Loading...

12, ఆగస్టు 2014, మంగళవారం

రఘునాథభూపాలుడు - తంజాపురాంధ్రవీణ (3)

      రఘునాథ భూపాలుడు తన రాజ్యమగు తంజావూరు, దాని పరిసరములు, అందలి ప్రజలు, వారి స్వభావములు, జీవనరీతులు మొదలగునవి తన కావ్యములందు సమయానుకూలముగ ప్రతిబింబించినటుల రచించెను. దేశమునందు గల కొన్ని పుణ్యక్షేత్రములను, నదులను,కొండలను, ముఱికి వాడలను, కిరాతుల జీవనవిధానములను , గిరిజనుల వృత్తివ్యాపారములను స్పష్టముగ వర్ణించెను.
  సందర్భమును కల్పించుకొని కూడ కొన్ని సమయములందు పై విషయములను పేర్కొనుట చేయును కాని తనను గుఱించి స్పష్టముగ ఎప్పుడును తెలియజేయుట గాని, పాత్రలచేత గ్రంథ మధ్యమున వ్యక్తపఱచుట కాని చేయడు.
       రఘునాథుని కాలమున ఇళక్కణ విళక్కణమ్ వ్రాసిన వైద్యనాథ దేశికర్ మాత్రమే కాక అఘోర మునివర్ , తాతాచార్య, మొదలైన తమిళవిద్వాంసులు కలరు. కానీ వీరెల్లరు ఈతని ఆస్థానమున నుండిరనుటకు బలీయమైన ఆధారములు దొరకలేదు.తమిళసాహిత్యమున రఘునాథుడు ముందువెనుకలుగ కొంతకాలము "అంధయుగముగ" పేర్కొనబడినది. కావున తమిళ కావ్యకర్తలు కవులు ఆ అంధయుగమున వెలుగులోనికి రాలేదు.
    నాటి స్త్రీలకు యుద్ధవిద్య శిక్షణ ఉండెడిది.
      ఆ కాలమున పేరు పొందిన అప్పయ్య దీక్షితులు, భాస్కరదీక్షితుడు, షడ్దర్శనీ పాండిత్యము గల గోవిందదీక్షితులుఉండేవారు, గోవిందదీక్షితులు సంగీతసుధానిధి , సుందరకాండవ్యాఖ్యానము,జ్యోతిష గ్రంథమును రచించెను.పంచనద మాహాత్మ్యమును ద్రావిడభాషలోని పరివర్తింపజేసెను.రఘునాథుని సమకాలీనుల రచనలవలన ఈతడు రఘునాథుని గురువుగనుండెనని తెలియుచున్నది. ఈ గోవిందదీక్షితుడు కుంభకోణమునందలి దేవాలయములను నిర్మించుట, బాగుచేయుటయే కాక 16 ఱాతిమంటపములను నిర్మింపజేసెను. 16 స్తంభముల తులాపూరుషదానమంటపమును, సంస్కృతకళాశాలను (నేటికీ కలదు) స్థాపించెను.
         కుమారతాతాచార్యులు రఘునాథునిపై భక్తి, అభిమానముకలిగియుండెను. పారిజాతనాటకమ్ అను సంస్కృత దృశ్యకావ్యమున రఘునాథునకు కీర్తి,ఆశీస్సులు కలుగునటుల రచించెను.
యజ్ఞనారాయణదీక్షితుడు గోవిందదీక్షితుని కుమారుడు, యజ్ఞయాగాదులు నిర్వహించినవాడు. రఘునాథుని శిష్యుడనని చెప్పుకొనెను. శాస్త్రదీపికా వ్యాఖ్యానమ్, ప్రభావమండలమ్, సాహిత్యరత్నాకరమ్ , రఘునాథ విలాస నాటకమ్, అలంకారరత్నాకరః అను గ్రంథములు రచించెనని తెలియుచున్నది. రఘునాథ విలాస నాటకమునందు రఘునాథుని అపర శ్రీరామచంద్రునిగ , అభినవభోజునిగ , సాహస విక్రమార్కునిగ, దానకర్ణునిగ స్తుతించెను.ఈ గ్రంథము వలననే చరిత్రకారులు తంజావూరు నాయకవంశవృత్తాంతమును గ్రహించగలిగిరి. ఇతడు రచించిన రఘునాథ భూపవిజయము సవ్యాఖ్యానముగ లభించుచున్నది.
వేంకటేశ్వర దీక్షితుడు చతుర్దండి ప్రకాశిక వలన మంచి పేరు సంపాదించెను. సంగీతశాస్త్రవేత్తలు, గాయకులు ఈతనిని ప్రామాణికునిగ గౌరవింతురు.
రాజచూడామణి దీక్షితుడు ఆనందరాఘవమ్, కమలినీ కలహంసమ్, కావ్యదర్పణః, తత్త్వచింతామణీ వ్యాఖ్యా దర్పణః , తంత్ర చింతామణిః, రుక్మిణీ కళ్యాణమ్, శాస్త్రదీపికా వ్యాఖ్య - న్యాయకర్పూర వార్తికా, మణిదర్పణః అను కావ్యములు రచించెను.
కృష్ణాధ్వరి రఘునాథునకు అంకితముగ నైషధపారిజాతీయము అను తెలుగు ద్వర్థి కావ్యమును రచించెను. శ్రీ రఘునాథ భూపాలీయము,నైషధపారిజాతావతారికా హృదయము, కళ్యాణకౌముదీ కందర్పనాటకమ్, అమరుకాలంకారము, తాళచింతామణి అను సంస్కృతకావ్యములు రచించెను. మీమాంసా పరిభాషా అను శాస్త్రగ్రంథముకూడ ఈతడు వ్రాసినదేనని తెలియుచున్నది.
రఘునాథ భూపాలీయమ్ సరసభూపాలీయము వలె సంస్కృత అలంకార గ్రంథము.దీని పీఠికయందు రఘునాథుడు అనేకవిధముల కీర్తింపబడినాడు. ఈ కృతి యందలి లక్ష్యములన్నింటను రఘునాథశబ్దమును అలంకరించెను. రఘునాథుని గుణములను స్వభావోక్తికి దూరములు కాకుండ వర్ణించెను. ఇష్టదేవతాస్తుతిని వేఱుగ జేయక రఘునాథనాయకుడే తన ఇష్టదేవునిగా కీర్తించెను.
రామభద్రాంబ అష్టభాషాకవయిత్రి. రఘునాథాభ్యుదయములో రఘునాథుని వంశ వృత్తాంతము, ప్రజాహితకార్యములను సాధించిన విజయములను మనోహరముగ వర్ణించినది. ఈమె కవిత్వము ధారాళమై సరళమై ఒప్పుచున్నది.
మధురవాణి ఈమె ఆఱు భాషలలో మధురకవిత్వమును చెప్పగలదు. వీణావాదనమునందు, సమస్యాపూరణమునందు, నిరోష్ఠ్యకవితా రచనయందు కవితా సందర్భశుద్ధి గలిగిన చతురురాలు. ఘటికార్థమునందు నూరు శ్లోకములను ఆశువుగ చెప్పు నిపుణురాలు. రఘునాథుని చేత కనకాభిషేకము బడసినది. ఈమె గ్రంథములలో రామాయణసార తిలకమ్ అను కావ్యము మాత్రము లభ్యము.
చేమకూరవేంకటకవి చతుర్విధ కవిత్వమున ప్రసిద్ధికెక్కిన ఈతని విజయవిలాసము సుప్రసిద్ధమైన గ్రంథము. ఇది కాక సారంగధర చరిత్రమును రచించెను.