Loading...

13, ఏప్రిల్ 2015, సోమవారం

ఉపాధ్యాయులను ప్రక్కన పెట్టేసి పెద్ద తరగతివాళ్ళనే గొప్పగా భావించడం ....

                సమాజ స్పృహ అనే పదం కొత్తదేమో గానీ భావం మనకు కొత్తది కాదు. విశ్వశ్రేయః కావ్యమ్ ఇత్యాది వాక్యాలలో చెప్పినది సమాజస్పృహ కాక మరేమిటి? కొన్ని విషయాలనే  కొన్ని పద్ధతులలోనే చెపితేనే సామాజిక స్పృహ -తద్భిన్నమైనదైతే కాదనే వాదన  ఒక మానసిక కల్పన మాత్రమే. ఒకటిన్నర రెండు శతాబ్దాల క్రితం ఆంగ్లభాషలో ఆవిర్భవించిన ఒక ప్రక్రియ కొత్తగా కనపడడం చేత వారు నావెల్ (కొత్తది) అనే పేరు పెట్టుకొంటే మనం తెలుగులో ఆ పేరునే నవలగా వాడుకొంటున్నాము. భారతీయ సాహిత్యానికి ఆ ప్రక్రియ కొత్తదనుకోవడం అమాయకత్వమే. ఆఖ్యాయిక, కథ, గద్యకావ్యాలనే పేర్లతో కథలు , నవలలే ఉన్నాయి. అద్భుతమైన వైవిధ్య కల్పిత కథనాలున్నాయి. వాటిలో దశకుమారచరితాదులు, బృహత్కథ, కాదంబరి వంటివెన్నో.
           కథల్లో అకథ. వికథ, కథ, దివ్యమానుష కథ, దివ్య కథ, మానుషకథ, ఖండకథ, ఉల్లాస కథ, పరిహాసకథ, సంకీర్ణకథ వంటి పేర్లు కూడా కథా ప్రక్రియలో ఉన్న వైవిధ్యతను సూచిస్తున్నాయి.  మహాకావ్యాలు, ఖండకావ్యాలు, ప్రబంధాలే కాక పది పదిహేను పద్యాలు, గేయాలు, వచనకవితలు కూడా ఉండేవి. వాటికి ముక్తకం, విశేషకం, కలాపకం, కులకం ఇత్యాది పేర్లెన్నో. (శతకం బాగా తెలుసు మనకు).  ఉన్నతాదర్శాలను చిత్రంచే నాటకం అనే ప్రక్రియ మాత్రమే కాక దృశ్యకథల్లో సాధారణ జనజీవన విధానాలు, సంఘర్షణలను కథా వస్తువుగా తీసుకొని వ్రాయబడినవాటికి రూపకం వంటి ఇరవయ్యేడు రకాలున్నాయి.
           ఇక భాషాశాస్త్రానికి సంబంధించిన విస్తృతపరిశోధనలు మన పూర్వీకులెంతో చేసి యున్నారు. నేటికి సుమారు నాలుగువేల యేళ్ళకు మునుపు పాణిని సంస్కృతవైయాకరణులలోనే కాక ప్రపంచమునందలి సర్వభాషావైయాకరణులలో అత్యున్నత మగు గౌరవస్థానము సంపాదించుకున్నాడు.
     ఈతడు రచించిన వ్యాకరణముతో పోల్చదగిన వ్యాకరణము ప్రాచీన భాషలకు గాని, అర్వాచీన భాషలకు గాని నాటి నుండి నేటివరకూ రచింపబడలేదను విషయము సర్వపండితలోకాంగీకృతము.
        సర్వసాధారణంగా తెలిసే వ్యాకరణ, భాషానియమాలనే కాక కనిపించకుండా రసజ్ఞులను మురిపింపచేయడానికి ముఖ్యమైన రసము, ధ్వని వంటి విషయాలను ఆమూలాగ్రంగా పరిశోధించి, చర్చించి, కొత్తవిషయాలను ప్రతిపాదించి నిరూపించిన అతి శక్తివంతమైన గ్రంధసర్వస్వం వేల యేళ్ళనాడే తయారు చేసియున్నారు.
   ఇంకా భామహుడు వ్రాసిన కావ్యాలంకారము, దండి వ్రాసిన కావ్యాదర్శమూ, ఆనందవర్ధనుడు వ్రాసిన ధ్వన్యాలోకము, అభినవగుప్తుడు వ్రాసిన లోచనమూ,  జగన్నాథ పండితరాయలు వ్రాసిన  రసగంగాధరమూ, రుయ్యకుడు వ్రాసిన  అలంకారసర్వస్వం, క్షేమేంద్రుడు వ్రాసిన ఔచిత్యవిచారచర్చ, భోజరాజు వ్రాసిన సరస్వతీ కంఠాభరణము మొదలైనవెన్నో పండిత పరిశోధనలకు ఉపయోగపడుతుండగా ఇంకా దొరకకుండా నాశనమైనవెన్నో.
     అలంకారాలంటే వ్రేలినుండి తీసి ఇనుపబీరువాలో పెట్టుకొన్న బంగారు ఆభరణాలు కాదు, కావ్యం నుంచి తీసి అవసరం అయినపుడు వాడుకొనేందుకు. కావ్యానికి శబ్దం , అర్థం శరీరాలైతే ప్రాణాలు రసము, ధ్వని అని చక్కగా నిరూపించబడింది.   ఇటువంటి మహత్తర శాస్త్రనియమాలన్నీ సంస్కృతసాహిత్యాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని చేయనూలేదు,  ఇవి ఉపయోగపడేది ఒక్క మన భాషాసాహిత్యానికే కాదు. ప్రపంచసాహిత్యానికంతా మార్గదర్శిగా ఉపయోగపడేవిగానే తయారు చేయబడినాయి. ప్రాకృత, అపభ్రంశ , పైశాచీ భాషల ఉదాహరణలు కూడా ఇస్తూ నిరూపణలో పెట్టినారు.
        కావ్యరచనలు విశ్వశ్రేయస్సు కొఱకే అని గాఢంగా విశ్వసించిన పండితులు - చెప్పే విషయం ఏదైనా నువ్వు చెప్పదలచుకున్న విధానం ఇలా ఉంటే మరింత ప్రభావవంతంగా ఉంటుందని- చెప్పినారు.
    కోపం చూపించే కఠోరపదావళి ఓజస్సు.
    కరుణ లేదా ప్రేమ చూపించే పదావళి మాధుర్యం
   అన్ని సందర్భాలలో స్పష్టత చూపించే పదావళి ప్రసాదం
ఇవన్నీ ఏ భాషకైనా అవసరమైన నియమాలే, రాయబోయేది నలుగురి హితవు కొరకైతే.
          ఇవన్నీ నాకిష్టమైన భాషకు సంబంధించిన గ్రంథాల చర్చ. ఇవేకాక అత్యాధునికం గా నేడు పరిగణించబడే గణితము, ఖగోళశాస్త్రము, (వరాహమిహిరుడు)  భూగోళ శాస్త్రము, అర్థశాస్త్ర్రము (చాణక్యుడు), రాజనీతిశాస్త్రము, ప్రజాపరిపాలనకు సంబంధించిన అనేక విషయాలకు సంబంధించిన పలుఅంశాల చర్చలు,  గ్రంథ రచనలు మన పూర్వీకులు చేసియున్నారు. ప్రపంచమంతా మన సంస్కృత, ప్రాకృత భాషలు నేర్చుకొని, అనువదించి మరీ రెఫరెన్సు కోసం వాడుకొంటూ ఉంటే వారసులు మాత్రం అన్నీ వేదాలలోనే ఉన్నాయిష అని వెటకారం చేసుకుంటున్న మూర్ఖులుగా తయారైపోయినారు.
        అతి పరిమితమైన తన జ్ఞానానికి గోచరించని వాటిని నిరాకరించడం, గోచరించినవాటిని మాత్రమే అంగీకరించడం బావి లో కప్పలు చేసే పని లాగే ఉంటుంది.
    ఇలా చెప్పినంత మాత్రాన భారతదేశంలో తప్ప మిగతా చోట్ల ప్రతిభలేదనడం నా ఉద్దేశ్యం మాత్రం కాదు. ఉంది. ఉంటుంది. మనం బళ్ళో చదువుతున్నప్పుడు మనకన్నా పెద్దతరగతులు చదివేవాళ్ళకు ఖచ్చితంగా ఎక్కువ తెలిసిఉంటుంది. వాళ్ళను మనం గౌరవించాలి అంతేకాని వాళ్ళకూ , పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకూ సమాన ప్రతిపత్తి ని కల్పించుకోవడం తప్పు. మనకన్నా వాళ్ళూ వీళ్ళూ కూడా గొప్పవాళ్ళే, కానీ ఉపాధ్యాయులను ప్రక్కన పెట్టేసి పెద్ద తరగతివాళ్ళనే గొప్పగా భావించడం ఎంత మూర్ఖత్వమో మన దేశ పరిశోధనలను నిష్కర్షలను ప్రక్కన పెట్టేసి విదేశీయుల మాటలనే శిరోధార్యాలుగా భావించడం అంతే మూర్ఖత్వం. ఇవి రెండూ సమానమూ కాదు, ఒకదానికొకటి ప్రత్యామ్నాయమూ కాదు. స్థాయీ భేదం గమనించాల.
      అయినంత మాత్రాన ఏ విషయంలోనైనా చివరిమాటలు చెప్పివేశాం ఇంక క్రొత్తగా ఎవరూ ఏమీ చెప్పగలిగినదిలేదు అని వందలమంది గ్రంథకారులలో ఎవరూ అనలేదు. వాళ్ళ బహుగ్రంథ పరిచయమూ , హృదయవైశాల్యమూ ఆ స్థాయిలో  ఉన్నాయి. ఆ స్థాయి వారు ఏదో ఒక వాదాన్నో ఏదో ఒక ప్రక్రియనో పట్టుకొని ఇది తప్ప మిగిలిన దంతా తుచ్ఛమైనదని వాదించరు. ప్రాచీన భాషావేత్తలూ, అలంకారికులు, సిద్ధాంత కర్తలు, శాస్త్రవేత్తలు చెప్పిన అన్ని  అంశాలూ అన్ని కావ్యాలకూ  అవి ఏ భాషలో ఉన్నా ఏకోవకు చెందినా ఏనాటివైనా వర్తిస్తాయి లేదా వాటిలో అంతర్గతంగా ఉంటాయి.
   సహస్రశోః మహాత్మభిః అన్యైః
  అలంకారప్రకారాః ప్రకాశితాః ప్రకాశ్యన్తేచ
 అనే వాక్యమే దీనికాధారం. ఇప్పటికి ఎంతో మంది ఎన్నో అలంకారాలను చెప్పారు. ఇంకా చెప్తారు. అని చెప్పినారు చూడండి. ఇదే మన ప్రాచీన గ్రంథ కర్తలకున్న పరిపక్వ మనస్తత్వానికి ఉదాహరణ.
( వందల సంఖ్యలో శాస్త్రగ్రంథ అనువాదాలు, సంపాదకత్వాలూ నిర్వహించి జాతీయస్థాయిలో అనేక పురస్కారాలు అందుకొన్న మహామహోపాధ్యాయ పుల్లెల శ్రీరామచంద్రుడు గారి ప్రస్తావనల్లోంచి నేను గ్రహించిన, అర్థం చేసుకున్న కొన్ని విషయాలు.)