Loading...

14, జనవరి 2012, శనివారం

నాగరికురాలు/డు-సంక్రాంతి


(తేటగీతి లో గీతమాలిక)


పచ్చపచ్చని పొలముల పంటలిల్లు
చేరుటన్నది యెఱుగని చిన్నవాడు
గంగిరెద్దుల కళలను కంటికింపు
చేయు ముగ్గుల గొబ్బిళ్ళ సిరిని దాను
చూసి ముఱియుట తెలియని శుంఠయయ్యె
నగరమందున పెఱిగిన నాగరికుడు
జనుల నెల్లర తోడుగ జనని వాడు
తనదు లోకమందెప్పుడు దానె మసలు
గుడిని దేవుడు తరలుట గొప్ప గాను
దీవనలనిచ్చి యూరిని తేరు లోన
నెల్లజనులను తోడుగా నేగుచున్న
సంబరాలను దానెప్డు జరుపుకొనడు
నేటి యాంత్రిక జీవిక నేమమిదియె
కథల వినుచును తలచును కల్పనలివి
యనుచు నవ్వును పల్లెల యందములను
విన్న క్షణమున నంతయు వేడుకగను!!

-----------లక్ష్మీదేవి

ఇది మగవాళ్ళకే కాదు ఆడవాళ్లకు కూడా వర్తిస్తుంది.

9, జనవరి 2012, సోమవారం

ఘంటసాల గారి స్వీయ రచనలు
ఆంధ్రుల అభిమాన గాయకులు శ్రీ ఘంటసాల గారు విదేశయాత్రనుంచి దిగ్విజయముగా తిరిగి వచ్చిన సందర్భములో ప్రచురింపబడిన భువనవిజయము అనే పుస్తకములో నవంబర్ 1971 లో ముద్రితమైనవి.

బాటసారీ!
మృతి అంటే భయం లేని వ్యక్తి పాడుతున్న పాట.

బహుదూరపు బాటసారీ
యిటురావో ఒక్కసారీ      ||బ||
అర్థరాత్రి పయనమేల నోయి
పెనుతుఫాను రేగనున్నదోయి
నా కుటీరమిదేనోయ్
విశ్రమింపరావోయి
వేకువనే పోదమోయి    ||బ||
పయనమెచటికోయ్ నీ
దేశమేనటోయి
నా ఆశలు తీరెనోయి
నీతోగొనిపోవోయి     ||బ||
***************************************************
౨.నారాణి
మరువలేనె మరువలేనె
నా వలపుల రాణి
తరుణమేదో యున్నదంచు
తెలిపి నావె నారాణి           ||మ||
పండు వెన్నెల నాటి రేయి
యేమేమొ పల్కి నావే
నాటిమాటలు నేడేమాయె  ||మ||
నారాణిని నీ రాజును
వేరు సేయు వారు లేరని
పల్కిన పల్కులు ఏమగునో  ||మ||
+++++++++++++++++++++++++++++++++++++++++++++
౩. ఓ సఖీ
మరణసమయ మిదియే ఓ సఖీ
వలపు మరిచిపోకే    ||మ||
వలపు తలపులు
అలలు అలలుగా
పయనించెనే నీ రూపురేఖయే
మైమరిపించెనే నీ తేనె మాటలూ
ఇలలో కలలాయె
జగము వెగటాయె  ||మ||
ఇహములోన మన
వలపు కలయైన
పరములోన  మన
మేకమౌదామను
మాట తెలుపరావే
కడసారి చూచి పోవే     || మ||
--------------------------------------
౪.ఎన్నినాళ్ళు!
ఎన్నినాళ్ళు గడిచినాయో
చిన్ని పాప నను బాసీ  ||ఎన్ని||
కనుపాప నాపాప
ననుజూచి నవ్వినాడె
కన్నులార జూచే లోనె
కన్నుమూసె చిన్నిపాప    || ఎన్ని||
మనసుదీర పాప మోము
ముద్దులాడలేనే లేదె
ముద్దులొలుకు నా బాబు
ముద్దు తీరనైనా లేదే   || ఎన్ని||
0000000000000000000000000000000000000000000000000
౫.మరపురానిది
మరపురాని తీయనైన బాధా
రోజ రాజుల గాథా ||మరపు||
వలపు టలల తలచి కులికె
కన్నె యెడద పులకరింత   ||మరపు||
మొగము మొగమె యెరగకున్న
యెరిగి యెరిగి వలవకున్న
వలచి చేరి వీడకున్న
మురిసి మురిసి తుదకిటులై
ముగియదేమొ నా బ్రతుకు     || మరపు||
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
౬.జీవితనౌక
సూటిగ పోయె జీవిత నౌక
దారి తప్పినది విధి సరిలేక
మల్లి మనసులో వలపు రేగెను
వలపు రేగి తా వరుని చేరెను
వరుని చేరి తా వలపు తెలిపెను
వరుని కౌగిట ఒదిగి పోయెను  || సూటిగ||
మగని మనసు తెలియని మల్లి చివరకు ____
తీరని కోరిక కోరిన దాని
వరుని కోపమున మరిగిపోయేను
మల్లి మనసులో మంట రగిలెను
మంటరేగి తా కుమిలి పోయేను
మల్లి జీవితమె కథగ మారెను    ||సూటిగ||
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
౭. భూమి పొమ్మన్నది ____ఆ
కాశం రమ్మన్నది          || భూమి||
అక్కడ నీ వారున్నారన్నది
ఆ దరికే నిను చేరమన్నదీ
కామక్రోధముల కాల్చమన్నది
లోభమోహముల త్రెంచమన్నది
మద మత్సరముల వదలమన్నది
ఇహమున అంతా శూన్యమన్నది
పరమే శాంతికి నిలయమన్నది      ||భూమి||
సంసారమనే సాగరమందు
సంగీతమనే పూల నావపై
సరిగమ పదనిస అంచులు దాటి
సర్వేశ్వరునే తలచమన్నది
సుఖముగ స్వర్గము చేరమన్నది     ||భూమి||

నాకు విషయం తెలిపి ప్రోత్సహించిన రసజ్ఞ గారికి ధన్యవాదాలు. ఈ వివరం నాతో పంచుకున్న మాధురిగారికి కృతజ్ఞతలు.