Loading...

22, డిసెంబర్ 2014, సోమవారం

అందమైన పదాలు-అంతులేని అర్థాలు

               అన్నమయ్య పదాల్లో అందమూ, అర్థమూ రెండూ పోటీపడుతూ ఉంటాయి. ఈరోజు మనం ఈ అందమైన పాట అర్థాన్ని కొంతవరకైనా అవగాహన చేసుకొనే ప్రయత్నము చేద్దాము.
                నడిచే బాటసారికి అల్లంతదూరాన పొలిమేర కనిపించవచ్చు.  అలసిన ఆతనికి దాన్ని చూసి అమ్మయ్య, ఏదో ఊరు కనిపిస్తుంది. అక్కడ కొంచెం విశ్రాంతి, ఆహారము దొరకవచ్చుననుకుంటాడు. సాధారణంగా పొలిమేర అంటే ఏ ఊరిదేవత గుడిజెండానో లేక రాతి ప్రతిరూపమో కనిపిస్తుంది కదా. ఆశతో అక్కడికి చేరుకున్నాక పాడుబడిన ఇండ్లు,వాకిండ్లు తప్ప జనము కనిపించకపోతే ఎంతో నిరాశ పడతాడు.
     ఎంత పని చేసినా జీవితంలో ఏ అభివృద్ధి లేక ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుంటే గానుగ చుట్టూ తిరిగే ఎద్దువంటి బ్రతుకైతే దాని వల్ల నిరాశ తప్ప ఏం మిగలదనేది అందరికీ తెలిసిందే.
      ప్రేమల్లో పరస్పరం గౌరవం లేకుండా పొసెసివ్ నెస్ పెరిగిపోతే ఆ ప్రేమ వల్ల పొందగలిగే సంతోషం ఏమీ ఉండదు. ఏ బంధంలోని ప్రేమకూ దీంట్లో మినహాయింపులేదు.
     ఈ విధంగా పల్లవి కి అర్థం== ఊరు లేని పొలిమేర, వృద్ధి లేని బ్రదుకు, పరస్పర గౌరవం లేని ప్రేమలను చేరుకున్నా వ్యర్థమే అని.
     మొదటి చరణం
     విడిచి ఉండలేని విరహం బాధపెడితేనే కలిసినపుడు ఆనందం వెల్లివిరుస్తుంది. కానపుడు ఆసక్తి కలిగించదు. ఎండ బాగా తీవ్రంగా ఉన్నపుడే నీడ విలువ తెలుస్తుంది. చలికాలపు ఎండ, మబ్బులు ముసిరినప్పటి ఎండ వేడిగా అనిపించదు. నీడ కావాలని కోరుకొనే వారూ ఉండరు.
    గొప్పమోహము ఉన్నా చేయివిడువని తోడు , ధైర్యము లేనపుడు ఆ మోహము వలన ఒరిగేదేముంది? ఇద్దరూ ఒకటి కాలేనినాడు ప్రేమలెందుకు?
రెండవచరణం
    మెప్పుదల, ఒప్పుకోలు లేని చోట మంచి స్నేహము ఉన్నా ప్రయోజనం  లేదు. స్నేహము ఏర్పడని చోట మాటలు ఏ ప్రయోజనాన్నీ ఒనగూర్చలేవు
              ఒద్దికపెరగడం కానీ,మనుష్యులమధ్య అంతరం తరగడం కానీ లేనపుడు ప్రేమ ప్రయోజనం ఏముంది? ఇష్టము కాని సొబగులు ఎన్ని ఉన్నా ఏమి ఫలము?
 మూడవచరణము
 నిజమైన చెలికాడైతే మనసుల్లో , ఊహల్లో కలల్లో కలయికలెందుకు? ఎటువంటి సందేహాలూలేకుండా స్వేచ్ఛగా కలిసేందుకు వీలుగాని చనువు వల్ల ప్రయోజనమేమి?( చనువు బదులు చదువు అని రికార్డుల్లోకి ఎక్కిందేమో అని నా ఊహ.)
జంకు గొంకు లేకుండా మంచి పొందికతో గూడి జంటగా వేంకటాద్రి విభుని ఉత్సవంలో, వేడుకలో పాల్గొనకపోతే ఫలమేముంది ?
******************
ఊరులేని పొలిమేర పేరు పెంపులేని బ్రతుకు
గారవంబులేని ప్రియము కదియనేటికే

ఉండరాని విరహవేదన ఉండని సురతసుఖమేల
యెండలేని నాటి నీడ యేమిసేయనే
దండి గలుగు తమకమనెడి దండలేని తాలిమేల
రెండునొకటిగాని రచన ప్రియములేటికే

మెచ్చులేని చోట మంచిమేలు కలిగినేమి సెలవు
మచ్చికలేని చోట మంచిమాట లేటికే
పెచ్చుపెరగలేని చోట ప్రియముగలిగి యేమి ఫలము
ఇచ్చలేని నాటి సొబగులేమి సేయనే

బొంకులేని చెలిమి గాని పొందులేల మనసులోన
శంకలేక కదియలేని చదువులేటికే
కొంకు గొసరులేని మంచికూటమలర నిట్లుగూడి
వేంకటాద్రి విభుడులేని వేడుకేటికే
( నాకు తెలిసినంత మేర వివరించడానికి , పరిచయం చేయడానికి ప్రయత్నించినాను. ఏమైనా పొరబాట్లు దొర్లిఉంటే చెపితే సవరించుకోగలను.)

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి