Loading...

28, ఆగస్టు 2012, మంగళవారం

నృత్యాభినయ వేళ......


ఎప్పుడూ దర్శిని (చానల్) లలో నృత్య/నాట్య ప్రదర్శనలు చూడటమే కానీ, ఈ మధ్య కాలములో ప్రత్యక్షంగా వేదికమీద ప్రదర్శనలు తిలకించే అదృష్టము కలిగింది. నాట్యము చూసి ఆనందించటమే కానీ అందులో ఓనమాలు తెలియని నాకు ప్రేక్షకురాలిగా కలిగే భావాలని మాత్రమే ఇక్కడ చెపుతున్నాను.

                        భరతనాట్యము, కథక్ కాస్సేపు చూడవచ్చు కానీ, మన కూచిపూడి మాత్రం ప్రతి కీర్తనలో ఉన్న చిన్ని కథనాన్ని తన హావభావాలతో పూర్తి నాటకంగా మలచి చూపించే నర్తకీమణులు, నర్తకరత్నముల నాట్యాన్ని ఎంతసేపైనా చూడవచ్చు. లీనమైపోయి... కొన్ని కీర్తనల విషయంలో ఇది ఇలా జరిగితే కొందరు వాళ్ళ ప్రతిభచేత అట్లా జరిపిస్తారు. అంటే మనం లీనమై పోయేటట్లు.

                         అందుకే నాకు కూచిపూడి చాలా ఇష్టం. ఒక నాలుగైదు కీర్తనలతో ప్రదర్శన ముగించేముందు వచ్చే తిల్లాన కూడా నాకు చాలా చాలా ఇష్టం. అసలు అన్నిటికన్నా ఇష్టము. నేనింతవరకూ చూసిన తిల్లాన లన్నీ శ్రీ బాలమురళీకృష్ణ గారే కూర్చారు. అసలు ఈ ప్రక్రియ కు ఆద్యులు వీరేనా లేక ఇంతకు ముందు ఇంకెవరైనా చేశారా, చేస్తున్నారా అనే వివరాలు తెలియవు. నాకు తెలిసిన వారిలో ఇలాంటి సందేహాలు తీర్చగల వారూ లేరు. మన బ్లాగు ప్రపంచంలో అన్నిరంగాల నిష్ణాతులూ ఉన్నారు. వారేమయినా దయ యుంచి చెపుతారని ఆశిస్తాను. లేకపోతే వారి బ్లాగుల్లో నాట్యం గురించిన ప్రాథమిక విషయాలయినా పరిచయం చేస్తూ వ్రాసినా చాలా సంతోషపడతాను.

ఇంతకీ ఈ మధ్య నేను చూసిన నాట్య ప్రదర్శన గురించిన ముచ్చట్లు.

                     ఒక వనితామణి సరస్వతీఅష్టకము, భవానీఅష్టకము, సుబ్బలక్ష్మి గారి కీర్తన ఒకటి మొదలయిన వాటితో పాటు హనుమాన్ చాలీసా మొత్తాన్ని అభినయించి చూపినారు. మొదట్లో కొంచెం స్వర్ణకమలం భానుప్రియ అక్కడక్కడా కనిపించినా, తర్వాత్తర్వాత బాగా లీనమయి చేసినారు. హనుమాన్ చాలీసా లో అయితే ప్రతీ సందర్భంలోనూ హనుమ ముఖాన్ని ప్రతిబింబించేటట్లు తన ముఖాన్ని మూతిని ఆ ముద్ర లో తీసుకువచ్చారు. శానా బాగా చేసినారు. హనుమాన్ చాలీసా అభినయించగా నేను చూడడం మొదటిసారి.

                        ఒక పురుషరత్నం స్వాగతం కృష్ణా, జయదేవుని అష్టపదులు, మరికొన్ని కీర్తనలని చక్కగా అభినయించారు. అతడు మొదట్నించీ లీనమయి నటించారు. వేదిక ఎత్తు తక్కువగా, పొడవు తక్కువగా ఉన్నది. పైన దీపపు తీగలు వేలాడుతున్నాయి. అతడు పొడుగైనవాడు. చేతులు పైకి ఎత్తినపుడల్లా తీగలు ఎక్కడ తగులుతాయేమో అనిపించేది. ఒక కీర్తన తరువాత ఒక పని అబ్బాయి వచ్చి తీగలు సరి చేసినాడు.
అమ్మయ్య అనుకున్నాను. స్వాగతం కృష్ణా కీర్తనలో వేదిక లో వెనక వరకూ పోయి మళ్ళీ ముందుకు వచ్చినపుడు ఆ వేగంలో అయ్యో కాలు ముందుకు పెట్టేస్తాడేమో అనిపించేంతగా అందులో లీనమయినట్టే ఉండేవాడు, కానీ జాగ్రత్తగానూ ఉండేవాడు. శానా బాగా చేసినాడు.

             ఇక వీటి తర్వాత దూరదర్శన్ జాతీయ దర్శిని లో మీనూఠాకూర్ అనే గుజరాతీ ఆమె తెలుగు నేర్చుకొని కూచిపూడి నేర్చుకొని ప్రదర్శనలు ఇస్తూ , శిష్యులకు కూచిపూడి నేర్పిస్తూ ఉన్నామెని పరిచయం చేయడం ఆమెతో సంభాషణ విన్నాను, చూసి శానా సంతోషమైంది. ఆమె ఎంతగా కూచిపూడిని ఇష్టపడుతుంది అనేది మాటలను బట్టి అర్థమయితుంది.
తెలుగుభాషా దినోత్సవమంట ఈరోజు. ఈరోజు మనదైన ఈ కూచిపూడి గురించి మాట్లాడుకోవడం సంతోషం.

8 వ్యాఖ్యలు:

 1. లక్ష్మీ దేవి గారు!
  మీరు చూసిన నర్తకి పేరు లలితా సింధూరి అయితే ఆమె
  ఆంద్ర సాంస్కృతిక పరిషత్ ఆద్వర్యం లో భోపాల్ లో
  అభినయించారు...
  ఆమె నాట్యం చేసిన కీర్తనలకి నేను వ్యాఖ్యాతగా (anchoring) ఉండటం జరిగింది...
  హనుమాన్ చాలీసా ఆమె స్వయంగా కంపోజ్ చేసి ఉన్నారు...
  మాయాబజార్ లో సావిత్రి నటనలా ఉంటుంది ఆమె హనుమాన్ అభినయం...
  నేను శ్రీమతి శోభానాయుడు గారిలో ఉన్న గ్రేస్ ఆమెలో ఉన్నాయని చెప్పాను...
  భామా కలాపం లో ఆమె లక్ష రూపాయల ప్రథమ బహుమతి కూడా తెచ్చుకున్నారు...
  http://en.wikipedia.org/wiki/Kuchipudi
  ఇందులో ఆమె పేరు ఉంది చూడండి..(తెలుగు వెర్షన్ క్లిక్ చేసి చూడండి నేను ఇచ్చిన లింక్ లో)
  నేను మిగిలిన వివరాలు ఇవ్వలేనేమో గానీ ఈ విషయం పంచుకోవాలని వ్రాసాను..
  మీకు కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాభినందనలు...
  తెలుగు ఇంకా ఇలా ఉంది అంటే మీలాంటి పద్య రచయితల వలెనే అనుకుంటాను నేను...
  @శ్రీ

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Tried to post the following comment in your blog but it said that the document is no longer available.

  నేను నిష్ణాతురాలిని కాదు కానీ కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఒకానొకప్పుడు అమీర్ ఖుస్రో "తననననోంతన...." అంటూ పాడాగా అదే కాలక్రమేణా "తరాన"గా "హిందుస్తానీలో", "తిల్లాన"గా కర్ణాటకంలో అభివృధ్ధి చేందాయని అంటారు. ఈ కోవలో మహామహులైన వాగ్గేయకారులు మరింత సృజనను, సాహిత్యాత్ర్హాన్ని జోడించి క్లిష్టమైన తిల్లానాలను వివిధ రాగాలలో రూపొందించారు. వారిలో బాలమురళిగారు అగ్రగణ్యులని వేరే చెప్పనఖ్ఖరలేదు. ఆయన మెదడు మహాచురుకు. ఆయన వెలువరించిన తిల్లానాలు నేర్చుకోవడం చాలా కష్టం. తాళప్రస్తారాలు, జతులు చాలా క్లిష్టమైనవి. వాటిలోని ఒకేఒక "బృందావని" రాగ తిల్లానాను మా గురువుగారు నా చిన్నప్పుడు నేర్పించారు. మిగతావారిలో లాల్గుడి జె జయరామన్ గారివి కూడా చాలా బాగుంటాయి. ఒకసారి గూగుల్లో వెతుకగలరు.

  మాధురి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. శ్రీనివాస్ గారు,
  లేదండి. నేను చూసినావిడ పేరు లలిత కాదు, అర్చన. మీరేదో వేరే కార్యక్రమంగా అనుకొని పొరబడ్డారనుకుంటాను. నేను చూసిన కార్యక్రమంలో వ్యాఖ్యాతలెవరూ లేరు.
  మీరిచ్చిన లంకె తప్పక చూస్తాను.
  మీకు అనేక ధన్యవాదాలండి.
  చివర్లో మీరన్న ఇంకో మాట భలే నచ్చిందండి నాకు. రాసేవారితో పాటు చదివేవారికి కూడా ఆ గొప్పదనం చెందుతుంది . కదండీ!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మాధురి గారు,
  మీరిచ్చిన వివరాలకు ధన్యవాదాలండి. మీ వ్యాఖ్య నా బ్లాగులో ప్రచురించాను. ఇక్కడుంటే ఇంకా తెలియని వాళ్ళు కూడా చదివి తెలుసుకుంటారు కదా అని.
  ఇంతవరకూ గూగుల్ లో ఏమీ వెదుకలేదు. అయితే మీరు నాట్యం నేర్చుకున్నారనమాట. మీతో పరిచయం నాకెంతో సంతోషం కలిగించింది.
  మరోసారి ధన్యవాదాలండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మాధురిగారు బ్లాగ్ వ్యాఖ్యల్లో ఏదొ సమస్య అన్నారు. చూద్దాం ఈ వ్యాఖ్య ప్రచురించబడుతుందేమో.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. దేవి గారు,

  నేను నాట్యం నేర్చుకోలేదుకానీ నా మొదటి ప్రాణం నాట్యమే. నేను నర్తకినని మీరు అనుకోవడం నాకు ఒక మధురానుభూతినిస్తోంది. మా మామయ్య కూతురు కూచిపూడి నేర్చుకోవడానికి ప్రసన్నరాణిగారి దగ్గరకు వెళ్ళినరోజుల్లో ఇంటికివచ్చి నేను అక్కద చూసింది సాధన చేసేదాన్నిలెండి.
  మా గాత్ర సంగీతం గురువుగారు నాకు ఆ తిల్లాన నేర్పించారు. మీరు ఆ విధంగా అర్థం చేసుకున్నది నేను చేసిన పొరపాటు వల్లే. నేర్చుకున్నానన్నానుకానీ గాత్రంలో అని చెప్పలేదుకదా!

  మాధురి.
  Pls post this, if needed.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మాధురి గారు,
  నాట్యం నేర్చుకోలేకపోయామని బాధపడకండి. సంగీతం నేర్చుకున్నానంటున్నారుకదా, అది కూడా ఆరాధనీయమైన గొప్ప కళ . మీరు సంగీతజ్ఞురాలన్నమాట.మీ వ్యాఖ్య బ్లాగులో కూడా ప్రచురిస్తానండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. శ్రీనివాస్ గారు,
  మీరు మళ్ళీ ఇచ్చిన లంకెలు పని చేయలేదు. పోనీయండి కానీ, నిన్న మీ కొత్త టపాలో నేను వ్యాఖ్య ప్రచురించగానే మళ్ళీ బ్రౌజర్ క్రాష్ అయిపోయింది. ఎందుకో మఱి?

  ప్రత్యుత్తరంతొలగించు