Loading...

1, జనవరి 2012, ఆదివారం

పడవ పయనం పాపికొండల గోదారిలో.....



   నది అలలపై తేలుతూ పయనించాలనే మనసుతో ఏర్పాట్లు చేసుకున్నాము. సముద్రపు తరగలపై ఇదివరలో పయనించాము. చుట్టూ ఎటు చూసినా సంద్రమే. కనుచూపుమేరలో ఎక్కడా తీరం కనిపించదు. ఓడ సాగుతూ......నే ఉంటుంది. నిజంచెప్పద్దూ....ఒక్కసారి దూకేసి సముద్రునితో కబుర్లు చెప్పాలనిపించకపోలేదు. కానీ దూకటం వరకే జరుగుతుంది. తర్వాతదేం జరుగుతుంది? అందుకే ఊరుకున్నా.

      ఇపుడు నదిపై పడవలో అదే లాంచిలో పయనం. ముందు ఏసి లాంచి బుక్ చేయటమేమిటి డిసెంబరులో అనుకున్నా. కానీ మధ్యాహ్నం వరకూ ఎండ బాగా కాసినపుడు తెలిసొచ్చింది.

ఎండ అయినా.....నీడ అయినా.....మబ్బులున్నా.......నిన్ను వదలి పోగలనా గోదావరీ!
కళ్ళ నిండా......మనసు నిండా........నింపుకున్నా......తనివి తీరదుగా.... మరలి రాగలనా, మరల రాగలనా?
నీతో కలిసి......నీలో.....కలిసి.........లోలోపల ......చేరిపోనా......నీటి బిందువునై......!
అని పాడుకుంటూ రాడ్ ని ఆనుకుని బయటే నించున్నా.
   అబ్బ ! ఎంత బాగుందో!!!!!!!!!!!!!!!!

విజయవాడ కృష్ణానదిలో సంకల్పస్నానం చేసి, కనకదుర్గమ్మను దర్శించుకొని, బస్సులో భద్రాచలం చేరుకున్నాం. అక్కడ రెండు రోజులున్నాం. రాముల వారి దర్శనం చేసుకుని,
వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా రామాలయం అలంకారం బాగుంది. గుడి ఎదురుగా సంగీత, సాహిత్య, భజన కార్యక్రమాల కోసం వేదిక, పచ్చిక రంగులో ఉన్న కార్పెట్ . కార్యక్రమాలు చాలా బాగా జరిగాయి.

 డెబ్భై కి.మీ. దూరంలో ఉన్న పర్ణశాల అనే ఊరు చూట్టానికి బస్సులో వెళ్ళాం. భద్రాచలం లో గోదావరిలో అంతగా నీళ్ళు లేవు కానీ, పర్ణశాల అనే ఊళ్ళో బాగా ప్రవహిస్తున్న నదిలో ఓ అరగంట బోటింగ్ చేసి తిరిగొచ్చాం.
ఇక లాంచి అదే పెద్ద పడవ అందామా.. అది భద్రాచలం నుంచి కాకుండా కూనవరం అనే ఊరునుంచి బయలుదేరుతుంది.

భద్రాచలంలో పడవ వాడు ఒక షేర్ కారు లాంటిది ఏర్పాటు చేసి అరవై అయిదు కి.మీ. ఉన్న కూనవరం తీసికెళ్ళాడు. అక్కడ కనిపించింది ఇసుక.  ప్రతీచోట నది పక్కన మెట్లు అవీ ఉండటంతో ఇసుకనే చూడలేదు. అక్కడ ఒక పిడికెడు తడి ఇసుకతో పంచముఖ గౌరమ్మను చేసి వెంట తీసుకెళ్ళిన పసుపు కుంకుమ పెట్టి నమస్కారము చేసుకొని, మళ్ళీ నీళ్ళలో కలిపేశాను.
ఇక బయలుదేరాం పెద్ద పడవలో ..
అబ్బ! ఎంతెంత బాగుందో....................!!!!!!!!!!!!!!!!!!

దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం గోదావరి నది మీద. జన్మకు సరిపడా అనుభవం. మూడు గంటల తర్వాత పాపి కొండలు మొదలయ్యాయి. మొత్తం డెబ్భై ఎనిమిది కొండలట. వరుసగా రెండు వైపులా కొండలు. మధ్యలో విశాలమైన గోదావరి చిన్నగా శబ్దం చేస్తూ ప్రవహిస్తోంది. ఆ శబ్దం స్పష్టం గా వినపడకుండా పడవవాళ్ళు పెద్దగా సినిమాపాటలు పెట్టారు. కొంచెం సౌండ్ అన్నా తగ్గించమంటే తగ్గించారు.
పక్కన దూరంగా కనిపించే కొన్ని ఊళ్ళ గురించి వాళ్ళు మధ్యమధ్యలో మైక్ లో చెపుతున్నారు. ఎలాంటి కరెంట్, ఫోన్ మరి ఏ ఇతర ప్రయాణ సాధనాలు లేని ఊళ్ళవి. వారానికి ఒకసారి పడవలో వెళ్ళి కావలసినవి తెచ్చుకోవలసిందేనట. సినిమా షూటింగ్ లు జరుగుతుంటాయని చెప్పారు. పేరంటాలపల్లి అని ఒక ఊళ్ళో ప్రతీ పడవ ఖచ్చితంగా ఆగి కొండపై కొలువున్న పరమేశ్వరుని ప్రయాణీకులు దర్శించుకున్నాక మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తారు.

ఆ గుడి ముందు చిన్న సెలయేరు, స్వచ్ఛమైన నీళ్ళలో కాళ్ళు కడుగుకొని దేవుణ్ణి దర్శించుకున్నాం. ఎంత శుభ్రంగా ఉంచారో ఎన్ని చెండు పూల మొక్కలున్నాయో అక్కడ. అక్కడి ప్రజలు కొమ్మలను మలిచి ఎంత అందమైన పువ్వులు చేశారంటే చాలా చాలా బాగున్నాయి. కొందరు కొన్నారు.
మధ్యాహ్నం మూడు గంటలకు కొల్లూరు అనే ఊరు చేరాం.


అక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు. అప్పటికి అక్కడ మూడు నాలుగు పెద్ద పడవలు చేరాయి. నాలుగు స్తంభాలు నాటి పైన తాటాకులేవో పరిచి అక్కడ భోజనాలు బఫేలాగా ఏర్పాటుచేశారు. నేను మజ్జిగ అన్నం మాత్రమే తృప్తిగా తినగలిగా. అక్కడ మా పడవ మమ్మల్ని వదలి తిరిగి వెళ్ళిపోయింది. అక్కడికి కాస్సేపట్లో ఇంకో పడవ వస్తుంది. దానిలొ మేము ముందుకు సాగాలట. పడవల పేర్లు భలే పెట్టారు. జాబిల్లి, సితార....

ఇక కొల్లూరు గురించి.
ఖమ్మం జిల్లాలో చివరిఊరట. అక్కడ ఊరేమీ కనిపించలేదు. విశాలంగా ప్రవహించే నది, ప్రక్కన పెద్ద ఇసుకతీరం,  చుట్టూ కొండలు. అక్కడ కావాలంటే ఉండిపోవచ్చు. భోజనాలు, టిఫిన్స్ ఏర్పాటుచేస్తారుట. రాత్రి తలదాచుకునేందుకు చిన్న చిన్న గుడారాలు వేసి ఉంచారు. ఒక ప్రక్కగా దూరంగా బాత్రూమ్ లట, కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇరవైనాలుగు గంటల తర్వాత పడవ వచ్చి తీసుకెళ్తుందట.




ఈరోజు మూడు గం.కు దిగితే సాయంకాలం, మరుసటి ఉదయం అక్కడే ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో ప్రకృతి ఒళ్ళో నదీ తీరంలో కొండల మధ్యన ఇసుకలో గడిపి మరుసటి మధ్యాహ్నం మూడు గం.కు మళ్ళీ పడవ ఎక్కటం. ఈ విషయాలన్నీ అక్కడ క్రిందటి రోజు గడిపిన వాళ్ళు చెప్పారు.
ఇక కాసేపటికి జాబిల్లి వచ్చి మమ్మల్ని తీసికెళ్ళింది.

 సముద్రం నీళ్ళు నీలంగా కనిపిస్తాయి. ఇక్కడ గోదారి పచ్చటి కొండల్ని ఒరుసుకుంటూ వెళ్తుంది కదా. కొండమీద పెరిగిన చెట్ల పచ్చదనం అంతా ప్రతిఫలిస్తున్నట్టుగా పచ్చగా కనిపిస్తున్నాయి నీళ్ళు . సముద్రం మీద ఆకాశం రంగు పులిమితే ఇక్కడ అడవి తన రంగు నదికి పులుముతుందా అన్నట్టు కనిపిస్తోంది. సూర్యుడేమో నేను రెండుచోట్లా ఉంటానన్నట్టు నది అలల మీద నవ్వుల వెలుగుల్ని మెఱిపిస్తుంటే...... పచ్చటి చీరకి వెండి జరీ తో చెమ్కీ అద్దినట్టుంది.

 హుషారైన పాటలు, మధ్యలో గైడ్ చమత్కారపు మాటలు (మైక్ లో) , ఉల్లిగడ్డ బజ్జీలు , టీ లతో ప్రయాణం సాగిపోయింది. ఉన్నట్టుండి ఎండ మాయమైపోయి తెల్ల మబ్బులు వచ్చి క్రమంగా దట్టమైన నల్ల మబ్బులు గా మారాయి.


చిరు చీకటి పడుతుండగా పురుషోత్తమపల్లి అనే ఊళ్ళో పడవ దిగామందరము.
అక్కణ్ణించి ముప్ఫయి అయిదు కి.మీ. దూరం రాజమండ్రికి మళ్ళీ ఒక షేర్ కారు. మరుసటి రోజు రాజమండ్రి నుంచి ట్రైన్ ఉంది మాకు.
కళాకారులకి గట్టిగా చప్పట్లు.





కొల్లూరు

భద్రాచలం నుంచి కూనవరం వరకూ ఎక్కువదూరం అయినా చక్కటి పక్కారోడ్. పురుషోత్తమపల్లి నుంచి రాజమండ్రి రోడ్ ఏం బాగాలేదు. మట్టి రోడ్ మాదిరే , గుంతలు, రాళ్ళు. బాబోయ్! తెలంగాణా వెనుకబడటం కోస్తా అభివృద్ధి చెందిందనటానికి మంచి ఉదాహరణ కదా   హి.హి.

16 వ్యాఖ్యలు:

  1. చాలా బాగుంది అందమైన పాపికొండల ప్రకృతి లో మీ నదీ ప్రయాణం!!!

    ప్రత్యుత్తరంతొలగించు
  2. మేము వెళ్ళినప్పుడు కొల్లూరు లో ఒక నైట్ స్టే చేసాము.చాలా బావుండే.
    మీ టపా చదువుతుంటే మల్లి అన్నీగుర్తొచ్చాయి .

    ప్రత్యుత్తరంతొలగించు
  3. మా ఊరు వెళ్లి వచ్చారన్నమాట.. గోదారి అలలపై నుంచి వచ్చే సన్నటి గాలిలా హాయిగా ఉంది మీ టపా.. ఇవాళ గోదారినీ, రాముడినీ ప్రత్యేకంగా గుర్తు చేసారు. బోల్డు ధన్యవాదాలు. :)

    ప్రత్యుత్తరంతొలగించు
  4. చిన్ని ఆశ గారు,
    ధన్యవాదాలండి మీకు నచ్చినందుకు.

    ప్రత్యుత్తరంతొలగించు
  5. మా ఊరు గారు,
    మీ జ్ఞాపకాల్ని రాశారాండీ మీరు? ఏం లేదు చదువుదామని అంతే.
    ధన్యవాదాలండి.

    ప్రత్యుత్తరంతొలగించు
  6. మధురవాణీ, మీ ఊరా! అయ్యో మొదటే మీతో మాట్లాడి ఉంటే బాగుండేది కదూ! (j/k)
    అలరించే గుణం ఉన్నదే కదా నదీసౌందర్యం..... సంతోషమండి.

    ప్రత్యుత్తరంతొలగించు
  7. చాలా బావుందండి.. గోదావరి పేరు చెపితేనే మనసుకెంతో హాయిగా ఉంటుంది.. అంత హాయిగా ఉంది మీ టపా, మీ ప్రయాణమూ..

    ప్రత్యుత్తరంతొలగించు
  8. ప్రసీద గారు,
    ధన్యవాదాలండీ. మీరు అన్నట్టు గోదావరి పేరే ఎంతోహాయి గొలుపుతుంది.

    ప్రత్యుత్తరంతొలగించు
  9. మా ఊరు పయనమయ్యారనమాట! బాగుంది! పాపికొండల వద్ద గోదావరి తల్లికి కొంచెం పట్టేక్కువ. మనసులో ఏదయినా అనుకుంటే జరిగి తీరాల్సిందే!

    ప్రత్యుత్తరంతొలగించు
  10. రసజ్ఞ గారు, మీ ఊరు కూడానా! ఆహా!!!!
    అప్పుడు నేను మనసులో ఏమనుకున్నానబ్బా, గుర్తు రావట్లేదు.
    ధన్యవాదాలు ఈ విషయం చెప్పినందుకు.

    ప్రత్యుత్తరంతొలగించు
  11. మందాకినిగారూ అందమైన గోదావరిని చూపించేశారు..బావున్నాయండీ మీ ప్రయాణం కబుర్లు..

    ప్రత్యుత్తరంతొలగించు
  12. జ్యోతిర్మయి గారు,
    ధన్యవాదాలండి.గోదావరి అందం మీకూ నచ్చింది కదూ!

    ప్రత్యుత్తరంతొలగించు
  13. మందాకిని గారూ నేను కూడా వెళ్ళానండీ..ప్రకృతి అంతా ఒక ఎత్తు.. కానీ పడవలో ఆ శబ్ధానికి తట్టుకోలేకపోయాము. నేను కొన్ని ఫోటోస్ తీసాను. అవే నా బ్లాగులో పెట్టాను. మీరు చూసే ఉంటారు. http://4ursmiles-picturesque.blogspot.com/2011/09/river-mighty-godaavari-andhra-pradesh.html ..మొత్తానికి మంచి ప్రయాణపు అనుభూతి అది ఆ శబ్ద కాలుష్యం మినహా..

    ప్రత్యుత్తరంతొలగించు
  14. సుభగారు, ధన్యవాదాలండి. నేను మీ ఫోటో బ్లాగ్ ఒక సారి చూశాను. ఎక్కువ సమయం లేక అన్నీ చూడలేదు. మీరిప్పుడు లింక్ ఇచ్చినందుకు థాంక్స్. మీరు చాలా ఫోటోస్ పెట్టారే. నేను కూడా పాపికొండల ఫోటోస్ , అండమాన్ ఫోటోస్ కోసమే ఒక ఫోటో బ్లాగ్ ప్రారంభించాలి.

    ప్రత్యుత్తరంతొలగించు