Loading...

13, ఏప్రిల్ 2013, శనివారం

ఒడి సింహాసనం


నేనూ రాణినే.
              రాణి లాగా అమ్మఒడి సింహాసనం లో కూర్చుని హృదయసీమల సామ్రాజ్యాన్ని పరిపాలించాను. అమ్మ రథమై నాలుగేళ్ళు ఐదేళ్ళు వచ్చేవరకూ మోసే తిప్పింది కాలు కందకుండా. ఉప్ఫు ఉప్ఫు మని ఊది మరీ గోరుముద్దలు తినిపించి రాచమర్యాదలన్నీ చేయలేదా ఏమిటి? కరెంట్ పోయినప్పుడంతా వింజామరతో వీచేందుకు సిద్ధం పరిచారికగా. రాజగురువై సలహాలు, ఆదేశాలు కూడా తప్పకుండా పాలింపజేసేది కాదా!                    నన్ను నవ్వించడానికో, ఏడుపు వస్తే మరిపించడానికో నా చుట్టూ ఉన్నవారు ఆస్థాన నర్తకులుగా, విదూషకులుగా మారిన వేళలూ లేకపోలేదు. నేను వ్రాసిందే కావ్యం, గీసిందే చిత్రం అని అమ్మ నెత్తిన పెట్టుకున్న రోజులూ కోకొల్లలు. సాటి రాజులు, రాణులతో (మిత్రులే తాత్కాలిక శత్రువులుగా, స్వంతమూ దూరమూ అయిన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు , వదినమరదళ్ళు, బావమరుదులు సైన్యాలుగా) యుద్ధాలు చేసిన చరిత్రలూ ఉన్నాయిగా మరి.

                  స్వంత సైన్యపు తిరుగుబాట్లు, వెన్నుపోట్లు సరదాగా గుర్తు చేసుకోవడానికన్నట్లే అప్పుడప్పుడూ జరక్కుండా లేవు. చిన్నవారికి పాఠాలు చెప్పినా, పెద్దవారితో మొట్టికాయలు తిన్నా అవన్నీ వసంతోత్సవాల కోలాహలాలు కాదేం? రెండు మీటర్ల గుడ్డ ఎక్కువయ్యే వయసులో ఆరు మీటర్ల చీరలు చుట్టుకొని పట్టాభిషేకాలూ చేసేసుకోలేదా ఏం?

                    బడిలో మొదటి స్థానం సంపాదించి అయ్యవారి మెప్పు పొందడం రాజసూయయాగం చేసి చక్రవర్తిని కావడం కన్నా తక్కువ ఆనందమా ? పరీక్షలయిపోగానే సినిమాలకు కుటుంబసమేతంగా పోవడం ససైన్యంగా పచ్చటి అడవుల్లోకి సింహాల వేటకని గుఱ్ఱమ్మీద సవారీ చేస్తూ పోయినంత సంబరంగా ఉండదూ!
                                     అబ్బో పెద్ద గొప్పే , ఈ రాజ్యాలు మేమూ పాలించామంటారా, అనండి. కాదనేముంది గనక...............!!
                       
         

10, ఏప్రిల్ 2013, బుధవారం

వనకన్నియ!

ఒళ్ళంతా సుమవనియై అలంకరించుకొని
కళ్ళల్లో క్రొంగొత్త ఆశల చిన్ని చిన్ని చివురులు చిగిర్చగా,
మళ్ళీ మళ్ళీ వలరాజై అలరించే వసంతునికి
తుళ్ళిపడే మనసుతో స్వాగతమంటూ వనకన్నియ!!

పచ్చని చిలకల పలుకుతో, చల్లని నల్లని కోయిల పల్లవితో,
గోరింటలై పండినట్టున్న కొమ్మల కరములు చాచుతూ,
విరుల వింజామరలు వీచుతూ,
చిఱునవ్వులతో వసంతునికి స్వాగతమంటూ వనకన్నియ !!

సీతాకోకచిలుకల నృత్య విభావరికి ప్రాంగణమంతా రంగస్థలమై,
వరుణుని చేతినుంచి చినుకుల అక్షింతల ఆశీస్సులు పొందినదై,
కలసిన మనసులకాహ్లాదపు చల్లదనాన్ని,
విరహపు జంటల నిట్టూరుపుల వేడిమిని,
భరిస్తూ, తరిస్తూ, వసంతునికి స్వాగతమంటూ వనకన్నియ !!

భూమి పళ్ళెరము వాన చినుకుల కడిగి,
మామిడి పిందెల వడ్డన చేసి,
వగరుల చిఱుయలకల రుచి చూపిస్తూ,
విందులు ముందు ముందు ఉన్నాయని ఊరిస్తూ,
 మురిపిస్తూ, మైమరిపిస్తూ , వసంతునికి స్వాగతమంటూ వనకన్నియ !!