Loading...

గురువారం 24 మే 2012

ఆనందం



అన్నీ మన మంచికే అంటుంటారు, కానీ ఒక్కోసారి కోపం ఆగదు, ఎందుకిలా జరగాలి అని ఆందోళన పడిపోతుంటాం. అవతలి వాళ్ళ మీద విరుచుకు పడిపోతుంటాము.
            అంతెందుకు? పవర్ కట్ అయినపుడల్లా ఎంత కోపంవస్తుందో, ఈ విద్యుత్తే లేనప్పుడు మనుషులు లేరా ఏం? అసలు ఇప్పుడు కూడా నగరాల్లో కన్నా పల్లెల్లో ఎక్కువ సేపు ఈ కోతలుంటాయి కదా, వాళ్ళెలా ఉంటారు? అన్నీ తెలిసినా కూడా, ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నా కూడా కోపంవస్తుంది.
             అసలు నిరంతరాయంగా విద్యుత్సరఫరా ఉంటే బాగుంటుంది అనీ అనిపిస్తుంది. కొన్ని రోజులు అలవాటయితే కోపం తగ్గుతుంది. రాత్రి పూట విద్యుత్కోత సమయంలో మిద్దెమీద నిద్దుర పోవటం లో ఉన్న ఆనందం ఏమిటో తెలుస్తుంది. ఎంత త్వరగా నిద్రపట్టేస్తుందో, సూర్యోదయం అయ్యీ కాక ముందే అలారమ్/ ఫోన్ లేకుండానే ఎలా మెలకువ వస్తుందో తెలుస్తుంది.
                   నదిలో స్నానం చేస్తే సబ్బులు, షాంపూలు గోల లేకుండా చక్కగా నెచ్చెలులతో కలిసి గంటలు గంటలు నీళ్ళలో జలకాలాడుతుంటే అది ఎవరికి వారికే అర్థమయ్యే ఒక ఆనందం. అలా స్నానం చేశాక ఎంత ఆకలి వేస్తుందో అది కొత్తగా ఉంటుంది.   రాత్రి ఎంత ప్రశాంతంగా గాఢనిద్ర పడుతుందో అదంతా మనం ప్రకృతి నుంచి ఎంత దూరం వచ్చేశామో తెలుపుతుంది. ఈ మధ్యలో ఒక పల్లెకు , ఒక నది ఉన్న క్షేత్రానికి ఫంక్షన్ లకు వెళ్ళి కొన్ని రోజులు ఉండటం మూలంగా మనసులో మెదిలిన భావాలు.

శనివారం 5 మే 2012

సమీరమా!




చెలికాని ఊపిరులతో ఎదనింపే పవనమా!
మనసైన ఊసులనే తలపులలో నింపుమా!

కనరాని దూరాల పయనించే సమీరమా!
కనిపించని దూరాలను కరిగించుట సాధ్యమా!

ఒడలెల్లా పులకరముల కురిపించే నేస్తమా!
సడి చేయని రాగాలను వినిపించెదనాగుమా!

కడు మెల్లని నడకలిక చాలించరాదొకో!
వడివడిగా చనుదెంచి అందించ రాదొకో!

సందేశము చేర్చినచో కానుకగా కలలనే
దారులలో పువ్వులుగా పఱచెదనే మారుతమా!

సోమవారం 30 ఎప్రిల్ 2012

ల్లల్లల్లల్ల ల్లల్లల్లా..........


గొల్లవారి ఊరిలోన
మల్లెపూల తోటలోన
వెల్లి విరిసె వెన్నెల

మెల్లమెల్ల ఊయల
మళ్ళిమళ్ళి ఊగుచు

అల్లి బిల్లి ఊసుల
పిల్లగాలి పాటల

చల్లచిలుకు గోపెమ్మ
కల్లలాడు గోపయ్య

నల్లనయ్య నవ్వులా....
పొల్లుపోని పలుకులా.....

ఝల్లుమనెడు గుండెలో
పల్లవించు వలపులు....................

బుధవారం 11 ఎప్రిల్ 2012

............కదూ!!

వెన్నెల కిరణాల్లో వెచ్చదనాలూ...
చల్లని గాలుల్లో అల్లరి వెల్లువలూ....
మల్లెల కాలంలో కల్లల నోములూ....
తెలిసొచ్చాయంటే....
వలపుల దేవునికి ,
పులకింతల నైవేద్యాలు .. 
పెట్టే తరుణం వచ్చిందనే.......
............కదూ!!

పరవశమైన  ప్రకృతి కన్యను 
దిక్కుల దీర్ఘ బాహువుల్లో 
పురుష వరుడు చుట్టేసి నపుడు
ఊపిరుల వెచ్చదనాలు...
చూపుల చల్లదనాలూ .....
సెలయేటి తానాలు మరిపిస్తుంటే ...
సమాగమ తరుణాలకు ,
అరుణోదయమైనట్టే.......
........కదూ!! 

శుక్రవారం 23 మార్చి 2012

వసంత నందన వైభవం


మిసిమిన్ చూపెడు చిన్నియాకులవి నెమ్మేనన్,  విలాసంబుగా
ముసినవ్వుల్ కురిపించుచున్ నటనలన్ మోహింపజెయ్యున్, నిలన్ .
కుసుమంబందున హాసముల్ సొగసులై కొంగ్రొత్త గా శోభిలున్,
హసితమ్మొక్కటి మోమునందు బలు వయ్యారమ్ము నొల్కించుచున్,

నందనమను వర్షమునను నాయికయ్యె 
నదె గను  వసంత భామిని నబ్బురముగ
సంతసమ్మును పంచుచు సాగిపోవ
వేడుకొందునిదె యుగాది వేళయందు.
చిగురాకులలో నూగుచు
వగలను కురియగ వనమున పాటల నెన్నో
మిగ మురిపెముగా పాడుచు
జగములకా కోకిలమ్మ సంతసమొసగున్.

మల్లెలు మాలల రూపున
పల్లెత మనముల మరింత వలపుల బెంచున్
కల్లాకపటములెఱుగని
సల్లాపములాడ భర్త సరసన జేరున్.


చల్లలు ద్రావుచున్ జనులు సందెల గాలులు  కోరుచుందురే!
మెల్లగ సాగుచున్న రవి మేఘము గప్పుట చూడనెంతురే!
పిల్లలు కోరుకున్నటుల ప్రీతిగ వేడుక దేలుచున్ మరే
యల్లరి చేయబోమనుచు నందర తోడను బొంకనేర్తురే!


--మందాకిని (లక్ష్మీదేవి)