పంచభక్ష్య పరమాన్నాలు అని తఱచుగా వాడుతూ ఉంటారు. భక్ష్యాలతో పాటు పరమాన్నమా అబ్బో మనవాళ్ళు మంచి భోజన ప్రియులే అనుకుంటారు.
నిజానికి పంచభక్ష్యములు అంటే ---
భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చోష్యం, పానీయం .
మనవాళ్ళు ఆరోగ్య రహస్యాలు చక్కగా తెలిసిన వాళ్ళు అని అర్థమౌతోంది కదూ. తినే వాటితో పాటు నీటిని కూడా భోజనంలో ఉంచారు.
పంచామృతములు అంటే ---
ఉదకం, పాలు , పెరుగు, నేయి, తేనె.
మనం చక్కెర, అరటిపండ్లు, గోడంబి ఇంకా ఏవేవో వేస్తారు రుచిఅంటూను. కానీ నిజంగా జీవాన్ని నిలబెట్టేదయిన ఉదకం - నీటిని వదిలేస్తాం. పంచామృతాల్లో అదే మొదటిది.
చిన్నప్పుడు కథల్లో సప్త సముద్రాలు దాటి మర్రిచెట్టు దానికో తొర్ర అందులో ఓ చిలక , చిలకలో దాగిన అందాల రాకుమారి ని ఎత్తుకెళ్ళే రాక్షసుని ప్రాణాలు ఉండటం. చదివాం కదా. అబ్బే ఏడు సముద్రాలేమిటి ఉండేది ఒకటే అయితేను అని వాదించే ఉంటాం కదా అవి--
సప్తసముద్రాలు -----లవణసముద్రం , ఇక్షుసముద్రం , సురాసముద్రం, సర్పి సముద్రం, దధిసముద్రం, క్షీరసముద్రం, జలసముద్రం.
కొడుకే కావాలని పోయిన తరం వాళ్ళు ఉబలాట పడేవారు. ఇప్పుడేమో స్త్రీ - సమానత్వం అంటూ కూతురు ఉంటే చాలని సంబరపడిపోతున్నారు.
కానీ అంతకన్నా ముందున్న మనవాళ్ళు పాత తరాల వాళ్ళు ఎంతో అనుభవంతో ఏం చెప్పారో తెలుసా. మన వారసులుగా మన పేరు నిలబెట్టే ఏడు విషయాలని గుర్తించారు. సప్తసంతానాలు అన్నారు.
సప్త సంతానములు ---
తనయ/తనయుడు, తటాకం, కావ్యం, నిధానం, ఆలయం, వనం, భూదేవస్థాపనం
అష్టదిగ్గజాలని కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న కవులని అంటుంటాం కదా, ఎందుకంటారో తెలుసా? అష్టదిక్కులకు అష్ట గజాలని ఉంటాయి. (అష్ట దిక్పాలకుల కోసమేమో)
ఆ గజముల పేర్లు----
ఐరావతం, పుండరీకం, వామనం, కుముదం, అంజనం, పుష్పదంతం, సార్వభౌమం, సంప్రతీకం
చదరంగం అనే పేరు చతురంగాల సైన్యాలు ఉండటం వల్ల ఆ ఆటకు ఆ పేరు వచ్చింది.
ఆ నాలుగు రంగములు----
రథ, గజ , తురగ, పదాతి (కాల్దళము )
నవరత్నాలు ---
వజ్రం, వైఢూర్యం, గోమేధికం, పుష్యరాగం, మరకతం , మాణిక్యం,నీలం, ప్రవాళం, ముత్యం.