Loading...

14, ఆగస్టు 2010, శనివారం

గాన గంధర్వ ....

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం అనేకన్నా మన బాలు గారు, మన ఎస్ పి బి, ఎస్ పి బాలసుబ్రమణ్యం అంటే తన గాన మాధుర్యంతో మనల మనములను అలరించే ఆత్మీయుడుగా; సరదా అయిన మాటలు మాట్లాడుతూ చిన్నప్పట్నీంచీ మనలని ఆటపట్టిస్తూ, మనతో కలిసి నవ్వుతూ, తుళ్ళుతూ, మనకు పరీక్షలు పెడుతూ, చదువులో ప్రోత్సహిస్తూ ఉండే చిన్నాన్నలా అనిపిస్తారు.

నిజంగానే గంధర్వ లోకం నుంచి మనందరినీ తన పాటల తోటలలో విహరింప చేయటానికి దిగి వచ్చారేమో అంటే అతిశయోక్తి కాదనిపిస్తుంది. ఒకవేళ ఇది కొంచెం ఓవర్ అని ఎవరైనా అనేవాళ్ళున్నా, వాళ్ళమీద జాలి పట్టం తప్ప మనమేం చేయలేము.

ఒకటా, రెండా ఎన్నివేల పాటలు పాడినా ఊటబావిలా ఆ గొంతులో మాధుర్యం, పాట భావాన్ని బట్టి ఒలికించే భావ ప్రకటనా సామర్థ్యం, ( జోల పాట పాడితే వాత్సల్య భావం, ప్రేమ గీతాలు పాడితే అనురాగం, శృంగార గీతాలు పాడితే కొంటెతనం, మధ్యలో వినపడే నవ్వుల్లో చిలిపి తనం, విషాద గీతాలు పాడితే శోక రసం ) ఎన్ని చెప్పగలం చెప్పండి?

సంగీతం నాకు రాదు రాదంటూనే ప్రతి రాగంగురించీ ఎవరూ తప్పు పట్టలేనంతగా వ్యాఖ్యానించగలగటం, స్వయంగా ఎన్నో సంగీతపరమైన పాటలు పాడటం ఎంత అద్భుతమైన విషయం?

సాహిత్యం విషయానికొస్తే పాటలలో సాహితీ విలువల గురించి చర్చించటం నుంచీ, పదాల అర్థాలు, వాటి భావాల గురించీ పిల్లలకు అర్థం అయ్యేలా వివరించేంత వరకూ ప్రతి విషయాన్నీ అంటే ఉచ్ఛారణ, పదాలని అర్థవంతంగా పలికే విధానం, భావోద్వేగాలను పలికించటం ప్రతీ విషయంలోనూ దోషరహితుడుగా ఎన్నదగిన పండితుడు అని చెప్పవచ్చు.

విద్యా దదాతి వినయం అన్న ఆర్యోక్తిని నిజంచేస్తూ తన గొప్పతనం ఏమీలేదని మనస్ఫూర్తిగా నమ్మే వినయ సంపన్నుడు. సంగీత సరస్వతీ పుంభావ రూపమైన ఘంటసాల గారిని, తన సాటి (పోటీ అని కొంతమంది భావించే ) అనేక గాయనీ గాయకుల్ని, పాటని శ్రవణీయంగా మలచే వాద్యకారుల్ని, కొత్తగా పాటలు పాడేవాళ్ళని అందర్నీ తగురీతిన గౌరవ మర్యాదలతో ఉటంకించే వినయ సంపన్నత సొంతం చేసుకున్నవారు.

కొత్త వారిని ప్రోత్సహించే ఎన్నో పాటల పోటీల కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించడమే గాక వాటికి వర్ధమాన సంగీత విద్వాంసుల్ని, గాయనీ గాయకుల్ని ఏమాత్రం ఈగో సమస్య లేకుండా పిలవటం, వారితో చక్కగా కలిసి మెలిసి కార్యక్రమం నిర్వహించడం చూస్తే ఈయనా, ఎవరినీ పైకి రానివ్వడు అన్న అపవాదు భరించింది అనిపించక మానదు.

అంతేకాదు, విశ్వనాథ్ గారి లాంటి క్లాసికల్ చిత్రాలని మనస్ఫూర్తిగా ఆస్వాదించే కళాదృష్టి ఉండి కూడా, వెంకటేష్ లాంటి కమర్షియల్ (చాలా వరకూ అంతే కదా) హీరో లో ఉండే ప్లస్ ఏమిటో అంతే సరిగ్గా చెప్పగలరు.

ఇలా చెప్పుకుంటూ పోతే నాకు అలుపు రాదు కానీ ఇక్కడ స్థలం చాలదు.

ఎంతో రసఙ్ఞతతో అభిమానించి, ఆదరించే కళాకారుడైన ఒక అభిమాని ఎవరైనా ఆయనతో ఇంటర్వ్యూ చేస్తే చూడాలని వుంది.

నా ఆశ ఎప్పుడు తీరుతుందో!!!!!!!!!!!