Loading...

9, ఫిబ్రవరి 2014, ఆదివారం

- ప్రగతి ప్రతిష్ఠ రెండూ శూన్యం -

        కష్టించి పనిచేసే ఉత్సాహవంతులైన ప్రజల స్వభావాన్ననుసరించి మన రాష్ట్రాలన్నీ ప్రగతి పథంలో ముందుకుపోవలసినవే. కానీ సంకుచిత రాజకీయాల వలన ప్రజల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపు కునే రాజకీయనాయకుల వలన ఏనాడో రాష్ట్రప్రగతి ఆగిపోయింది. ప్రగతి కి సంబంధించిన కొత్త ఆలోచన, కార్యాచరణలటుంచితే, పరిపాలనాగతమైన పనులకే దిక్కులేకుండా పోతున్నది. కనీస అవసరాలైన శాంతి భద్రతలు, రహదారి నిర్వహణలు, తిండి గింజల ఉత్పత్తిలో వస్తున్న ఆటుపోట్లకు సహాయసహాకారాలు, ముందస్తు చర్యలు కూడా మూలబడిపోతున్నాయి.

         గుప్పెడు రాజకీయనాయకులకు దక్కే మంత్రి, ముఖ్యమంత్రి, వివిధ సంస్థలకు కార్యదర్శి, అధ్యక్ష పదవులు దక్కడం తప్ప సామాన్య ప్రజల జీవితంలో విభజన కానీ ఇటు సమైక్యత కానీ తీసుకొచ్చే మార్పు ఏమీ లేదు. లక్షల ఉద్యోగాల వంటి మబ్బుల్లో నీళ్ళు చూపించి కుండల్లో నీళ్ళు ఒలకబోయిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఒక ప్రాంతంలో కొత్త రాజధాని, మిగిలిన వసతులు ఏర్పరచడానికీ, ఇంకొకప్రాంతంలో ఇప్పుడున్న రాజకీయ పదవులన్నీ కొత్తగా సృష్టించి అవి ప్రజానీకాన్ని దండుకొంటే భరించడానికీ ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది? అదంతా ఎక్కణ్ణించీ ఊడిపడుతుంది? కేంద్రం ఇస్తానని మాట ఇచ్చినవన్నీ ఇంతవరకూ ఎన్ని అమలయినాయి? ఎంత వరకూ అమలయినాయి? బయటి దేశాలనుంచీ ప్రపంచ బాంకు ల నుంచీ తీసుకొచ్చిన ఋణాలన్నీ ఇంతవరకూ ఎన్ని తీరినాయి? భవిష్యత్తులో ఎట్ల తీరబోతున్నాయి?

     ఇదంతా ప్రక్కన బెడితే, ఇప్పుడే కేంద్రం కాళ్ళు పట్టుకోవడం తప్ప మాట చెల్లించుకోలేని పరిస్థితి ఉంటే రెండు ప్రాంతాల్లోనూ ఎంపీల సంఖ్య తగ్గినాక రాన్రానూ భిక్షమెత్తాల్సి వస్తుంది రెండు రాష్ట్రాలూ. మనకు మనమే ఇంతగా ద్వేషించుకుంటూ మన మీద చూసేవారికి గౌరవం ఉండాలనుకోవడం మూర్ఖత్వమే. ప్రక్క రాష్ట్రాలన్నీ వాళ్ళలో వాళ్ళకేం విభేదాలున్నా కేంద్రంతో గొడవ వచ్చినా, ఇంకెవరితో వచ్చినా అంతా ఒక్కటౌతారు. అందుకే విదేశీ సంబంధాల విషయంలో రాష్ట్రాలకు హక్కు లేమీ లేకపోయినా, ఇటు అరవ్వాళ్ళు శ్రీలంక కు వెళ్ళగూడదని ప్రధానిని శాసించగలరు. కన్నడులు ప్రత్యేక రైల్వేజోన్ తెప్పించుకోగలరు. బెంగాలీలు ప్రక్కదేశానికి పారే నదుల ప్రాజెక్ట్ ల విషయంలో తమ మాటే నెగ్గాలని పట్టు పట్టగలరు. మనం తప్ప ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద అవార్డ్ లు తమ రాష్ట్రాలకు వచ్చేటట్లు చూసుకోగలరు. మనమే............మీ లేదు.

           ఒక ప్రాంతం వాళ్ళు మమ్మల్ని చీల్చేయండి, మీ కాళ్ళు మొక్కుతానంటే, మమ్మల్ని చీల్చకండి అంటూ ఇంకోప్రాంతం వాళ్ళు కాళ్ళు పట్టుకొని చూపించినారు. ఎందుకింత దిగజారుడు తనం? ఏ ప్రాంతీయపార్టీ / జాతీయపార్టీ అయినా  ఏ నిర్ణయం తీసుకోవడానికైనా వాళ్ళకెంత లాభం , ఎన్ని ఓట్లు వస్తాయనో , ఎంత మైలేజీ/ మంచిపేరు దక్కుతుందనో చూస్తారు తప్పితే విభజనతో వృద్ధి అనో సమైక్యంతో స్వాంతన అనో చేయరని అందరికీ తెలిసిందే . మరెందుకీ అడుక్కోవడాలు?
    
           ఎవరు ఎంత కాదన్నా తెలంగాణలో మొదలు పెట్టినది పార్టీలు/ ఉద్యమ నాయకులైతే ప్రజలు వారితో కలిసినారు. సమైక్యాంధ్ర కోసం ప్రజలు మొదలు పెట్టి ఉద్ధృతంగా ఉద్యమం చేసి పార్టీల, నాయకుల మెడలు వంచడానికి ప్రయత్నిస్తున్నారు అనేది నిజం.

              ఏదైనా వాళ్ళూ వీళ్ళూ కూడా ఉద్యమాలు చేసినారు, పట్టుదలలు చూపించినారు. మేం ఎందులోనూ తక్కువకాదని ఒకరికొకరు నిరూపించుకున్నారు. మరి ఈ ఉద్యమోత్సాహం, ఈ పట్టుదల , ఈ కష్టాలు భరించే సహనం అన్నీ తమతమ సమస్యలు పరిష్కరించుకోవడంలో ఎందుకు చూపించకూడదు. అప్పుడు విభజన వల్ల దేశం మీద , రాష్ట్రాల మీద పడే అతి పెద్ద ఋణభారం తప్పుతుంది కదా! ఎన్ని వేల కోట్లు మిగులు ఉంటుంది! రాష్ట్రప్రజలు ప్రగతి , ప్రశాంతి, ప్రతిష్ఠ పొంది సంతోషంగా ఉంటారు కదా!

    నాలాంటి ఎంతమందికో అందరికీ తెలిసినంత సమాచారం, లెక్కలూ డొక్కలూ తెలియవు కానీ ఈ ప్రాథమిక విషయాలు అర్థమవుతున్నాయి. బాధ గా ఉంది. ఏం చేయలేక మౌనంగా చూస్తున్నాము.


కుత్తుకన్ తెగఁ గోయువారిని,క్రూర నీతుల నేతలన్
మత్తు మున్గిన నన్నదమ్ములు మాదిమాదని పోరుచున్
జిత్తులందిలు దోచువారిని , చేవతో నెదిరింపగా
సత్తు జచ్చి యిదో యటంచిటు స్వంత వారల నిట్లహో
కత్తికిన్ బలి యిచ్చువేళల కంటినీటికి కొంచెమే?
-------------------------------లక్ష్మీదేవి.
         12 వ్యాఖ్యలు:

 1. శూన్యాంధ్రప్రదేశ్ గా భారతదేశ పటం లో స్థానం సంపాదించటమే మన రాజకీయ నాయకుల అభీష్టం.

  Sent from http://bit.ly/f02wSy

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శూన్యాంధ్రప్రదేశ్ గా భారతదేశ పటం లో స్థానం సంపాదించటమే మన రాజకీయ నాయకుల అభీష్టం.

  Sent from http://bit.ly/f02wSy

  ప్రత్యుత్తరంతొలగించు
 3. >>పరిస్కరించుకోవటంలో ఎందుకు చూపించొద్దు?

  దశాబ్దాలుగా స్వా, బంధు, ప్రాంత స్వార్థం కలిగిన కొందరి స్వార్థం వలన ఇప్పుడు సిమాంద్ర ప్రజలు అనుభవించవలసి వస్తున్నది. మొసపోయినాము అనే భావనలో ఉన్న వారు కాలసి ఉండాలని పట్టుదల చూపించలేరు, అది మానవ సహజం. కాని కలసి ఉండాలి అనుకునే వారు కూడా ఆ పట్టుదల చూపించనే లేదు. విభజన వాదులను ఎల్లప్పుడూ ప్రథ్యర్తులుగానే చూసారు కాని సర్ది చెపుదాం అని ప్రయత్నించింది ఏనాడు లేదు.,

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నిజం. మోసపోయినామనే ప్రచారమే (నిజం కాదది) చేసుకుంటూ పోయేవాళ్ళకు దుమ్మెత్తి పోసేవాళ్ళకు ఇవతలి వాళ్ళతో మాట్లాడాలని ఉండదు. సమస్య ఉంటేనే వాళ్ళకు వెలుగు. పరిష్కారం కావాలని కోరుకోరు. కానీ కలసి ఉండాలనుకునే వాళ్ళూ చొరవచూపించి అన్ని రంగాల పెద్దమనుష్యులను పిలిపించి మాట్లాడాలనుకోలేదు. కనీసం ఉద్యమాలకు పిలుపు ఇచ్చేటపుడు కూడా శ్రీకాకుళం నుంచి అనంత పురం వరకూ అనే ఎందుకు అన్నారు అనేదే అర్థం కాలేదు. ఎందరు పాల్గొంటారో తెలంగాణ జిల్లాల్లో కానీ పిలవాల కదా? అందరికీ జరిగే నష్టం గురించి గట్టిగా మాట్లాడింది కిరణ్ గారొక్కరే.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. లక్ష్మిదేవి గారు, దయచేసి నా సమాధానాలు పెర్సనల్ గా తీసుకోవద్దు. సమైక్య వాదం తప్పు కాదు , నేను దాన్ని తప్పు పట్టను. సగటు సమక్య వాది చేస్తున్న తప్పే మీరు చేస్తున్నారు.

  >నాలాంటి ఎంతమందికో అందరికి తెలిసినంత సమాచారం, లెక్కలూడొక్కలూ తెలియవు
  >మోసపోయినామనే ప్రచారమే (నిజం కాదది)

  మీకు పెద్దగా సమాచారం లేదని చెపుతూనే 'మోసపోయామనే భావన' నిజం కాదని తేల్చేసారు. అసలు (తెలంగాణాలో)సమస్యే లేనప్పుడు కేవలం కల్పితాలతో ఇంత పెద్ద ప్రజా ఉద్య్యమంను ఇన్నీ రోజులు నడిపించలేరు. అందుకే తెలంగాణాలో మీకు సమైక్యవాదాన్ని వినిపించే పట్టుమని పదిమంది మేధావులు కూడా కనిపించరు. మీరు మోసపోయినామనేది నిజం కాదన్నారు కాబట్టి ఈ లింకు మీకు షేర్ చేస్తున్నాను http://bit.ly/1eKi370 మరియు http://bit.ly/1eKiiyX ఇలాంటివి ఇంకెన్నో ఉన్నాయి. సమైక్యవాదులలో ఇటువంటి విషయాలపై అవగాహన చాలా తక్కువగా ఉన్నదని నేను కలిసిన సమక్యవాదుల వలన నాకు అనిపించినది.

  >నష్టం గురించి గట్టిగా మాట్లాడింది కిరణ్ గారొక్కరే

  ఆయన ఎన్నో ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు, కాని ఈ నష్టాల గురించి మాట్లాడటం మాత్రం ఈమధ్య మొదలు పెట్టారు. అప్పుడు ఎందుకు మాట్లడలేదో, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మీరు ఇచ్చిన లంకెలో నష్టపోయిందెవరు అనే భాగం చూడలేదాండీ, తెలంగాణా వాళ్ళు మాత్రమే నష్టపోలేదు. అన్ని ప్రాంతాల వారూ నష్టపోయినారని ఉంది కదా! ఎన్నో చోట్ల మోసాలు కుట్రలు జరుగుతున్నాయి.మోసగించే వాళ్ళు, మోసపోయేవాళ్ళు ఉన్నారు. కానీ నేను ప్రచారం అనింది ఏమంటే పని గట్టుకుని కుట్రపన్ని సీమాంధ్రులు తెలంగాణా వారిని దోచుకున్నారు అని పేరు పెట్టి మొత్తం అందరినీ అంటున్నారు. దేశవ్యాప్తంగా ఈ పేరు నిలిచిపోదా? ఇంత ఉద్యమం నడిపించినవాళ్ళు ఆ యా మోసాలకు వ్యతిరేకంగా నడపాల కానీ, మేం మిమ్మల్ని ఉండనియ్యం, తరిమేస్తాం , పెన్షనర్లు కూడా ఉండకూడదనీ అనడం చివరకు దేశమంతా దోచుకుపోయిన బ్రిటిషు వారిని కూడా ఇంత హేయంగా చిత్రించలేదు. ఇప్పుడు తెలంగాణ ఎక్కువ అభివృద్ధి చెందింది, కొన్ని జిల్లాలు, హైదరాబాదు అందరి కష్టంతో అభివృద్ధి చెందినదాన్ని తెలంగాణ వాళ్ళు దోచుకొనిపోయినారు, కాంగ్రస్ సహాయంతో అని అంటే బాధ తెలుస్తుంది. కిరణ్ ని అర్థం చేసుకునే కెపాసిటీ నాకు లేదులెండి, వాళ్ళ రాజకీయ ఎత్తుగడలేమో . నేననింది మిగతా సీమాంధ్ర ఉద్యమకారులు అనని మాటను తెలంగాణ కు కూడా నష్టమేనని మొదట చెప్పినాడని మాత్రమే. ఓపికగా స్పందించినందుకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మళ్ళీ పత్తా లేకుండా పోయినట్టున్నాడు. అంతే అమాయకంగా కనబడ్డ వాళ్ళ దగ్గిర తెలివైన వాళ్ళలాగా అబధ్ధాలు చెప్పటంలో మాత్రం ఇరగదీస్తారు,గట్టిగా పాయింటు పడీతె చాలు తోక ముడవటం.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. నా బాధంతా కొందరు చేసిన మోసాలను అందరి నెత్తి మీద రుద్దేసినారనే. ఈ కొన్ని మోసాలు రెండు పక్కలా జరుగుతాయి. మనుషులున్న చోట మంచి చెడు ఉంటాయి. పని గట్టుకొని స్వార్థం కోసం విషప్రచారాలు చేసిన గుప్పెడు మందికి పశ్చాత్తాపం ఎప్పుడు కలుగుతుందో?

  ప్రత్యుత్తరంతొలగించు
 9. లక్ష్మి దేవి గారు,

  ఇలాంటి చర్చలు ఎంతకు తెగవు కాబట్టే నేను తిరిగి సమాధానం రాయలేదు. పైన ఒకడు నేను పత్తా లేకుండా పోయాడని అన్నాడు కాబట్టి మళ్ళి రాయవలసి వస్తుంది.

  మీరు చెప్పేది నాకు అర్థం అయ్యింది, కొందరు చేసిన మోసాలు అందరి నెత్తిన రుద్దటం తప్పే, అదే సమయంలో మీరు కొందరు మోసాలు చేసారు అని చెపుతూనే, అసలు మోసాలే జరగలేదని మిరే అంటారు. అది ఎలానో మీరే చెప్పాలి.

  నష్టం అందరికి జరిగింది అని పత్రికలో రాసారు, నిజమే, మరి ఏ ప్రాంతం ఎంత నష్ట పోయిందో ఎందుకు రాయలేదు? పనిగట్టుకొని తెలంగాణ లెక్కలే ఎందుకు రాసారు? ఒక వంద లేక వెయ్యి ఉద్యోగాలు అలా జరిగాయి అంటే అవినీతి అనుకోవచ్చు, ఒక ప్రాంతంలో ఉన్న 4-5 లక్షల ఉద్యోగాలలో 58 వేల ఉద్యోగాలు అన్యాయంగా పొతే ఎలా? విచారణకు ప్రభుత్వం సహకరించలేదని చెపుతున్నారు, అంటే అర కోర సమాచారంతోనే ఇన్ని వేల ఉద్యోగాలు అని తెలిస్తే సమగ్ర సమాచారం ఉంటె ఇంకెన్ని ఇలా బయట పడొచ్చు? అసలు ఈ రిపోర్టు బయటకు వచ్చినాక, ఈ విషయంపై ఇంత రబస జరుగుతుంటే దీనిపై తీసుకున్న చర్యలు ఏమిటి?

  దేశ వ్యాప్తంగా చెడ్డ పేరు రాదా అని అన్నారు, ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏముంది? ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడగానే 20 వేల తెలంగాణా ఉద్యోగాలలో చట్ట విరుద్దంగా సీమండ్రులను నియమించారు, అది GO36, తెలంగాణా వారు గొడవ చేస్తేనే అది బయటకు వచ్చింది, అలా జరిగినప్పుడు చెడ్డ పేరు రాలేదా? తెలంగాణా వారు గొడవ చేస్తే ఏర్పడిన కమిషన్ తెలంగాణా నిధులను చట్ట విరుద్దంగా సీమంద్రలో ఖర్చు చేసారని కేంద్ర ఏర్పాటు చేసిన భార్గవ కమిషన్ తేల్చింది, అలా అక్రమంగా సీమంద్రలో కర్చు చేసిన నిధులు తెలంగాణకు తిరిగి చెల్లిస్తామని అప్పటి ముక్య మంత్రి తెలిపారు, అప్పుడు దేశ వ్యాప్తంగా చెడ్డ పేరు రాలేదా? తెలంగాణ ఉద్యోగాలు సుమారు 60వేలకు పైగా చట్ట విరుద్దంగా పోయాయని తెలంగాణా వారు గొడవ చేస్తే నంద మూరి GO610 వేసాడు, అది ఇంత వరకు పూర్తిగా అమలు కాలేదు, అలాంటప్పుడు దేశంలో చెడ్డ పేరు రాదా? ఇప్పుడు ఈ గిర్గ్లాని రిపోర్టు. ఇలాంటి విషయాలలో నష్ట పోతుంది ఎవరు, లాబ పడుతుంది ఎవరు? ఆల్రెడీ కావలసినంత చెడ్డ పేరు రానే వచ్చింది కదా ? తెలంగాణా కలవక ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్తితి లేదు, అదే తెలంగాణా మిగులు నిధులతో ఉందని మొదటి SRC చెప్పిన మాటలు ఒక సరి గుర్తు చేసుకుంటే ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు వలన ఎవరు లాభ పడినారో మీకే అర్థం అవుతుంది. దశాబ్దాలుగా ఒక వర్గానికి వ్యేతిరేకంగా జరుగుతున్నా ఈ మోసాలను ఎవరు మాత్రం భరిస్తారు. 'సీమండ్రులు' అనే పద ప్రయోగం రాజకీయ పరిబాష, దాని అర్థం ప్రతి ఒక్క సీమండ్రులు అని కాదు కదా. మహా రాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ లు బాబ్లి కోసం గొడవ పడుతున్నారు అంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గొడవ పడుతున్నారు అని కాదు కదా.

  మరో సారి చెపుతున్నాను అసలు మోసాలే జరగలేదు, తెలంగాణా వాళ్లకు అబద్దాలు చెప్పి ఈ పరిస్తితి తీసుకొచ్చారు అని అధికులు అనుకోవటం వలెనే సమస్య పరిష్కారం దిశగా వెళ్ళలేదు. సమస్య పరిష్కరించే స్తానంలో ఉన్న సీమంద్ర నాయకత్వం ఆ దిశగా ప్రయత్నాలే చెయ్యలేదు, ఎందుకంటే సమస్య పరిష్కారం చెయ్యాలంటే ఆ మోసాలు బహిర్గతం అవుతాయి, సీమండ్రులు నష్టపోతారు. అందుకే.

  పెన్షనర్ ల గురించి మీరు చెప్పేది తప్పు, అలా ఎవ్వరు అనలేదు. తెలంగాణలో అక్రమంగా ఉద్యోగాలు చేసిన వారికి తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే అప్పుడు వారికి పెన్షన్ లు ఇవ్వము అన్నారు, అది తప్పేలా అవుతుంది? నన్నడిగితే అక్రమంగా ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వారినుండి వారి అక్రమ ఉద్యోగం నుండి సంపాదించిన జీతాన్ని వడ్డీతో సహా వసూల్ చెయ్యాలి.

  మరొక సారి, లక్ష్మి దేవి గారు, దయచేసి ఇవి పర్సనల్గా తీసుకోవద్దు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. ఈ చర్చలు తెగేవి కావని నాకూ తెలుసండి. అపార్థాల సృష్టి వల్లనే ఇంత జరుగుతుందని బాధ పడేదాన్ని కాబట్టి పర్సనల్గా తీసుకోలేదు.
  కొందరు కొందర్ని మోసం చేయడం జరిగి ఉండవచ్చనే సంగతుల్ని ఎవరూ కాదనలేరు. మొత్తంగా ఒక వర్గం ఇంకో వర్గాన్ని మోసం చేసిందనేది మాత్రమే అబద్ధ ప్రచారం అని నా ఉద్దేశ్యం. మొత్తం ఒక ప్రాంత ప్రజలు కలిసి కుట్రచేసి ఇంకో ప్రాంత ప్రజల్ని ముంచినారు, మోసం చెసినారనేది మాత్రం జరిగే అవకాశమే లేదు. అందరూ నష్టపోతే ఒక ప్రాంతం గురించి ఎందుకు వ్రాస్తున్నారన్నారు. అందుకే ఒక చిన్న గుంపు (పది కోట్ల తెలుగువారిముందు అది చిన్న గుంపే) స్వార్థంతో ఒక ప్రాంతం గురించే లెక్కలు తీసి హైలైట్ చేసి చివర్లో ఎక్కడో అందరికీ మోసం జరిగింది అనేది చెప్పీచెప్పనట్టు చెప్తారు. గొడవ చేసి ఎక్కువ లాభపడే ముద్దుల సంతానం మాదిరి ఇప్పటికే హామీలు, ప్రత్యేక నిధులు పొందినారు. పైన నిందలు వేస్తున్నారు. పెన్షన్ ఇయ్యడం గురించి కాదు నేను చెప్పినది, రిటైరైన వాళ్ళు కూడా ఇక్కడ ఉండకూడదు అనే అమానుషకరమైన పరుషవాక్యాల గురంచి. బాబ్లీ వంటి సమస్యల్లో కూడా అక్కడి ప్రజలందరిపైనా నిందావాక్యాలు, ద్వేషపూరితమైన వాక్యాలు పలకడం లేదు కదా ఎవరైనా ? ఇక్కడ మాత్రం అట్లా ఎందుకు జరుగుతున్నదనేదే నా బాధ. అక్రమం ఏదన్నా జరిగినా అది లంచగొండితనం, మేధను గుర్తించలేని మూర్ఖుల వల్ల జరిగింది కానీ పనిగట్టుకొని సీమ/కోస్తా/తెలంగాణ అనే భేదభావం వల్ల కాదు. ఈ భేదభావం ఒకానొక కుట్రవల్ల కృత్రిమంగా ఏర్పరచబడుతున్నది. ఓపెన్ మైండ్ తొ చూస్తే సమస్య పరిష్కారంఅవుతుంది కానీ ఒకవైపు ఉన్నవాళ్ళంతా ద్రోహులే అన్నట్టు చూస్తే ఎట్లా? స్త్రీవాదం వచ్చిన కొత్తల్లో మొత్తం పురుషజాతి మాకు ద్రోహం చేస్తున్నదని కొందరు ప్రచారం చేసినారు. ఇప్పుడిపుడే ఒకరికొకరు పూరకమని గ్రహిస్తున్నారు. ఈ కుట్రదారులు చేస్తున్న ప్రచారం యొక్క నిజానిజాలు సమాజం గ్రహించే రోజు రాకపోదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. కమీషన్లు ప్రభుత్వనిధుల గురించి మాట్లాడతాయి. ప్రైవేటు నిధులు? మొత్తం ఒకే రాష్ట్రంగా ఉన్నపుడు అక్కడినిధులు ఇక్కడికి, ఇక్కడినిధులు అక్కడికి ప్రవహించి ఉండవచ్చు. ఎన్ని చెప్పినా సీమ కన్నా అభివృద్ధి చెందిన జిల్లాలు కొన్ని ఉన్నాయని తెలుసు కదా. ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని అభివృద్ధి చెందినాయి. అదేపనిగా ఎవరూ ఎవర్నీ నాశనం చేయలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు