Loading...

27, మార్చి 2014, గురువారం

వెలుగు జిలుగులు


                      
1. కం. మనవగు మాటల, పాటల
మనవగు చక్కని కథలను మరిచితిమయ్యో!
మనదగు భాషనుఁ మరచిన
మనమిక మీదను భవితను మరి గాంచెదమా?

2. ఆ. మేలు పఱచినట్టి మేలిమి బంగరు
భాషఁ దాను విడిచె; భాష యందు
బోధఁ జేయలేదు, బుద్ధి గఱప లేదు;
సంతు నిప్డు దిట్ట సబబు కాదు.

3. కం. సంస్కారంబుల పెంపున
కాస్కారములేని భౌతికమయిన విద్యల్
తస్కరులఁ జేసె; తుదకు తి
రస్కారముఁ బొందగఁ దలరాతల్ గనుమా!

4. తే. బయటి పలుకులె త్రొక్కెను భాష గళము
తెలుగు పలుకుల కర్థము తెలియదిపుడు
కలల లోకము విడువుము కనులు తెఱచి
నేటి రాజ్యపు తీరున నిజముఁ గనుము.


5. తే. ఆట పాటల నడకల యాట వెలది
తేటదనమలరించును తేటగీతి
సుందరమ్ముగ సాగెడి సులభ కంద
ములు మనంబులఁ గూర్చును ముదములింక.

6. కం. విశదపు వర్ణనఁ జేయగ
నిశితమ్ముగను పరికించి నిపుణతతోడన్
కుశలము సాగెడి సీసము
వశమయినయెడల సుఖంబు పఠితకుఁ గూర్చున్.


7.  ఉ. కందము, నుత్పలమ్ములును, కౌముది, చంపక, తేటగీతి యా
నందము గాను సాగెడిది యాటవెలందియు, సీసపద్యముల్
చందము నేర్చి పద్యముల చక్కగఁ జెప్ప తెనుంగునందునన్
సుందరమైన పోకడల సొంపగు మాలిక తల్లి కంఠమున్.

8. మ. పలుకుల్ తేనెల ధారలై కురియగా వాగ్దేవి యాశీస్సులై
కులుకుల్ హంసల గెల్వగా, గజములున్ క్రుంగెన్ గభీరమ్మునన్
తళుకుల్ తారల మించునిద్ధరణి యాంధ్రంబన్నహో లెస్సగా
పలికెన్ రాయలు నాడు; నేటికి మహా భాగ్యంబదే యెంచగా.

9. కం. భాషది కాచును నిన్నున్
భాషనుఁ గావుము నరుండ! భవితలు నీవౌ
బాసల్ చేయుదమిప్పుడు
"భాషను విడువము విదేశి భాషలకొఱకై".

10. తే. స్వంత పలుకుల నాడిన స్వంతదేశ
ముననె శిక్ష విధించిన ముప్పుగాదె?
పాఠశాలల జరిగె నీ పగిది నేడు
తెలుగునాటను వింతలఁ దెలిసికొనుడు.

11. చం. తమిళగమన్న దేశమునఁ దాను జనించెను గీతరాజుగాన్
విమలుడు, రామభక్తుడుగ వెల్గి తెనుంగున పాడె కీర్తనల్;
తమదగు రాజ్యమందుననె ధైర్యము వీడిన బంటులై యిటుల్
శ్రమయని మాతృభాషవిడిరంచన నమ్మగ శక్యమేరికిన్?


12. శా. గంగాతీరమునాది దేవుడయి యా కామేశుడున్నట్టుగా,
బంగారమ్ము లతాంత గంధములతో భాసిల్లుచున్నట్టుగా,
సింగారించిన మోముపై నగవులే సింగారమైనట్టుగా
హంగుల్ రంగుల కావ్యమాలఁ దెనుగాహ్లాదమ్ములన్ పంచదే?


13. ఆ. భారతమ్మునిచట పామర పండిత
జనులకెల్లరకును చాలనింపుఁ
గలుగ నన్నయార్య, కవి తిక్కనార్యుండు,
యెఱ్ఱనాదులండ్రు యెఱుకఁ గలిగి

కమ్మనైన రీతి కావ్యము సేయగ
ధన్యులైతిమింక తమ్ములార!
నిత్యపూజనీయ నిర్మల హృదయులు
 పుణ్యభూమియందు పుట్టినారు.

14. కం. కమ్మటి వీణానాదము
తుమ్మెద ఝుంఝుమ్ము దేవతుంబురగానమ్
కొమ్మల కోకిల పలుకులు
బమ్మెర పోతనుడి రాత బాగుగ నమరెన్.


15. కం. మేరు నగపు గంభీరము
కారపు నుడికారముండు కమ్మటి రచనల్
తీరది శ్రీనాథునిదౌ;
లేరీనాటికిని మిన్న; లేరొకరైనన్.

16. కం. మన్నుకు మిన్నుకు నడుమన
నెన్నో విషయములనేర్చు ; హెచ్చనడ,తడే
యున్నత విద్యాభ్యాసం
బన్నను ముందుగనె స్వంత భాషను విడుచున్.

17. తే. నాగరికలటంచును నవతయంచు
తనది యన్నది విడిచెను దారి తప్పి
యువత పట్టెను పెడదారి యునికి విడచి
యునికి గోలుపోయిన నింక నూపిరేది?

18. ఆ. మ్రొక్కులిడుదు నమ్మ మురిసిన మనమునఁ
జక్కనక్కరాల చందనమ్మ!
యలిగి తొలగ బోకు, యమ్మవు ; మాదగు
భాష నిలిచి వెలుగ పలుకుమమ్మ!

19. ఆ.ఇంట బయట నిన్ను నిత్తఱి మఱచిన
కోపమింక మదినిఁ గూడదమ్మ!
తప్పులెన్నబోకు దయకురిపించుము
మాదు పలుకులందు! మమ్మునేలు!


20. సీ. తేనియలూరుచుఁ దేటగఁ దోచును
                 తీయనిదగు మన తెలుగుభాష
గలగల పారుచు కదములు తొక్కెడి
            యేరుల నగవట యిచటి భాష
అందము చందము నందరి మనసుల
         విందులు చేయుచు వెలుగు భాష
చూసెడి వారికి చూపులకింపగు
         యక్కరరూపము యమరు భాష

21. తే.పలుకు చక్కెర గుళికల పగిదియేను
పొరుగుభాషల యందునుఁ బొందె మెప్పు
పామరులును పండితులును బాగుబాగు
యనగ కీర్తిని పొందిన యమృతభాష.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి