Loading...

21, ఏప్రిల్ 2016, గురువారం

సరస్వతీ ప్రార్థన.

సరస్వతీ!


రచన : లక్ష్మీదేవి

శార్దూలము
         విద్యార్థుల్ నిను వేడుకొందు రిలలో వీణాధరీ! దీవనల్
సద్యోగంబుల నిమ్ముశుద్ధచరితా! శాతోదరీ! పావనీ!
పద్యం బన్నను నీరస మ్మనక పక్వంబౌ మహాశ్రద్ధతో
నుద్యోగమ్మున నేర్చుకొ మ్మనుచు నీ వొప్పింపగా రాగదే!

మత్తేభము
         కరమున్ బట్టుదు పుస్తకంబుమనమున్ కైంకర్యమున్ జేతునీ
దరికిన్ బిల్వుము శారదా! చదువులన్ దానంబుగా నిచ్చినన్,
వరముల్ వేరుగ నేల చాలు నదియేవాణీ! సదాచారిణీ!
స్థిరమౌ దృష్టిని నన్ను గాచుకొనుమా శ్రీమంగళాకారిణీ!

పంచచామరము
సదా మదిన్ దలంతు నిన్ను శ్రద్ధతోసరస్వతీ!
పదమ్ము లిట్లొసంగుమా! కృపామయీసరస్వతీ!
ముదమ్ముతోడఁ దీర్చుకొందు మ్రొక్కులన్సరస్వతీ!
పదమ్ముఁ జేరుకొందుమోక్ష ప్రాప్తికైసరస్వతీ!

మత్తకోకిల
వీణఁ బట్టిన శారదాంబకు వేశుభమ్ములు పల్కుమా!
ప్రాణికోటికి విద్యనిచ్చెడు భారతీ జయ మందుమా!
పాణిఁ బట్టిన ధాతృపత్నికివందనమ్ములు పల్కుమా!
వాణిపుస్తకపాణికిన్, జగవంద్యకున్ శుభమందుమా!

-----------లక్ష్మీదేవి.


శంకరాభరణం బ్లాగులో ప్రచురింపబడిన నా ఖండిక.
ప్రచురించి ఆశీర్వదించిన గురువుగారికీ, కవిమిత్రులకూ, పెద్దలకూ నమస్కారములు.

8 వ్యాఖ్యలు:

 1. చక్కని పద్యాలు. అభినందనలు.
  ‘ముజ్జగ వంద్యకు’ అనరాదు. “వాణి, పుస్తకపాణికిన్, జగవంద్యకున్..’ అనండి.
 2. సరస్వతీ!యటంచు మీరు శారదన్ స్తుతించుచున్
  శిరస్సు వంచి మ్రొక్కినంత శీఘ్రమే వరమ్ములన్
  మరింత వ్రాయగల్లు భావ మాధురీ మహత్తులన్
  నిరంతరమ్ము నిచ్చు మీకు నేర్పులన్, సమున్నతిన్!

 3. గురువుగారూ,
  కృతజ్ఞురాలను. మీ సవరణ శిరోధార్యము.
  నాకొక సందేహము.
  ఖండకావ్యమనగా ఏదైనా ఒక విషయమును గొని ఉపోద్ఘాతము, ఘటన/ఇతివృత్తం, ఉపసంహారము ఉండాలని ఇన్నాళ్ళూ అనుకున్నాను. కానీ ఇక్కడ వచ్చిన ఖండకావ్యములను చూసి నేనూ ఇలా ప్రారంభించాను. కేవల వర్ణనలను, స్తుతులను ఖండకావ్యములనవచ్చునా? వివరింపవలసినది.

 4. అయ్యా, అంతకన్న భాగ్యమా? ధన్యురాలనౌదును.

 5. ఆదిగురువు మనిషికమ్మ|సరస్వతే|
  వాక్కు నేర్పు తల్లి వాణిగాద?
  భవిత బంచి పెట్టు భారతి బాధ్యతే
  లక్ష్మి|దేవిరచన లక్ష ణంబె|
 6. లలిత పదముల లాస్య విలాస భరిత
  సతత వృత్యనుప్రాసల శారదాంబ
  స్తుతిని జేయ “లక్ష్మీదేవి” సుగుణరాశి
  భార తీదేవి యిచ్చుత భవ్యముగను.
 7. శారదమ్మమీదచక్కనిగృతులను
  రచనజేసినట్టిరమ్యచరిత!
  యింకనురచనలనునింపుగామరికొన్ని
  యందజేయుమిపుడయభ్ధిపుత్రి!
 8. శారదాంబకు చక్కని చామరము వీచారు...బాగుంది.

2 వ్యాఖ్యలు:

 1. సరస్వతీ ప్రార్ధన
  లక్ష్మీదేవి అర్చన
  విద్యాదేవి దీవెన
  ప్రముఖుల మన్నన ...

  _____/|\_____

  ప్రత్యుత్తరంతొలగించు