Loading...

22, డిసెంబర్ 2012, శనివారం

పల్లెల పిల్లల సరదా పాటలు
చిన్నతనంలో పిల్లలకు నోటి పాటలు, వాటికి అభినయం అంటే చిన్నగా చేతులతో ఆ యా పదాలను సూచిస్తూ , ఒక కాలు భూమి మీద ఆనించి, ఒక కాలుని చిన్నగా ఊపుతూ పాట పాడుతూ ఆడుతూ ఉండే ఆటలు నేర్పించే వారు. ఆ పాటలు ఛలోక్తులతో నిండి ఉంటాయి. ఎవరినీ ఎగతాళి చేయడం కాకుండా అందరూ కలసి నవ్వుకొనే విధంగా ఉంటాయి. ఇప్పుడు వచ్చే సినిమా పాటలను ఒకరిమీద ఒకరు పడుతూ చేసే అభినయంకన్నా అవి అయితే ఎంతో బాగుంటాయి.
అట్లా చిన్నప్పుడు మేం నేర్చుకున్న ఒక పాట.

వదినెకు ఒక్కసరి _ బిందెకు బిగుసరి
బంగారు జడకుచ్చుల మా వదినె
అహ బంగారు జడకుచ్చుల మా వదినె
||వదినెకు||
గాలికి ఎగిరె దుమ్మును జూచి
బుక్కాము అంటది మా వదినె
నా ముఖానికంటది మా వదినె
||వదినెకు||

సెరువుల ఉన్న కప్పల జూసి
బోండాలంటది మా వదినె
బోంచేత్తనంటది మా వదినె
||వదినెకు||

దోవల ఉన్న పామును జూసి
వడ్డాణమంటది మా వదినె
నడుము పెట్టమంది మా వదినె
||వదినెకు||

బండిని నడిపే గాసగాన్ని జూసి
నా మగడన్నది మా వదినె
అహ బండిలొ ఎక్కెను మా వదినె
||వదినెకు||

గాసగాడు అంటే జీతగాడు (పనివాడు) అని .
ఇది నెట్లో దొరికింది కానీ కొన్ని మాటలు వేరేగా ఉన్నాయి.
ఎక్కిం చడం  రాలేదు. మన్నించండి.

ఇంకోపాట ఆడినట్లు గుర్తులేదు గాని విన్నట్టు గుర్తుంది.

మూడువేలిస్తాను ముద్దబంతులిస్తాను
రావయ్య పెండ్లికొడక పీటల్ మీదికి
నీవు రావయ్య పెండ్లికొడక పీటల్ మీదికి

మూడు వేలక్కర్లేదు ముద్దబంతులక్కర్లేదు
రానండి అత్తగారు పీటల్ మీదికి
నేను రానండి అత్తగారు పీటల్ మీదికి

నాల్గు వేలిస్తాను నందిపిల్లనిస్తాను
రావయ్య పెండ్లికొడక పీటల్ మీదికి
నీవు రావయ్య పెండ్లికొడక పీటల్ మీదికి

నాల్గు వేలక్కర్లేదు నందిపిల్ల అక్కర్లేదు
రానండి అత్తగారు పీటల్ మీదికి
నేను రానండి అత్తగారు పీటల్ మీదికి
ఇట్లాగే అయిదు వేలు, ఆకువక్కలు; ఎనిమిది వేలు, ఎండిపల్లెము, పదివేలు, పట్టుపరుపులు;
ఇస్తాననడం అత్త రాననడం అల్లుడు.
చివరికి లక్ష రూపాయ్ లిస్తాను లక్షిందేవి నిస్తాను
అంటే
లక్ష రూపాయలక్కర్లేదు, లాంచనాలక్కర్లేదు
లక్షిందేవి నీ బిడ్డ లక్షవరహాల్ నాకింక
వస్తాను అత్తగారు పీటల్ మీదికి
నేను వస్తాను అత్తగారు పీటల్ మీదికి
అనడంతో పాట ముగుస్తుంది.


చిన్న చిన్న పిల్లలు ముద్దుముద్దుగా చేస్తుంటే చూడడానికి బాగుంటుంది.