Loading...

17, డిసెంబర్ 2011, శనివారం

కబుర్లు (కాకరకాయల్లేవు)                                 తిల తండుల న్యాయము అంటారుట. అంటే నువ్వులు, బియ్యము కలిసి ఉన్నట్లు. తిల అంటే నూగులు, తండుల అంటే బియ్యము. ఇవి కలిపి ఉంచితే కలిసినట్టే ఉంటాయి.విడదీస్తే ఇట్టే విడిపోతాయి. బహుశా తోడికోడళ్ళు, తోడల్లుళ్ళలాగా అన్నమాట. కలిసి ఉంటే బాగున్నట్టే ఉంటారు. విడిపోవాల్సి వస్తే సంకోచించటం, బాధపడటం ఏముండదు. అంతేనా!

           మనము సంఖ్యల పేర్లు నేర్చుకోవటంలో శతకోటి వరకూ సాధారణంగా వాడుతుంటాము.
కానీ  తర్వాత....శతకోటి, అర్బుదము, న్యర్బుదము, ఖర్వము, మహాఖర్వము, పద్మము, మహాపద్మము , క్షోణి మహాక్షోణి, శంఖము, మహాశంఖము, క్షితి, మహాక్షితి, క్షోభము , మహాక్షోభము, నిధి, మహానిధి, పర్వతము, పరార్ధము, అనంతము, సాగరము, అవ్యయము, అమృతము, అచింత్యము, అమేయము, భూరి, మహాభూరి అని ముప్పదియారు స్థానసంజ్ఞలు అంటే అంకెల పేర్లున్నాయట మన భాషల్లో. మనము ఒకట్లు, పదులు , వందలు, వేలు, పదివేలు, లక్ష, పదిలక్షలు, కోటి, పదికోట్లు, వందకోట్లు (శతకోటి) దగ్గరే ఆగిపోయాము.
అంటే ఇంకా 26 ఎక్కువ ఉన్నాయి.ప్రాచీన భారతీయ గణిత విజ్ఞానంలో అన్నింటి కన్నా పెద్ద సంఖ్యగా "తల్ల క్షణం"నే చెప్పుకుంటారు.ఒకటి పక్కన 53 సున్నాలు పెట్టాలి. ( క్రింది వ్యాఖ్యలో శర్మ గారిచ్చిన సమాచారం.)

    మర్కటకిశోరన్యాయము అంటారే అంటే తల్లికోతిని గట్టిగా కర్చుకొని పిల్లకోతి ఉంటుంది.తల్లి కొమ్మలు, గోడలు ఎగిరినా , ఏంచేస్తున్నా తల్లి పిల్ల ఉండే స్పృహ లేకుండా తన పాటుకు తను ఉంటుంది. పిల్ల మాత్రం తల్లిని వదలనే వదలదు. క్రిందపడదు. చూట్టానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దీనికి సరిగ్గా వ్యతిరేకమైనది మార్జాలకిశోరన్యాయము. అంటే తల్లి పిల్లి తన పిల్లలను నోట కరచుకొని పోతూఉంటుంది. దీనిలో పూర్తిగా తల్లిపిల్లిదే బాధ్యత.ఇప్పుడు చాలామంది మనుష్యులు కూడా ఒక సంచీ తగిలించుకొని నడుస్తూఉంటారు. వాటిలో పిల్ల వేలాడుతూ ఉంటుంది. కోతి పిల్లకున్న అలవాట్లు మనిషిపిల్లకెలా వస్తుంది? అది పడిపోతే అప్పుడు తెలుస్తుంది.

          న హి సర్వ స్సర్వం జానాతి అంటే ప్రతి ఒక్కరూ, అన్ని విషయాలు తెలుసుకోవటం అసంభవం. ఒక్కరికి ఎన్ని విషయాలు తెలిసినా ఇంకా తెలియనివి ఉండవచ్చు. అవి ఇంకొకరికి తెలిసి ఉండవచ్చు. అలా ప్రతి ఒక్కరికి కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి. ఏదీ తెలియనివారని ఎవరినీ తీసిపారేయటానికి లేదు.అని అర్థము.

          కాకతాళీయం అంటే కాకి తాటి చెట్టు మీద వాలినపుడే తాటిపండు రాలితే కాకి వల్లే రాలిందనుకోవటం తప్పు. రెండూ వాటి ప్రమేయం లేకుండా ఒక్కసారే జరిగాయని అర్థము.
   
            ఇప్పుడు జరుగుతున్న ఖర నామ సంవత్సరము ప్రభవాది అరవై సంవత్సరాలలో ఇరవయ్యైదవది.

11 వ్యాఖ్యలు:

 1. ఎన్నో విషయాలు తెలిసాయండి...కాకతాళీయం కథ అదా? ధన్యవాదాలండీ. బాగా చెప్పారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. సుభ గారు,
  నిజమండీ, మనకు తెలియకుండా ఎన్నో పదాలు వాడేస్తుంటాము.
  జాము అంటే మూడుగంటలకాలమని, ముహూర్తమంటే దాదాపు గంట కాలమని(నలభై నిముషాలేమో) తెలియకుండా చాలాపెళ్ళిళ్ళలో గడియారం వంకచూసి ఆ ...ఇదే ముహూర్తం. ఖచ్చితంగా ఇన్ని నిముషాలైంది అంటుంటారు. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మందాకినిగారూ..!
  అర్బుదం, సాగరం, అని సంఖ్యల పేర్లు చెప్తూంటే, అన్నీ వదలకుండా రాసి ఉంటారని ఆశిస్తూ చదివిన నాకు, "తల్ల క్షణం" మిస్‌ చేసి కొద్దిగా అసంతృప్తిని కలిగించారు... బహుశా "తల్ల క్షణం" అంటే మీకు తెలిసే ఉంటుంది. ఒకటి పక్కన 53 సున్నాలు పెట్టాలి.
  ప్రాచీన భారతీయ గణిత విజ్ఞానంలో అన్నింటి కన్నా పెద్ద సంఖ్యగా "తల్ల క్షణం"నే చెప్పుకుంటారు.
  ఏది ఏమైనా మంచి విషయాలు తెలియజేసినందుకు, ఆరో తరగతి పాఠాన్ని, పెద్ద బాల శిక్షనీ మళ్ళీ గుర్తు చేసినందుకు, ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 4. శర్మగారు,
  మన్నించాలి. ఇవన్నీ నాకు తెలిసి చెప్పలేదు. చిన్నప్పుడు ఇవేవీ మా సిలబస్ లో లేవు. నేను పెద్దబాలశిక్ష చదివే వ్రాస్తున్నాను. ఇవన్నీ తెలియని నా తరంతో పంచుకుందామని.
  మీరు తల్లక్షణం గురించి చెప్పి మంచి పని చేశారు. ఈ సమాచారం పై వాటితో చేరుస్తాను. నేను పాతూరి సీతారామాంజనేయులు గారు సంపాదకత్వంలో వచ్చిన పెద్ద బాలశిక్ష ఆధారంగా వ్రాశాను.అందులో ఇంతే ఉంది. తల్లక్షణం మాట లేదు. మీకు అనేక ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మందాకినిగారు..!
  మీ తరంతో పంచుకుందామని అన్నారు.. మీరే ఉద్దేశ్యంతో అన్నారో నాకర్థం కాలేదుగానీ, నాకర్థమైంది మాత్రం నేనేదో యాభై, అరవై యేళ్ళవాణ్ణని భావించారేమోనని..
  బహుశా, నా పేరు వల్ల కావచ్చు..! అదే అయితే మాత్రం మీరు పొరబడినట్టే.. నేను ఇరవయ్యేళ్ళ కుర్రాణ్ణి... "విద్యార్థి"ని కూడా..!
  హేపీగా అసలు పేరు రాయకుండా "వామనగీత" అని బ్లాగుపేరు పెట్టుకుని కామెంటేవాణ్ణి.. గూగుల్‌ ప్లస్‌ దయవల్ల, అది రాకుండా పోయింది..,
  పై వ్యాఖ్యలో "అసంతృప్తి"ని "నిరాశ"గా మార్చుకొమ్మని మనవి..!

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మీ తరువాతి తరమయిన నేను అమేయం దగ్గర ఆగిపోయాను. ఆ తరువాతవి ఇప్పుడే తెలిసాయి!

  ప్రత్యుత్తరంతొలగించు
 7. శర్మ గారు, మళ్ళీ మన్నించాలి.
  నేను మీ ప్రొఫైల్ ఆలస్యంగా చూశాను. మీరు ఐఐటి విద్యార్థి అని తెలిసి ఎంత చక్కగా ఈ విషయాలన్నీ తెలుసుకున్నారో అని అబ్బురపడ్డాను. ఈ విషయాలు నా వ్యాఖ్యలో చేర్చి వ్రాశాను. కానీ సగమే పేస్ట్ అయింది. తర్వాత పవర్ ప్రాబ్లమ్స్ వల్ల వ్రాయలేకపోయాను.
  మీ వామన గీత నేను ఎప్పుడూ చదువుతుంటానండీ.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. రసజ్ఞ గారు,
  మీరు శర్మ గారి తర్వాతి తరమా! అయితే నేను మీ తర్వాతి తరము.:))
  ఎందుకంటే పైన చెప్పినట్టు నాకు శతకోటి వరకే తెలుసు. పెద్దబాలశిక్ష పేరు మాత్రమే విన్నా. అందుకే ఇప్పుడు కొని చదువుతూ ఉంటానప్పుడప్పుడు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. హహహ మందాకిని గారూ నేనూ శర్మ గారూ ఒకే తరం! నేనన్నది మీ తరువాతి తరం అని! నేను కూడా ఒక విద్యార్ధినినే!

  ప్రత్యుత్తరంతొలగించు
 10. రసజ్ఞగారు, సరదాకన్నానండీ, మొత్తంమీద నన్ను ముసలిదాన్ని చేశారన్నమాట. ఒకె.
  పోతే, నేనూ విద్యార్థినే. పరీక్షలకు కడితేనే విద్యార్థి అనికాదుకదా, నిరంతరం నేర్చుకునే బాటలో ఉండేదాన్ని అని అర్థము.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..

  ప్రత్యుత్తరంతొలగించు