Loading...

13, ఆగస్టు 2011, శనివారం

దోచుకున్నంత దోచుకుని పారిపోయారు.


                            మన వాళ్ళు దొంగలని తరిమి కొట్టారు. చెప్పాలంటే అలా చెప్పాలి కానీ మనకు స్వతంత్రం వచ్చిన రోజని చెప్పడం బాలేదు. వందల ఏళ్ళు దోచుకొని తిన్న దొంగలని, ఇంటి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి దుష్టులని రకరకాలుగా వెళ్ళగొట్టాలని ప్రయత్నించారు మనవాళ్ళు. కొట్టేవాళ్ళు కొట్టారు. చంపేవాళ్ళు చంపారు. మాటలతో , సత్యాగ్రహాలతో , నినాదాలతో కొంతమంది వెళ్ళిపొమ్మని అడిగారు. ఇన్ని రకాలు చేసినా చూరు పట్టుకొని వేళ్ళాడి ఇక తప్పక వెళ్ళిపోయారు.

                                        (పారిపోయారు ఇక మెయిన్ టెయిన్ చేయలేక) దోచుకున్నంత దోచుకుని పారిపోయారు. నేనిలాగే అంటాను.
                              నాకు తెలుసు మీలో కొందరంటారు. వాళ్ళెక్కడ పారిపోయారు, దొరల్లాగా ఫలానా తారీకున పోతామని చెప్పి పోయారని. వాళ్ళెన్నివేషాలు వేసినా, డాంబికాలు పోయినా, సొంత ఇంటివాళ్ళం పొమ్మంటేనే పారిపోయారు.మనవాళ్ళు ఆస్తులను, ప్రాణాలను, బంధాలను అన్ని వదిలేసి దేశం కోసం పోరాడితేనే దేశానికి పట్టిన చీడ వదిలింది.అప్పుడు మన పెద్దలు అంత సీరియస్ గా దేశం మీద అటాచ్మెంట్ చూపించారు గనకనే ఈవేళ మనం ఇలా ఉంటున్నాం. లేకపోతే వాళ్ళు అనుభవించిన కష్టాలే మనం అనుభవించాల్సి వచ్చేది. అప్పుడుకానీ తెలిసేది కాదు వారి త్యాగాల విలువ.

                              వారి గురించి చదువుకోవటం మానేశాం. సినిమాలు తియ్యటం మానేశాం. ఇపుడు తీస్తే అప్పటికాలం లో ఎవరో ఒక విదేశీవనితకూ, భారతీయునికీ/భారతీయ వనితకూ, విదేశీయునికీ
 జరిగిన ప్రేమ ని హైలైట్ చేసి తీస్తారు. అదో పెద్ద హిట్ అవుతుంది.

                                             ఒక జోధాఅక్బర్, ఒక మదరాసుపట్టినమ్ అలాంటివే గా.

                                 ఆనాటి కష్టాలేంటో, వాళ్ళు పడిన చిత్రహింసలేమిటో, ఆనాటి నరక సదృశ జీవన పరిస్థితులేంటొ ఎవరికీ తెలీదు. ఏమన్నా చెప్పబోతే లైట్ తీసుకో అనటమే.
చరిత్ర ప్రతీ జాతీ తెలుసుకోవాలి. తండ్రెవరో తెలీకపోవటం లాంటిదే , చరిత్ర తెలీకపోవటం. చరిత్ర చదివేవాళ్ళకూ దానివిలువ తెలీకుండా డిగ్రీ కోసం చదవటం, ప్రొఫెషనల్ కోర్స్ ల్లో చరిత్ర అసలు లేకపోవటం ఆత్మహత్యా సదృశం. ఎన్నాళ్ళు, ఎన్ని చదువులు చదివినా, అన్నిట్లో స్వంతభాష, స్వంతచరిత్ర తప్పనిసరిగా ఒక విషయంగా ఉండాలి.

9 వ్యాఖ్యలు:

 1. మందాకిని గారూ, స్వాతంత్ర దినోత్సవ ఆహ్వానానికి సన్నాహాలు చేస్తున్న మీకు ముందుగా శుభాభినందనలు

  ఇక విషయంలోకి వస్తే మనకు భారతీయ చరిత్రలోనే "రోజువారీ సామాన్య మానవుని" కష్టాలు, వాడి చిన్న చిన్న ఆనందాలు, సంతోషాలు ఇవి చరిత్ర పుస్తకాలలో లేదా సాహిత్య పుస్తకాలలో కనిపించడం మహా అరుదు. మనము కాల్పనిక సాహిత్యానికిచ్చిన విలువ సమకాలీన సాహిత్యానికివ్వలేదేమో. ఇవ్వలేదేమో అనేదానికంటే మనకు రోజూవారీ కష్టాలను వినడంకంటే కల్పన వినడం ఇష్టమైవుండవచ్చు. దానితో కాల్పనిక సాహిత్యానికి వచ్చిన ఆదరణ వాస్తవిక సాహిత్యానికి రాలేదనుకుంటాను. ఇక భారతదేశానికి మొన్నమొన్నటి వరకూ చరిత్రపుస్తకాలంటే సాహిత్యపుస్తకాలే. ఆ తరువాత వచ్చిన చరిత్ర పుస్తకాలు కూడా సగటు మనిషి సాంఘిక చరిత్రను భద్రపరిచినవి చాలా అరుదనే చెప్పాలి.

  కాబట్టి ఇప్పటి మనకు రాచరికంలో వున్న కష్టాలు అసలుకే తెలిసే అవకాశం లేదు. ఆంగ్లేయుల పాలనలో ఎలా ఇబ్బందుల పాలైంది ఒకటి అరా పుస్తకాలున్నా ఇప్పటి సమాజానికి స్వాతంత్ర్యం దాని విలువ తెలియదు కాబట్టి పెద్దగా బుఱ్ఱకెక్కుతాయని నమ్మకమూ లేదు. కోట్లు పెట్టి తీసే సినిమాల్లో ఇలాంటి మసాలా లేని కథలను ఎక్కించి నిర్మాతలూ ఆర్థికనష్టాన్నీ మూట గట్టుకోలేరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. "ఇక విషయంలోకి వస్తే మనకు భారతీయ చరిత్రలోనే "రోజువారీ సామాన్య మానవుని" కష్టాలు, వాడి చిన్న చిన్న ఆనందాలు, సంతోషాలు ఇవి చరిత్ర పుస్తకాలలో లేదా సాహిత్య పుస్తకాలలో కనిపించడం మహా అరుదు"


  నేనెక్కువ పుస్తకాలు చదవలేదు(దురదృష్టవశాత్తూ మన సాహిత్యాన్ని చులకన చేసే తరం తయారు చేసిన పాఠాలనే నేనూ చదువుకున్నాను)కాబట్టి మీరు చెప్పినంత ఖచ్చితంగా మన సాహిత్య/చరిత్రపుస్తకాల్లో "రోజువారీ కష్టాలు " లేవు అని చెప్పలేను. ఒక్క ఆముద్యమాల్యద చూస్తే అందులో సామాన్యుల లైఫ్ స్టైల్ కనిపిస్తుంది.ఇంకా శ్రీనాథుడు కూడా సామాన్యుల ఆహారపు అలవాట్లు, రాజుల మూర్ఖత్వాలు చెప్పాడు, ధూర్జటి కూడా రాజుల మనస్తత్వాలను నిశితంగా విమర్శించాడు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. " మనము కాల్పనిక సాహిత్యానికిచ్చిన విలువ సమకాలీన సాహిత్యానికివ్వలేదేమో. ఇవ్వలేదేమో అనేదానికంటే మనకు రోజూవారీ కష్టాలను వినడంకంటే కల్పన వినడం ఇష్టమైవుండవచ్చు. దానితో కాల్పనిక సాహిత్యానికి వచ్చిన ఆదరణ వాస్తవిక సాహిత్యానికి రాలేదనుకుంటాను"


  నిజమే. అందుకే కొంతవరకూ కంపల్సరీగా పెట్టాలి అంటున్నాను.
  సాహిత్యము అని తెలుగులో ఛందస్సులో ఉంది కాబట్టి అంటున్నారు. కానీ అందులో రాజనీతిశాస్త్రము, అర్థశాస్త్రము, గణితము అన్నీ ఛందస్సులో చెప్పినపుడు అంతా కల్పనా సాహిత్యమే అన్న లెక్కకు రాలేముకదా, చరిత్ర కూడా అలానే చెప్పి ఉండవచ్చు. మనకు అన్ని పుస్తకాలూ లభ్యతలో ఉన్నాయా ఏమిటి?

  ప్రత్యుత్తరంతొలగించు
 4. "ఇక భారతదేశానికి మొన్నమొన్నటి వరకూ చరిత్రపుస్తకాలంటే సాహిత్యపుస్తకాలే. ఆ తరువాత వచ్చిన చరిత్ర పుస్తకాలు కూడా సగటు మనిషి సాంఘిక చరిత్రను భద్రపరిచినవి చాలా అరుదనే చెప్పాలి. "

  రాచరికంలో కష్టాలు మనకు తెలియక పోయినా, ఆంగ్లేయులు/ ముస్లిం ల పాలనలో ఉన్న కష్టాలైనా తెలిసి తీరాలి. ఇలా అనటం తప్పనకండి . ఎందుకంటే ఇంట్లో నాన్న గారు కొట్టటం కన్నా, మనకు కావలసిందంతా దొరక్కపోయినా ఉండే కష్టం వేరు. ఇంట్లో దొంగలు పడి ఇంట్లో వాళ్ళని తన్ని, వస్తువులన్నీ నాశనం చేసి , టెలిఫోన్ వైర్లు పీకేసి, నగలెత్తుకు పోవటంలో ఉండే కష్టం వేరు. ఈ రెండు కష్టాల్లో ఏది మీకు పెద్దది గా కనిపిస్తుంది? అదే నా సమాధానం

  ప్రత్యుత్తరంతొలగించు
 5. "కాబట్టి ఇప్పటి మనకు రాచరికంలో వున్న కష్టాలు అసలుకే తెలిసే అవకాశం లేదు. ఆంగ్లేయుల పాలనలో ఎలా ఇబ్బందుల పాలైంది ఒకటి అరా పుస్తకాలున్నా ఇప్పటి సమాజానికి స్వాతంత్ర్యం దాని విలువ తెలియదు కాబట్టి పెద్దగా బుఱ్ఱకెక్కుతాయని నమ్మకమూ లేదు. "


  ఈ విషయం నిజమే . పతీవ్రతమూ, పత్నీ వ్రతమూ కాన్సెప్ట్ ఇప్పటివాళ్ళకు అర్థం కానట్టే స్వేచ్ఛ విలువ తెలీకపోవచ్చు. అంతమాత్రాన చెప్పటం మానేయకూడదు. సంవత్సరం బాబుకి నోట్ల కట్ట విలువ తెలీనట్టే. చెప్పగా చెప్పగా తెలుస్తుందని మనం పనికట్టుకుని నేర్పించమూ? ఇదీ అలాగే చెయ్యాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. "కోట్లు పెట్టి తీసే సినిమాల్లో ఇలాంటి మసాలా లేని కథలను ఎక్కించి నిర్మాతలూ ఆర్థికనష్టాన్నీ మూట గట్టుకోలేరు."


  మసాలా లేనికథలు అని ఆలోచించే నిర్మాతలకు మనమేం చెప్తాం లెండి. మంచి నిర్మాతలూ ఉన్నారు. కొన్ని మంచి సినిమాలూ మనకు వచ్చాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మీ అభిప్రాయం చెప్పినందుకూ, నా అభిప్రాయాన్ని మరింత విస్తారంగా చెప్పే అవకాశం ఇచ్చినందుకూ మరీ మరీ మరీమరీ ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. మీరు చెప్పింది నిజమేనండీ..
  హిస్టరీ ఒక సబ్జెక్ట్ గా చదివిన ప్రతి విద్యార్ధికీ చరిత్ర పూర్తిగా తెలిసుంటుంది అనుకుంటే
  అది నేతి బీరకాయలో నెయ్యి వుంటుంది అనుకోవటంతో సమానమని అప్పట్లో ఒక జోక్ వుండేది ..
  డిగ్రీ కోసమే చరిత్రను కంఠతా పట్టి తర్వాత మర్చిపొవటం నిజమే..

  మీకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 9. నాతో ఏకీభవించినందుకు ధన్యవాదములండీ!

  ప్రత్యుత్తరంతొలగించు