Loading...

9, ఏప్రిల్ 2014, బుధవారం

ఆనందతాండవమా

           కూచిపూడి నడకల కన్నా భరతనాట్యపు సొబగులకన్నా ఏదో ప్రత్యేకత నింపుకున్నట్టుగా తోచిందీ చెట్లు నాట్యమాడుతుంటే. చక్కటి చల్లగాలికి ఆనందాన్ని నింపుకున్న తరువు శైలూషిగా ఆనందతాండవమాడుతుంటే ప్రపంచమంతా ప్రేక్షకపాత్రవహిస్తుందీ ప్రకృతి విన్యాసాలకు.
                               గాలికి తోడు కాస్సేపు పెద్దపెద్ద చినుకులతో వాన.
              మిన్నేటి వాగులో జలకాలాడి నిన్నటి కళ్యాణపు వేడుకలో ఆకాశపు పందిరిలో మన రామయ్య ,సీతమ్మ పోసుకున్న తలంబ్రాలే ముత్యపు బిందువులై, తీయని పానకపు చుక్కలై ఇలా ఈ రోజుకు నేల వరకూ పడుతున్నాయా!
                   లేక ఆకాశమ్మ లాలలు పోస్తుంటే తరుబాలలు అమ్మా వద్దమ్మా అయ్యో కళ్ళలో పడిందంటూ చేతులల్లాడిస్తూన్నాయా!
                   నిన్నంతా కదలకుండా శిలలై , శిల్పాలై , చిత్తరువులై నిలచిన ఈ చెట్లల్లో ఏ ప్రాణాలు ఈ చలనాలు తీసుకొచ్చినాయో, క్షణమాగక, మబ్బులు ఉరుముల దరువులకు లయబద్ధంగా ఆడుతున్నాయే, ఇదేం వింతో!
             కుండలో నీళ్ళకు అమ్మ బెల్లం మిరియాల పొడి కలిపి పానకం చేస్తే నీళ్ళు తియ్యగా, పుష్టికారకంగా తయారుచేసి ఇచ్చినట్టు,
             అన్ని జలాశయాల మంచినీళ్ళు, ఉప్పునీళ్ళు తీసుకొని మాయా మంత్రం చేసి ఎండమ్మ ధరణీబాలకు తియ్యటి పుష్టికారకమైన అన్ని ప్రత్యేకతలున్న వాననీటిగా చేసిచ్చి బలవర్ధకం చేసినట్టే కదూ!
                      తియ్యా తియ్యని వానా చినుకుల్లో
                     చెయ్యీ  కలిపే చిన్న చేతుల్లో
                     సయ్యాటా లెన్నో ఆడే కోకిల్లో
                     వయ్యారాలు చూద్దాం రారండో!
             
                            

2 వ్యాఖ్యలు:

  1. లక్ష్మీదేవి గారికి
    నమస్తే.
    "ఈనాడు" దినపత్రిక గ్రూప్ నుంచి "తెలుగు వెలుగు" పత్రిక వెలువడుతున్న సంగతి మీకు తెలిసిందే. తెలుగు వంటకాల తయారీ విధనాలను తెలుగులో వివరిస్తున్న మంచి వెబ్ సైట్లు, బ్లాగుల గురించి పత్రిక మే నెల సంచికలో వ్యాసం ఇస్తున్నాం. అందులో మీ బ్లాగు (సీమవంట) గురించి కూడా ప్రస్తావిస్తున్నాం. ఆ వ్యాసం కోసం కొన్ని వివరాలు కావాలి. teluguveluguedit@gmail.com కు మీ మెయిల్ ఐడీ పంపగలరు.

    ధన్యవాదాలతో

    శైలేష్ నిమ్మగడ్డ
    సీనియర్ సబ్ ఎడిటర్
    తెలుగు వెలుగు

    ప్రత్యుత్తరంతొలగించు
  2. శైలేశ్ గారు,
    ఈ రోజే తెలుగువెలుగులో నా వంట బ్లాగు గురించిన వివరాలు చూసినాను. ధన్యవాదాలు. మీకూ, వ్యాసకర్తకూ, బ్లాగు చదివేవాళ్ళకూ.

    ప్రత్యుత్తరంతొలగించు