Loading...

26, మార్చి 2013, మంగళవారం

వర్ధిల్లు చల్లచల్లగా!!!

చందమామ వంటి మోములో మెఱిసే వెన్నెలమ్మ చిఱునగవుతో
నీలికళ్ళ మబ్బుల్లో మెఱిసే మెఱుపుల చల్లని చూపులతో
ముద్దులొలుకు తండ్రికి ముత్తెంపు సిరుల జోల పాడనా, రతనంపు ఊయలూపనా!
పన్నీరు చిలికి పగడాల ఆరతివ్వనా? బంగారు జలతారు పరుపునవ్వనా!
కంటిపాపాయి గా ఇంటవెలిగే తండ్రికి కాటుకచుక్క పెట్టనా!
దిష్టి పరిహారముగా రాలితే రాలనని నా కురుల దిప్పనా!
కేరింతలను దలచనా! కెందామరల అరికాళ్ళ ఎఱుపు దలచనా!
అమ్మా యని పిలిచినావనీ పరుగిడిన మనసు నాపనా!
తీగల్లో సాగు పిలుపులే నేడు తనివి తీర్చు పాట్లు చూడనా!
గోరుముద్దలూ, చిట్టికథలను పలుకు తేనెచినుకులనూ
 చిలుక పలుకలను చిలిపి చేష్టలందు మునిగి తేలగా
గడచినట్టి యా గతకాల తీపిగురుతులే గంగనీరుగా
బ్రతికించె నన్ను అమ్మగా , కంటి చెమ్మగా .
నా ఆయుష్షు ఇంక నీదిగా వర్ధిల్లు చల్లచల్లగా
పదికాలాలు శాంతి సుఖములు సకల ఐశ్వర్యములు
నిన్ను చేరగా, సతీసుతులతో సంతోషములు పండగా.