Loading...

3, ఆగస్టు 2011, బుధవారం

సార్థకత - పూల మనోవీథిలో "ఉదయిశ్రీ" సంచారం


ఇది కరుణశ్రీ డాక్టర్ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ఉదయశ్రీ అను కవితా సంపుటిలోనిది.

అర్చకులొనర్చు పూజల నందుకొనుచు
గుళ్ళలోపల హాయిగా కూరుచున్న
దైవముల తలకెక్కి  తైతక్కలాడి
కులుకరింపగ మా మది కోర్కె లేదు.


గంధపొడి గాలిపై చల్లి విందులిడి మ
రంద బిందువులు మిళింద బృందములకు
సిగ్గు విడనాడి ఉచ్చిష్ట జీవితమ్ము
గడుపుటకు మా మదిని కౌతుకమ్ము లేదు.


హాయి మేయుచు శయ్యా గృహాంతరముల
పూలపాన్పులపై బడి పొరలుచున్న
మనుజ మహిషాల అడుగున మణగిపోయి
కమలిపోవగ మాకు నుత్కంఠ లేదు.


తొడిమి లెడలించి చించి తంతువులతోడ
గొంతులు బిగించి దండలు గ్రుచ్చి మమ్ము
ముడుచుకొను మోహనాంగుల ముడులమీద
ఫేషనులు దిద్ద మా కభిలాష లేదు.


ప్రణయినీ మృదులాంగళీ రచిత పుష్ప
దామమై ప్రేమమయు కంఠసీమ నలరి
వలపు కౌగిళ్ళ సందున నలిగి నలిగి
పరవశత నంద మాకు సంబరము లేదు.


ఒక ప్రశాంత ప్రభాతాన, ఒక్క మంద
మలయ మారుతవీచిలో పులకరించి
మెల్లగా తల్లి చల్లని కాళ్ళపైన
రాలి కనుమూసికొనుటె సార్థకత మాకు!!

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి