Loading...

4, జులై 2009, శనివారం

తొలకరి జల్లులు

అబ్బ! ఇన్నాళ్ళ ఎదురు చూపుల తర్వాత మా వూళ్ళో వానొచ్చింది.
అహా! మట్టివాసన ఎంత పీల్చినా ఇంకా కొత్తగా, ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఇది తొలకరి జల్లులకు మాత్రమే పరిమితమైన ప్రత్యేకమైన నాకెంతో ఇష్టమైన వాసన. ఐతే ఎక్కడ మట్టి ఉండటం చాలా తక్కువైపోయింది. ప్చ్!
చిన్నప్పుడు వర్షాలు వచ్చి నీళ్ళు అక్కడక్కడా పారుతుంటే వర్షం పూర్తిగా ఆగక ముందే కాగితప్పడవలు చేసుకుని బయటకు పరిగెత్తటంలో ఉన్న ఆనందం మరువలేనిది.పడవ, కత్తి పడవ, రెక్కల పడవ అంటూ పోటీలు పెట్టుకుని చేసుకునే వాళ్ళం.ఒకటి, రెండు నిముషాలు అది నిళ్ళలో వెళ్ళి, ఆ తరువాత తడిసి పోయి మునిగిపోతే ఇంకొకటి వదలడమే.ఓహ్!
వర్షా కాలంలో వాటంతటవే బావి వెనకాల మట్టిలో ఎప్పుడు పడిన విత్తనాలో మరి, కాకర, కాచర (చిన్నగా ఒక అంగుళం పొడవులో చేదైన కాయలు, బెల్లం వేసి చేసుకుంటే బావుంటుంది. ఈ మధ్య ఈ కాయల్ని ఎక్కడా చూడలెదు.బెల్లం వేయకుండ చేసి చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిదంటారు.) మొక్కలు వచ్చేసెవి. ఇంకా నువ్వుల మొక్కలు కూడా వచ్చేవి. మా వూరంతా మాగాణి, వరి పండేది కాబట్టి నువ్వుల మొక్కల్ని చూస్తే విచిత్రంగా ఉండేది.హి!
మా అమ్మమ్మగారి ఊరు వెళ్ళినప్పుడు కూడా కొత్తిమీర, కంది,శనగ, పొద్దు తిరుగుడు, ఇలా కొన్ని చూశాను కానీ నువ్వుల మొక్కలు నాకు కొత్తే! మా బావిలో నీళ్ళు తోడుకోవడానికి వచ్చే మావూరు పురోహితుని భార్యను అత్త అని పిలిచే వాళ్ళము.(ఊరికంతా ఒకే పురోహితుడు) ఆవిడకు ఎప్పుడైనా కాకర కాయలు మా తోటలో పండాయని ఇస్తే పక పకా నవ్వేవారు. ఏమిటీ తోటా! అంటూ. నిజమే మరి అప్పట్లో మా వూళ్ళో పెరట్లో ప్రత్యేకంగా తోటంటూ వేసుకునే వారు ఎవరూ లేరు.అందుకే ఆవిడ నవ్వే వారు.
ఇక వర్షం ఆగాక వచ్చే ఇంద్ర ధనుస్సు అందాల్ని చూస్తూ అందులో విబ్జియార్ లోని అన్ని రంగులూ ఉన్నాయా లేవా అనిచూడడం ఆహా!
మరుసటి రొజు బడికెళ్తే అక్కడ కానుగ చెట్టు ఆకులమీద రాత్రంతా పడిన వానచుక్కలు కొమ్మల్ని అల్లాడిస్తే మామీద పడేవి. మా అందరికీ ఎంతిష్టమో!
ఇక ఇలా రాస్తూ పోతే ఇక దీనికి అంతేముంది?
ఇప్పటికిక శెలవు.

28, జూన్ 2009, ఆదివారం

ట్రాఫిక్ జాం సమస్యలు- సమాధానాలు గురించి మా అబ్బాయి సైట్

ORACLE నిర్వహించిన పోటీకి మా అబ్బాయి, వాళ్ళ టీము కలిసి స్వంతంగా తయారు చేసిన SITE. Pl. check this out.

It's about Traffic jam problems & solutions.

CROSSROAD CONGESTION

17, జూన్ 2009, బుధవారం

పెదవి గుమ్మానికి చిరునవ్వుల తోరణాలు

పెదవి గుమ్మం దాటలేని మూగబాసలు
చిరునవ్వుల తోరణాలై కనువిందు చేస్తున్నాయి!

కదలివచ్చిన చూపులకిరణాలు
నునుమేని తాకిడికి పరావర్తనం చెందుతున్నాయి!

మౌనాల వెనక దాగిన పలుకులు
మనోకుసుమాన్ని వికసింప చేస్తున్నాయి!


కలల కదిలే స్వర్ణ భవితకు
కాంతులీనే శొభవై అగుపిస్తున్నావు!

వర్ణమయమై
విరులవనమై
మన బతుకు బాట సాగిపోనీ!!

-మందాకిని.

25, మే 2009, సోమవారం

నీ వంట గదిలో నే ఉప్పా చక్కెరనా?

మన మిత్రుడుసందీప్ గారు కొన్నాళ్ళ క్రితం విలన్ సినిమా పాటను చక్కగా వివరిస్తూ ఓ టపా రాశారు. నేను తెలుగులో వినకపోయానే అనుకున్నాను. మన మిత్రుడు బహు చక్కగా విశ్లేషించి మరీ మన కోసం రాశారు.ఆ పాట తమిళ్ దిల్ అనే సినిమాలో విక్రం, లైల మీద తీసిన పాట.

తెలుగులో శృంగారం పాళ్ళు ఎక్కువగా ఉన్న ఆ పాట తమిళ్ లో ఒక కంపానియన్ కొసం అన్నట్టుగా సాగుతుంది. రెండు పాటలూ బాగున్నాయి. అందుకే మన మిత్రుల కోసం నేను సరదాగా తెలుగులో అనువదించి రాస్తున్నాను. అప్పట్నుంచీ అనుకుంటే ఇప్పటికి కుదిరింది.

అతను: నీ వంట గదిలో నే ఉప్పా చక్కెరనా?
ఆమె: నీ పడక గదిలో నే కళ్ళా,పుస్తకమా? (కళ్ళా=కన్నులా)
అతను: నీవు చేతివేళ్ళైతే నేను నఖమా, ఉంగరమా?
ఆమె :నీవు పెదవులైతే నేను ముద్దునా, చిరుదరహాసమా?
అతను: నీవు అందమైతే నేను కవినా,చిత్రకారుడినా?
ఆమె: నేను నునుసిగ్గునైతే నీవు బుగ్గవా, కెంజాయవా?
అతను:(తిండల్) అయితే నీవు వేలివా, స్పర్శవా? (తిండల్ అనే తమిళ్ పదానికి అర్థం తెలీలేదు.)
ఆమె: నీవు పసిపాప వైతే నే జోలపాటనా, ఊయలనా?
అతను: నీవు నిద్రవైతే ఒడినా, తలగడనా?
ఆమె: నేను హృదయమైతే నీవు ప్రాణమా. గుండెసడివా? (నీ)


అతను: నీవు విత్తైతే నే వేరునా,విత్తిన నేలనా?
ఆమె: నీవు విందైతే నే రుచినా, ఆకలినా?
అతను: నీవు ఖైదీవైతే నే చెర నా దండననా?
ఆమె: నీవు భాషవైతే నే తమిళా,ధ్వనినా? (తెలుగు అందామా మనం?)
అతను: నీవు నవతవైతే నే భారతినా, భారతిదాసనా?
నీవు ఒంటరైతే నే తోడునా, దూరంగా ఉన్న ప్రేమనా?
ఆమె: నీవు తోడువైతే నే మాటాడనా, యోచించనా?
అతను: నీవలా తిరిగి నించుంటే నే ఆగనా, వెళ్ళిపోనా?
ఆమె: నీవు వెళుతుంటే నే పిలవనా,ఏడ్చేయనా?
అతను:నీవు ప్రేమవంటే నే సరియా, తప్పా?

ఆమె:నీ కుడిచేతిలో పదివేళ్ళు
పదివేళ్ళు
అతను: నా ఎడమ చేతిలో పదివేళ్ళు

నాకైతే ఈ పాట చాలా నచ్చింది.
తిండల్ అనే పదానికి అర్థం తెలీలేదు.
చిత్రీకరణ కూడా బాగుంది.చివరలో నా కుడిచేతిలో పదివేళ్ళు అనేఉడు ఇద్దరూ వర్షంలో తడుస్తూ చేతులు కలిపి ఉంటారు. ఈ లైన్లు మొదట రాశారా లేక చిత్రీకరణ అయ్యాక రాశారా అనుకున్నాను. పదివేళ్ళనే ఈ ఊహ కొత్తగా అనిపించింది.

23, ఏప్రిల్ 2009, గురువారం

నిరీక్షణ--ముందు,తర్వాత

కన్నుల కొలను ఎండిపోయెనే
చూపుల పూలు వాడిపోయెనే
ఆమని మారెనే వేసవిగానే
వేచి యుండుట ఇంత నరకమా!


అడుగుల సడి ఎద మురిపించెనే
వెచ్చని ఊపిరి ఆయువు పెంచెనే
మరుని రాకతో మనసు మురిసెనే
వేచిన పిదప ఇంతటి సుఖమా!

-మందాకిని

11, ఏప్రిల్ 2009, శనివారం

రాగాల పల్లకి

ఈ పాట వినడానికి ఇక్కడ నొక్కండి.

ముందు తెలిసెనా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసెనా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసెనా ప్రభూ!

అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
సుందర మందారకుంద సుమ దళములు పరువనా
సుందర మందారకుంద సుమ దళములు పరువనా
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును

ముందు తెలిసెనా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసెనా ప్రభూ!

బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానేరావు
బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానేరావు
ఎదురగయని వేళవచ్చి ఇట్టే మాయమవుతావు
ఎదురగయని వేళవచ్చి ఇట్టే మాయమవుతావు
కదలనీక నిముసము నను వదలిపోక నిలుపగ
నీ పదముల బంధింపలేను హృదయము సంకెల జేసి

ముందు తెలిసెనా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసెనా ప్రభూ!

***

28, మార్చి 2009, శనివారం

చందమామ - తారభామ

ఎన్నెన్నో అందాలు చందమామకి
కన్నేసి చెంతచేరె తారభామిని
కన్నులతో రాసుకున్న ప్రేమలేఖలే
మిన్నంతా సాగెనెమో మేఘమాలలై


జాజిపూల గంధమై జావళీల చందమై
జాబిల్లి డెందమే అలరారగా
వెల్లువయే కోరికే వెన్నెల్లో వేడుకై
మెల్ల మెల్ల తారకే తళుకులీనగా

దశమి నాటి రేతిరేళ చలచల్లగా
దిశలన్ని వెన్నెల్ల వెలిగిపోయెగా
చక్కనైన చుక్క బొమ్మ పక్కనుండగా
చిక్కనైన చీకటెకడో దాగిపొయెగా
-
మందాకిని

26, మార్చి 2009, గురువారం

ఉగాది శుభాకాంక్షలు!
మన
మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

26, ఫిబ్రవరి 2009, గురువారం

మా తాతయ్యలు

మా తాతయ్య వయసులో ఉన్నప్పటి ఫోటో చూస్తే ఎన్. టి. ఆర్ లాగే ఉండేవారు. ఎత్తు, ఎత్తుకు తగ్గ లావు ,నిండైన విగ్రహం,చూడడానికి గంభీరంగా ఉండేవారు. వయసయ్యాక ఎన్. టి. ఆర్ లాగే లావుగా అయిపోయారు.

పుట్టింది 1910 లో కాబట్టి ఆకాలపు పదవ తరగతి చదివినా ఆంగ్లంలో కవితలు రాసేవారట. (చదువుకునే రోజుల్లోనే,) అప్పుడు నేను కొంచెం పొట్టిగా ఉండటంతో నన్నెప్పుడూ పొట్టి, పొట్టి అని ఏడిపించేవారు. నావయసే ఉన్న మా చిన్నాన్న కూతురు పొడుగ్గా ఉండటంతో నాకు చాలా ఉక్రోషంగా ఉండేది. (తర్వాత నెను పొడుగు పెరిగాను.అది చూడకుండానె ఆయన పోయారని నాకు చాలా బాధ.)
షుగర్ ఉండటంతో ఎప్పుడూ మంచినీళ్ళు అడిగేవారు. నేను ఒపిగ్గా తెచ్చి ఇస్తే, అది ఇవ్వదు, అది చెండి, చాముండి అని మా చిన్నాన్న కూతుర్ని మెత్తగా విసుక్కునేవారు. అప్పుడు నాకు సంతోషం.
అదంటె నాకు ప్రాణం. ఎందుకో చిన్నతనంలో ఆపోటీలు.
ఎప్పుడు బయట అరుగు మీద కూర్చుని భగవద్గీత లోని పద్యాలు రాగయుక్తంగా చదివేవారు. అలా వినినందువల్లే గీత లోకృష్ణుడు చెప్పిన విషయాలమీద ఆసక్తి పెరిగింది. (నేను ఆరవ తరగతి చదివేటప్పుడు గీత శ్లోకాల పోటీ లో మొదటి బహుమతి గెలుచుకున్నానోచ్!)


మా తాతగారి తో మేమే కాదు, మా నాన్న, చిన్నాన్నలు కూడా సరదాగా స్నేహితుల్లా రాజకీయాలు, ఇంకా ఎన్నో విషయాలు గల గలా మాట్లాడుకునే వారు. అర్థం కాని వయస్సులో కూడా వినడం భలే సరదాగా ఉండేది.
ఇక ఇంకో తాతయ్య (అమ్మకు నాన్న)గురించి తలుచు కుంటే అంతా వ్యతిరేక అనుభవం. ఈ తాతయ్యను చూడడానికి ఎండాకాలం శెలవల్లో తప్పనిసరిగా వెళ్ళేవాళ్ళం. రైలు, బస్సు, ఎద్దుల బండి(ఒక్కోసారి జట్కా బండి. రెండూ తాతయ్య సొంతం.)

ఈ ప్రయాణం భలే ఇష్టంగా ఉండెది. పాసెంజెరులో నిదానంగా బస్సులో జనంలో అవస్థలు పడి, దిగంగానే మాకోసం బండి ఎదురు చూడం భలే థ్రిల్లింగ్ గా ఉండేది. మమ్ములను చూడగానే విప్పి ఉంచిన ఎద్దుల్ని బండి కి కట్టేవారు. వేసవి కదా పంటలు ఉండవు. భూమి నల్లగ కాటుకలా ఉంటుంది దాన్ని చూస్తూ అరగంట ప్రయాణం.
తాతయ్యను చూస్తే భయం. ఎప్పుడూ తిట్టలేదు, కొట్టలేదు. ఎందుకోమరి తెలీని భయం. మా కజిన్స్ అంతా వచ్చేవాల్ళ్ళు. సెలవలంతా వాళ్ళతోనే ఆటలు, మాటలు. తాతయ్య నాకు డాక్టర్ అవమని చెప్పేవారు. నాకు లెక్కలు ఇష్టం అని మొండిగా చెప్పినా కోపగించకుండా, డాక్టర్ అయితె ఎవరి దయ లేకుండా మనమే బోర్డ్ వేసుకోవచ్చు అని చెప్పేవారు.

ఆమాట నిత్యసత్యమని ఇప్పుడు ఇంజనీర్లని చూస్తే తెలుస్తుంది. వాళ్ళు ఇంట్లో కన్నడ మాట్లాడేవారు. నన్ను నేర్చుకోమని చెప్పేవారు. నీకు ఒక భాష అదనంగా వస్తుంది కదా అని నచ్చచెప్పెవారు. మొండిగా నేర్చుకోకుండా ఉండిపోయాను. కానీ ఇప్పుడు చక్కగా కన్నడ, తమిళ్ మాట్లాడగలను. వినడానికి, సంతోషించడానికీ తాతయ్య లేరు.
ప్చ్!.. ఏమిటో!

3, ఫిబ్రవరి 2009, మంగళవారం

కనుగొనవా ప్రియతమా!


కనుగొనవా ప్రియతమా!
నాకన్నుల కాంతిలో
మెరుపు నీవని
నా మూగ మనసులో రాగమే నీవని
నా ఆకాంక్షలో ఆర్తివైనావని
నా లక్ష్యం లో దిక్షవై ఉన్నవనికనుగొనవా ప్రియతమా!
నా గుండియలో లయవని
నా నవ్వులలో దివ్వెలా
వెలుగుతున్నావని
నా శ్వాస లో వెచ్చదనం
నా చూపులో చల్లదనం
నీవేనని

కనుగొనవా ప్రియతమా!
నా కలల లోకానివని
కోరికల రూపానివని
నా భావాల్లో జీవానివని

కనుగొనవా ప్రియతమా!
నా భావ కడలికి నువు
పున్నమవని
నను భవ కడలి దాటిస్తావని
నా జీవాత్మలో పరమాత్మ
నీవె నీవెనని!!

-మందాకిని.

31, జనవరి 2009, శనివారం

రాధికా విరహ గీతి


జయదేవుని రాధిక విరహ ఘట్టం చదువుతుండగా
నా మనసులో రాధ గురించి ఎన్నో ఆలోచనలు. వాటినన్నింటిని కాగితం మీద పెట్టకుండా ఉండలేకపోయాను. అది ఈ గీతమై నిలిచింది. ఇప్పుడు అన్నిభావనాతరంగాలను పదిలంగా దాచుకునేందుకు బ్లాగు అందుబాటులోకి వచ్చింది. ఇక ఇందులో రాయకుండా (టైపకుండా) ఉండగలనా?

ఒంటరి మనసు తుంటరి తోడు కోరుకున్నదిలే !
చల్లని రేయి మల్లెల వేళ వేచి ఉన్నదిలే ! ||||

ఉరమున వాలే కోరిక తీర్చగ చేర రమ్మనెలే !
కరముల మాలలు వాడక మునుపే వేగ రమ్మనెలే!
వెన్నెల లోన ఉల్లమునందున
ఆశలున్నవిలే ! ||||

కన్నుల కన్నీరొలికే దాకా జాగు చేయకుమా!
వెన్నల మనసుల మీద కొంచెం జాలి చూపుమా!
నిన్నే నమ్మిన నెచ్చెలి నొకపరి
చెంత చేర్చుమా! ||||

ఎల్లలు లేని ఆకస వీధుల సంచరించెదమా!
కలువల తోటల కాసారమ్ముల సాగిపోదామా!
నవ్వుల పువ్వులు విరిసే చోటికి
చేరుకుందామా! ||||
-మందాకిని(లక్ష్మీదేవి)

29, జనవరి 2009, గురువారం

చిన్న నాటి కబుర్లు

మా తమ్ముడు చక్కగా కష్టపడి చదివేవాడు. హార్డ్ వర్కర్ అన్నమాట. నాకేమో ఒకసారి చదివింది మళ్లీ మళ్లీ చదవాలంటే బోరు. (ఏక సంథా గ్రాహి అని పేరుండేది లెండి మనకి) దానికి తగినట్టు వాడు ఎప్పుడూ క్లాసులో ఫస్టు వచ్చేవాడు. వాడు

పదవ తరగతి పరిక్షలు రాసినప్పుడు జరిగిన విషయము మేమెప్పుడూ మరిచిపోలేము.
మాది పల్లె కావటం వల్ల పరిక్షలు మా పాఠశాల లో కాకుండా పక్కన ఉన్న టౌను లో వేశారు. రోజు వెళ్లి వచ్చేవాడు. వాళ్ల బాచ్ కు (సబ్జెక్టు లన్నీ)సిలబస్ మారింది. కొత్త సిలబస్ తో ఉపాధ్యాయులతో సహా అందరూ కష్ట పడుతున్నారు.

ఒకరోజు ఆంగ్ల పరిక్షరోజు అనుకుంటా, మా తమ్ముడు పరిక్ష రాయడం మొదలెట్టాడు. అందరూ మొదలెట్టారు. కాని పేపర్ చాలా కష్టంగా ఉంది కాబోలు ఎవ్వరూ సరిగా రాయలేక పోతున్నారు. అప్పుడు పరిక్షాదికారి టక టకా రాసేస్తున్న మా తమ్ముడి దగ్గరకు వచ్చి గమనిస్తున్నాడట.

రెండు గంటలు గడిచాయి. మా తమ్ముడు చాలావరకూ రాసేశాడు. అప్పుడు ఉన్నట్టుండి పరిక్షాదికారి మా తమ్ముడి పేపర్ తీసుకుని పెద్దగా చదివి అందరికి డిక్టేట్ చెయ్యడం మొదలెట్టాడుట. మా తమ్ముడు షాక్! కాని చేసేదేమీ లేక రాసినవన్నీ చూపిస్తూ వచ్చాడట. ఇంటికి వచ్చాక మాతో విషయం చెప్పాడు. నాకో కొత్త భయం పట్టుకుంది పేపర్లన్నీ ఒకేలా ఉంటే డిబార్ చేస్తారేమో, అన్దరినీ డిబార్ చేస్తే..? వీడిదే ఒరిజినల్ అని వారికి ఎలా తెలుస్తుంది?
ఆతర్వాత కూడా కష్టమైన పేపర్లన్నిటికి ఇదే వరస.

ఇప్పుడు అయితే ఇన్ని టీవీలు అవి వచ్చాయి కాని అప్పుడేముంది? అన్యాయం జరిగితే వెంటనే అదే వార్త పదే పదే వేసి లోకమంతా తెలిసిపోతుంది. కొందరికి పరిష్కారం దొరకొచ్చు. కొందరికి దొరక్కపోవచ్చు. కాని పబ్లిక్ కి విషయం తెలుస్తుంది. దాదాపు ఇరవైయేళ్ళ క్రితం ఏమి లేదు. రిజల్ట్స్ వచ్చేవరకూ మనసు మనసులో లేదు.

ఎట్టకేలకు రిజల్ట్స్ వచ్చాయి. మా తమ్ముడు స్కూల్ ఫస్ట్ వచ్చాడు. మిగతా వాళ్లు డిబార్ కాలేదు. అంతే కాదు, అంత వరకూ స్కూల్ చరిత్రలో లేని విధంగా మాతమ్ముడు మార్కులు తెచ్చుకున్నాడు.

కరస్పండేంట్ గారు పిలిచి నువ్వు మన వూరికే పేరు తెస్తావని ఆశీర్వదిన్చారు. ఇప్పుడు వాడు టి. సి. ఎస్ లో ఉన్నాడు. విధంగా పరిక్షలు నిర్వహించే వాళ్ళే నడచుకుంటే ఎవ్వరేం చెయ్యగలరు? కొత్త సిలబస్ కు తగినట్టు గా ఉపాధ్యాయులకు శిక్షణ నిచ్చి తయారు చెయ్యాలి. కంచె చేను మేస్తే అన్నట్టు ఇలా జరిగితే అడ్డుకునేది ఎవరు?

అయినా మార్కులు, పాస్ కావడం కాకుండా విషయం అర్థమయిందా లేదా అని చూసే రోజు ఎన్నడు వస్తుందో? పూర్వం మన గురుకులాల్లో అలాగే ఉండేదిట. ఎన్ని రోజులు అని కాకుండా ఒక సబ్జెక్ట్ , లేదా శాస్త్రం అని తీసుకుంటే అది అంత అవపోసన పట్టేవాళ్ళు. తిరిగి అలాంటి రోజులు రావాలని నా ఆశ. అప్పుడే శాస్త్రం లో మనం మరింత నేర్చుకుని , పరిశోధించి ఏమైనా కనిపెట్టగలం. శాస్త్రజ్ఞులు పెరుగుతారు.

అలా కాకుండా పది పదిహేనేళ్ళు పది రకాల సబ్జెక్టులని పరిచయం అనే పేరు తో అలవాటు చేసి ఇప్పుడు నీకేది కావాలో తేల్చు కొమనడం సబబు కాదు. అప్పుడు వాళ్లు తేల్చుకోలేక పోవడమూ వింత కాదు.

కొంతమంది పిల్లలు మాకు ఇది కావాలని చెప్పగలరేమో గాని అందరూ చెప్పగలరా? అప్పుడే స్నేహితులు, బంధువులు చెప్పిన తెలిసి తెలియని ఉచిత సలహాలు ఇవ్వటం మొదలెడితే వాటిల్లో ఏదో ఒకటి పాటించి, తర్వాత కయ్యో మొర్రో మంటే ఏంటి లాభం?

26, జనవరి 2009, సోమవారం

నేటి సమాజం.. ఏం కోల్పోతూంది ?

మనం ఎప్పుడూపిల్లలు బాల్యం కోల్పోతున్నారని మాట్లాడుకుంటూ ఉంటాము. నిజమే, పిల్లలు వీడియో, టీవీ ,కంప్యూటర్ గేమ్స్ , చదువులు అని ఎప్పుడూ బిజీ గా ఉంటారని, నేలమీద, మట్టిలో ఆడుకోవడానికి లేదని, బాధపడుతూ ఉంటాము. అంతేనా, ఏదైనా బంధువులందరూ కలిసే శుభ సందర్భాలు, పండుగలు మొదలైన వాటిలో అందరితో కలిసే అవకాశము ఉండదు. ఈ విధంగా అలవాటు లేక ఎప్పుడైనా అందరితో కలిసినప్పుడు వారితో కలుపుగోలుగా ఉండలేకపోతారు. కాబట్టి కలవడానికి అసలు ఇష్టపడటమే లేకుండా పోతుంది.

రాను రాను నాలాంటి అమ్మలు కూడా బ్లాగులకు అలవాటు పడి, పిల్లలతో కలిసి గడిపే టైము తగ్గిపోతూంది. ఈ విధంగా పిల్లలు వాళ్ల లోకంలో వాళ్లు ఉండటానికి ఒక తప్పనిసరి పరిస్థితికి నెట్టబడుతున్నారు.
ఉరికే ఉండటం , ఇతరులతో కలిసి గడపడం లాంటివి ఈ తరానికి చేత కావేమో గదా!

నాకు తెలుసు.ఇంతకి, నేను చెప్పోచ్చేదేమిటి అంటే
పిల్లలు ఎలా బాల్యం కోల్పోయారో, అలాగే పెద్దలు తమ వృద్ధాప్యాన్ని కోల్పోయారని నాకు అనిపిస్తోంది. నిజమే , వృద్ధాప్యాన్ని అందులోని పెద్దరికపు గౌరవాన్ని, అందులోని హుందాతనాన్ని కోల్పోయారు. మునుపట్లో, ఇంటిలో పెద్దలు ఉంటే, ప్రతీ ముఖ్య విషయంలో, వారిని సంప్రదించి, వారి సలహా తీసుకుని, అమలు చేసేవారు.

వారి అనుభవము,
వారి మేచ్యురిటి(పరిపక్వత)
తొందరపాటు లేకుండా నిదానంగా ఆలోచించడము
తమ ఒక్కరికే కాకుండా కుటుంబాన్ని, సమాజాన్ని గురించి ఆలోచించి, నిర్ణయం తీసుకొగలగడము,
లోకజ్ఞానము

ఇవన్ని ఉపయోగించుకోకుండా ఈ నాటి (యువతరమా, కాదు) సంపాదించే వారు, వారి జీవిత భాగస్వామి ఎంతో కోల్పోతున్నారనిపిస్తోంది. ఒక్కమాట నేను ఒప్పుకోక తప్పదు. ఈ నాడు లభించే సదుపాయాలు, సౌకర్యాల గురించి పెద్దవాళ్ళకు తెలీక పోవచ్చు. కాని పైన చెప్పినవన్నీ వారి ప్లస్ లే కదా. ఎ విషయమైనా రెండు తరాలవారు కలిసి కూర్చుని మాట్లాడుకుని నిర్ణయించుకోవచ్చు కదా. ఇంకా నయం, ఇప్పుడు కొత్తగా పెళ్ళయిన వాళ్ళయితే పిల్లలను కనగానే మా పిల్లలు మా ఇష్టం అనడం చూస్తూంటాం. చిన్న పిల్లల విషయం అనుభవజ్ఞులకే కదా బాగా తెలుస్తూంది అని కూడా అనుకోరు. ఇక పెద్ద పెద్ద విషయాలు, పాలసీ డేసిషన్స్ తీసుకునే టప్పుడు పెద్దవాళ్ళను సంప్రదించాలి అనుకుంటారా?
ఈ విధంగా ప్రతీ విషయంలోనూ నిర్లక్ష్యం చేయబడటం వల్ల పెద్దవారికి జీవితం మిద ఇచ్ఛ తగ్గిపోతూంది. ఇప్పుడు వచ్చిన వైద్య సౌకర్యాల వల్ల వారి ఆరోగ్యాలు బాగుగా ఉండటము, జీవిత కాలము పెరగడము జరగడం మంచిదే అయినా కుటుంబంలో వారి పాత్ర, బాధ్యత గణనీయమ్ గా తగ్గిపోయింది. దీంతో వారు సొంత ఇంట్లో అతిథులుగా ఉండవలసి వస్తోంది. ఎంత సౌకర్యంగా ఉన్నా అతిథులుగా ఎక్కువ రోజులు గడపడం చాల కష్టం. ఇది అన్దరికీ అర్థం కాకపోవచ్చు. కొన్నేళ్ళ క్రితం మనవాళ్ళని చూసుకోవడం అనే సంతోషకరమైన బాధ్యత అయినా ఉండేది. ఇప్పుడు పిల్లలు కంప్యూటర్ అని కోచింగ్ లని చాల బిజీ గా ఉండటం తో అదీ పోయింది. అందుకే కుటుంబాల్లో పెద్దల పరిస్థితి చుస్తే చాల జాలేస్తుంది
ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికే చాలామంది పదవీ విరమణ తర్వాత కూడా పిల్లలు పనిచేసే ఊరికి షిఫ్ట్ కావడానికి ఇష్ట పడరు. ఒంట్లో ఓపిక అనేది ఉన్నంతవరకూ భార్య భర్తలే ఒంటరిగా ఉంటారు. ఎంత ఓపిక అని చెప్పుకున్న అన్ని పనులు చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. చప్పున ఒక మాత్ర తెచ్చుకోవాలన్న, ఒక కాఫీ చేసుకోవాలన్న ఒక్కోసారి కష్టంగానే ఉంటుంది.
ఏమిటో ఈ జీవితం అని అనిపించక మానదు.

అందుకే నేటి సమాజం బాల్యం యొక్క అందాన్ని, ఆనందాన్ని కోల్పోయిందో అదే విధంగా వృద్ధాప్యం యొక్క హుందాతనాన్ని, పరిపక్వతని కోల్పోయింది. దీనికీ కాలమే జవాబు చెప్పాలి. ఎందుకంటే అందరికి తమ తమ కారణాలు ఉండటం వల్ల వీరిది తప్పే అని నొక్కి చెప్పలేము.

21, జనవరి 2009, బుధవారం

నరసింహ: తెలుగు భాషాభివృద్ధి

నరసింహ: తెలుగు భాషాభివృద్ధి

19, జనవరి 2009, సోమవారం

ఎన్నియల్లో !

సంక్రాంతి పండగ అయిపోయింది. అందరం మన పల్లె సీమల్ని గుర్తు తెచ్చుకుని సంబరపడ్డాము. ఈ ఊపులో నేను రాసిన ఈ పల్లె పదం కూడా చూడండి మరి.

ఎన్నియల్లో ఎన్నియల్లో
మా పల్లె సీమల్లో ఎన్నెన్ని ఎన్నెల్లో
మా వోల్ల కళ్ళల్లో ఎన్నెన్ని ఎన్నెల్లో "ఎ"
చిన్నారి పాపల్ల పసిడి నవ్వుల్లో
పొన్నారి బాబుల్ల మిసిమి చూపుల్లో
ఎన్నియల్లో ఎన్నియల్లో
అమ్మలక్కలు చేరి పాడేటి పాటల్లో
కొమ్మల్ల ఊయల్లు ఊగేటి వేళల్లో
ఎన్నియల్లో ఎన్నియల్లో "ఎ"
సంజెపొద్దుల్లో మేసొచ్చేఆవుల్లో
ఇల్లంతా తిరిగేటి కోళ్ళ గోలల్లో
ఎన్నియల్లో ఎన్నియల్లో
పారే నీళ్ళల్లో పసిడిపంటల్లో
అవ్వాతాతలు కొసరే ప్రేమల్లో
ఎన్నియల్లో ఎన్నియల్లో "ఎ"

17, జనవరి 2009, శనివారం

అమృత ఆస్వాదన

ఆంధ్రామృతంలో చక్కని తెలుగు పద్యాలు, అర్థం, అన్వయం భావం చదివితే మనసుకి ఎంతో హాయిగా ఉంటున్నది. ఇకపోతే, ముందునుంచీ చదివితే తెలుగు,వెనుకనుంచీ చదివితే సంస్కృతం అర్థం వచ్చేలా రాసిన ఆమహనీయుల ప్రతిభ, చక్కగా అవన్నీ సేకరించి మనకి అమృతం పంచుతున్న చింతా రామకృష్ణారావు గారి అభిరుచి నిజంగా మెచ్చుకోతగినది. మనలో ఇంకా ఎవరైనా ఆ పద్యాల అందాలను తిలకించనివారుంటె చప్పున వెళ్ళి చూడండి.ఇంకా ఇలాంటి బ్లాగులు చాలా ఉన్నట్టున్నాయి.లంకెలు దొరికితే బాగుండేది.

13, జనవరి 2009, మంగళవారం

సంక్రాంతి శుభాకాంక్షలు!!!

ముందుగా మన బ్లాగు మిత్రులందరికీవారి కుటుంబాలకూ సంక్రాంతి శుభాకాంక్షలు!!!

ఇప్పుడు ఇలా నగరాల్లో చేరి మరిచిపోయాం కానీ చిన్నప్పుడు మా పల్లెలో సంక్రాంతి అంటే ఎంత సంబరంగా ఉండేదో! అబ్బా అందరూ ఇదే రాస్తున్నారని చదివేవాళ్ళకు విసుగొస్తే రానీ గాక, మావూళ్ళో పండగ గురించి నేనూ రాసుకోక మానను. హ..హ..హ .


నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో....(చక్రాలు) చక్కగా 3 గంటలకంతా నిద్దర లేచి ఏడింటి వరకూ మా కాంపౌండ్ అంతా ముగ్గులతో నింపేసేదాన్ని.

ఆ నెలంతా ఒకటొ, రెండో వేసినా, భోగి, సంక్రాంతి,కనుమ ఈ3 రోజులు మాత్రం నాలుగు గంటలపాటు మా ఇంటి ముందు ముగ్గులతో నింపేసేదాన్ని.

బొర్నవిటా తాగుదువు గాని రామ్మా అని అమ్మ ఎంత పిలిచినా ముగ్గుల కార్యక్రమం అయ్యేదాకా వెళ్ళేది లేదు. రంగులు నింపితే ముగ్గుల అందాన్ని చూడలేమనే గొప్ప అభిప్రాయంతో రంగులు మాత్రం వేసే దాన్ని కాదు. ( తర్వాత ఈ తొక్కలో అభిప్రాయన్ని మార్చుకున్నాననుకోండి.)


క భో గి రోజు ఉదయన్నే తలంటుపోసుకుని పూజచేసుకుని అమ్మ చేసిన సద్ద రొట్టెలు గుమ్మడి కాయ కూర పులగం అందరూ కలసి (అన్నీ ఒకేసారి కాదు లెండి బాబూ) లాగించేవాళ్ళం.

సంక్రాంతి రోజు భక్ష్యాలు, చక్కెర పొంగలి,కొత్త బట్టలు, గోరింటాకు పెట్టుకోవడం, ఎవరి ముగ్గులు, గోరింటాకు బాగున్నాయో మాట్లాడుకోవడం3 ఏళ్ళ వయసు వరకూ పిల్లలకు భోగిపళ్ళు పోయడం(పుల్ల రేగుపళ్ళు,చెరుకుముక్కలు, బొరుగులు, పైసలు కలిపి పోస్తారు. తెలిసిన వాళ్ళను పేరంటానికి పిలుస్తారు.)

ఇంట్లో చుట్టాలు, వీధుల్లో హరిదాసులు, సాయంకాలం గుళ్ళోకెళ్ళటం, దేవుడి ఊరేగింపుల కోసం రథం అలంకారం అక్కడే ఉండి సహాయం చేస్తూ , రథంతో పాటు స్నెహితులతో కలిసి నడవటం, ఎవరి ఇల్లు రాగానే వాళ్ళు విడిపోవటం. ఇవన్నీ నా మధుర స్మృతులు .


8, జనవరి 2009, గురువారం

ఆకాశ వీధిలో....

5, జనవరి 2009, సోమవారం

మందార మకరందమును....

పుస్తకాలు చదివేటప్పుడు ఓ కొత్త ప్రపంచం లోకి వెళ్ళటం అనే అనుభూతి చాలా గొప్పది. అది నా లాంటి పుస్తకాల పురుగులకే తెలుస్తుంది.

మధ్యలో పుస్తకాలు (కనీసం వారపత్రికలు కూడా) చదవటం తగ్గించుకున్నాను. తర్వాత టి.వి. ప్రభావం వల్ల చదివే ఓపిక తగ్గిపోయింది.

ఇప్పుడు బ్లాగ్లోకం లోకి వచ్చి పడ్డాక మళ్ళీ ఖాళీ అయిన కలంలో సిరా నింపినట్టుగా (జీవం వచ్చినట్టుగా) అయింది. మనం రాసే కాలక్షేపం కబుర్లు చదువుతున్నపుడే ఇంత ఆనందమేమిటో! పుస్తకాలు చదవటం, బొమ్మలు గీయడం, రాయడం అన్నిటికి సంసార మహా సాగరంలో పడి బొత్తిగా దూరం అయిపోయాను.

నా బ్లాగులోకి ఇంకా ఎవరూ తొంగి కూడా చూడనప్పటికీ,నేను మాత్రం ప్రతిరోజూ బ్లాగ్దర్శనం చేసుకుంటూ బహు ఆనందం పొందుతున్నాను.

"మందార మకరంద మాధుర్యమును గ్రోలు..." అన్నట్లు ఇక టి.వి. సీరియళ్ళ మీద ఆసక్తి ఠక్కున మాయమయ్యింది. ఫోన్ల పుణ్యమాని ఉత్తరాలు కూడా మానుకున్నాక షాపింగ్ లిస్ట్ తప్ప ఏదీ రాయకుండా ఎలా ఉంటున్నానో ఇన్నాళ్ళూ అనిపించింది.

అయినా బొత్తిగా కలం పట్టకుండా లేను. కొన్ని దేవుని పాటలు, పల్లె పదాలు, విరహగీతాలు గెలికి ఆట్టే పెట్టాను.

అవన్నీ ఇప్పుడు నా బ్లాగులో కనిపిస్తుంటే పరమానందంగా ఉంది.

ఇక జనామోదానికి నోచుకున్న గొప్ప గొప్ప కావ్యాలు, గ్రంథాలు వ్రాసిన వాళ్ళ ఆనందం ఎలా ఉంటుందో కదా!

30, డిసెంబర్ 2008, మంగళవారం

ఏవో ఊహలు

ఎవరూ లేని ఏకాంతంలో
ధ్యానంలో
ప్రకృతి గానంలో
మౌనంలో
మానస సంచారం

మనసు సంచరించు వేళలో
మది మాటలాడు హేలలో
కనుల జలకాల లీలలో
ఏదో శాంతి దిగంతాలందుకునే మనభ్రాంతి
ఎంత ఎగసినా అంబరాన్ని చేరలేని అలలు
ఎంత మెరిసినా సంబరాన్ని చూడలేని కలలు

కనుపాపలాడే కన్నీటి జలకాల
కరిగేటి కలలన్నీ లవణాలధార
మదిఓపలేని మనభారమంతా
సహవాసమొదలి ననువీడిపోయె

ప్రేమరాహిత్యంలో బ్రతికి
ప్రేమరాహిత్యంలో మరణించగా
జీవములేని మనసు డొల్ల
అణగారిపోయెను ఆశలెల్ల
అడుగంటి పోయెను మరులెల్ల
-మందాకిని.