Loading...

4, ఆగస్టు 2015, మంగళవారం

సిచ్చ మాకా తప్పు పరులది రా ఓ వానదేవా

పల్లవి-
కంటి నీరు సాలకొచ్చెను రా ఓ వానదేవా!
మంటి కడవ నింపి తెస్తిమి రా ఓ వానదేవా మంటి కడవ నింపితెస్తిమి రా!
పంట సేల తడుపుతుంటిమిరా ఓవానదేవా!
కంట జూడక నూరకుంటివిరా ఓ వానదేవా కంటజూడక నూరకుంటివిరా!

చరణం--
మబ్బులొచ్చి మళ్ళిపోయెను రా ఓ వానదేవా!
ఉబ్బిపోయి గబ్బుపడితిమి రా ఓ వానదేవా ఉబ్బిపోయి గబ్బుపడితిమిరా!
పచ్చదనమున పానముంచుదుమే ఓ వానదేవా!
సిచ్చ మాకా తప్పు పరులది రా ఓ వానదేవా సిచ్చ మాకా? తప్పు పరులది రా!

చరణం ---
ఏటికేడు అప్పులైనవి రా ఓ వాన దేవా!
ఏటి బదుకను మాట తోచెనురా ఓ వానదేవా ఏటిబదుకను మాట తోచెనురా!
పాటుపడినా కూడు దొరకకపాయ్ ఓ వానదేవా!
మాటతప్పిన దైవమైతివిరా ఓ వానదేవా మాటతప్పిన దైవమైతివిరా!

చరణం ----
చిక్కు దీర్పగ చినుకులంపుమురా ఓ వానదేవా!
మొక్కి పోదుము ముప్పు తప్పును రా ఓ వానదేవా మొక్కిపోదుము ముప్పు తప్పును రా!
సిత్తమందున నమ్మినోళ్ళము రా ఓ వానదేవా!
సిత్తడే మా పుత్తడందుమురా ఓవానదేవా సిత్తడే మా పుత్తడందుమురా!
------లక్ష్మీదేవి

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి