Loading...

9, ఫిబ్రవరి 2014, ఆదివారం

- ప్రగతి ప్రతిష్ఠ రెండూ శూన్యం -

        కష్టించి పనిచేసే ఉత్సాహవంతులైన ప్రజల స్వభావాన్ననుసరించి మన రాష్ట్రాలన్నీ ప్రగతి పథంలో ముందుకుపోవలసినవే. కానీ సంకుచిత రాజకీయాల వలన ప్రజల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపు కునే రాజకీయనాయకుల వలన ఏనాడో రాష్ట్రప్రగతి ఆగిపోయింది. ప్రగతి కి సంబంధించిన కొత్త ఆలోచన, కార్యాచరణలటుంచితే, పరిపాలనాగతమైన పనులకే దిక్కులేకుండా పోతున్నది. కనీస అవసరాలైన శాంతి భద్రతలు, రహదారి నిర్వహణలు, తిండి గింజల ఉత్పత్తిలో వస్తున్న ఆటుపోట్లకు సహాయసహాకారాలు, ముందస్తు చర్యలు కూడా మూలబడిపోతున్నాయి.

         గుప్పెడు రాజకీయనాయకులకు దక్కే మంత్రి, ముఖ్యమంత్రి, వివిధ సంస్థలకు కార్యదర్శి, అధ్యక్ష పదవులు దక్కడం తప్ప సామాన్య ప్రజల జీవితంలో విభజన కానీ ఇటు సమైక్యత కానీ తీసుకొచ్చే మార్పు ఏమీ లేదు. లక్షల ఉద్యోగాల వంటి మబ్బుల్లో నీళ్ళు చూపించి కుండల్లో నీళ్ళు ఒలకబోయిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఒక ప్రాంతంలో కొత్త రాజధాని, మిగిలిన వసతులు ఏర్పరచడానికీ, ఇంకొకప్రాంతంలో ఇప్పుడున్న రాజకీయ పదవులన్నీ కొత్తగా సృష్టించి అవి ప్రజానీకాన్ని దండుకొంటే భరించడానికీ ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది? అదంతా ఎక్కణ్ణించీ ఊడిపడుతుంది? కేంద్రం ఇస్తానని మాట ఇచ్చినవన్నీ ఇంతవరకూ ఎన్ని అమలయినాయి? ఎంత వరకూ అమలయినాయి? బయటి దేశాలనుంచీ ప్రపంచ బాంకు ల నుంచీ తీసుకొచ్చిన ఋణాలన్నీ ఇంతవరకూ ఎన్ని తీరినాయి? భవిష్యత్తులో ఎట్ల తీరబోతున్నాయి?

     ఇదంతా ప్రక్కన బెడితే, ఇప్పుడే కేంద్రం కాళ్ళు పట్టుకోవడం తప్ప మాట చెల్లించుకోలేని పరిస్థితి ఉంటే రెండు ప్రాంతాల్లోనూ ఎంపీల సంఖ్య తగ్గినాక రాన్రానూ భిక్షమెత్తాల్సి వస్తుంది రెండు రాష్ట్రాలూ. మనకు మనమే ఇంతగా ద్వేషించుకుంటూ మన మీద చూసేవారికి గౌరవం ఉండాలనుకోవడం మూర్ఖత్వమే. ప్రక్క రాష్ట్రాలన్నీ వాళ్ళలో వాళ్ళకేం విభేదాలున్నా కేంద్రంతో గొడవ వచ్చినా, ఇంకెవరితో వచ్చినా అంతా ఒక్కటౌతారు. అందుకే విదేశీ సంబంధాల విషయంలో రాష్ట్రాలకు హక్కు లేమీ లేకపోయినా, ఇటు అరవ్వాళ్ళు శ్రీలంక కు వెళ్ళగూడదని ప్రధానిని శాసించగలరు. కన్నడులు ప్రత్యేక రైల్వేజోన్ తెప్పించుకోగలరు. బెంగాలీలు ప్రక్కదేశానికి పారే నదుల ప్రాజెక్ట్ ల విషయంలో తమ మాటే నెగ్గాలని పట్టు పట్టగలరు. మనం తప్ప ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద అవార్డ్ లు తమ రాష్ట్రాలకు వచ్చేటట్లు చూసుకోగలరు. మనమే............మీ లేదు.

           ఒక ప్రాంతం వాళ్ళు మమ్మల్ని చీల్చేయండి, మీ కాళ్ళు మొక్కుతానంటే, మమ్మల్ని చీల్చకండి అంటూ ఇంకోప్రాంతం వాళ్ళు కాళ్ళు పట్టుకొని చూపించినారు. ఎందుకింత దిగజారుడు తనం? ఏ ప్రాంతీయపార్టీ / జాతీయపార్టీ అయినా  ఏ నిర్ణయం తీసుకోవడానికైనా వాళ్ళకెంత లాభం , ఎన్ని ఓట్లు వస్తాయనో , ఎంత మైలేజీ/ మంచిపేరు దక్కుతుందనో చూస్తారు తప్పితే విభజనతో వృద్ధి అనో సమైక్యంతో స్వాంతన అనో చేయరని అందరికీ తెలిసిందే . మరెందుకీ అడుక్కోవడాలు?
    
           ఎవరు ఎంత కాదన్నా తెలంగాణలో మొదలు పెట్టినది పార్టీలు/ ఉద్యమ నాయకులైతే ప్రజలు వారితో కలిసినారు. సమైక్యాంధ్ర కోసం ప్రజలు మొదలు పెట్టి ఉద్ధృతంగా ఉద్యమం చేసి పార్టీల, నాయకుల మెడలు వంచడానికి ప్రయత్నిస్తున్నారు అనేది నిజం.

              ఏదైనా వాళ్ళూ వీళ్ళూ కూడా ఉద్యమాలు చేసినారు, పట్టుదలలు చూపించినారు. మేం ఎందులోనూ తక్కువకాదని ఒకరికొకరు నిరూపించుకున్నారు. మరి ఈ ఉద్యమోత్సాహం, ఈ పట్టుదల , ఈ కష్టాలు భరించే సహనం అన్నీ తమతమ సమస్యలు పరిష్కరించుకోవడంలో ఎందుకు చూపించకూడదు. అప్పుడు విభజన వల్ల దేశం మీద , రాష్ట్రాల మీద పడే అతి పెద్ద ఋణభారం తప్పుతుంది కదా! ఎన్ని వేల కోట్లు మిగులు ఉంటుంది! రాష్ట్రప్రజలు ప్రగతి , ప్రశాంతి, ప్రతిష్ఠ పొంది సంతోషంగా ఉంటారు కదా!

    నాలాంటి ఎంతమందికో అందరికీ తెలిసినంత సమాచారం, లెక్కలూ డొక్కలూ తెలియవు కానీ ఈ ప్రాథమిక విషయాలు అర్థమవుతున్నాయి. బాధ గా ఉంది. ఏం చేయలేక మౌనంగా చూస్తున్నాము.


కుత్తుకన్ తెగఁ గోయువారిని,క్రూర నీతుల నేతలన్
మత్తు మున్గిన నన్నదమ్ములు మాదిమాదని పోరుచున్
జిత్తులందిలు దోచువారిని , చేవతో నెదిరింపగా
సత్తు జచ్చి యిదో యటంచిటు స్వంత వారల నిట్లహో
కత్తికిన్ బలి యిచ్చువేళల కంటినీటికి కొంచెమే?
-------------------------------లక్ష్మీదేవి.