Loading...

13, అక్టోబర్ 2017, శుక్రవారం

పలుకుల చక్కెర గుళికలు!

కం.

నీలో నుండుట నాకును
నాలో నుండుటయె నీకు నప్పును విధిగా
నేలోయీ దాపఱికము,
లే లోటుల నెంచి చూడ నేమి ఫలమ్మో!

ఇప్పుడు గాదన్నవినుము,
ఎప్పటికైనను కలువక నెటు పోయెదమీ
తప్పుల నెంచుట మానిన
యొప్పగు కూరిమి నిలువకనుండునటోయీ!

రూపము, నామాదులలో
తాపము తొలగించు శక్తి తరగనిదంచున్
కోపము లేకుండఁ , దెలుపు.
నా పాలిటి దైవమవుగ నమ్మితినోయీ.

పలుకుల చక్కెర గుళికల
నొలుకుచు నుండిననదెట్లు నొచ్చును మనముల్?
వెలుపట దాపట నొక్కటె
తలపును గలిగిన నదెట్లు తప్పులు దోచున్?

వంచన మార్గము లెప్పుడు
పెంచును వైరమ్మటంద్రు, వినగలిగినచో.
చంచలమైనట్టి మనము
నించుక కట్టడిని యుంచుటెప్పుడు శుభమౌ.

--------------లక్ష్మీదేవి.

12, అక్టోబర్ 2017, గురువారం

నింగి చుక్కలు నీటి చుక్కలయ్యె

సీ.

చినుకులెల్లను జేరి చిటపట రాలగ
    వాన వచ్చెనదిగొ వైభవముగ,
పనులు చెడిననేమి పంటలు పండును
      గాన మెచ్చిరిలను కలలు పండ,
ధనమును ధాన్యము తమకు దక్కుననుచు
     చాన తలపులెవ్వొ మనము నిండె,
తనకును తనవారికనలేని రైతన్న
     దానదక్షిణలిడు దరికిఁ బిలిచి.



ఆ.
నేల మీద నేడు నింగి ప్రతిఫలించె
నీటి యద్దమందు నిలిచెనిదిగొ
నింగిఁ గానరావు నిక్కు చుక్కలవెల్ల
నీటి చుక్కలల్లె నేలఁ జేరె.

---------లక్ష్మీదేవి.