Loading...

23, మార్చి 2012, శుక్రవారం

వసంత నందన వైభవం


మిసిమిన్ చూపెడు చిన్నియాకులవి నెమ్మేనన్,  విలాసంబుగా
ముసినవ్వుల్ కురిపించుచున్ నటనలన్ మోహింపజెయ్యున్, నిలన్ .
కుసుమంబందున హాసముల్ సొగసులై కొంగ్రొత్త గా శోభిలున్,
హసితమ్మొక్కటి మోమునందు బలు వయ్యారమ్ము నొల్కించుచున్,

నందనమను వర్షమునను నాయికయ్యె 
నదె గను  వసంత భామిని నబ్బురముగ
సంతసమ్మును పంచుచు సాగిపోవ
వేడుకొందునిదె యుగాది వేళయందు.
చిగురాకులలో నూగుచు
వగలను కురియగ వనమున పాటల నెన్నో
మిగ మురిపెముగా పాడుచు
జగములకా కోకిలమ్మ సంతసమొసగున్.

మల్లెలు మాలల రూపున
పల్లెత మనముల మరింత వలపుల బెంచున్
కల్లాకపటములెఱుగని
సల్లాపములాడ భర్త సరసన జేరున్.


చల్లలు ద్రావుచున్ జనులు సందెల గాలులు  కోరుచుందురే!
మెల్లగ సాగుచున్న రవి మేఘము గప్పుట చూడనెంతురే!
పిల్లలు కోరుకున్నటుల ప్రీతిగ వేడుక దేలుచున్ మరే
యల్లరి చేయబోమనుచు నందర తోడను బొంకనేర్తురే!


--మందాకిని (లక్ష్మీదేవి)

11 వ్యాఖ్యలు:

  1. చాలా బాగా రాసారండీ..మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు..

    ప్రత్యుత్తరంతొలగించు
  2. మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు సుభాషిణీ,
    తీరిక లేకపోవటంతో రెండు రోజుల ముందే ఈ పోస్ట్ షెడ్యూల్ చేసి పెట్టాను. ఈరోజు పొద్దున్నే పబ్లిష్ అవుతుందనుకుంటే కాలేదు. మధ్యాహ్నం రెండింటికి చూసి నేనే పబ్లిష్ చేశా.

    ప్రత్యుత్తరంతొలగించు
  3. మన తెలుగు పండుగనాడు తెలుగులో తెలుగుతనం ఉట్టిపడే పద్యాలు ఎంత బాగున్నాయో! చదువుతుంటే చాలా ఆనందంగా ఉంది! నందన నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

    ప్రత్యుత్తరంతొలగించు
  4. రసజ్ఞా ,
    నా మనసు ఆనందనందనవనం చేశారు.
    మీక్కూడా శుభాకాంక్షలు.

    ప్రత్యుత్తరంతొలగించు
  5. చాలా బాగున్నాయి. నేను చదివిన మీ పద్యాలన్నింటిలో ఇవే బాగున్నాయంటే కొట్టరు కదా :)

    మీకూ నందన నామ ఉగాది శుభాకాంక్షలు.

    ప్రత్యుత్తరంతొలగించు
  6. భలేవారే, ఇవైనా నచ్చాయన్నారు. అక్కడికి సంతోషము.
    సాధారణంగా అభ్యాసం కోసమే తప్ప సమస్యాపూరణాల్లో రసానుభూతి ఎప్పుడో గానీ నాక్కూడా లభించటం లేదు.
    ఇంతకీ నిఘంటువు పేజీలు పంపమంటే పంపరేంటీ?
    నందన సంవత్సరం నుంచీ రాబోయే కాలం మీకు సర్వశుభప్రదంగా ఉండాలని ఆశిస్తాను.

    ప్రత్యుత్తరంతొలగించు
  7. రేపు పంపుతానండి. పత్రిక పనుల్లో కొద్దిగా బిజీ అయి నిఘంటువు పని కాస్తా వెనుకపడింది.

    ప్రత్యుత్తరంతొలగించు