Loading...

9, ఆగస్టు 2014, శనివారం

రఘునాథభూపాలుడు - తంజాపురాంధ్రవీణ (2)

 
రఘునాథభూపాలుని ప్రత్యేకత
రఘునాథ భూపాలుడు కవిరాజు. సమకాలీకులలో ప్రత్యేకస్థానము పొందినవాడు. రాజస స్ఫూర్తికన్నా సాత్విక కవితా స్ఫూర్తిని కలిగించునట్లు వ్రాయుటలో దక్షుడు. రఘునాథుని మాటనేర్పఱితనమును కవి చౌడప్ప స్పష్టముగా పేర్కొనెను.
రఘునాథుని యందు గల ఖడ్గచాలనాపాటవము, శౌర్యము, కులీనత్వము, ధార్మికత్వము, కావ్యగీతిప్రియత్వము, గుణాధిక్యత, ఉదారగుణములు నిరుపమానములు. అన్ని కావ్యములను ఉత్తమకవుల తృప్తి కొఱకు, సహృదయుల సమ్మతము కొఱకు రచించినట్లు తెలిపెను. తాను పొందిన ప్రతిభాయుక్త కవిత్వ సంపదతో శ్రీరామచంద్రుని కరుణారసపూరిత కటాక్షవీక్షణముల వలన కావ్యకన్య స్వరూపమును నిర్మించి రామునకే అర్పించుట స్వీయ కర్తవ్యముగ భావించెను.
   రఘునాథ నాయకుడు పరిపాలనయందు,  కవిత్వపోషణ యందు, లలితకళలప్రోత్సాహపఱచుటయందు, వ్యక్తిత్వమునందు కృష్ణదేవరాయలను అనుసరించినవాడు. కవిత్వమున మాత్రము వీరికి పోలిక లేదు. కృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద, సత్యవతీ వధూప్రీణము అనునవి రెండును పండితులకు, విద్వాంసులకు కూడ అవగతమగుట కొంత కష్టమందురు. రఘునాథుని కృతులన్నియు చివరకు శాస్త్రగ్రంథమగు సంగీతసుధ కూడా సంగీత పరిజ్ఞానవంతులకు కూడ అవభోన్నిధ్యములగును.
   సంస్కృతకవులను , కవయిత్రులను , శాస్త్రజ్ఞులను పోషించినప్పటికీ, తాను ఎక్కువ తెలుగుభాషలోనే రచనలు చేసెను.
  అమూల్యమగు గ్రంథములను ప్రజలచే సేకరింపజేసి ఇప్పటి తంజావూరు లోని "సరస్వతీమహల్ " అను గ్రంథాలయము ఏర్పడుటకు కారణభూతుడయ్యెను. స్వయముగ కళాహృదయుడు, వాగ్గేయకారుడు, నాటకకర్త, సూత్రధారి. తమిళదేశమున తెలుగుభాషను, సంస్కృతిని అభివృద్ధి చేసినాడు. ద్విపదకావ్యములను రచించి ప్రజాకవితకు దారి చూపినాడు. యుద్ధవ్యూహమున ఎంత నిపుణుడో వివిధ కావ్యరచనా ప్రక్రియలందు అంతటి ఘనుడు.
    అన్నదానములను, యజ్ఞయాగాదులను చేసి ప్రజలలో వైదిక భావములను ప్రేరేపించినవాడు. కులమత వివక్షతను తొలగించి సర్వమత సామరస్యముతో ప్రజలను పాలించినవాడు. ఆచరణలో ఆదర్శాలను చూపినవాడు. దేవాలయమును అభివృద్ధి చేయుటయే కాక విద్యాలయములను స్థాపించినవాడు. (నేటికిని కుంభకోణమున ఇటువంటి విద్యాపీఠములున్నవి.) సంగీతకళాకారులకు, కర్ణాటక సంగీతమునకు సరిక్రొత్త దగు "రఘునాథ మేళవీణ"ను కనిపెట్టి సహాయము చేసినవాడు. జయంతసేన అను రాగమును కనిపెట్టి సవిస్తరముగా తెలియజేసెను.
          చక్కటి క్రమశిక్షణ కలిగిన ఆతని దినచర్యను సమకాలీనులు అత్యున్నతముగ వర్ణించిరి. సమకాలీనులచే పొగడబడుటకు ఈతని వ్యక్తిత్వమే కారణం.
రాజకీయ సాహిత్య పరములుగ రఘునాథుడు అపారమగు సేవచేయుటవలన ఈ నగరము సరస లలిత కళలకు నేటికీ స్థానమై యున్నది.
           శ్రీకృష్ణదేవరాయలు యావద్దక్షిణభారతమును ఏకచ్ఛత్రము క్రిందికి తెచ్చినాడు. కాని తదుపరి తల్లికోట యుద్ధమున, తురుష్కుల దౌష్ట్యమున తల్లిగడ్డ వల్లకాడైపోయినది.  విజయనగరధ్వజము క్రింద ఏర్పడిన ఆంధ్ర సామ్రాజ్యము తమిళనాడు నడిబొడ్డునకు తరలిపోయినది. అక్కడ అవతరించిన మరొక్క రాయలే రఘునాథ భూపాలుడు.
అంతటి రఘునాథుని గురించి సమగ్ర సుందరముగా రూపొందించిన పరిశోధనాగ్రంథమునుండి సేకరించిన కొన్ని విశేషాలివి. పరిశోధకులు డాక్టరు రామాపంతుల లక్ష్మీకామేశ్వరరావు , ఆంధ్రోపన్యాసకులు- సివిల్ ఇంజనీరు. ప్రచురించినది తెలుగు విశ్వవిద్యాలయము.
వారికి నా మనఃపూర్వక ప్రణామములు. వారి 450 పేజీల పరిశోధనా గ్రంథము నుండి ఈ చిన్ని పరిచయము భారతీయులకు చేయదల్చిన నా చిరుప్రయత్నాన్ని సహృదయులు అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను.

4 వ్యాఖ్యలు:

 1. నమస్తే!

  ఈ రఘునాధ వీణని రూపొందించింది రామామాత్యుడు. ఈయన కొండవీడు సంస్థానాధిపతి. ఈయన సంగీతానికి చేసిన పెద్ద మేలేవిటంటే మేల కర్త రాగ విభజన. దాన్నే వేంకట మఖి సరిదిద్ది శాస్త్ర రూపం ఇచ్చాడు. రగునాధ వీణ మీరు చెప్పినట్లు రఘునాధ భూపాలుడు రూపొందించింది కాదు. ఎన్నో సాహిత్య సంపదలకి మూలకర్తలుగా రాజు పేరు మీద చెలామణీ అవుతూనే ఉంటాయి.

  మీ దగ్గర రామా పంతుల వారి పరిశోధనా పుస్తకం PDF కాపీ ఉంటే పంపగలరా?

  -సాయి బ్రహ్మనందం గొర్తి

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ప్రత్యుత్తరాలు
  1. పైన ఇచ్చిన లంకెలో ఈ వ్యాసం మొదటి భాగం ఉంది. దాంట్లో వీణ, సంగీతసుధ గురించిన మరిన్ని వివరాలు చదవగలరు.

   తొలగించు
  2. "బ్రహ్మానందం గారు,
   ఎన్నో విషయాలకు రాజు గారి పేరు పెట్టడం చలామణీ కావడం జరిగి ఉంటుంది. కానీ రఘునాథుడు మెట్లు మార్చుకోవాలసిన అవసరం లేకుండా వీణను అభివృద్ధి చేయడం మాత్రమే కాక జయంతసేన అనే రాగం రూపొందించి పూర్తిగా వివరించడం జరిగింది. అంతేకాదు సంగీత సుధ అనే గ్రంథాన్ని, స్వరములభేదాలను, అంతర్భేదాలను తెలిపే గ్రంథం రచించినాడు అది లభ్యము కూడా.
   మీరు చెప్పిన రామామాత్యులవారు కూడా వీణను అభివృద్ధి చేసి ఉండవచ్చు.వీణ నానాటికీ మెఱుగుపడుతూ ఉంది ఎంతోమంది చేతుల్లో.
   ఈనాటి రూపము దాదాపు రఘునాథుడు రూపొందించిన రూపంలో ఉందనే పుస్తకంలో ఇచ్చినారు. ఇంకొన్ని మెఱుగులు రామామాత్యుడు దిద్ది ఉండవచ్చు.
   ఇంక నేను చదివింది పైన చెప్పినట్టు డా ఆర్. ఎల్ కామేశ్వరరావు గారి పరిశోధనా గ్రంథము. నేను గ్రంధాలయంలో ముద్రిత ప్రతిని తీసికొని చదివినాను. పిడియెఫ్ నాదగ్గర లేదు. వేరే పుస్తకమేదీ నేను చదవలేదు.
   పైన చెప్పిన వన్నీ నేను చదివిన పుస్తకంలో ని విషయాలే తప్ప నేనే వేరే పరిశోధన చేయలేదు కాబట్టి మీరు చెప్పింది సరికాదని కూడా నేను సాధికారంగా చెప్పలేను. ధన్యవాదాలు.
   http://paarijatam.blogspot.in/2014/08/blog-post_4.html"

   తొలగించు