Loading...

16, జులై 2011, శనివారం

భూలోకానికి నిచ్చెనలు!!నేలమాళిగకు నిచ్చెనలు వేసుకొని పై మూత తీసి క్రిందికి దిగి నిలవ ఉన్న ధాన్యాలను పైకి తీసుకున్నట్లు
భూలోకానికి నిచ్చెనలు వేసుకొని వరుణదేవుడు భూమి లోపలి కంటా దిగి భూమితల్లి కడుపులోంచి
కాలానికి తగినట్లు అన్ని రకాల పండ్లు, కూరలు, గింజధాన్యాలు, పప్పుధాన్యాలు ఒకటేమిటి అన్నీ పైకి
తీసికొచ్చి ఇస్తూనే ఉన్నాడు. ఎంత దయామయుడో కదూ!

ఎన్ని తరాలకు సరిపడా దాచాడో ఈ భూమాళిగలో!
ఎన్నెన్ని యుగాలను పోషిస్తున్నాడో !
విరుచుకు పడితే నదులనీ పొంగిస్తాడు, కడలినీ కుదిపేస్తాడు
ఆయన కోపం ఎంతసేపు?
రోజులు లేదా వారాలు ఒకటీ ఎక్కువైతే రెండు
అందులో వేలమంది ప్రాణాలు పోతాయి, కోట్ల ఆస్తి నష్టమూ జరుగుతోంది.

కానీ కరుణ - ఏడాదంతా చూపిస్తాడు. వర్షాకాలం భూమిని తడిపి, నదులనీ చెరువుల్నీ కొత్తనీటితో నింపితే ఏడంతా కోట్ల మందికి ఆ నీరూ, నీటితో పండే ఆహారమూ ప్రాణాలు పోస్తున్నాయి. కోట్ల కోట్ల ఆస్తులు తయారవుతున్నాయి.
ఇచ్చినపుడు ఆనందంగా కాదు అదేదో మన హక్కు అన్నట్టుగా ఆ భగవంతుని పేరు కూడా ఎత్తకుండా అనుభవించేస్తాం. అందులో ఒక్కశాతం లాగేసుకుంటే శాపనార్థాలు పెట్టకుండా ఉండం.

అదే మానవుల అంటే మన విచిత్రమనస్తత్వం !!!!!

కానీ మిగతా చెట్టూ చేమా, పిట్టా పశువూ అన్నీ మనలాంటి ప్రాణులేగా.
ఇచ్చినపుడు మౌనంగా పుచ్చుకుంటాయి.
ఎండలో, వర్షంలో , చలిలో, గాలిలో ఎంత బాగా హాయి అనుభవిస్తాయి.
లాగేసుకున్నపుడు మౌనంగా కన్నీరు కారుస్తాయి. కానీ దేవుణ్ణి , వరుణ దేవుణ్ణి తిట్టవు. కదూ!
మనకేదో వాటికన్నా అదనంగా ఉందనుకుంటాం. ఏదీ ? తర్కానికి నిలబడుతుందా ?

మనిషిగా పుట్టటం కన్నా అడవిలో మానై పుట్టటం మేలు.
వానలు కురవటానికి కారణమై........
వానల రాకకు తోరణమై నిలబడి....
ఆహ్వానం పలుకుతూ .....
చినుకుల చేతుల పలకరింపుకి....
ఒళ్ళంతా తడిసి ముద్దై.....
పులకరించి పోతూ......
చూసే వారికి కనులవిందులు గా పరమానందాన్ని అందిస్తూ......
చిరుజల్లులతో వరుణుడు భూమాతకు అభిషేకం చేస్తుంటే...
విరిజల్లులతో పుష్పార్చన చేస్తూ...
పూతావుల ధూపాలతో విశ్వమే సుగంధాలు చిమ్మగా...
బ్రహ్మానందమే....................................!

10, జులై 2011, ఆదివారం

పలుకరే చిన్నారి చిలుకలై పలుకరే

పలుకరే చిన్నారి చిలుకలై పలుకరే
పాడరే పాడేటి కోయిలలై పాడరే ||

తెలుగులో వయారి నడకల మన తెలుగులో
పలుకరే చిన్నారులందరూ పలుకరే || || పలుకరే||


ఎచ్చోట కేగినా ఏ వృత్తి చేసినా
వచ్చేపోయే వాళ్ళెన్నెన్ని నేర్పినా

ఉగ్గుపాల తో నేర్చిన విలువలు వదిలేమా?
బంగరూయలకొరకు అమ్మఒడి వదిలేమా? || పలుకరే ||


చెఱుకు రసముల తీపి తేనెల్ల తీపి
జాలువారెడి తెలుగు ముద్దుగొలిపి

రతనాల వంటి దిగ్గజుల నోటి పలుకు
మన తాతలిచ్చిన ముత్యమ్ము మన లిపి


రాయరే చిట్టి చేతుల ముత్యాల లిపిలోన
రాయరే పిల్లలిక నందరును రాయరే || రాయరే ||


పలుకరే.................రాయరే .....

-లక్ష్మీదేవి