Loading...

22, ఫిబ్రవరి 2017, బుధవారం

నాకు నచ్చిన కథ                                                              నాకు నచ్చిన కథ
మనుష్యులకు ఇతరగ్రహవాసుల గురించి తెలియకపోవచ్చు. ఇతర జంతు జాతి గురించి తెలియకపోవచ్చు. కానీ మనిషి గురించైతే మనిషికి తెలిసే ఉండాలికదా! కనీసం తను జీవించే సమాజంలో మనిషి
గురించైనా తెలిసుండాలి. వారి మనస్తత్వం గురించి తెలిసుండాలి. వారి గుణగణాల గురించి తెలిసుండాలి. ఒకానొక పరిస్థితిలో వారెలా ప్రవర్తిస్తారో ఊహించేటపుడు తాను చూస్తున్న దినవారీ జీవితాన్ని దృష్టిలో
పెట్టుకోవాలి.
ముఖ్యంగా కథ వ్రాసేవారికి ఈ మాత్రం జాగ్రత్త లేకపోతే కథలు వస్తాయి, పోతాయి లేదా అప్పటికప్పుడు సంచలనాలు సృష్టించినా, మనసును తాకకుండా తాలు రాలిపోయినట్లు రాలిపోతాయి.
సమాజం లేదా వ్యక్తి యొక్క ఆలోచనా స్థాయిని ఎదిగేలా చేసేది సాహిత్యం. అందులో కథా రచన కీలకమైనది. అందరినీ అన్ని పరిస్థితులలోనూ ఆకట్టుకునేది.
ఒక మొక్క ఎదుగుదలను మనం కాంక్షించినపుడు ఆ మొక్కకు చీడ పీడలు రాకుండా మందులు చల్లడం ఎంత ముఖ్యమైనదో, అంతకన్నా ముఖ్యమైనది దానికి కావలసిన ఎండా, నీరు, ఎరువులూ
సమయానికి అందించడం.
అదే విధంగా ఆలోచనాస్థాయి ఎదుగుదలను మనం కాంక్షించినపుడు అందులో ఉన్న చెడును ఎత్తిచూపడం, పరిష్కారం కోసం అన్వేషించడం చేయడం ఎంత ముఖ్యమైనదో, అంతకన్నా ముఖ్యమైనది
దానికి కావలసిన మంచి ఆలోచనలను పెంపొందించడం, సరైన దారులు వెదకడమూ.
మందులు మాత్రమే చల్లుతూ పెంచుతున్న కూరలు ధాన్యాలు ఇప్పుడు మనిషి ఆరోగ్యానికి ప్రాణాలకూ ఎలా ప్రమాదకరంగా తయారైనాయో, అదేవిధంగా చెడు యొక్క అన్వేషణ, ఆవిష్కరణ, విశ్లేషణ
లను మాత్రమే రంగురంగులలో రకరకాలుగా చేస్తూ పోవడం వల్ల సమాజం/వ్యక్తి యొక్క ఆలోచనాస్థాయి రోజురోజుకీ స్వార్థమే పరమార్థంగా, పగలు పెంచుకోవడం/తీర్చుకోవడమే ప్రధానంగా, 'నేను' చుట్టూ
కేంద్రీకృతం కావడమే పరమావధిగా దిగజారుతోంది.
మనం చూసిన, చూడగలిగిన సమాజం నుంచి పాత్రలను మలిచి, మనిషి లోపల, మనుషుల మధ్యన ఉండే సహజమైన వాతావరణాన్ని చిత్రించిన కథ సాక్షి ఆదివారం నవంబరు ఇరవై (20-11-2016) న నేను చదివినకథ.
" లెక్కంటే లెక్కే."
వ్రాసినవారు ప్రసిద్ధ కథకులు, అనువాదకులు అయిన గుత్తి (జోళదరాశి) చంద్రశేఖరరెడ్డిగారు. ఇది బళ్ళారి మాండలీకపు సొగసుల తెలుగు కథ. బళ్ళారి ఇప్పుడు కర్ణాటకలో ఉన్నా, ఒకప్పుడు ఆంధ్రప్రాంతానికి చెందినదే
 నని అందరికీ తెలిసుండకపోవచ్చు.
  కథ లో స్వామి బసవయ్య అందరివంటి సాధారణమైన మనిషి. ఒక్కడే ఉంటాడు. చేతనైన కూలీ నాలీ చేసుకుంటుంటాడు. తనకు తెలిసిన చిన్న చిన్న వైద్యాలతో ఊరిజనాలను అవసరమైనపుడు
 ఆదుకుంటాడు.  ఇటువంటి పాత్ర మన మధ్య దొరికే సాధారణ మనిషి జీవనయాత్ర.
 మరొకరు కష్టంలో పిలిస్తే ఆగి సహాయం చేయడం, తాను చేసిన పనికి న్యాయమైన వేతనం కన్నా ఎక్కువ ఆశించకపోవడం అనేవి మనందరికీ సర్వసామాన్యంగా మన సమాజంలో కనబడే లక్షణాలే.
 ఎవరికి ఎవరు ఏం చేసినా మనసులో ఇంకేవో వికృతమైన ఆలోచనలే ఉన్నాయట్టు చూపించడం, పనికి తగినట్టు కాక అవసరాలకో , ఆశలకో, పేరాశలకో తగిన సంపాదన లేదని బాధపడడమే ప్రతి వ్యక్తి
 యొక్క ఆలోచనలున్నట్టు లేదా ఉండాలన్నట్టు చూపించడంభార్య చనిపోయిందనో పిల్లలు చూడలేదనో ఏదో ఒక విషయానికి ప్రతి పాత్రా(మనిషీ) కుంగిపోయినట్టుగా చూపించడమే సున్నితత్వం అన్నట్టు
 చూపించడం ఈ కాలంలో మనము చదువుతున్న అనేక మహామహా రచయితల బలహీనత.
అలా కాకుండా...
 ఒక మనిషికి ఒక మనిషి తనకు తెలిసిన విషయాలలో సాయంచేయడం బ్రతికి ఉండడమంత సహజమైన విషయమని, సంపాదన లేకపోవడం కాక ఆత్మ గౌరవం లేకపోవడం చిన్నతనంగా భావించడం
 అనేది పరిపక్వతకు గుర్తింపని, ఇంట్లో ఉన్న కన్నవాళ్ళు, కట్టుకున్నవాళ్ళే కాక మిగిలిన వాళ్ళూ మన వాళ్ళనుకునే సున్నితత్త్వం ఉంటే ఎప్పుడూ ఎక్కడా కుంగిపోవలసిన అవసరం లేదని ఈ చిన్న కథ సహజంగా చూపిస్తుంది.
 రచయిత గారికి నా మనఃపూర్వక అభినందనలు.
కథ ఇక్కడ చదవచ్చు. 


5 వ్యాఖ్యలు:

 1. మీ విశ్లేషణలో మంచి విషయాలు ప్రస్తావించేరు కథకి మించిన ఆలోచనలు కూడా జత చేర్చి. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఈ కథను, విశ్లేషణను నేను చదవగా, ఫిబ్రవరి 21, 2017 నాడు myindmedia.com (వెబ్ రేడియో/జాలవాణి) లో ప్రసారమైంది. ఆ సైట్ లో ఉన్న svaramalika అనే లింక్ నొక్కితే ఆర్చీవ్స్ లో ఉంటాయి. ఎప్పుడు కావాలన్నా వినవచ్చు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. చాలా సంతోషం కలిగించింది మాలతిగారూ, మీ స్పందన. విమర్శ నాకిష్టమైన అంశం.
  మీరు కూడా నాటి మంచి కథలను పరిచయం చేస్తున్నారు మీ బ్లాగులో. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. విలువలు అంటే ఏమిటో తెలిపే కథ ను పరిచయం చేశారు. ధన్యవాదాలు .

  ప్రత్యుత్తరంతొలగించు
 5. సంతోషమండి మీకు నచ్చినందుకు.
  వ్యాఖ్య చూడలేదు. అందుకే ప్రచురించడం ఆలస్యమైంది. ఏమీ అనుకోకండి. ఈమధ్య వ్యాఖ్యలు తగ్గాయి కాబట్టి చూడడమూ తగ్గింది.
  మీ స్పందన సంతోషం కలిగించింది.

  ప్రత్యుత్తరంతొలగించు