Loading...

23, జులై 2011, శనివారం

చిన్న చిన్న విషయాలు
పంచభక్ష్య పరమాన్నాలు అని తఱచుగా వాడుతూ ఉంటారు. భక్ష్యాలతో పాటు పరమాన్నమా అబ్బో మనవాళ్ళు మంచి భోజన ప్రియులే అనుకుంటారు. 
నిజానికి పంచభక్ష్యములు అంటే ---
                భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చోష్యం, పానీయం .
మనవాళ్ళు ఆరోగ్య రహస్యాలు చక్కగా తెలిసిన వాళ్ళు అని అర్థమౌతోంది కదూ. తినే వాటితో పాటు నీటిని కూడా భోజనంలో ఉంచారు.

పంచామృతములు అంటే ---
             ఉదకం, పాలు , పెరుగు, నేయి, తేనె. 
మనం చక్కెర, అరటిపండ్లు, గోడంబి ఇంకా ఏవేవో వేస్తారు రుచిఅంటూను. కానీ నిజంగా జీవాన్ని నిలబెట్టేదయిన ఉదకం - నీటిని వదిలేస్తాం. పంచామృతాల్లో అదే మొదటిది.

చిన్నప్పుడు కథల్లో సప్త సముద్రాలు దాటి మర్రిచెట్టు దానికో తొర్ర అందులో ఓ చిలక , చిలకలో దాగిన అందాల రాకుమారి ని ఎత్తుకెళ్ళే రాక్షసుని ప్రాణాలు ఉండటం. చదివాం కదా.  అబ్బే ఏడు సముద్రాలేమిటి ఉండేది ఒకటే అయితేను అని వాదించే ఉంటాం కదా అవి--
సప్తసముద్రాలు -----లవణసముద్రం , ఇక్షుసముద్రం , సురాసముద్రం, సర్పి సముద్రం, దధిసముద్రం, క్షీరసముద్రం, జలసముద్రం. 

కొడుకే కావాలని పోయిన తరం వాళ్ళు ఉబలాట పడేవారు. ఇప్పుడేమో స్త్రీ - సమానత్వం అంటూ కూతురు ఉంటే చాలని సంబరపడిపోతున్నారు.
కానీ అంతకన్నా ముందున్న మనవాళ్ళు పాత తరాల వాళ్ళు ఎంతో అనుభవంతో ఏం చెప్పారో తెలుసా. మన వారసులుగా మన పేరు నిలబెట్టే  ఏడు విషయాలని గుర్తించారు. సప్తసంతానాలు అన్నారు.
సప్త సంతానములు ---
          తనయ/తనయుడు, తటాకం, కావ్యం, నిధానం, ఆలయం, వనం, భూదేవస్థాపనం

అష్టదిగ్గజాలని కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న కవులని అంటుంటాం కదా, ఎందుకంటారో తెలుసా? అష్టదిక్కులకు అష్ట గజాలని ఉంటాయి. (అష్ట దిక్పాలకుల కోసమేమో)
ఆ గజముల పేర్లు----           
            ఐరావతం, పుండరీకం, వామనం, కుముదం, అంజనం, పుష్పదంతం, సార్వభౌమం, సంప్రతీకం

చదరంగం అనే పేరు చతురంగాల సైన్యాలు ఉండటం వల్ల ఆ ఆటకు ఆ పేరు వచ్చింది. 
ఆ నాలుగు రంగములు----
       రథ, గజ , తురగ, పదాతి (కాల్దళము )
నవరత్నాలు ---
  వజ్రం, వైఢూర్యం, గోమేధికం, పుష్యరాగం, మరకతం , మాణిక్యం,నీలం, ప్రవాళం, ముత్యం.

3 వ్యాఖ్యలు:

 1. బావున్నాయి, అలాగే

  తాపత్రయం లో ముడు ఏమి?

  పంచదార లో అయిదు ఏమి? కుడా చెప్పండి. చాల రోజులుగా వెతుకుతున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అలాగే, తాపత్రయం లో ముడు, పంచదార లో అయిదు ఏమిటో కూడా చెప్పగలరు.

  చాల రోజులుగా వెతుకుతున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. తాపత్రయములు -- ఆధ్యాత్మికము, ఆధిభౌతికము, ఆధిదైవికము.
  ఇక మీరు పంచదార అని దేన్ని అంటున్నారో అర్థం కాలేదండి.
  అయినా వెతికి మరీ తెలుసుకునే మీరు ధన్యులండి.

  ప్రత్యుత్తరంతొలగించు