Loading...

6, ఫిబ్రవరి 2018, మంగళవారం

నిష్కామము

నిశ్శబ్దంలోని శబ్దం
నీ పలవరింతలుగా
నా ఊహల్లో వినిపిస్తోంది.

నిష్కామకర్మగా నీ ధ్యానం
నన్ను నలువైపుల నుంచీ
చుట్టుముడుతోంది.

నిర్వేదపు మరుభూమి పొరలు
 చీల్చుకొని మరువపు మొలకలు
చిగుళ్ళు తొడుగుతున్నాయి.

నిర్మోహాలను నిర్మిస్తున్న
మోహాలు మానససౌధానికి
శాంతిప్రాకారాలుగా నిలుస్తున్నాయి.

-----లక్ష్మీదేవి.

శిశిరం లో ఒక వసంతం

నిండుగా పూసిన రసాలసాలం

పూలెన్నున్నా  కలలెన్నున్నా అన్నీ పండేనా!
పండకపోయినా కనుల నిండేనే ఆనందం, చాలందాం.

4, ఫిబ్రవరి 2018, ఆదివారం

చెప్పుమా నేస్తమా!

చేనుగట్టుల, చెట్టునీడల చేయి కలుపుదామా?
మానుమానుకూ మంచికథలను కలిసి చెప్పుదామా?

ఆటలాడుతూ పాటపాడుతూ బాట సాగుదామా?
మాటమాటకూ మనసుతోడుగా చేర్చి నవ్వుదామా?


తేనె నింపిన పూల పరిమళం మదిని నింపుదామా?
నేను నీవుగా నీవు నేనుగా నింగికెగురుదామా?

----లక్ష్మీదేవి.