Loading...

21, ఏప్రిల్ 2014, సోమవారం

తలో నలుగురితో ఏం సాధిస్తారు?


            నలభై మంది సభ్యులు ఇక్కడ్నించి ఉన్నప్పుడే గౌరవంగా, మర్యాదగా ఏమీ సాధించలేకపోయినాక ఇప్పుడు ముక్కలుగా విడగొట్టేసిన వాళ్ళదగ్గరకేపోయి, ఇప్పుడున్న ఇన్ని పక్షాల వాండ్లూ తలో నలుగురు సభ్యులతో ఏమి సాధించుకొస్తారు? బలమున్నప్పుడే కుక్కల్ని గొట్టించినట్టు కొట్టించినారు. పిలిచి మాట్లాడేంత మర్యాదకూడా ఇయ్యలేదు. తెలంగాణలో ఉద్యమం జరిగినపుడు వాళ్ళను పట్టించుకోలేదు. విడగొట్టవద్దనే ఉద్యమం జరిగినప్పుడు వీళ్ళను పట్టించుకోలేదు.

              అందరూ అన్ని పక్షాలూ స్వలాభం ఎక్కడుంటుందో అక్కడే ఉన్నారు.జనాల ఆవేశాల్ని ఎట్ల రెచ్చగొడితే తమకు నాలుగు ఓట్లు రాలతాయో చూసుకున్నారు. రెచ్చగొట్టడం అంటే అంతింత కాదు. నోటి కొచ్చినదంతా కూస్తున్నారు. సామాజికమర్యాదలనే మాటలీ గాలిలో కొట్టుకొనిపోయినాయి. అసలు విషయం లేనప్పుడే తిట్లు బయటికొస్తాయి అనేది జగమెఱిగిన సత్యం. రెండు మూడు జిల్లాల ప్రాబల్యం లేనివాళ్ళు కుట్రలు చేసి రాష్ట్రాల భవితవ్యం నిర్ణయిస్తున్నారు. కొందరు తమ రాష్ట్రంలో నివసించే తమ పౌరులనే సెట్లర్స్ అని వ్యవహరిస్తున్నారు. వాళ్ళకు వంతపాడే కొందరు మా కోపమంతా సీమాంధ్ర నేతలపైనే జనాలమీద కాదు అని రంగులు పూసి అందంగా చూపించుకొనేవాళ్ళు ఈ సంగతులకేమంటారు? అసలు పలకరు.

             ఏ సంగతులకంటే హైదరాబాదు లో ఉన్నవాళ్ళను సెట్లర్స్ అనడం, పెన్షనర్లు కూడా ఇక్కడ ఉండకూడదనడం, తొంభైశాతం ఉద్యోగులు అక్రమంగా వచ్చినవాళ్ళేననడం , వాళ్ళు తల్లిదండ్రుల స్థానికత ఆధారం గా పోవాలనడం, భవనాల్లో పంపకాల్లో కూడా ఒకరి మొహం ఒకరు చూడకుండా ఉండే ఏర్పాట్లు జరగాలనడం, సీమాంధ్రలో నేతలవెంట ఉన్న వాళ్ళను తెలంగాణ ద్రోహులనడం ఇవన్నీ ఏమంట? ఇవి నేతల మీద కోపాలా? కాదు , సీమాంధ్రులమీద నిప్పులు కక్కడం. తెలంగాణ రాయలసీమ కోస్తా ప్రజల్లో ఒకరిమీద ఒకరికి లేని ద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనే మనుషులు, పక్షాలు దిక్కు లేకుండా పోతే తప్ప ఈ పరిస్థితి మారదు. అదీ జరిగింది. మళ్ళీ వాళ్ళని తమ తమ ప్రయోజనాల కోసం పెంచి పోషించిన వాండ్లున్నారు గదూ!

              కాబట్టి ఈ పరిస్థితికి ఇప్పట్లో అంతం లేదా? ఎప్పుడూ పరస్పరం కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉండాల్సిందేనా? అభివృద్ధీ జరగదు. బలంగా ఉన్నప్పుడే మాటకు లేని విలువ ఇప్పుడు తలోపార్టీకీ వచ్చే నలుగురైదుగురు సభ్యులతో ఎటూ రాదు. భాజపకు ఇక్కడ ఏమంత బలముందని వాళ్ళు స్థానిక పార్టీల పైన పెత్తనం చేస్తున్నారో అర్థంకాదు. తెలుగుదేశానికి ఆత్మవిశ్వాసం చాలక వాళ్ళు చెప్పినట్టు వినడమా? కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం దేశ భవిష్యత్తు కుమంచిది. అదే విధంగా ఇక్కడ కూడా ఒకే పక్షం బలంగా వస్తేనే అభివృద్ధి అంతో ఇంతో జరిగే అవకాశం ఉంది. లేకపోతే ఏమీ లేదు.

                     పక్కరాష్ట్రం వాళ్ళ మాట కాంగ్రెస్ ఎట్లా వింటుందో భాజపా కూడా అంతే అనిపిస్తుంది. ఇక్కడి స్టార్ లు అక్కడికి పోయి మోడీని కలుస్తారు. మోడీ గెలవాలని ఆకాంక్షిస్తారు. పక్కరాష్ట్రం స్టార్ ల దగ్గరికే పోయి మోడీ మాట్లాడుతాడు . అయినా వాళ్ళు రాజకీయాలు మాట్లాడనే లేదంటారు. కాబట్టే భాజప వచ్చినప్పుడూ వాండ్ల రాజ్యం ఇప్పటి వెలుగులే వెలుగుతుంది. మన రాష్ట్రం (రాష్ట్రాలనలేను) ఇప్పటి ఏడుపే ఏడుస్తుంది. ఈ విధంగా నిరాశావాదంలోకి రాష్ట్రాన్ని నెట్టేసిన నేతలందరికీ భవిష్యత్తు లేదని తెలుస్తూనే ఉంది. ఇప్పటికీ సగం మంది పోటీ చేయడం లేదు. మిగిలినవాళ్ళకూ ఈ ఉసురు తగలక మానదు. ఇవి చేతకాని ఏడుపులనిపించవచ్చు. అవును , నిజమే. ఏమీ చేయలేక చేతకాక చేవచచ్చిన రాజ్యం మనది. ఇక్కడ్నించి ఇంతకన్నా ఎక్కువ ఆశించడాలూ, సింగపూర్ల కలలూ అన్నీ పబ్బంగడుపుకొనే మాటలే. ఎవరూ నమ్మడం లేదు.

26 వ్యాఖ్యలు:

 1. ముందు మీరు దేవుని కొడుకు బారి నుండి తప్పించుకోండి(Y.S.Jagun)!
  భా.జా.ప వారు బలం లేక పోయినా ఓట్లు చీలకూడదు అనే సదుద్దేశ్యం తో పొత్తు కుదుర్చుకున్నారు ...ఓట్లు చీలితే కర్నాటకా లో జరిగినట్లు కాంగిరేసు అనూహ్యంగా అధికారం లోకి వచ్చినట్లు అవుతుంది అని రెండు పార్టీల వారు పాత సంబంధాలను పునరుద్ధరించుకున్నారు ....
  ఇక మన స్టార్లు కలవడం అంటే మన రాష్ట్ర పరిస్తితి వేరుగా ఉంది కదా.... టి.డి.పి మతం పేరుతో భా.జా.ప ని దూరం పెట్టింది(ఈయన మాత్రం కులం పేరుతో రాజకీయం చేయొచ్చు మరి!) అలాంటప్పుడు బాద్యత గల మన సినిమా స్టార్లు భవిష్యత్తు ప్రధానిని కలుసుకుని మరీ మన 2 రాష్ట్రాల క్షేమం గురించి చర్చించడం లో తప్పు లేదు ....తమిళ నాడు వారిది కడుపు నిండిన బేరం మన రాష్ట్రానిది కడుపు చినిగిన బేరం ఈ విషయం లో మన సినిమా స్టార్స్ ని అభినందించాలి. (పవన్ కలిసేప్పటికి టి.డి.పి పొత్తు ప్రకటన జరగలెదు).
  అయినా తమిళులు లౌక్యం ప్రదర్శిస్తే మన సినిమావాళ్ళు ధైర్యంగా తమ అభీష్టాన్ని ఏ రంగు లేకుండా వ్యక్త పరిచారు .
  Narsimha K

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అయినా పులుల్ని ఎన్నుకోవడానికి పిల్లుల్ని ఎన్నుకోవడానికి తేడా ఉందండి ...గతం లో వై.ఎస్ కీ ..ఇటల్య్ గాంఢి కి బానిసలని ఎన్నుకుని తప్పు చేసాము కనీసం ఇప్పుడైనా ఆత్మాభిమానం గల నేతలని ఎనుకుందాము.
  బానిసలని పంపి ప్రతిదానికీ అమ్మగారూ.... అనే వారిని మరచి ....సొంతంగా ఆలోచించే నేతల్ని ఎన్నుకోవడం మేలు ...
  దేవుని కొడుకు చేతిలో కీలు బొమ్మలై ఆయన పాపపు వ్యాపారం లో భాగస్తులైన మరో బానిసలని ఎన్నుకుంటే కథ మళ్ళీ మొదటికే కదా..(మోపిదేవి , ధర్మాన ...అయొధ్య ...మొ||)
  కానీ ఖచ్చితంగా ఎన్నికల రోజున వెల్లి వోటూ వేయండి.
  -తేజ

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నరసింహ గారు,
  ఔను, ఇప్పటికి కనీసం మన తారల్లో వచ్చిన చలనం సంతోషాన్ని కలుగజేసింది. వాళ్ళు ఓపెన్ గా ధైర్యంగా మాట్లాడడం కూడా సంతోషాన్ని కలుగజేసింది. కానీ తర్వాతే పక్కవాళ్ళతో అనవసరంగా పోల్చుకున్నాను. ధైర్యంగా మాట్లాడడమే మంచిది.
  పొరపొచ్చాలు వచ్చినా పంతాలకు పోకుండా రెండు పక్షాలూ సర్దుకోవడం, పవన్ కళ్యాణ్ కూడా వీరిద్దరికీ జయప్రకాష్ నారాయణ గారికీ మద్దతు నివ్వడం కూడా శుభపరిణామమే.
  మీరు మొదట తలచిన పేరు కూడా నా కీ బోర్డ్ పై పలికించి పాపం మూటకట్టుకోదలచలేదు.
  ధన్యవాదాలు పాజిటివ్ విషయాలను హైలైట్ చేసినందుకు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. తేజ గారు,
  అదే, ఆత్మాభిమానం దేశభక్తి ఉన్నవారు ఎన్నికయితేనే భవిష్యత్తు అని మనస్ఫూర్తిగా నమ్మేదాన్ని నేను.
  తప్పకుండా ఓటు వేద్దాము.
  ఇంక పాపుల మాట కూడా నా నోట రావడం ఇష్టం లేదు.
  నా మనసులోని భావాలకు రూపాన్నిచ్చి వ్రాసిన మీకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. లక్ష్మీదేవి గారూ, రెండు విషయాలు:

  పెన్షనర్లను వెళ్ళిపొమ్మని ఎవరూ అనలేదండీ. పెన్షన్ సొమ్మును ప్రాంతీయత ఆధారంగా పంచాలని అడగడం తప్పెలా అవుతుంది?

  సెట్లరు అన్న పదం అర్ధం "స్థిరపడ్డ వారు". దీంట్లో అభ్యంతరం ఎందుకు? అసలు ఈ పదం ఎక్కడనుండి వచ్చిందో తెలుసుకుందాం. తమకు తమ సంస్కృతికి ప్రత్యెక గుర్తింపు కావాలనే కోరికతో తెలంగాణాలో స్థిరపడ్డ ఆంధ్రులు ఈ పదాన్ని వాడడం మొదలు పెట్టారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. జయ్ గారు,
  వెళ్ళిపొమ్మనేందుకు ఎవరికీ హక్కు కూడాలేదండి. భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా ఉండవచ్చు.
  కానీ కొందరు అంటూనే ఉన్నారు.
  చిత్రహింసలు పెట్టిన నిజాం పాలకుడినీ మావాడన్నారు గానీ అమాయక ప్రజలపై ఇటువంటి మాటల తూటాలు ఎక్కుపెడుతూనే ఉన్నారు.
  పెన్షన్ ఏ ప్రభుత్వం నుంచి జమ అవుతుంది అనే దాంట్లో పేచీలేమీ లేవు.
  సెట్లర్లని మిగతా ఎవ్వరినీ అనడం లేదండీ , మీరు సమర్థిస్తూ చెపుతున్నారంతే. సీమ నుంచీ, కోస్తానుంచీ వచ్చినవాళ్ళనే అంటున్నారు. వేరే రాష్ట్రం నుంచో , దేశం నుంచో వస్తే అనడం వేరు . మా రాష్ట్రం అనుకొని వచ్చిన వారిని అనడంవేరు అని మీకు మాత్రం తెలియదా?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. వెళ్ళమనే హక్కు ఉందా & ఎవరు ఎవరిని భాగో అన్నారో అనే విషయాలు ప్రస్తుతానికి వదిలేద్దాం.

   పెన్షనర్లను ఎవరు ఎప్పుడు ఎక్కడకి వెళ్ళమన్నారో నేనయితే వినలేదు. మీకు తెలిస్తే వివరాలు ఇవ్వండి. ఈ విషయంలో తెలంగాణా ఉద్యోగుల డిమాండ్ ఒక్కటే: ఆంద్ర ఉద్యోగుల పెన్షన్ భారం తెలంగాణా ప్రభుత్వంపై పడకూడదు. ఇది న్యాయమె అని మీరంటున్నారు కానీ ఆంద్ర ఉద్యోగులు ఒప్పుకోవడం లేదు.

   సెట్లర్ అనే పదాన్ని వాడుకలో తెచ్చింది ఆంద్ర నుండి వచ్చి తెలంగాణాలో స్థిరపడిన వారే. ఆ పదాన్ని వారు అమర్యాదగా భావించరు సరికదా తమ ప్రత్యెక అస్తిత్వానికి చిహ్నంగా తలిచారు.

   FYI most of the settlers moved to Telangana before 1956. I know the situation very well from settlers in my family & friends circles.

   No comments about Asafjahis as the point is irrelevant to the context.

   తొలగించు
 7. వివరాలు ఇచ్చి ప్రూవ్ చేయడం కుదురుతుందనే అడుగుతున్నారాండీ? బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండే వాళ్ళే ఇచ్చిన స్టేట్ మెంట్లు మరుసటి రోజు నా వ్యాఖ్యల్ని వక్రీకరించినారని అదే విలేఖరులతో చెప్పడం వెళ్ళిపోవడం జరుగుతున్న ఈ రోజుల్లో నోరు పారేసుకోవడం తప్ప జాతి పట్ల , రాష్ట్రం పట్ల ఏ బాధ్యతా లేని వారి వ్యాఖ్యల్ని నిరూపించడం నాకు సాధ్యం కాదు. కానీ ఎప్పటికప్పుడు పేపర్లో ఇటువంటి మాటలు చదివినప్పుడు మనసు పడిన బాధనే నా బ్లాగులో వ్రాసుకుంటుంటాను కానీ, నిలదీసి శిక్షించే భ్రమలతో కాదు. సెట్లరు అనే పదం మీకు తెలిసిన విధమేమో నాకు తెలియదు గానీ ఇప్పుడు తిట్లు తప్ప మంచి మాటలు రాని నేత ఒకరు మాత్రం నేను చెప్పిన అర్థంలోనే అంటున్నారు.
  ఇంక ఉద్యోగుల విభజన జరిగినాక కదా భారం గురించి చర్చలు. జరగక ముందే భారాల గురించి చర్చ ఎలా?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఒకవేళ ఎవరో ఏమో అన్నా ఒక్క మనిషి మాటలకు అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదేమో? అలాగే టీవీలో చెప్పినవన్నీ నిజాలు కానక్కరలేదు. మన దేశంలో మీడియా పాత్ర ఎంత దిగజారిందో చూస్తేనే ఉన్నాం. ఆయనెవరో మోడీ వ్యతిరేకులను పాకిస్తాన్ వెళ్ళమంటే అదే పొద్దస్తమానం చూపించారు.

   విభజన అనేది ఒక ప్రాసెస్. అందులో అనేక విషయాలు ఉంటాయి, ప్రతిదానికి వాదోపవాదాలు జరుగుతాయి. సమైక్యాంధ్ర అంటూ "ఉద్యమం" చేసిన కొందరు ఉద్యోగులు ఇప్పుడు తమ సొంత ప్రయోజనాల కోసం తెలంగాణా రాష్ట్రంలో ఉద్యోగం చేద్దామని ఉవ్విళ్లూరుతున్నారు. వీరు అనవసరంగా ఉద్యోగేతరులను భయబ్రాంతం చేద్దామని ప్రయత్నిస్తున్నారు.

   It is best to leave these matters to those involved in it unless one has knowledge of the various factors. There is little point in getting agitated.

   తొలగించు
 8. మీ కన్సర్న్ కు సంతోషమండి. నిజమే, ఒక్క మనిషి మాటలకు, మీడియా కథనాలకు విలువ ఇయ్యాల్సిన అవసరం లేదని తెలుసు. కానీ దీని వెనుక జరుగుతున్న కుట్ర గురించి నా బాధ. అందరూ కలిసి ఉండాలనే భావనకు, బలము వృద్ధి పెంచే భావనకు ఎక్కడ నష్టం వాటిల్లుతుందో అని మాత్రమే నా ఆవేదన.
  ఈ తతంగం అంతా జరిగి ముగిసే లోపు రాష్ట్రానికి తీరని నష్టం ఏర్పడకుంటే అంతే చాలు.
  ఎవరైనా తాపత్రయ పడుతుంటే తమదనుకున్న ఊరితో ఉన్న అనుబంధమని గుర్తించండి దయచేసి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కలిసి ఉండాలనే భావన మంచిదే కానీ బలవంతంగా కలిసి ఉండాలని పట్టుపట్టడం తప్పు. ఇంత సింపుల్ విషయం సాధారణ (ఎటువంటి స్వార్ధ ప్రయోజనం లేని) ఆంధ్రులకు ఎందుకు అర్ధం కావడం లేదో?

   తమది అనుకున్న ఊరితోనే (ప్రాంతంతోనే) అనుబంధం ఉండడం మంచిదే. అయితే గురజాడ చెప్పినట్టు "దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్" అనే మాటను పాటిస్తే బాగుంటుంది. భూముల మీద ఉన్న మమకారంతో బాటు ఇక్కడ మనుషులతో మమేకం అయ్యి వారి కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ ఉంటె ఎటువంటి అబద్రతాభావం రాదు.

   ఇటీవలి కాలంలో వచ్చిన ఆంధ్రులు (సెట్లర్లు కాదు) ఎందుకో ఆ పని చేయలేకపోయారు. దీన్ని కొందరు తమ స్వార్ధానికి (ఉ. అక్రమ వ్యాపార/రాజకీయ/ఉద్యోగ లబ్ది) వాడుకుంటున్నారు. వారి వలలో సామాన్యులు పడకూడదనే నా తాపత్రయం.

   తెలంగాణా అనేక భాషల అనేక ప్రాంతాల మిశ్రమ సంస్కృతి. దేశం నలుమూలల నుండి వచ్చిన ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకున్న ఘనత ఈ రాష్ట్రానిది. ఎవరి మీదా ఏమీ రుద్దే ఆచారం లేదిక్కడ. ఈ కాస్మోపాలిటన్ దృక్పధం (గంగా జమునీ తెహ్జీబ్) ఒప్పుకున్న వారందరికీ (వారెక్కడ నుండి వచ్చినా) ఎటువంటి ఇబ్బందీ ఉండదు.

   తొలగించు
 9. కలిసి ఉండాలంటే పరస్పరద్వేషభావన లేకుండా ఉండడం. మిగతా రాష్ట్రాలవారితో ఉన్నట్టు ఉండడం. ఇంకా ఒకే రాష్ట్రంగా ఉండే అవకాశం ఎక్కడుంది?
  ఊరితో అనుబంధమంటే భూముల మీద మమకారం కాదు. అన్నీ కలిపే . అందరికీ భూములు, ఇళ్ళు ఉంటాయా ? ఉండవు.
  అభద్రతా భావం అదంతకదే రాదు. కుట్రదారులు కల్పిస్తారు. ఇప్పుడు కల్పించి రాష్ట్రం ముక్కలయ్యేటట్లు చేసినారు.
  స్వార్థ పరుల వలలో అమాయకులు ఇప్పటికే పడిపోయినారనేదే నా తాపత్రయం.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మీరు రాష్ట్రం ముక్కలు అయ్యింది (లేదా చేసారు) అంటున్నారు. మేము తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది అంటున్నాము. మీరు మమ్మల్ని అర్ధం చేసుకోలేదు అనడానికి ఇది చాలు.

   If you don't understand people's aspirations, you can't expect them to appreciate your concerns.

   తొలగించు
 10. అభివృద్ధికీ, రాష్ట్రం ఏర్పడడానికీ ఎటువంటి సంబంధమూ లేదని తొందర్లోనూ మీరూ గ్రహిస్తారు. అభివృద్ధికి జనచైతన్యము, రాజకీయ చిత్తశుద్ధి మాత్రమే అవసరం. ఇది అర్థం చేసుకోకుండా సీమాంధ్రుల మీద కత్తి గట్టి చేయబడిన ప్రచారానికి ప్రభావితులైనారు కాబట్టి ఇప్పుడు జరిగిన దాన్ని రాష్ట్రం ముక్కలవడం అనే అనవలసినది.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. "అభివృద్దికి, రాష్ట్రం ఏర్పడటానికి ఎటువంటి సంబంధం లేదు"

  ఎందుకు లేదు? రాష్ట్ర ఆదాయంలో తెలంగాణా కోసం ఎంత ఖర్చు పెడుతున్నారో మీరు చెప్పగలరా ? అసలు పదేళ్లుగా ఈ విషయాలపై రాద్దాంతం జరుగుతున్నా ప్రభుత్వం ఈ వివరాలు ఎందుకు ప్రకటించలేదు? చివరికి మొన్న ఆఖరు బడ్జెట్ లో జేపి కూడా ఏమన్నాడో మీరొక సారి గుర్తు చేసుకోవాలి "తెలంగాణా ఉద్యయం ఇంతగా జరుగుతున్నా కూడా ఈ బడ్జెట్ లో కూడా జిల్లాల వారి లెక్కలు ఎందుకు చూపించటం లేదు? ఎవరికీ వారు ఎదో ఊహించుకుని రేపు జనాలు తన్నుకోవతానికా?". తెలంగాణా ఏర్పాటు జరిగితే సీమంద్ర లోటు బడ్జెట్ లో ఉంటుందనేది ఎందఱో సీమంద్ర నాయకులు చెప్పినదే? అంటే సీమంద్ర లోటు ను ఇన్నాళ్ళు తెలంగాణా తీరుస్తుందని అర్థం కావటం లేదా?

  అసలు ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుకు జరిగిన ఒప్పందం, పెద్ద మనుషుల ఒప్పందంలో ఏమని చెప్పారు ? తెలంగాణా లోనీ ఆదాయం అంతా తెలంగాణా కే ఖర్చు పెట్టాలని ఒప్పందం కదా ? అలా జరగటం లేదని అర్థం కావటానికి సీమంద్రలో రాబోవు లోటు చూస్తూనే అర్థం అవుతుంది.

  ఇంత మిగులు ఒప్పంద విరుద్దంగా, అన్యాయంగా సీమంద్రలో ఖర్చు పెట్టకుండా తెలంగాణాలో ఖర్చు పెడితే తెలంగాణా ఎందుకు అభివృద్ధి చెందదు?

  ప్రత్యుత్తరంతొలగించు
 12. కీర్తి గారు,
  తెలంగాణ ఏర్పాటు జరిగితే సీమాంధ్ర లోటులో ఎందుకుంటుందంటే హైదరాబాదు నుంచే వచ్చేది ఆదాయం. హైదరాబాదు నుంచే ఎక్కువ పన్నులూ అవీ వచ్చేది. హైదరాబాదులో రాష్ట్రవాసులందరూ ఎక్కువగా ఉన్నారు. అందరూ పెట్టుబడులూ పెట్టినారు, పన్నులూ ఇతర ఆదాయాలూ వస్తున్నాయి.
  హైదరాబాదు ఆదాయం తీసేస్తే తెలంగాణా కూడా లోటు బడ్జెట్ లో ఉంటుందని పదేపదే నిపుణులందరూ చెప్పినమాట మఱిచినట్టున్నారు.
  హైదరాబాదు తీసేస్తే అనేమాట మీరెట్ల భరించలేరో ఇవతలివాళ్ళూ అంతే అన్నది గమనించండి.
  సీమ, కోస్తా సంపద, ఆదాయం అంతా కూడా సీమకు, కోస్తాకు మాత్రమే ఖర్చుపెట్టలేదు, తెలంగాణా ఆదాయమూ తెలంగాణాకు మాత్రమే ఖర్చుపెట్టలేదు. మొత్తమంతా కూడా హైదరాబాదుకే పెట్టబడింది.
  ఆదాయాన్ని సక్రమంగా అన్ని పక్కలా ఖర్చుపెట్టే విధానాలూ, చిత్తశుద్ధి ఉంటే మన రాష్ట్రమేం, దేశమంతా కూడా ఎప్పుడో బాగుపడేది.
  ఇంక ఏ జిల్లాకు , ఏప్రాంతానికీ ఎంత ఖర్చుపెట్టినారనే లెక్కలు నాదగ్గర లేవు.నేను కేవలం రెచ్చగొట్టబడిన భావోద్వేగాల వల్ల మన రాష్ట్రం ఎంత నష్టపోతున్నదనే అంశం మీదనే వ్రాసుకుంటున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. ఎ ప్రాంతం ఆదాయం ఆ ప్రాంతానికే ఖర్చు చేయాలన్న ఒప్పందాన్ని తుంగలో తొక్కారు. 1956 నుండి ఇప్పటివరకూ హైదరాబాదు మిగులును ఇతర జిల్లాల మీద ఖర్చు చేసారు.

  Hyderabad has always been revenue surplus. Claiming Hyderabad was subsidized by Andhra revenues is incorrect. On the contrary Hyderabad has subsidized other districts right from 1956.

  In fact, this is the main reason why Andhras wanted to join with Telangana. The situation in the short lived (1953-56) Andhra state was pathetic with offices in tents and no money to even pay salaries.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. ఇతరజిల్లాల నుండికూడా ఆర్థిక వనరులు, మానవవనరులు హైదరాబాదుకు తరలించబడ్డాయి. యాభై అరవై ఏళ్ళ నాటి డబ్బు లెక్కలు ఇప్పటి డబ్బు లెక్కలు వేరే. అప్పుడు సంపన్నుల దగ్గర కూడా వ్యర్థం చేసేంత ధనం లేదు. ఇప్పుడు రోజు కూలీ కొండొకచో తను సంపాదించిన దాంట్లోనే ఖర్చు చేసే విధం మార్చుకున్నాడు.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. తెలంగాణా లోని సంపద నంతా దోచుకుని, దాచుకుని, తరలించుకుపోవదం నిజమయితే ఇప్పుడు విడిపోతున్న రెండు రాష్ట్రాల్లో రాయలాంధ్ర మిగులులోనూ తెలంగాణా తరుగులోనూ ఉండి ఉండేది. అలా కాకుండా తెలంగాణా మిగులు లోనూ రాయలాంధ్ర తరుగులోనూ యెందుకు ఉంది?మీ ప్రాంతాన్ని మిగులులో ఉంచి మా ప్రాంతాన్ని తరుగులో ఉంచుకున్నా తిట్లు మాత్రం మాకే తగుల్తున్నాయి!

  అక్కడ పెట్తిన పెట్తుబడులతో అక్కద వ్యాపారం చేసి లాభాల్ని కూడా అక్కదే మళ్ళీ పెట్టుబడులుగా పెట్టి అఘోరించాం తప్ప మేము మా ప్రాంతానికి తరలించుకు పోలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. తెలంగాణా లోని సంపద నంతా దోచుకుని, దాచుకుని, తరలించుకుపోవదం నిజమయితే ఇప్పుడు విడిపోతున్న రెండు రాష్ట్రాల్లో రాయలాంధ్ర మిగులులోనూ తెలంగాణా తరుగులోనూ ఉండి ఉండేది. అలా కాకుండా తెలంగాణా మిగులు లోనూ రాయలాంధ్ర తరుగులోనూ యెందుకు ఉంది?మీ ప్రాంతాన్ని మిగులులో ఉంచి మా ప్రాంతాన్ని తరుగులో ఉంచుకున్నా తిట్లు మాత్రం మాకే తగుల్తున్నాయి!

  అక్కడ పెట్తిన పెట్తుబడులతో అక్కద వ్యాపారం చేసి లాభాల్ని కూడా అక్కదే మళ్ళీ పెట్టుబడులుగా పెట్టి అఘోరించాం తప్ప మేము మా ప్రాంతానికి తరలించుకు పోలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. హైదరాబాదుకు మిగిలిందాన్ని గురించి అస్సలు మాట్లాడరు . క్రూరత్వం చూపించిన మొగలాయీ పాలకుల్నీ, నిజాం పాలకుల్నీ, కుట్రదారులైన ఆంగ్లేయుల్నీ కూడా ఇంత గా ద్వేషించడం లేదుభారతీయులు. ఎవరో కొద్దిమంది నేతలు మాత్రమే మోసం చేసినారు. సీమాంధ్రులందర్నీ అనడం లేదంటూనే మొగంచూడమంటారు. ఏమి అన్యాయపు రోజులు!

  ప్రత్యుత్తరంతొలగించు
 18. "హైదరాబాదు ఆదాయం తీసేస్తే తెలంగాణా కూడా లోటు బడ్జెట్లో ఉంటుందని పదే పదే నిపుణులందరూ చెప్పిన మాట మరిచినట్లున్నారు"

  నేను ఆ విషయం మరవలేదండి, కాని ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడక ముందే హైదరాబాదు తెలంగాణాలో అంతర్బాగం అని, ఆనాడు కూడా హైదరాబాదుదే హైదరాబాదు రాష్ట్రంలో సింహ బాగమని, హైదరాబాదు నగరం లేని తెలంగాణా లోటు బడ్జెటేనని, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు వలన హైదరాబాదు ఆదాయం సీమంద్రతో పంచుకోవటం తెలంగాణకు ఇష్టం లేని కారణంగా హైదరాబాదు ఆదాయం మొత్తం తెలంగాణకు మాత్రమె చెందుతుందని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సందర్బంగా చేసుకున్న ఒప్పందంను మీరు మరిచినట్లున్నారు. ఆ ఒప్పందం మరిచి హైదరాబాదు ఆదాయంలో వాటా అడగటం మాట తప్పటమే అని మరోవోద్దు. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుకు ముందు కూడా సీమంద్ర లోటు బడ్జెట్లోనే ఉందనే విషయాన్ని కూడా మరిచారు.

  హైదరాబాదుకు ఎవ్వరు ఖర్చు పెట్టలేదు, హైదరాబాదు ఆదాయాన్నే హైదరాబాదుకు కొంత కర్చు పెట్టగా మిగిలినది మిగిలిన ప్రాంతాలలో ఖర్చు పెట్టారు. అసలు హైదరాబాదు ఆదాయం ఎంత, హైదరాబాదుకు ఖర్చు పెట్టినది ఎంత అనేది చిన్న కాకి లెక్క వేసుకున్నా అర్థం అవుతుంది, వచ్చేది కొండ-ఖర్చు పిసిరంత అని.

  మీరు 'రెచ్చగొట్టిన భావోద్వేగాల' విషయమై రాస్తునారు, సరే, నేను మీరు చేసిన ఈ కింది వాఖ్య పై రాస్తునాను "అభివృద్దికి, రాష్ట్రం ఏర్పడటానికి ఎటువంటి సంబంధం లేదు"

  జమా ఖర్చుల విషయంలో పారదర్శకత లేకపోవటం, ఒప్పందాలు ఉల్లంగించటం వలలన ఇన్నాళ్ళు సీమంద్రులే లాభ పడ్డారని నా నమ్మకం. అది నిజం కాకపొతే గత పదేళ్లుగా సీమంద్ర ప్రాంత సమైక్య వాద వ్యక్తులే ముఖ్య మంత్రి స్థానంలో ఉన్నారు, లెక్కలన్నీ ఏనాడో బయట పెట్టి ఉండే వారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 19. హైదరాబాదుకు ఎవ్వరూ ఖర్చుపెట్టలేదా? మరి హైదరాబాదు ఆదాయం, హైదరాబాదు ఆదాయం అనేది ఎక్కడ్నించి వస్తున్నది? మనందరం కట్టే పన్నుల దగ్గర్నించీ అన్నీ అక్కడికే పోతున్నాయి. రాష్ట్రం నలువైపులనుంచీ ఆదాయం, రాష్ట్రం పేరుతో కేంద్రం ఇచ్చే నిధులు, విదేశాల్నించి తెచ్చుకున్న అప్పులు, ప్రైవేటు వ్యక్తులు పెట్టినపెట్టుబడుల నుంచి వచ్చే రకరకాల పన్నులు మొదలైన ఆదాయాలు అందరివీ.
  ఏ లెక్కలైనా బయటపడలేదంటే ఆ యా నేతల స్వార్థాల వల్లనే. నిజాలెప్పటికైనా బయటికి రాకమానవు.

  ప్రత్యుత్తరంతొలగించు
 20. నిరాశా నిస్పృహలు తప్ప
  చివరికేం మిగలవు ...

  కనుచూపు మేర అంధకారం
  తప్ప వెలుగు జాడెక్కడ?

  ప్రత్యుత్తరంతొలగించు
 21. వేచిచూడడమే.
  మీ టపాలు చదువుతూ ఉంటాను.

  ప్రత్యుత్తరంతొలగించు