Loading...

17, జనవరి 2009, శనివారం

అమృత ఆస్వాదన

ఆంధ్రామృతంలో చక్కని తెలుగు పద్యాలు, అర్థం, అన్వయం భావం చదివితే మనసుకి ఎంతో హాయిగా ఉంటున్నది. ఇకపోతే, ముందునుంచీ చదివితే తెలుగు,వెనుకనుంచీ చదివితే సంస్కృతం అర్థం వచ్చేలా రాసిన ఆమహనీయుల ప్రతిభ, చక్కగా అవన్నీ సేకరించి మనకి అమృతం పంచుతున్న చింతా రామకృష్ణారావు గారి అభిరుచి నిజంగా మెచ్చుకోతగినది. మనలో ఇంకా ఎవరైనా ఆ పద్యాల అందాలను తిలకించనివారుంటె చప్పున వెళ్ళి చూడండి.ఇంకా ఇలాంటి బ్లాగులు చాలా ఉన్నట్టున్నాయి.లంకెలు దొరికితే బాగుండేది.

13, జనవరి 2009, మంగళవారం

సంక్రాంతి శుభాకాంక్షలు!!!

ముందుగా మన బ్లాగు మిత్రులందరికీవారి కుటుంబాలకూ సంక్రాంతి శుభాకాంక్షలు!!!

ఇప్పుడు ఇలా నగరాల్లో చేరి మరిచిపోయాం కానీ చిన్నప్పుడు మా పల్లెలో సంక్రాంతి అంటే ఎంత సంబరంగా ఉండేదో! అబ్బా అందరూ ఇదే రాస్తున్నారని చదివేవాళ్ళకు విసుగొస్తే రానీ గాక, మావూళ్ళో పండగ గురించి నేనూ రాసుకోక మానను. హ..హ..హ .


నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో....(చక్రాలు) చక్కగా 3 గంటలకంతా నిద్దర లేచి ఏడింటి వరకూ మా కాంపౌండ్ అంతా ముగ్గులతో నింపేసేదాన్ని.

ఆ నెలంతా ఒకటొ, రెండో వేసినా, భోగి, సంక్రాంతి,కనుమ ఈ3 రోజులు మాత్రం నాలుగు గంటలపాటు మా ఇంటి ముందు ముగ్గులతో నింపేసేదాన్ని.

బొర్నవిటా తాగుదువు గాని రామ్మా అని అమ్మ ఎంత పిలిచినా ముగ్గుల కార్యక్రమం అయ్యేదాకా వెళ్ళేది లేదు. రంగులు నింపితే ముగ్గుల అందాన్ని చూడలేమనే గొప్ప అభిప్రాయంతో రంగులు మాత్రం వేసే దాన్ని కాదు. ( తర్వాత ఈ తొక్కలో అభిప్రాయన్ని మార్చుకున్నాననుకోండి.)


క భో గి రోజు ఉదయన్నే తలంటుపోసుకుని పూజచేసుకుని అమ్మ చేసిన సద్ద రొట్టెలు గుమ్మడి కాయ కూర పులగం అందరూ కలసి (అన్నీ ఒకేసారి కాదు లెండి బాబూ) లాగించేవాళ్ళం.

సంక్రాంతి రోజు భక్ష్యాలు, చక్కెర పొంగలి,కొత్త బట్టలు, గోరింటాకు పెట్టుకోవడం, ఎవరి ముగ్గులు, గోరింటాకు బాగున్నాయో మాట్లాడుకోవడం3 ఏళ్ళ వయసు వరకూ పిల్లలకు భోగిపళ్ళు పోయడం(పుల్ల రేగుపళ్ళు,చెరుకుముక్కలు, బొరుగులు, పైసలు కలిపి పోస్తారు. తెలిసిన వాళ్ళను పేరంటానికి పిలుస్తారు.)

ఇంట్లో చుట్టాలు, వీధుల్లో హరిదాసులు, సాయంకాలం గుళ్ళోకెళ్ళటం, దేవుడి ఊరేగింపుల కోసం రథం అలంకారం అక్కడే ఉండి సహాయం చేస్తూ , రథంతో పాటు స్నెహితులతో కలిసి నడవటం, ఎవరి ఇల్లు రాగానే వాళ్ళు విడిపోవటం. ఇవన్నీ నా మధుర స్మృతులు .