Loading...

1, ఆగస్టు 2012, బుధవారం

అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్ళకు...

రక్షాబంధనము అనే పండుగ ఎప్పటి నుంచీ ఉందో, ఎలా వచ్చిందో అవన్నీ మనము తెలుసుకొని ఏంచేస్తాము కానీ హాయిగా పండుగ చేసుకుంటే సరి. ఎంతైనా హిందీదేశంలో ఉన్నంత హిందూదేశమంతా ఉందని చెప్పలేము.కానీ చాలామటుకు అందరికీ మనఊళ్ళల్లో కూడా బాగా తెలుసిప్పుడు.
              అయినా ఏ పండగ కైతే బహుమానాలతో ఖచ్చితంగా సంబంధం ఉంటుందో ఆ పండుగ పాపులర్ కాకుండా ఉంటుందా ఏమిటి. ఎంత వద్దులేరా అన్నా అన్నలు, తమ్ముళ్ళు కానుకలిస్తారు. ఇచ్చినపుడు తీసుకున్నపుడు మనుషులందరికీ సంతోషమే కదా!
                       అదీ కాక తోడబుట్టిన బంధానికి ప్రత్యేకమైన పండుగ కాబట్టి విశేషమైనదే! ఈ తరంలో జరుపుకున్నంతగా వచ్చేతరంలో జరుపుకోవటం తగ్గిపోతుందా, మరి అన్ని ఇండ్లలో ఒక్కొక్కరే ఉంటుంటే అంతే కదా!రాష్ట్రీయ స్వయంసేవకులైతే చక్కగా అందరూ ఒకరికొకరు కట్టేసుకుంటారు, ఒక్కర్నీ వదలకుండా. చిన్న ఎఱ్ఱటి దారాలు. బాగుంటుందలా.
            ఒక్కో పండుగ వదిలేసుకోవటానికి ఒక్కొక్క కారణం చెప్పుకుంటున్నాము. ఉగాదికి వేరే రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకు ఆ సమయంలో వేపపూత దొరకటం కష్టము, లేదా వృత్తి ఉద్యోగాల్లో శలవులు దొరకవు.సంక్రాంతికి ముగ్గులు పెట్టేంత స్థలాలు లేక ముగ్గులన్నీ మఱచినట్టైంది. ఇక దీపావళికి చిన్న చిన్నవి కాల్చుకోవడం వల్ల వ్యాపారం జరగట్లేదనో హంగామా ఉండట్లేదనో పెద్దవీ, ప్రమాదకరమైనవీ తయారు చేసి వాటి మీద విరక్తి పుట్టేంతగా ధ్వని కాలుష్యము, వాతావరణ కాలుష్యము అంటూ వ్యతిరేక ప్రచారాలవల్ల ఇప్పుడు పెద్దలు కాదు, పిల్లలే అబ్బే వద్దు. అనేస్తున్నారు.
                     ఈ పిల్లలు ఏదీ మిస్ కారు, ఏ వీడియో గేమ్ లో , ఫేస్ బుక్ చాటింగ్ లో ఉంటాయి కాబట్టి.
సరే ఇకపోతే మన విషయానికి వస్తే అన్న అంటే అమ్మ, నాన్న లో ఒక్కో అక్షరం అంటారు కదా, అలాగే తమ్మ / తమ్ముడు అంటే తండ్రి, అమ్మలో ఒక్కో అక్షరం అని నేను కనిపెట్టా , ఎందుకంటే నాకు ఉండేది తమ్ముడు కాబట్టి.
                      ఇన్ని పని వత్తిడులలో , ప్రతికూల పరిస్థితులలో కూడా వాడు వస్తున్నాడు. నేనూ వాడికోసం ఏం చేశానో చూడండి. రవ్వలడ్డు, అప్పచ్చులు. చాలా రోజులైంది రవ్వలడ్డు తిని అనిపించింది. చేసినాను. వాడిని అడగలేదనుకోండి. అడిగితే వాడేమైనా అడిగాడంటే నాకు వస్తుందో రాదో కదా , అందుకే ...హహ్హహ.


        బ్లాగ్లోకంలో , బయట ఉన్న అందరు అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్ళకు రాఖీ శుభాకాంక్షలు!!