Loading...

20, ఫిబ్రవరి 2015, శుక్రవారం

ఖజురహో నృత్యోత్సవాలు!!

                     శిల్పకళాకృతులకు పేరుగాంచిన ఖజురహో(మధ్యప్రదేశం) లో అద్భుతమైన, అందమైన దేవాలయాల ప్రాంగణంలోదేశవిదేశప్రముఖులైన కళాకారులు, కళారాధకుల పండుగ నృత్యోత్సవాలు ప్రారంభమైనాయి.
ఈరోజు మొదటిరోజు ఎంతో అభినయ నైపుణ్యం, ప్రతిభ గల్గిన నర్తకులు కన్నుల పండుగ చేస్తూ ప్రదర్శన చేస్తున్నారు.


                     రెండు కళ్ళు మాత్రమే చాలవని తెలిసిన దేవుడు మనిషికి మనసు నిచ్చినాడు. తాదాత్మ్యత చెందగలిగిన రసజ్ఞుల ఆనందమే ఆనందము. అదృష్టమే అదృష్టము.  అత్యంత సహజంగా వారితో పాటు ఒకానొక భావప్రపంచంలోకి తీసుకుపోగలిగిన కళాకారుల జన్మ ధన్యము.

                 ఈరోజు మొదటి అంశంగా మోహినియాట్టమ్ (కేరళ స్త్రీలభినయించు నాట్యరీతి) చక్కటి ప్రదర్శన.
                     
                           రెండవ అంశం కూచిపూడి , భరతనాట్యం నాట్యసమన్వయంగా కేరళ నుంచి వచ్చిన పద్మినీ,  ద్రౌపదీ  అనే అమ్మాయిలిద్దరు మానససంచరరే, నమశ్శివాయైచ నమశ్శివాయ కీర్తనల దృశ్యాన్ని ఆవిష్కరించినారు.

       మానస సంచరరే లో వారు తీసుకున్న భావం కానీ, ప్రదర్శించినతీరు కానీ, వారి నడుమ , రెండునాట్యరీతులనడుమ సమన్వయం కానీ అత్యద్భుతం. భరతనాట్యం చేస్తున్న కళాకారిణి కృష్ణుని పూజిస్తూ స్వాప్నికావస్థలో కృష్ణుని ఆటపాటలను కళ్ళారా చూస్తున్నట్టు అభినయించగా కూచిపూడి కళాకారిణి కృష్ణుని వలె అభినయించింది. తన పరమాత్ముని నిజంలో కాక స్వప్నంలో చూస్తున్నట్టుగా ఎంత చక్కగా అభినయించిందో చెప్పలేను. చివరకు కళ్ళుతెరచి సాక్షాత్కారం పొందినట్టుగా , కృష్ణుడు చేపట్టి తనను తీసుకు వెళ్ళినట్టుగా ....వ్రాయడానికి పదాలు చాలవు. చూసి తీరాల్సిందే . అమృతం రుచి తాగినవాళ్ళకే కానీ ఎంతగా వర్ణించినా తాగని వాళ్ళకు తెలియనట్టుగానే ఇదీ...:)

తరువాత శివస్తుతి కూడా అంతే చక్కగా అభినయించినారు.

తరువాత ఒడిస్సీ బృందనాట్యం అన్నీ ఒకదాన్ని మించి ఒకటి ప్రదర్శనలు.