Loading...

1, జనవరి 2012, ఆదివారం

పడవ పయనం పాపికొండల గోదారిలో.....   నది అలలపై తేలుతూ పయనించాలనే మనసుతో ఏర్పాట్లు చేసుకున్నాము. సముద్రపు తరగలపై ఇదివరలో పయనించాము. చుట్టూ ఎటు చూసినా సంద్రమే. కనుచూపుమేరలో ఎక్కడా తీరం కనిపించదు. ఓడ సాగుతూ......నే ఉంటుంది. నిజంచెప్పద్దూ....ఒక్కసారి దూకేసి సముద్రునితో కబుర్లు చెప్పాలనిపించకపోలేదు. కానీ దూకటం వరకే జరుగుతుంది. తర్వాతదేం జరుగుతుంది? అందుకే ఊరుకున్నా.

      ఇపుడు నదిపై పడవలో అదే లాంచిలో పయనం. ముందు ఏసి లాంచి బుక్ చేయటమేమిటి డిసెంబరులో అనుకున్నా. కానీ మధ్యాహ్నం వరకూ ఎండ బాగా కాసినపుడు తెలిసొచ్చింది.

ఎండ అయినా.....నీడ అయినా.....మబ్బులున్నా.......నిన్ను వదలి పోగలనా గోదావరీ!
కళ్ళ నిండా......మనసు నిండా........నింపుకున్నా......తనివి తీరదుగా.... మరలి రాగలనా, మరల రాగలనా?
నీతో కలిసి......నీలో.....కలిసి.........లోలోపల ......చేరిపోనా......నీటి బిందువునై......!
అని పాడుకుంటూ రాడ్ ని ఆనుకుని బయటే నించున్నా.
   అబ్బ ! ఎంత బాగుందో!!!!!!!!!!!!!!!!

విజయవాడ కృష్ణానదిలో సంకల్పస్నానం చేసి, కనకదుర్గమ్మను దర్శించుకొని, బస్సులో భద్రాచలం చేరుకున్నాం. అక్కడ రెండు రోజులున్నాం. రాముల వారి దర్శనం చేసుకుని,
వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా రామాలయం అలంకారం బాగుంది. గుడి ఎదురుగా సంగీత, సాహిత్య, భజన కార్యక్రమాల కోసం వేదిక, పచ్చిక రంగులో ఉన్న కార్పెట్ . కార్యక్రమాలు చాలా బాగా జరిగాయి.

 డెబ్భై కి.మీ. దూరంలో ఉన్న పర్ణశాల అనే ఊరు చూట్టానికి బస్సులో వెళ్ళాం. భద్రాచలం లో గోదావరిలో అంతగా నీళ్ళు లేవు కానీ, పర్ణశాల అనే ఊళ్ళో బాగా ప్రవహిస్తున్న నదిలో ఓ అరగంట బోటింగ్ చేసి తిరిగొచ్చాం.
ఇక లాంచి అదే పెద్ద పడవ అందామా.. అది భద్రాచలం నుంచి కాకుండా కూనవరం అనే ఊరునుంచి బయలుదేరుతుంది.

భద్రాచలంలో పడవ వాడు ఒక షేర్ కారు లాంటిది ఏర్పాటు చేసి అరవై అయిదు కి.మీ. ఉన్న కూనవరం తీసికెళ్ళాడు. అక్కడ కనిపించింది ఇసుక.  ప్రతీచోట నది పక్కన మెట్లు అవీ ఉండటంతో ఇసుకనే చూడలేదు. అక్కడ ఒక పిడికెడు తడి ఇసుకతో పంచముఖ గౌరమ్మను చేసి వెంట తీసుకెళ్ళిన పసుపు కుంకుమ పెట్టి నమస్కారము చేసుకొని, మళ్ళీ నీళ్ళలో కలిపేశాను.
ఇక బయలుదేరాం పెద్ద పడవలో ..
అబ్బ! ఎంతెంత బాగుందో....................!!!!!!!!!!!!!!!!!!

దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం గోదావరి నది మీద. జన్మకు సరిపడా అనుభవం. మూడు గంటల తర్వాత పాపి కొండలు మొదలయ్యాయి. మొత్తం డెబ్భై ఎనిమిది కొండలట. వరుసగా రెండు వైపులా కొండలు. మధ్యలో విశాలమైన గోదావరి చిన్నగా శబ్దం చేస్తూ ప్రవహిస్తోంది. ఆ శబ్దం స్పష్టం గా వినపడకుండా పడవవాళ్ళు పెద్దగా సినిమాపాటలు పెట్టారు. కొంచెం సౌండ్ అన్నా తగ్గించమంటే తగ్గించారు.
పక్కన దూరంగా కనిపించే కొన్ని ఊళ్ళ గురించి వాళ్ళు మధ్యమధ్యలో మైక్ లో చెపుతున్నారు. ఎలాంటి కరెంట్, ఫోన్ మరి ఏ ఇతర ప్రయాణ సాధనాలు లేని ఊళ్ళవి. వారానికి ఒకసారి పడవలో వెళ్ళి కావలసినవి తెచ్చుకోవలసిందేనట. సినిమా షూటింగ్ లు జరుగుతుంటాయని చెప్పారు. పేరంటాలపల్లి అని ఒక ఊళ్ళో ప్రతీ పడవ ఖచ్చితంగా ఆగి కొండపై కొలువున్న పరమేశ్వరుని ప్రయాణీకులు దర్శించుకున్నాక మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తారు.

ఆ గుడి ముందు చిన్న సెలయేరు, స్వచ్ఛమైన నీళ్ళలో కాళ్ళు కడుగుకొని దేవుణ్ణి దర్శించుకున్నాం. ఎంత శుభ్రంగా ఉంచారో ఎన్ని చెండు పూల మొక్కలున్నాయో అక్కడ. అక్కడి ప్రజలు కొమ్మలను మలిచి ఎంత అందమైన పువ్వులు చేశారంటే చాలా చాలా బాగున్నాయి. కొందరు కొన్నారు.
మధ్యాహ్నం మూడు గంటలకు కొల్లూరు అనే ఊరు చేరాం.


అక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు. అప్పటికి అక్కడ మూడు నాలుగు పెద్ద పడవలు చేరాయి. నాలుగు స్తంభాలు నాటి పైన తాటాకులేవో పరిచి అక్కడ భోజనాలు బఫేలాగా ఏర్పాటుచేశారు. నేను మజ్జిగ అన్నం మాత్రమే తృప్తిగా తినగలిగా. అక్కడ మా పడవ మమ్మల్ని వదలి తిరిగి వెళ్ళిపోయింది. అక్కడికి కాస్సేపట్లో ఇంకో పడవ వస్తుంది. దానిలొ మేము ముందుకు సాగాలట. పడవల పేర్లు భలే పెట్టారు. జాబిల్లి, సితార....

ఇక కొల్లూరు గురించి.
ఖమ్మం జిల్లాలో చివరిఊరట. అక్కడ ఊరేమీ కనిపించలేదు. విశాలంగా ప్రవహించే నది, ప్రక్కన పెద్ద ఇసుకతీరం,  చుట్టూ కొండలు. అక్కడ కావాలంటే ఉండిపోవచ్చు. భోజనాలు, టిఫిన్స్ ఏర్పాటుచేస్తారుట. రాత్రి తలదాచుకునేందుకు చిన్న చిన్న గుడారాలు వేసి ఉంచారు. ఒక ప్రక్కగా దూరంగా బాత్రూమ్ లట, కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇరవైనాలుగు గంటల తర్వాత పడవ వచ్చి తీసుకెళ్తుందట.