Loading...

28, జనవరి 2018, ఆదివారం

సాహిత్యోత్సవం (లిటరరీ ఫెస్టివల్)

హైదరాబాద్ సాహిత్యోత్సవం

             ఈరోజు వెళ్ళడం కుదిరింది. కొన్ని ప్రత్యక్ష పరిచయ కార్యక్రమాలను వినడం, చూడడం; స్థానిక కళాప్రదర్శనలు చూడడం జరిగింది.
      హైడీ  కామిక్ పాత్రను హిందీ పిల్లలకు పరిచయం చేసిన అవంతీ దేవస్థలె, గురు అర్జున్ సింగ్ కృత ఆదిగ్రంథ్ లోని పాటలను అనువదించిన అస్త్రి ఘోష్ వంటి అనువాదకుల తో పరిచయ కార్యక్రమం ఆసక్తికరంగా ఉండింది. ముఖ్యంగా అనువాదంలో భాషను మాత్రమే కాక భావనలను అనువదించే విషయం నాకు నచ్చే విషయం. ఇక దానితో పాటు ఒక సంస్కృతిని అనువదించాల్సి వచ్చినప్పుడు వారి ఆలోచనలు శ్రోతలతో పరిచయకర్తలతో పంచుకున్నారు. తరువాత శ్రోతల ప్రశ్నలకు జవాబిచ్చారు.
                      ఒక మాట చెప్పడం మరిచాను.
        ఒక అన్య సంస్కృతికి చెందిన పాత్రను, ఘటనను  స్థానికీకరణం చేయడం గురించి మాత్రం ఇద్దరు అనువాదకులు భిన్నాభిప్రాయాలను వెలువరించారు. స్థానికీకరణం చేయడం వల్ల అనువాదం చేయబడిన భాషలోని చదువరులకు ఆ యా పాత్ర, ఘటన స్వంతంగా అనిపించి దగ్గరౌతుందనేది ఒక అభిప్రాయం అయితే, ఏ భాష లోంచి అనువదిస్తున్నామో ఆ మూల భాషా పరిమళం( ఎసెన్స్) మాయం చేయడం అన్యాయమన్నది రెండో అభిప్రాయం. ఈ రెండు అభిప్రాయాల మధ్య చర్చ కొత్తదేం కాదు గానీ, ఇక్కడ కూడా మరింత ప్రస్ఫుటంగా వ్యక్తం చేయబడిందంతే.
    
           అనువాదకులకెప్పుడూ ఒకటికి మించి భాషలు తెలిసే ఉంటాయి. కానీ వారిని ప్రశ్నలు వేసేవారు ఒక ప్రాథమిక ప్రశ్నను ఎప్పుడూ వేస్తుంటారు. మీకెన్ని భాషలు తెలుసు? ఎలా తెలుసు? ఎలా నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది? అని. 😊
         ఒక కొత్త భాష నేర్చుకునేటప్పుడు ఎలా ప్రారంభిస్తే బాగుంటుందన్నదీ ఒక ప్రశ్న. ఈ విషయంలో ఎవరి ప్రాధాన్యతలూ, ఆసక్తులూ వారికున్నప్పటికీ మొట్ట మొదట దృశ్య, శ్రవ్య పద్ధతులు, వాటికి సహాయంగా నోట్స్ అన్నది నా అనుభవం. ఇది టీవీ కావచ్చు, లేదా ప్రత్యక్షంగా ఆ భాషీయుల సంభాషణలు కావచ్చు. అప్పుడే మనం నేర్చుకోవాలనుకున్న భాష సాధారణంగా ఉంటుంది. వికృతంగా ఉండదు. ముప్ఫై రోజులలో డాక్టర్ కావడం ఎలా అన్న పుస్తకం మార్కెట్లో చూసి డాక్టర్ మూర్ఛ పోయాడన్న హాస్యప్రసంగాలు వింటూ ఉంటాము కానీ ముప్ఫై రోజులలో ఫలాని భాష నేర్చుకోవడం ఎలా అన్నది కూడా అటువంటి జోకే. ఆ పుస్తకాలు ఏ మాత్రమన్నా ఉపయోగపడతాయని అనుకోను.


    --------------  తర్వాత నాకెంతో ఇష్టమైన పల్లీయుల (అంటే ప్రొఫెషనల్ అనే తీసుకోవాలి) కోలాట నృత్యం చాలా బాగుండింది.  ఉత్సాహం తగ్గకుండా , లయతప్పకుండా, పాటతో సహా నాలుగు రకాల కోలాట నృత్యరీతులు ప్రదర్శించారు.
    తర్వాత సుగాలీ (బంజారా?) నృత్యకళాకారులు చేశారు కానీ అది నన్నంతగా ఆకట్టుకోలేదు.
-------
      ఇంకొక పరిచయ కార్యక్రమం కొత్త రచయితలైన సుదీప్ నగర్ కర్, రవీందర్ సింగ్ లతో విన్నాను. రచన వస్తువు, శీర్షిక, ముద్రణ, మార్కెటింగ్ కి సంబంధించి పరిచయకర్తతోనూ, శ్రోతలతోనూ సాగింది. ఆసక్తికరమైన ఈ సంభాషణలో తన రచన గురించి మాట్లాడుతూ సుదీప్ ఎలా విద్యార్థుల పేర్లు జె ఎన్ యూ కాంపస్ కు వెళ్ళగానే కులాల పేరుతో మాత్రమే గుర్తింపబడతాయో చెప్పారు.
 

--------
 

భారతీయ సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశ్యంతో పది పన్నెండేళ్ళనుంచీ నడపబడుతున్న మ్యూజ్ ఇండియా పత్రిక వారు భక్తి కవయిత్రి  ఆండాళ్ ను ఆంగ్లంలో పరిచయం చేసిన రచయితలకూ, దేశవిభజన కాలం నాటి కథ జిందగీనామాను అనువదించిన అనువాదకులకూ బహుమతి ప్రదానం చేసి అనువాదాల్లో వారి అనుభవాలను అడిగి శ్రోతలకు అందించారు. జిందగీనామా ముక్కలు కానప్పటి పంజాబ్ ప్రాంతానికి సంబంధించినది. హిందీ, ఉర్దూ, పర్షియన్ శబ్దావళి తో కూడిన ఆనాటి వాతావరణాన్ని చూపించే ఆ నవలను అనువదించడం ఎంత కష్టంతో కూడిన పనో వారు వివరించారు.
-------
          ఒక కన్నడ కార్యక్రమంలో కొన్ని కవితలను చదివేవారూ గానం చేసేవారితో ప్రదర్శన ఉండింది.
         ఆ కవితల కన్నా చివరిగా శ్రోతల కోరిక మేరకు ప్యాసీ అనే పాటను వారు చాలా బాగా పాడారు.  ప్యాసీ అనే పాట కర్ణాటక నుంచి తమిళనాడుకు ప్రవహించే కావేరి నది పాడినట్టుగా వ్రాయబడిన పాట. మొదటి పంక్తులే ఎంతో ఆకట్టుకున్నాయి.
     కావేరి నీళ్ళ కోసం కర్ణాటక, తమిళనాడు మధ్య ఎప్పుడూ వివాదమే. ఆ రెండు రాష్ట్రాలనూ తన పిల్లలుగా భావించే కావేరి ఆ వివాదాలకు బాధపడి పాడుతోందట - మీకు నీళ్ళు త్రాగిస్తూ నేను దాహార్తినై మిగిలిపోతున్నాను. ఎవరి చేతిలో మీరు కీలుబొమ్మలుగా మారుతున్నారు అంటూ  సాగే పాట ఆకట్టుకుంది.
--------

        ఇంకేదో కార్యక్రమంలో సాగరికా ఘోష్, 'సంఘ్ వాళ్ళు కాంగ్రెస్ లో ఇందిరను మాత్రం విమర్శించరు' అని ఏదో వాళ్ళు భయపడుతున్నట్టు ఫీలైంది. నవ్వొచ్చింది. తర్వాతి మాటల్లో ఆవిడో నేషనలిస్ట్, పేట్రియాటిక్ అన్నది. ఆ రెండూ కలుపుకొని చూడలేకపోయింది పాపం. అత్యవసరపరిస్థితి వంటి కొన్ని చర్యలను విమర్శించినా, దేశ హిత కార్యక్రమాల విషయంలో బలపరిచినా- దేశం కోసం ఆలోచించి చేసే పనులైతే సంఘ్ వాళ్ళు సమర్థిస్తారనే విషయం ఆమెకెప్పుడు అర్థం కావాలి? పార్టీ కళ్ళద్దాలతో చూడ్డం అలవాటైతే ఇలాంటి దృష్టిలోపమే ఏర్పడుతుంది.

      తర్వాత చెప్పుకోదగ్గది ఎన్ ఆర్ బి (నేషన్ రాక్ బీట్) అనే సంస్థ సభ్యులు గా విద్యార్థినీ విద్యార్థులు గాన, నృత్య, రేఖాచిత్రాది కళలలో తమ సామర్థ్యాన్ని ఒక రోడ్ షో లా ప్రదర్శించిన తీరు. అదీ నచ్చింది. మనస్ఫూర్తిగా అభినందించాను.