Loading...

30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

ఎందుకిలా???????

                        శరన్నవరాత్రుల గురించీ, బొమ్మలకొలువు గురించీ వ్రాశాను. స్నేహితులందరూ చూశారు. అభినందించారు.

             మన పండుగల గురించి వ్రాసుకోవటం సరే సంతోషంగా చేసుకోవటం ఉందా? ఎందుకు బయట పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయి. తెలుగు దేశం (పార్టీకాదు) లో ఎందుకీ గొడవలు?ఎందుకిలా జరిగింది? చాలా బాధగా ఉంది. రెండు వైపుల వాళ్ళు తమ వాదనలు విడిచి పెట్టలేరు. రెండు వైపులలో నాదీ ఒక వైపు వాదనే.    కానీ......

                 కానీ వీటన్నిటినీ మించి బాధ ఏంటంటే అసలిదంతా లేకుండా అందరూ ప్రశాంతంగా ఎప్పుడుంటారు? ఒకరినొకరు తిట్టుకోవటం ఎప్పుడు ఆగుతుంది? ఈ రోజు  రెండు వైపులా నీళ్ళుపోసి పెంచుతున్న ద్వేషపు విష వృక్షం ఎంత పెద్దగా పెరుగుతుందో ఏమిటో? దీన్ని ఏ అగ్ని కాల్చి బూడిద చేయగలదు? అందరూ కలిసి నేను, నీవు కాకుండా మనము అని ఎప్పుడు అంటారు?

                    ఈ చెట్టు పైకీ కొమ్మలు పెంచుకుంటూ , క్రిందికీ వేళ్ళూనుకుంటూ ఎంత భయంకరంగా పెరుగుతోంది? అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ద్వేషం కుమ్మరించుకోవటం కాక, పూర్వీకులను కూడా పంచుకోవటం ...వాళ్ళు మా వాళ్ళు , వీళ్ళు మీవాళ్ళు అంటూ.....ప్చ్...

28, సెప్టెంబర్ 2011, బుధవారం

బొమ్మలకొలువు

                       దసరా శుభాకాంక్షలు అందరికీ! దసరా కీ బొమ్మలకొలువు పెడతారు కొందరు. ఎక్కడ చూసినా బొమ్మలే అమ్మకానికి. చాలా బాగున్నాయి. ఇప్పుడైతే క్రికెట్ టీమ్ సెట్ కూడా కనిపిస్తోంది. మొదట పెళ్ళి వారి గుంపు , వాద్యకారులు, అష్టలక్ష్ములు, దశావతారాలు కనిపించేవి. భలే ముద్దొస్తున్నాయి బొమ్మలు.
                        శేషశయనుడు లక్ష్మీ దేవితో చాలా బాగుంటుంది బొమ్మ. ఇంకా పక్షులు , జంతువుల బొమ్మలు , గజేంద్రమోక్షం (నీటిమడుగులో ఏనుగు కాలును మొసలి పట్టుకున్న) బొమ్మ, నమస్తే చేస్తున్న బొమ్మలు, వినాయకుల బొమ్మలు జనాలకు ఆల్ టైమ్ ఫేవరేట్స్. ఇప్పుడు సాయిబాబా బొమ్మలు కూడా విరివిగా కనిపిస్తున్నాయి.
                     
                     బొమ్మలు కొలువు తీరటానికి మూడు, ఐదు, ఏడు, తొమ్మిది మెట్లతో ఉండే రెడీమేడ్ రేకు స్టాండ్ దొరుకుతుంది. దాంతో పాటు దీపాలంకరణ కోసం రంగురంగుల లైట్స్.చూట్టం కన్నులపండుగే.  అరవ్వాళ్ళు అమావాస్యనాడే అంటే (మహాలయ అమావాస్య) పెడతారు. మహర్నవమి వరకే వాళ్ళకు లెక్క. విజయదశమి విద్యార్థులు చదవాలి అనే విషయం తప్ప ఆ వేళ ఏ హడావిడీ ఉండదు.

                          ఆంధ్ర, కర్ణాటకల్లో విజయ దశమిరోజునే పెద్ద పండుగ అంటాము. ఆరోజు జమ్మిచెట్టుకు పూజ చేసి జమ్మి ఆకులు తీసికొని వచ్చి పెద్దల చేతిలో పెట్టి ఆశీర్వాదం తీసుకుంటాము. మా వూళ్ళో ఊరందరికీ కలిపి ఒకే పురోహితుడు ఉండే వాడు. వారితో కలిసి పిల్లలంతా, కొందరు పెద్దలు కూడా జమ్మిచెట్టుకు జరిగే విశేషమైన పూజలో పాల్గొనే వారు. ఆకులు తెచ్చుకునేవారు.

                          బొమ్మలకొలువు పెట్టినవాళ్ళు ప్రతిరోజూ ఏదో ఒక నైవేద్యం పెట్టి దీపాలు పెట్టి నలుగుర్నీ పిలిచి తాంబూలం ఇవ్వటం జరుగుతుంది. పదిరోజుల్లో రోజూ ఎవరో ఒకరికి ఇస్తూఉంటారు. కుంకుమ, పసుపు, తమలపాకులు, వక్క, ప్రసాదాలు, పళ్ళు, రవికగుడ్డలు లేదా ఏదైనా ఒక చిన్న గిన్నో, ప్లేటో ఇస్తూ ఉంటారు.
ఇలా పిలిచినపుడు వెళ్ళిన వాళ్ళంతా ఒక బొమ్మ కొని ఇంటివాళ్ళకు తీసికెళ్ళి ఇస్తే బాగుంటుందని మా స్నేహితురాలొకావిడ అనేది. ఎందుకంటే ప్రతీసారి అవే బొమ్మలే పైనుంచి తీసి తుడిచి పెట్టలేక కొన్నైనా కొంటూఉంటారు. ఒక్క బొమ్మ యాభై వరకూ పలుకుతుంటే ఎన్నని కొంటారు? ముఫ్ఫై, నలభై బొమ్మలన్నా కనీసం ఉంటే కొలువు బాగుంటుంది. కదా!
సలహా బాగుందని నేనూ అన్నాను.

బొమ్మల అందం వాటిపై మోహం ఎప్పటికీ తరగదండీ!