Loading...

14, ఆగస్టు 2016, ఆదివారం

కథ

తమిళం నుంచి నేను అనువదించిన కథ కొత్తపల్లి పత్రికలో---
http://kottapalli.in/2016/08/%E0%B0%86%E0%B0%AE%E0%B1%86_%E0%B0%8E%E0%B0%B5%E0%B0%B0%E0%B1%81

వాళ్ళు కొంచెం ఎడిట్ చేశారు.

నేను పంపిన వెర్షన్ ఇది.

సుస్మిత హుషారుగా పరుగెత్తుకొని వచ్చి, పూలు కోస్తున్న వత్సల భుజాలు పట్టుకొని ఊపేస్తూ, “అమ్మా, అమ్మా! ఈ కథ భలే ఉంది తెలుసా? చదివావా నువ్వు?” ఏదమ్మా ఏ కథ?”
“ఇదిగో, ‘ఆమె ఎవరు?’ అనే కథ. నేను చదువుతా వినవా?”
అమ్మ ఏమంటుందో పట్టించుకోకుండానే చదవడం మొదలుపెట్టింది సుస్మిత.
“అది హిమాలయాల అంచుల్లో ఉన్న ఒక కుగ్రామం. ఆదివాసుల కుటుంబాలు కొన్ని ఆవాసం ఏర్పరచుకున్నాయక్కడ.  ఆ కుటుంబాలవారిక్కానీ, ఒక చిన్న దీవి లాంటి ఆ గ్రామానికి గానీ బయటి ప్రపంచంతో  ఏ సంబంధమూ ఉండే అవకాశం లేదు.
అందుకేనేమో వారే చీకూ చింతా,  చిక్కులూ లేకుండా స్వతంత్రులై హాయిగా కాలం గడుపుతున్నారు.

ఆ కుటుంబాల్లో ఒకటి గుంబా కుటుంబం. గుంబా, అతని భార్య సిప్పి సంతోషంగా అరమరికలు లేకుండా ఒద్దికగా కాపురం చేసుకొనేవారు. పిల్లలు లేరనే కొరత కనిపించనివ్వకుండా ఒకరికి ఒకరై తోడుగా నిల్చిన ఆ జంట ఆనందాలకు ఆ అడవి నిలయమైంది.

వారి గ్రామంచుట్టూ దట్టమైన అడవి ఉండడం వల్ల కొంత దూరపు ఊళ్ళలోని జనం వేటకోసం ఆ చుట్టుపక్కలకు వచ్చి వెళ్తుండేవారు. అలా వచ్చినవారెవరో తమతో బాటు తెచ్చుకున్న అద్దాన్ని పొరబాటుగా మరిచిపోయి అక్కడే వదిలి వెళ్ళారు.

అలవాటుగా పండ్లకోసం వెదకుతూ అడవిలోకి వెళ్ళిన మన గుంబా కంటపడిందా అద్దం. దాన్ని చేతిలోకి తీసుకొని తిప్పితిప్పి చూసి ఏదో పెద్ద నిధి దొరికినట్టుగా సంబరపడిపోతూ దాన్ని తీసుకెళ్ళి తన గుడిసెలో భద్రంగా దాచుకున్నాడు. అందులోకి మొదటిసారి చూసినపుడు అతనికి చనిపోయిన తన తండ్రి రూపాన్ని చూసినట్టనిపించి, వీలున్నప్పుడల్లా ఆ అద్దాన్ని తీసి చూసుకునేవాడు.

ఇలా ఉండగా, కొన్ని రోజులుగా తన భర్త ప్రవర్తనలో ఏదో మార్పుందని సిప్పికి అనిపించసాగింది. అతనికి తెలియకుండా అతన్ని గమనించసాగింది. దేన్నో పెట్టెలోంచి తీసి తీసి చూస్తున్నాడని, అప్పుడప్పుడూ నవ్వుకుంటున్నాడని గమనించిందే కానీ అందుకు కారణమేమిటో ఆమెకు అర్థం కాలేదు.

ఒకరోజు అతను ఇంట్లో లేనప్పుడు అతని పెట్టె తీసి చూడగా అద్దం కనిపించింది. దాన్ని తీసి చేతిలో పట్టుకొని చూసినప్పుడు అందులో ఒక అందమైన యువతి ముఖం కనిపించింది. సిప్పికి చాలా బాధ కలిగింది. తన భర్తకు తాను కాక ఇంకొక భార్య ఉన్నదని ఆలోచించి ఎంతో బాధపడింది.

గుంబా ఇంటికి రాగానే, “ ఏమయ్యా, ఇన్ని రోజులు నీకింత ఊడిగం చేశానే? నీవు నన్నింత మోసం చేస్తావా? ఇంకొకామెను మనువాడతావా? అంతకు ముందు నన్ను చంపేయవయ్యా” అంటూ వేడి నూనెలో ఆవపు గింజలా చిటపటలాడింది సిప్పి.

ఏమీ ఎఱుగని గుంబా ఏం చేయాలో ఏం చెప్పాలో దిక్కు తోచనట్టు ఉండిపోయాడు. ఉన్నట్టుండి అతనికి ఎందుకో అద్దం గుర్తుకు వచ్చింది. వెళ్ళి చూశాడు. సిప్పి అతన్నే గమనిస్తోంది.

భార్యకు కూడా చూపించాలని గుంబా వెంటనే సిప్పి పక్కగా వెళ్ళి నిలబడి ఇద్దరికి కనిపించేటట్లు అద్దం పట్టుకున్నాడు. ఇప్పుడు అద్దంలో ఇద్దరూ కనిపిస్తున్నారు. ఇద్దరూ ఆశ్చర్యానందాలలో మునిగి పోయారు. మళ్ళీ మళ్ళీ అద్దంలో చూసుకున్నారు, ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఫక్కున నవ్వేసుకున్నారు.

హమ్మయ్య! ఒక పెద్ద తుఫాను రాకుండా ఆగిపోయింది.”
“భలే ఉంది కదమ్మా ఈ కథ! అసలు వీళ్ళకు అద్దం అనేదే తెలియదన్నమాట. “ ముసిముసిగా నవ్వుతూ పుస్తకాన్ని మూసేసింది సుస్మిత.
“ఔనమ్మా, నిజంగా చక్కని కథ. ఈ కొత్తపల్లి కథల పుస్తకంలో ఎప్పుడూ మంచి కథలు వస్తాయి కదా.” అంటూ బిడ్డతో పాటు ఇంట్లోకి నడచింది వత్సల.
             --------------------వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి