Loading...

29, డిసెంబర్ 2012, శనివారం

చెట్టుల చిట్టాలు


         మేము చదువుకున్న బళ్ళో ఒక కానుగ చెట్టు ఉండేది. చుట్టు గోడ లేని బడి కానీ ఎక్కడ్నించీ లోపలికి పోతామో అక్కడే ఆ చెట్టు . తొమ్మిదిన్నరకు మేము పోయేటప్పటికి తెల్లని చిన్నచిన్న పూలన్నీ చెట్టు మొదట్లో చాప పఱిచినట్టు రాలి ఉండేవి. ఇప్పటికి కూడా ఆ దృశ్యము ఎంతో మనోహరంగా కళ్ళ ముందు కన్పిస్తూంది. మట్టి రంగు మీద ఆ తెల్లనిపూలు ఆకాశంలో చుక్కల మాదిరి ఎంతో  అందంగా కనిపించేవి. ఇంకా ఎన్నో చెట్లు ఆ ఆవరణలో ఉన్నా ఇది బాగా గుర్తొస్తుందెందుకో , మామిడి చెట్టు దానికి కాయలు కూడా ఉండేవి.

                మా ఇంటి బావి వెనుక కాకర తీగ, నూగుల తీగ అవే పెరిగి ఎంతో సంతోషాన్నిచ్చేవి. ఒక వేపచెట్టు అయితే గోడకు ఆనుకుని అదే పడిన విత్తనం ఎట్లా మొలకెత్తిందో మఱి, ఇంత పెద్ద స్థలమున్నా అంతా బండలు పఱచిఉన్నందువలన చుట్టుగోడకు ఆనుకుని ఉన్నందువల్ల పెద్దగా పెఱగడానికి లేక సన్నగా పొడుగ్గా ఈతచెట్టు మాదిరి పెరిగిండింది. ఎంత పొడుగు ఉందని అందరూ అనుకునేవారు.

              దసరాలప్పుడు విజయదశమి రోజు ఊరి బయట పొలాల దగ్గర ఉన్న జమ్మి చెట్టు దగ్గరకు ఊరికి ఉన్న ఒక్కగానొక్క పురోహితుడు , కొందరు పెద్దవాళ్ళు, ఎక్కువమంది పిల్లలు అందరూ కలిసి గలగలమంటూ బయల్దేరి పోయి జమ్మిచెట్టుకు పూజ చేసి జమ్మి ఆకు తెచ్చుకునే వాళ్ళము. అది పెద్దవాళ్ళకిచ్చి మొక్కేవాళ్ళము. అప్పుడెంత సంబరమో!

               తెలిసిన వాళ్ళ ఒకరింటి దగ్గర కాగితం పూల చెట్టు ఉండేది. గులాబిరంగు పూలు చెట్టు నిండా పూసి చూడ్డానికెంతో బాగుండేది. ఈ రోజు వాల్పేపర్స్ లో చెట్ల అందాన్ని చూసి ఇవన్నీ గుర్తొస్తున్నాయి.

28, డిసెంబర్ 2012, శుక్రవారం

మంచిదారి చూపించు

 మనుష్యులకు మంచినడత నేర్పి,
మంచిదారి చూపించు భగవంతుడా!!

నాగరికమ్ము పేరిట వినాశపు సంస్కృతి పెచ్చరిల్లె నీ
వేగపు జీవితమ్మిచట పీడన పెంచుచు నశ్వరమ్మునీ
లాగున తెచ్చె; కావుమిక రక్షణ సేయవె సంస్కరించుచున్
రాగల రోజులందున సలక్షణమైన తెనుంగు పిల్లలన్.

ఇల సంస్కారము బెంచు విద్యలకు దానిల్లౌ ప్రదేశమ్మునన్
కలకంఠిన్ కడు దుష్కరంబుగ మహాకాఠిన్యులై చంపుటే?
కలికాలమ్మన నిట్లహో! మిగుల శోకమ్మందు నల్లాడు కాం
తల బాష్పంబులు_ భీషణాస్త్రచయమై దండించు దుర్మార్గులన్.