Loading...

18, డిసెంబర్ 2013, బుధవారం

కోపాలు తాపాలు పైపైని యేసాలు !!

ఎఱ్ఱంగ సూరీడు చిఱ్ఱెత్తి యున్నాడు ఎందుకమ్మా?
చల్లంగ జాబిల్లి ఎదురెల్ల లేదంట సందెకాడ!

ఎఱ్ఱంగ సూరీడు చిఱ్ఱెత్తి యున్నాడు ఎందుకమ్మా?
చల్లంగ జాబిల్లి ఎదురెల్ల లేదంట సందెకాడ!

కోపాలు తాపాలు పైపైని యేసాలు అందమమ్మా,
లోలోని రాగాలు అట్టిట్టు సాగేటి బంధమమ్మా!
కమలాల కలువల్ల నవ్వుల్ల సొంపుల్లు తుళ్ళునమ్మా,
మమకారముండంగ శ్రమలన్నవింకేమి తోచునమ్మా!

ఎఱ్ఱంగ సూరీడు చిఱ్ఱెత్తి యున్నాడు ఎందుకమ్మా?
చల్లంగ జాబిల్లి ఎదురెల్ల లేదంట సందెకాడ!

పచ్చన్ని పైరుల్ల వెచ్చన్ని చేతులు చాచంగనే,
కుచ్చిళ్ళు సవరించి వెన్నెల్ల పైటలు పఱిచెనమ్మా!
సందెల్ల కలిసేటి చక్కన్ని జంటంట చూడరమ్మా,
మనసైన వరసైన వారెల్ల గొంతెత్తి పాడరమ్మా!

ఎఱ్ఱన్ని సూరీడు మటుమాయె నోయమ్మ  ఎందుకమ్మా?
చల్లంగ జాబిల్లి పిలుపందినాదంట సందెకాడ!