Loading...

30, మార్చి 2013, శనివారం

శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి కావ్యమంజరి (నవీన ప్రచురణ)


         శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి గురించి ఎంతో గొప్పగా విన్నాను కానీ వారి రచనలు నేను చదవగలనని అనుకోలేదు. అనుకోకుండా నాకు ఒక పుస్తకం కనిపించి ఆశ్చర్యపఱిచింది. వెంటనే కొని చదవటం కూడా అయింది.

        తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన ఈ పుస్తకం "కావ్యమంజరి" పేరుతో శాస్త్రిగారి ఐదు ఖండకావ్యములను కూర్చినది. శాస్త్రిగారు చరిత్రకు సంబంధించిన అనేక శాసనఫలకాల్ని, తాళపత్రగ్రంథాల్ని పరిష్కరించినవారని , సంస్కృతాంధ్రాలలో మేటి పండితులని , అన్నమయ్య గురించిన అనేక విశేషాల్ని వెలికి తీసినవారని విన్నాను. వారి పేరున తిరుమల  దేవస్థానం వారు ఒక వాఙ్మయపీఠాన్ని నెలకొల్పినారంట. ఇక వరుసగా వారి రచనలన్నీ పరిశీలింపబడటానికి , పరిశోధింపబడటానికి విద్యార్థులకు దొరకుతాయంట. ఇంతవరకూ శాస్త్రిగారి స్మారకట్రస్టు వారు సేకరించినవే ముద్రితములు, అముద్రితములు, స్మృతిఖండికలు,ఆశీర్వచనములు,అనువాదములు, గేయరచనలు, స్తుతిసుందరములు, శుభాశంసనములు ఇత్యాది అరవై శీర్షికల వరకూ ఉన్నాయని ముందుమాటల్లో తెలిపినారు.
           
            ప్రస్తుత పుస్తకములో కడుపుతీపు, విశ్వాసము, దివ్యదర్శనము, కపోతకథ, మూన్నాళ్ళముచ్చట అనే ఖండకృతులున్నాయి. సరళమైన భాషలో సుందరమైన పదాలతో అలరించగలిగే వారి రచనాధార నింగి నుండి నేలను చేరే వరకూ ఆగని వర్షపుధారలాగా  సాగిపోతూనే ఉన్నది.

             ఇందులో నాకు అత్యంతానందము చేకూర్చినది దివ్యదర్శనము అనబడుతాత్విక కవితాఖండిక. ఇందులో విజయవాడ ఎండలను గూర్చి వర్ణన చూస్తే ఆ కాలంలో కూడా ఇప్పటి ఎండలకు తక్కువేమీ లేవని తెలుస్తున్నది.

చండదీధితి నడుమింట మండుచుండె
నీ చెవినిగాడ్పు లాచెవి వీచుచుండె
మంగలములోని ప్రేలాలమాడ్కిఁ బ్రజలు
వేఁగుచుండిరి యానాఁడు విజయవాడ.

ఎంత యోగిపుంగవులకును కనరాని విజ్ఞాన సర్వస్వమును గురించి చెపుతూ...

చక్షుర్గోచరమైన యీ జగతికిం జాటై యనేకాద్భుత
ప్రేక్షకాలక్షితమెంతయేన్ గలదు తద్విజ్ఞాన సర్వస్వమున్
లక్షింపన్ దగు శక్తి మర్త్యులకుఁ గల్గన్ లేద,యద్దానఁ బ్ర
త్యక్షంబైనది నీకొకింత, యటమాటై యింక నేమున్నదో!

అను పద్యము కంటికి కనిపించేదే సత్యమను వాదించే వారికికొంత ఆలోచన కలిగించక మానదు. భౌతిక రూపమును ధరించిఉన్న అణుమాత్రకీటకాలనే మన చక్షువు దర్శించుటకు కొన్ని సాధనాలు, కొంత అభ్యాసము కావలసియున్నప్పుడు , సర్వవ్యాపి అయి ఉండి నీహారశూకమత్తన్వీ....అని వర్ణింపబడే ఆ విశ్వేశ్వరుని గురించి మన చక్షువు తెలుసుకోగలదా అని తెలుస్తుంది.

కృష్ణవేణి నదిని కృష్ణవేణ్ణగా వ్యవహరించారెందుకో మరి. అప్పట్లో అనేవాళ్ళేమో.

ఇంకా కడుపుతీపు గొప్పదనపు చివరి హద్దునూ, కుక్కవిశ్వాసము అసలు అర్థాన్ని, భారతీయ గృహస్థుకు నిర్దేశింపబడిన అతిథి సత్కారము చేయవలసిన గుణపు ఔన్నత్యాన్ని  తెలిపే రచనలు కూడా ఆపకుండా చదివించేస్తాయి. విశ్వాసం లో మాత్రము ప్లాట్ఫారము, రైలు , టికెట్ అన్న ఆంగ్లపదాలు నాక్కొంచెం గుచ్చుకున్నాయనే చెప్పకతప్పదు.వారి పద్యాలలో అందంగా లేనివి లేనేలేవు. అన్నీ అందమైనవే. కానీ ప్రసాదంగా కొన్ని యిక్కడ...

ఏల రాదయ్యెనో యిందాఁక నా సాధ్వి
గాఢాంధకారమ్ము క్రమ్ముకొనియె
కూలెనో యెందేని గాలివానకుఁ, దాళఁ
జాలనయ్యెద నాదు తన్విఁ బాసి
కువకువలాడుచు గూఁటిలో నాఱెక్క
చాటున శయనించు చానలేదె?
ననుఁబాసి తానెంత వనరుచున్నదియొకో
కటకటా! ప్రాణాన గలదొలేదొ!
ఏమి సేయువాఁడ నెచట వెదకువాఁడ
నేమి చిక్కు నాకిఁకేమి దిక్కు?
అదరుచుండె గుండె నిదురయు రాదయ్యె
నింపు మాలె నాదు కొంప గూలె.  (కపోత కథ)

ఆశ్చర్యంబుగఁ దోఁచె విద్యుతులు చెర్లాడెన్ విచిత్రంబుగా,
నైశ్చల్యమ్మొదవెన్ ద్యుతిస్థలికి స్వర్ణచ్ఛాయముల్ దాన న
త్యాశ్చర్యంబుగ నక్షరంబులును నయ్యై స్థానముల్ కన్పడెన్,
పశ్చాద్దృష్టములిందుకున్ సరిపడెన్, భ్రాంతత్వమిందేది యో? (దివ్యదర్శనము)

కృష్ణానది వరద చేసిన వినాశం గురించి.

కూలెం గొంపలు ప్రాపుదక్కి పఱచెం గోతండముల్ నీటికిం
బాలయ్యెన్ ధనధాన్య సంతతులు జీవంబింత గాపాడుకోఁ
జాలందుర్ఘటమయ్యెఁ బల్లెల కవస్థల్ హెచ్చెఁ గృష్ణామహో
ద్వేలస్ఫూర్జితదుర్నివారవిసరత్తీవ్రప్రవాహార్భటిన్. (కడుపుతీపు)


మొత్తంమీద శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి రచనలు చదివానన్న ఆనందంలో తలమున్కలై ఉన్నాను.