Loading...

2, సెప్టెంబర్ 2012, ఆదివారం

సౌందర్యరాశి

మేఘుని చూపుల చినుకుల్లో
తడిసిన ప్రకృతి కన్నియ హొయలు...!
హొయలును గనిన మేఘుని కన్నుల్లో
మెరిసిన మెరుపుల వెలుగులు.....!!
నిత్యనూతనమైన ఈ జంట మనసుల్లో
చిగుళ్ళు వేసిన కొత్త రంగుల ఆశలు....!!!
మరులు పెరిగిన తరుణంలో
మారాకు వేసిన తరువులు....!!!!
విరుల మధుజలములలో ఘంటాన్ని అద్ది
తేనె సంతకాలు చేస్తున్న భ్రమరవరులు....!!!!!!!!

మనసును దోచే , మై మఱపించే సౌందర్యరాశి ఈ ప్రకృతి......
ప్రకృతి ముందు ప్రపంచ సుందరీమణులు నిలువగలరా?

28, ఆగస్టు 2012, మంగళవారం

నృత్యాభినయ వేళ......


ఎప్పుడూ దర్శిని (చానల్) లలో నృత్య/నాట్య ప్రదర్శనలు చూడటమే కానీ, ఈ మధ్య కాలములో ప్రత్యక్షంగా వేదికమీద ప్రదర్శనలు తిలకించే అదృష్టము కలిగింది. నాట్యము చూసి ఆనందించటమే కానీ అందులో ఓనమాలు తెలియని నాకు ప్రేక్షకురాలిగా కలిగే భావాలని మాత్రమే ఇక్కడ చెపుతున్నాను.

                        భరతనాట్యము, కథక్ కాస్సేపు చూడవచ్చు కానీ, మన కూచిపూడి మాత్రం ప్రతి కీర్తనలో ఉన్న చిన్ని కథనాన్ని తన హావభావాలతో పూర్తి నాటకంగా మలచి చూపించే నర్తకీమణులు, నర్తకరత్నముల నాట్యాన్ని ఎంతసేపైనా చూడవచ్చు. లీనమైపోయి... కొన్ని కీర్తనల విషయంలో ఇది ఇలా జరిగితే కొందరు వాళ్ళ ప్రతిభచేత అట్లా జరిపిస్తారు. అంటే మనం లీనమై పోయేటట్లు.

                         అందుకే నాకు కూచిపూడి చాలా ఇష్టం. ఒక నాలుగైదు కీర్తనలతో ప్రదర్శన ముగించేముందు వచ్చే తిల్లాన కూడా నాకు చాలా చాలా ఇష్టం. అసలు అన్నిటికన్నా ఇష్టము. నేనింతవరకూ చూసిన తిల్లాన లన్నీ శ్రీ బాలమురళీకృష్ణ గారే కూర్చారు. అసలు ఈ ప్రక్రియ కు ఆద్యులు వీరేనా లేక ఇంతకు ముందు ఇంకెవరైనా చేశారా, చేస్తున్నారా అనే వివరాలు తెలియవు. నాకు తెలిసిన వారిలో ఇలాంటి సందేహాలు తీర్చగల వారూ లేరు. మన బ్లాగు ప్రపంచంలో అన్నిరంగాల నిష్ణాతులూ ఉన్నారు. వారేమయినా దయ యుంచి చెపుతారని ఆశిస్తాను. లేకపోతే వారి బ్లాగుల్లో నాట్యం గురించిన ప్రాథమిక విషయాలయినా పరిచయం చేస్తూ వ్రాసినా చాలా సంతోషపడతాను.

ఇంతకీ ఈ మధ్య నేను చూసిన నాట్య ప్రదర్శన గురించిన ముచ్చట్లు.

                     ఒక వనితామణి సరస్వతీఅష్టకము, భవానీఅష్టకము, సుబ్బలక్ష్మి గారి కీర్తన ఒకటి మొదలయిన వాటితో పాటు హనుమాన్ చాలీసా మొత్తాన్ని అభినయించి చూపినారు. మొదట్లో కొంచెం స్వర్ణకమలం భానుప్రియ అక్కడక్కడా కనిపించినా, తర్వాత్తర్వాత బాగా లీనమయి చేసినారు. హనుమాన్ చాలీసా లో అయితే ప్రతీ సందర్భంలోనూ హనుమ ముఖాన్ని ప్రతిబింబించేటట్లు తన ముఖాన్ని మూతిని ఆ ముద్ర లో తీసుకువచ్చారు. శానా బాగా చేసినారు. హనుమాన్ చాలీసా అభినయించగా నేను చూడడం మొదటిసారి.

                        ఒక పురుషరత్నం స్వాగతం కృష్ణా, జయదేవుని అష్టపదులు, మరికొన్ని కీర్తనలని చక్కగా అభినయించారు. అతడు మొదట్నించీ లీనమయి నటించారు. వేదిక ఎత్తు తక్కువగా, పొడవు తక్కువగా ఉన్నది. పైన దీపపు తీగలు వేలాడుతున్నాయి. అతడు పొడుగైనవాడు. చేతులు పైకి ఎత్తినపుడల్లా తీగలు ఎక్కడ తగులుతాయేమో అనిపించేది. ఒక కీర్తన తరువాత ఒక పని అబ్బాయి వచ్చి తీగలు సరి చేసినాడు.
అమ్మయ్య అనుకున్నాను. స్వాగతం కృష్ణా కీర్తనలో వేదిక లో వెనక వరకూ పోయి మళ్ళీ ముందుకు వచ్చినపుడు ఆ వేగంలో అయ్యో కాలు ముందుకు పెట్టేస్తాడేమో అనిపించేంతగా అందులో లీనమయినట్టే ఉండేవాడు, కానీ జాగ్రత్తగానూ ఉండేవాడు. శానా బాగా చేసినాడు.

             ఇక వీటి తర్వాత దూరదర్శన్ జాతీయ దర్శిని లో మీనూఠాకూర్ అనే గుజరాతీ ఆమె తెలుగు నేర్చుకొని కూచిపూడి నేర్చుకొని ప్రదర్శనలు ఇస్తూ , శిష్యులకు కూచిపూడి నేర్పిస్తూ ఉన్నామెని పరిచయం చేయడం ఆమెతో సంభాషణ విన్నాను, చూసి శానా సంతోషమైంది. ఆమె ఎంతగా కూచిపూడిని ఇష్టపడుతుంది అనేది మాటలను బట్టి అర్థమయితుంది.
తెలుగుభాషా దినోత్సవమంట ఈరోజు. ఈరోజు మనదైన ఈ కూచిపూడి గురించి మాట్లాడుకోవడం సంతోషం.

11, ఆగస్టు 2012, శనివారం

కలల కొత్తలోకంలో.....


అతడు...
నీలికురులున్న నీలవేణివో
పూల తనువున్న పూబోణివీవో......
ఆమె...
గానమాధురులున్నగండుకోయిలవో,
మబ్బుగని యాడు మయూరానివో....
అతడు...
తళుకుబెళుకు తారవో,
చిలుక పలుకుల కలికివీవో....
ఆమె....
వలపులు చిందే వలరాజువో....
వనములనేలే మృగరాజువీవో......
అతడు.....
అలకలు బూనే అలివేణివో,
చిరుచిరు నగవుల విరిబోణివీవో......
ఆమె....
చల్లని చూపుల నెలరాజువో....
తలపుల మెదిలే రేరాజువీవో.....

(కొత్త కొత్త కలలను కనీ ప్రతీ కొత్త బంగారులోకపు యువరాజు, యువరాణుల తలపుల పందిరి..)

8, ఆగస్టు 2012, బుధవారం

తారంగం తారంగం

అందరికీ కృష్ణాష్టమి   శుభాకాంక్షలు !!
కృష్ణయ్య పుట్టినరోజున మనమందరం చిన్నప్పుడు పాడిన తారంగం పాట ఆనిమేటెడ్ వీడియో లంకె  చూడండి. ఎంత బాగుందో!!!!!!!!!!!!!

తారంగం తారంగం తాండవ కృష్ణా తారంగం!!!!

దీన్ని తయారు చేసిన సైబర్ విలేజ్ సొల్యూషన్స్ వారికి కృతజ్ఞతలు.
(రేపు పొద్దున కొంచెం తీరిక ఉండదని ఇప్పుడే చెప్పేస్తున్నాను. స్వీకరించండేం!!)

1, ఆగస్టు 2012, బుధవారం

అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్ళకు...

రక్షాబంధనము అనే పండుగ ఎప్పటి నుంచీ ఉందో, ఎలా వచ్చిందో అవన్నీ మనము తెలుసుకొని ఏంచేస్తాము కానీ హాయిగా పండుగ చేసుకుంటే సరి. ఎంతైనా హిందీదేశంలో ఉన్నంత హిందూదేశమంతా ఉందని చెప్పలేము.కానీ చాలామటుకు అందరికీ మనఊళ్ళల్లో కూడా బాగా తెలుసిప్పుడు.
              అయినా ఏ పండగ కైతే బహుమానాలతో ఖచ్చితంగా సంబంధం ఉంటుందో ఆ పండుగ పాపులర్ కాకుండా ఉంటుందా ఏమిటి. ఎంత వద్దులేరా అన్నా అన్నలు, తమ్ముళ్ళు కానుకలిస్తారు. ఇచ్చినపుడు తీసుకున్నపుడు మనుషులందరికీ సంతోషమే కదా!
                       అదీ కాక తోడబుట్టిన బంధానికి ప్రత్యేకమైన పండుగ కాబట్టి విశేషమైనదే! ఈ తరంలో జరుపుకున్నంతగా వచ్చేతరంలో జరుపుకోవటం తగ్గిపోతుందా, మరి అన్ని ఇండ్లలో ఒక్కొక్కరే ఉంటుంటే అంతే కదా!రాష్ట్రీయ స్వయంసేవకులైతే చక్కగా అందరూ ఒకరికొకరు కట్టేసుకుంటారు, ఒక్కర్నీ వదలకుండా. చిన్న ఎఱ్ఱటి దారాలు. బాగుంటుందలా.
            ఒక్కో పండుగ వదిలేసుకోవటానికి ఒక్కొక్క కారణం చెప్పుకుంటున్నాము. ఉగాదికి వేరే రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకు ఆ సమయంలో వేపపూత దొరకటం కష్టము, లేదా వృత్తి ఉద్యోగాల్లో శలవులు దొరకవు.సంక్రాంతికి ముగ్గులు పెట్టేంత స్థలాలు లేక ముగ్గులన్నీ మఱచినట్టైంది. ఇక దీపావళికి చిన్న చిన్నవి కాల్చుకోవడం వల్ల వ్యాపారం జరగట్లేదనో హంగామా ఉండట్లేదనో పెద్దవీ, ప్రమాదకరమైనవీ తయారు చేసి వాటి మీద విరక్తి పుట్టేంతగా ధ్వని కాలుష్యము, వాతావరణ కాలుష్యము అంటూ వ్యతిరేక ప్రచారాలవల్ల ఇప్పుడు పెద్దలు కాదు, పిల్లలే అబ్బే వద్దు. అనేస్తున్నారు.
                     ఈ పిల్లలు ఏదీ మిస్ కారు, ఏ వీడియో గేమ్ లో , ఫేస్ బుక్ చాటింగ్ లో ఉంటాయి కాబట్టి.
సరే ఇకపోతే మన విషయానికి వస్తే అన్న అంటే అమ్మ, నాన్న లో ఒక్కో అక్షరం అంటారు కదా, అలాగే తమ్మ / తమ్ముడు అంటే తండ్రి, అమ్మలో ఒక్కో అక్షరం అని నేను కనిపెట్టా , ఎందుకంటే నాకు ఉండేది తమ్ముడు కాబట్టి.
                      ఇన్ని పని వత్తిడులలో , ప్రతికూల పరిస్థితులలో కూడా వాడు వస్తున్నాడు. నేనూ వాడికోసం ఏం చేశానో చూడండి. రవ్వలడ్డు, అప్పచ్చులు. చాలా రోజులైంది రవ్వలడ్డు తిని అనిపించింది. చేసినాను. వాడిని అడగలేదనుకోండి. అడిగితే వాడేమైనా అడిగాడంటే నాకు వస్తుందో రాదో కదా , అందుకే ...హహ్హహ.


        బ్లాగ్లోకంలో , బయట ఉన్న అందరు అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్ళకు రాఖీ శుభాకాంక్షలు!!