Loading...

17, జూన్ 2013, సోమవారం

దాశరథి యాత్రాస్మృతి


అట నివసింతమా సఖి! నవారుణపల్లవికారసాలని
ష్కుటముల గూడుకట్టికొని కోయిల కూయిడుచోట , కోటి సం
కటములు మాటువెట్టి, వడగాడ్పుల యేడ్పులు దాటి, శీతలో
త్కట జలపాత తీరముల కాలము వేలము వేసి, కొందమా?
 
  ఇంత అందమైన పద్యము దాశరథి కృష్ణమాచార్య గారి అగ్నిధారలోనిది. వారి యాత్రాస్మృతి లో ప్రతి స్మృతి కి ముందు ఇట్లాంటి పద్యరత్నాలను అగ్నిధార , మహాంధ్రోదయం, రుద్రవీణ మొదలగు వాటినుంచి ప్రసాదంగా ఇచ్చినారు.

యాత్రాస్మృతి లో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నప్పటి జ్ఞాపకాలను , నిజాం పాలనలో ఖైదులో పడిన కష్టాలను చదువుతుంటే గుండె చెరువయి కంటి గండ్లను త్రెంచుకొని బాధ బరువయి వరదౌతుంది. ఇందరు ఇన్ని కష్టాలు పడితే కదా ఈరోజు మనమింత ప్రశాంతంగా స్వాత్రంత్ర్యాన్ని పొందియున్నామని మనసు కృతజ్ఞతతో నిండిపోతుంది.
అంత కవీ నవకవులను ప్రోత్సహిస్తూ వ్రాసిన పద్యము చదివితే ఉత్సాహం పొంగి పొరలుతుంది.
త్వరపడు! భావసాగరము బాహువులెత్తుచు నీ శిరస్సుపై
పొరలుచు వచ్చుచున్నది; కవుంగిలిలో కవితాకుమారి సం
బరపడి నవ్వుచున్నది, గబాగబ కూర్చుము పద్యరాశి, అ
ర్థరహితమంచు పల్కెడి కళారహితున్ పడద్రోసి సాగుమా!

అంటూ భుజం తట్టుతారని తెలిసి ఆశ్చర్యమౌతుంది.

దెబ్బల కోరిచి, ఆకలి మరిచి వారెల్లరు వందేమాతరం పాడిన ఘటనలు చదివితే ఈనాటి తరపు నిస్తేజము వదలునేమో అనిపిస్తుంది. చెరసాలల్లో ధైర్యముగా పత్రికలు నడిపి దేశమును జాగృతి చేసిన వారి నిష్ఠ  తలిస్తే ఇప్పటి కాలము గడ్డుకాలమా అనిపిస్తుంది.

అన్నింటికన్నా నాకు తెలిసిన అమూల్యమైన విషయమేమంటే
1953లో కర్నూలు దగ్గరి అలంపురం (అష్టాదశశక్తిపీఠాల్లో మొదటిది) లో జరిగిన ఆంధ్రసారస్వత పరిషత్తు ఏడవమహాసభలు జరిగితే పాతికవేలమంది భాషాభిమానులు పాల్గొనడం. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (అప్పటి ఉపరాష్ట్రపతి) వచ్చి సభను ఆవిష్కరించినారు.
సభలో కన్నడ , మరాఠీ, హిందీ, సంస్కృత పండితులూ పాల్గొన్నారు. తెలుగునాట మూడుచెరగులనుంచీ మహామహులెల్లరూ పాల్గొన్నారు.
ఆ సభను గురించిన సమస్త విశేషాలూ చదివినపుడు ఆనందాశ్చర్యాలు కలిగినాయి.

తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ చదివి తీరవలసిన పుస్తకమిది.

చివరగా దాశరథి గారి శాంతి మంత్రమువంటి పద్యము ఉదహరించి ముగిస్తాను.
రాజకీయ సామ్రాజ్యములలో కాకపోయినా సాహిత్య సామ్రాజ్యములోనైనా శాంతి పరిఢవిల్లాలని కోరుతున్న పద్యమిది.

ఏనాడెవ్వడు కత్తితో గెలువలేదీ విశ్వమున్; ప్రేమ పా
శానన్ కట్టుము నాలుగుం బది ప్రపంచాలన్; మహాత్ముండిదే
జ్ఞానోద్బోధము సేసె; నెవ్వడు వినెన్? సాహిత్యసామ్రాజ్యమం
దైనన్ కొంతగ శాంతి  పాదుకొననిమ్మా, నీకు పుణ్యంబగున్.