Loading...

15, అక్టోబర్ 2009, గురువారం

సాంకేతిక కారణాలవల్ల అంతరాయం

నా బ్లాగుల్లో ఉన్నట్టుండి ఏమైందో, వ్యాఖ్యలకు సమా ధానం రాయటం కుదరట్లేదు. చూజ్ యువర్ ప్రొఫైల్ అని వస్తోంది, ఏ ఆప్షన్ లూ లేవు.
అందుకే ఈ టపా

@సుభద్ర: అదే చాలా బాధగా ఉందండీ!
ఏం చేద్దాం చెప్పండి.

14, అక్టోబర్ 2009, బుధవారం

గోధూళి వేళ.....

గోధూళి వేళ.....

గోధూళి వేళ... అంటే ఎలా ఉంటుందో....

పుస్తకాల్లో చదవటమే కానీ, ఊహల్లో చూడటమే కానీ ప్రత్యక్షంగా చూడలేదెన్నడూ...
మా చిన్నతనంలో ఇంట్లోనూ, వీధిలోనూ గోవుల్ని, గేదెల్ని చూసినా, గోధూళి చూడలేదు.మట్టినేలల మీద లేత ఎరుపు, గోధుమరంగు కలిసిన ఆ రంగు తారు రోడ్డు పై వచ్చేనా! రాదు గాక రాదు.

ఇంతకీ గోధూళివేళ ఎందుకు గుర్తొచ్చిందంటే సాయంకాలం డాబా మీద కెళ్తే ఆకాశం అద్భుతమైన చిత్తరువులా కనిపించింది. చిలికిన మజ్జిగ కుండలో వెన్న తేలుతున్నట్టుగా ఉన్న తెల్లటి మబ్బుతునకలు ఓవైపు కనువిందు చేస్తుంటే, ఏనుగు ఒంటిరంగు మబ్బుతునకలు ఇంకోవైపు తెలుపు నలుపుల వర్ణ చిత్రాన్ని శోభాయమానం చేస్తున్నాయి. వర్ణచిత్రమేంటి అంటారా! ఏం! తెలుపు నలుపులు వర్ణాలు కావా! నాకెంతో నచ్చిన రంగులవి. వాటి తర్వాతే లేత గులాబి, లేత నీలం అన్నీను.

ఆకాశం అందాలు పరికిస్తూ మధ్యలో నా గొడవెందుకు? కొంచెం కింద చుట్టూ కనిపించే కొబ్బరాకులు, మామిడి కొమ్మలు పిల్లగాలికి మెల్లగా ఊగుతూ, ప్రకృతి రాణికి మెల్ల మెల్లగా వింజామరలు వీస్తున్నట్టుగా గమ్మత్తుగా ఉంది. పైన గుంపులుగా ఎగిరే చిన్న పక్షులు సభలో నాట్యం చేసే అప్సరసల్లా కనువిందు చేస్తున్నాయంటూ కొమ్మల మీద నుంచి ఎగిరే పక్షులు సభికుల్లా తమ కిలాకిలారావాలతో జయజయధ్వానాలు చేస్తున్నట్టుంది. ఒక్క క్షణం ఆ ప్రకృతిని నేనే అయినట్టు అనుభూతి.

భూమిలో పచ్చదనం, చల్లదనం, జలధనం అందించే మట్టినేల కన్పించకుండా పోయిందేమో కానీ, ఆకాశం ఇంకా అలాగే ఉన్నందుకు సంతోషం. చంద్రుడు, చుక్కల అందాల్ని ఎన్నిసార్లు చెప్పుకునా తనివి తీరదు. సప్తర్షి మండలం భూమికి అటువైపు నుంచి చూస్తే పెద్ద గరిటె లా కనిపిస్తుందని కొత్తపాళి గారు ఓ సారి రాశారు. చందమామ మాత్రం ఏ కోణంనుంచి చూసినా అందంగా కన్పిస్తుంటాడు కదూ!

అలాంటి అందాల చందమామ మీద బాంబు వేయబోతున్నారంటే మనసులో ఏదో గుబులు. ఔనూ, చందమామ మీద ఇప్పుడున్న మచ్చ కూడా ఎప్పుడో ఎవరో చేసిన ఇలాంటి ఘాతుకమేనా? అకటా! మానవజాతి అకృత్యాలకు అంతే లేదా?
ఎటు తిరిగినా, ఎంత దూరం నడిచినా మనతో పాటే వచ్చే చందమామని చూస్తే ఇప్పటికీ చిన్నపిల్లల్లా మనసు గంతులేస్తుంది కదూ!అందాల చందమామా!ఏమందువూ....వూ.....వూ......!
జాబిల్లీ! నీవు లేక తోచదు మాకూ.................................!