Loading...

31, జనవరి 2014, శుక్రవారం

పోషణ , రక్షణ, శోధన

              మన దేశం మనడానికీ, ప్రగతి పథంలో చనడానికీ ముఖ్యమైన మూడింటిని నిర్లక్ష్యము చేయకుండా ఉండడం ముఖ్యము. ఈ సంగతి అందరికీ తెలిసినదే, కానీ విపరీతమైన నిర్లక్ష్యము జరుగుతునే ఉంది. మనిషి ఎంత అభివృద్ధి సాధించినా తన వంటి రోబోట్ కనిపెట్టి ప్రతిసృష్టి చేసినానని మురిసి పోయినా, గ్రహాంతరాలను దాటినా, ఉపగ్రహాలను తయారుచేసినా చివరి వరకూ అతనికి కావలసినది పిడికెడు ఆహారము. అది లేక తపించడం జరగరాదు. కాబట్టి సేద్యాన్ని ఎప్పుడూ ఏ దేశమూ తక్కువగా చూడకూడదు. అదీ అనుకూల పరిస్థితులున్నపుడు. మనదేశం లో సేద్యానికి అనుకూల పరిస్థితులున్నాయి. మనదేశం ఎడారి కాదు, మంచుముద్ద కాదు. సమశీతోష్ణస్థితి ఉన్న బంగారు భూమి. వరదలు, కరువు లేదనడం లేదు. కష్టాలూ, నష్టాలు రావనడం లేదు. ప్రతి రంగంలోనూ ఉన్న కష్టనష్టాలను, అనుకోని పరిస్థితులనూ దాటడానికి ఎట్లయితే ఒక పనివిధానం, స్ట్రేటజీలు ఏర్పరచుకొని పని ఆగకుండా చూసుకుంటామో అదే విధంగా వ్యవసాయాన్ని కూడా చూసుకోవాల. ప్రతి సంవత్సరమూ వ్యవసాయ బడ్జెట్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలే గాని ఎన్నికల ముందు ఋణాలు మాఫీ చేయడాలు, రైతు ఆత్మహత్యలు ఎక్కువైనపుడు పరిహారాలు చెల్లించడం కాదు.
               బాంకుల్లో ఋణాలు మంజూరు చేస్తామని రాజకీయనాయకులు ఊదర గొడతారు. కానీ నిజానికి ఒక రైతు బాంకు ఋణంపొందాలంటే సవాలక్ష షరతులు పెట్టి తిప్పుకుంటాయి బాంకులు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోదు. నీటిపారుదల మంత్రులు, వాణిజ్య శాఖల మంత్రులు, ఆర్థిక శాఖ మంత్రులు, పర్యావరణ మంత్రులు , పశుసంవర్ధక శాఖ మంత్రులు ఒక జట్టుగా ఏర్పడి సమగ్ర వ్యవసాయ విధానాన్ని యంత్రాంగ సాయంతో రూపొందించుకోవాల. ప్రతి సంవత్సరమూ వరదలు ఎప్పుడొస్తున్నాయో పరిశీలించి అంతకు ముందు పంట కోతలు పూర్తి అయ్యేటట్లు నీళ్ళు విడిచేపనులు, విత్తనాలు , ఋణాలు అందించే పనులూ సక్రమంగా అమలు అయ్యేటట్లు విధాన స్థాయిలో ,క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల, పశుపెంపకం ద్వారా రైతు స్వయంసమృద్ధి పొందేటట్లు ప్రోత్సహించాల. ఎవరూ చెప్పక్కర్లేకుండా రైతులు మొదట పశువులను పెంచుకోవడం అదీ మొదట్లో ఉండేది. సేద్యమంతా యంత్రప్రాధాన్యత పెంచడం, పశువుల పెంపకాన్ని అనాగరీకంగా యువతరం ఫ్యాషన్ వల్ల చూడబడడం వల్ల తగ్గిపోయింది. దాంతో పంట నష్టాలను తట్టుకునే ఒక మంచి సపోర్ట్/ శక్తి రైతునుంచీ తీసివేసినట్లయింది. దాంతోపాటు పంటను మంచి ధరకు అమ్ముకోవడానికి పంట ధరను రైతుసంఘాలు నిర్ణయించనీయాల. దళారుల ఆధిపత్యాన్ని తగ్గించి ప్రతి ఊళ్ళో సామూహిక గోదాములు ఏర్పాటు చేయాల. వేలకేజీల టమోటాల పంట వచ్చినపుడు మనకు ఐదు రూపాయలకు కేజీ దొరికితే సంబరపడతాము. ఆ సమయములో పండించిన వారికి కేజీకి అర్థ రూపాయి కూడా రావడం లేదు. ఆ సమయంలో కొంత పంటను నిలవజేసే సామర్థ్యాన్ని పెంచినట్లయితే, రైతు,కొనేవాడు కూడా నష్టపోకుండా ఉంటారు.

       తిండి తర్వాత మనిషికి కావలసినది రక్షణ. సరిహద్దులు కాపలా కాసేవాళ్ళను, సమాజాన్ని కాపలా కాసేవాళ్ళను తేలికగా చూడడం మంచిది కాదు. వాళ్ళు ఇరవై నాలుగు గంటలూ పని చేయబట్టే మనము సురక్షితముగా ఉన్నామని మరచిపోకూడదు. ప్రమాదం జరిగినపుడు వారు పని చేయలేదని నిందిస్తామే కానీ, ప్రమాదం జరగనన్నాళ్ళూ వారి పని సక్రమంగా ఉన్నందువల్లనే ప్రమాదం రాలేదని గమనించము. రక్షణ వ్యవస్థ సరిహద్దు వద్దనూ, లోపలనూ కూడా అంటే సైనిక వ్యవస్థనూ, పోలీసు వ్యవస్థనూ పటిష్ఠం చేయడానికి మానవవనరుల శాఖామంత్రులు, ఆర్థికమంత్రులు, విద్యాశాఖమంత్రులు, నియామకాలు జరిపే సంస్థలతో కలిసి ఒక జట్టుగా ఏర్పడాల. చదువుకునేటప్పుడే ఐఐటీకి లక్ష్యాలు పెట్టుకున్నట్టు రక్షణ వ్యవస్థలో చెరాలనుకునే వాళ్ళూ ఉంటారు. వారిని గుర్తించి వారికి డిగ్రీలతో పాటే ఇంటెగ్రేటెడ్ కోర్సులు చేసే అవకాశం కల్పించాల. ఇప్పటికే సైన్యం లో చేరడానికి పది, పన్నెండు చదివినవాళ్ళను కొన్ని పరీక్షల ద్వారా ఎన్నిక చేసుకొని సైన్యంలో చేరేముందు ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సులు చేసి అక్కడే ఉద్యోగంలో చేరేవిధంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నట్టే పోలీసు వ్యవస్థలో కూడా ఏర్పాట్లు ఉండాల. చిన్నతనం నుంచే ఆ లక్ష్యం ఏర్పరచుకొని అంకిత భావంతో పనిచేసే పోలీసు వ్యవస్థ ఉండాల మనకు. అంతే కానీ గుమాస్తా ఉద్యోగాలకు, అప్లై చేసినట్లే అర్హతలు సరిపోతే, ఏ ప్రకటనలూ రాక పోలీస్ ఉద్యోగాల ప్రకటనలు చూసి చేరడం మంచిది కాదు. ఇది ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తుంది. లక్ష్యం , అంకిత భావం లేకపోయినా , అసలు ఇష్టం లేకపోయినా ఏ ఉద్యోగమూ రాలేదని ఉపాధ్యాయులుగా చేరుతున్నవారు రెండు మూడు తరాలను నాశనం చేస్తున్నారు. ఈమధ్య టైమ్ పాస్ కోసం , సొంతం గాడబ్బులు సంపాదిస్తేనే సమానత్వమని భావించే కలిగిన ఇంటి ఆడవాళ్ళూ కూడా ఉపాధ్యాయ వృత్తిలో చేరి సమాజానికి ద్రోహం చేస్తున్నారు, అంకితభావం లేకుండా పని చేసే స్వభావం వల్ల. అంకితభావం అంటే పని పూర్తి చేయడం కాదు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్ది తీరాలన్న లక్ష్యం ఉండడం.

          తిండి, రక్షణ దొరికిన తర్వాత మనిషి ముందుకు సాగే పరిస్థితి ఏర్పడుతుంది. దానికి ముఖ్యమైనది పరిశోధన. ఈ రంగానికి తగిన ప్రోత్సాహం సమాజం , ప్రభుత్వం ఇచ్చి తీరాల. అదికూడా మనిషి సౌకర్యాల పెంపుదల కోసమే కాకుండా అత్యవసరమైన విషయాల లో శోధనారంగం పరిశ్రమించేటట్లు చూసుకోవాల . ఇప్పుడు మన దేశం లోని యువత అంతా సాఫ్ట్వేర్ రంగంలో నిష్ణాతులు. అంటే ఏమిటి చేస్తున్న పని ని సులభతరం చేసే ప్రోగ్రామింగ్స్, కమ్యూనికేషన్ రంగం లో విపరీతమైన వృద్ధి సాధించడం ద్వారా మనిషి కాలక్షేపం చేసే సాధనాల ఇన్వెన్షన్స్ మాత్రము విపరీతంగా పెరుగుతున్నాయి. అంటే రకరకాల సాఫ్ట్వేర్ ల ద్వారా మనిషి ఒక పనిని దేశం/ప్రపంచం మొత్తం ఒకేసారి ఎట్లా చేయవచ్చనే విషయాలు, ఎంత తొందరగా ఎంత పెద్దపని చేయగలమన్న విషయాలు, ఫోన్, టీవి, నెట్ వంటి వాటిల్లో కొత్తకొత్త రకాలను కని పెట్టడం లోనే మునిగి తేలుతున్నారు. ఇవి మంచివే కాదనడం లేదు. కానీ అదే ప్రాధాన్యత మనిషి మనుగడకు అత్యావశ్యకమైన రంగాల్లో కూడా ఉండాలంటాను. ఇవి అన్నీ లేకపోయినా, కొద్ది మాత్రం ప్రగతి సాధించినా మనిషి మనుగడ సాగుతుంది. కానీ పంటలు పండడానికీ, నష్టపోకుండా ఉండడానికీ/ రక్షణ కు సంబంధించిన అత్యవసరమైన ఆధునిక పరిజ్ఞానాన్ని సంపాదించడానికీ/ శోధనా రంగానికి అన్ని ప్రాంతాలలో యువతను ప్రోత్సహించడానికీ అవసరమైన ప్రయత్నాలు శోధనా రంగంలోనే జరగాలంటాను.

        సేద్యరంగము ఆమూలాగ్రంగా రక్షింపబడకుండా పైపై మెరుగుల వంటి ఋణమాఫీలు, ఆత్మహత్యలప్పుడు పరిహారాలు వట్టి జనాకర్షక పథకాలు.
         రక్షణ వ్యవస్థకు సరిఅయిన మానవ వనరులను, ఆధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చకుండా ఉన్న కొద్దిమందినీ రాజకీయనాయకుల రక్షణకు వినియోగించడం, మంచుకొండల్లోని సైనికులకు కనీస వసతులకు నిధులు విడుదల చేయకపోవడం వట్టి స్వయం వినాశకారకాలు.
       శోధన రంగానికి తగిన ప్రాధాన్యత ఈయకుండా, నిధుల విడుదలకు సవాలక్ష షరతులు పెట్టి ఉత్సాహవంతులైన మేధావులు వలసలు పోయేటట్లు చేయడం/ లేదా పద్మశ్రీలు వంటి బహుమతులతో సరిపెట్టి ప్రయోగశాలల ఆధునికీకరణలు చేపట్టకపోవడం వంటివి వట్టి మూర్ఖ పాలనా లక్షణాలు.
          సేద్యము వలన  పోషణ, సైన్యము వలన రక్షణ, శోధన వలన  ప్రగతి సాధించి మన దేశం , మానవజాతి సమస్తమూ సుభిక్షంగా ఉండాలని ఆశిద్దాము.

4 వ్యాఖ్యలు:

 1. సేద్యము వలన పోషణ,సైన్యము వలన రక్షణ,శోధన వలన ప్రగతి చక్కని క్రమంలో సమాజ అభివృద్ధి దిశను చక్కగా వివరించారు లక్ష్మీదేవిగారు.ఈ పాటి జ్ఞానం ప్రభుత్వానికి ఉండక కాదు ,నిర్లక్ష్యం ...వారి స్వలాభాపేక్షతో ....దేశాభివృద్ధిని సర్వనాశనం చేసేస్తున్నారు .

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శ్రీదేవిగారు,
  నిజం. ఈ సంగతులు అందరూ పదే పదే చర్చించుకోవాలని అందర్లో అవగాహన పెంపొందాలని పిల్లలుగా మన మధ్య పెరిగే వారు ఈ అవగాహనతో ఇకమీదట నియమింపబడే అధికారులయినపుడు మంచి జరుగుతుందని నా అనుకోలు. అంతేకాక మనచుట్టూ ఉన్నవాళ్ళలో ఎవరైనా ఈ విషయంలో ముందడుగు వేసే వాళ్ళుంటే తెలిసీ తెలియకనో / మనకెందుకనో వెనక్కు లాగే వాళ్ళుంటారు . వాళ్ళకు అవగాహన రావాలని, మన ఇండ్లల్లో కూడా సైంటిస్ట్ అవడమేంటి, చక్కగా సాఫ్ట్వేర్ లోకి పోక అని ,ఎందుకు వ్యవసాయం ఆ కాస్తా భూమి కాంట్రాక్టర్ కిస్తే నాలుగు ప్లాట్లేసి మనకోటి ఇస్తాడంటూ చెత్త సలహాలు చెప్పేవాళ్ళకు అవగాహన కలగకపోయినా కనీసం మనం చెప్పేది తప్పేమో అని ఆలోచించాలని ఏదో..........ఆశండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. చాలా బాగా రాసారు లక్ష్మి దేవి గారు, అభినందనలు మరియు ధన్యవాదములు.

  ఐటి లో చేసే నా కజిన్ ఒకడు సైడు బిజినెస్ కోసం డైరి ఫాం పెడతానంటే కుటుంబం నుండి ఎంతో వఎతిరేకత వచ్చింది. మనం పశువులు పెంచటం ఏంటి, పాల వ్యాపారం చెయ్యటం ఏంటి, అందరిలో పరువు పోతుంది అని కొన్ని నెలలు పోరు పెట్టారు. ఈ చిన్న చూపు పోవాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ధన్యవాదాలండి. నెట్ లేక వ్యాఖ్య ప్రచురింపబడలేదు. మీరు ఏమీ వ్రాయడం లేదేం??

  ప్రత్యుత్తరంతొలగించు