Loading...

22, జూన్ 2011, బుధవారం

అయోమయం


ఏమిటో నాకు వింతగా అనిపిస్తుంది.భయంగా ఉంటుంది, భవిష్యత్తును తలచుకుంటే. కూరలో, సరుకులో ఏం కొనాలని వెళ్ళినా ఈరోజు ఉన్న ధరలు ఇంకో రెండు రోజుల్లో ఉండవు. అమాంతం అంతలా ఎలా పెరుగుతాయో , ఏమో అంతా అయోమయంగా ఉంటుంది. కూరలన్నీ యాభయ్, అరవైల్లో నే ఉంటాయి. పప్పుల ధరలూ అలా పెరిగిపోతూనే ఉన్నాయి. కొబ్బరినూనె నేను సీల్డ్ ది కొనను. విడిగా కొని కాస్తాను. వెళితే ఒకేసారి యాభయ్ రూపాయలు లీ.కు పెరిగింది. వాళ్ళు చెప్పింది మనం నమ్మాలి కదా!

వ్యాపారం చేసేవాళ్ళు సాధారణంగా అబద్ధం చెప్పరనను. కానీ పక్క అంగట్లో ఉన్నధరకు మరీ తేడా ఉండేలా వాళ్ళూ చెప్పలేరని ఒక నమ్మకం. ఎప్పుడూ కొనే చోట్ల అంగడి వాళ్ళను నమ్మకుండా ఎలా జరుగుతుంది? ఆటో వాళ్ళు ఉన్నట్టుండి పెంచేస్తారు. ఇంకో ఏరియాలొ ఇదే దూరానికి అలా తీసుకోరని తెలిసినా ఇవ్వాల్సిందే వీళ్ళకు.

ఏం చేద్దాం? ఎందుకు పెరుగుతాయో, ఎలా పెరుగుతాయో , ఎప్పుడు పెంచాలని నిర్ణయం తీసుకుంటారో, అక్కడ ఎక్కడో సమ్మెలు జరిగితే వీళ్ళెందుకు పెంచుతారో , ఏమో ! ఏం తెలీట్లేదు. పోన్లే ఇవన్నీ ఎంతయినా ఒకట్లు, పదులే కదా పోనిద్దూ అనిపిస్తుంది, టీ.వీలూ, ఫాన్లూ, ఏసిలూ, ఎమ్ పి ౩ ప్లేయర్లూ, ఏ ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నా వ్యాపారస్తుడు చెప్పింది నోరుమూసుకొని ఇస్తున్నాం కదా , ఇక్కడ ఏం మిగిలించుకుంటాం అనిపిస్తుందికదా! ఈ రోజువారీ వస్తువులు నిత్యావసరాలు. ఇవి లేకపోతే ఏం తింటాం, ఎలా బ్రతుకుతాం ? టీ.వీలూ గట్రా లేకపోతే జీవనం ఆగిపోదు. తిండీ, నీళ్ళూ లేకుండా మనుగడ ఎట్లా?
కొన్ని ప్రాణులు చక్క గా గాలి , నీళ్ళు పీల్చి బ్రతుకుతూ ఉంటాయి. అదే నయం . ఔను మరి మొక్కలు గాలి, నీళ్ళు పీల్చి బ్రతుకుతున్నాయి. మనం అలా ఉంటే ఎంతబాగుండేదో! మనిషై పుట్టే కన్నా అడవిలో మానై పుట్టడం మేలంటారు కదూ! నూటికి నూరుపాళ్ళూ నిజం సుమండీ. ఉన్న చోటునుండి కదలకుండా అన్ని జీవులకూ సహాయం చేయవచ్చు. మన మనుషులు ఉన్నారే , ఎన్ని ఉన్నా చాలవు మనకు. శాకాహారులం కొంతలో కొంత నయం. కదలని ప్రాణులు అదే మొక్కల్లోంచి వచ్చే కూరలు, ధాన్యాలు వంటివి సరిపోతాయి. మాంసాహారులు అయితే కదిలే ప్రాణుల్నీ వదలరు. ఇంకానయం చైనా వాళ్ళ ఆహారపు అలవాట్లు తెలిశాక మిగిలిన మాంసాహారులు నయం అనిపిస్తుంది. వాళ్ళు పాముల్నీ , కప్పల్నీ కూడా వదలరుట.

ఇకమీదట మనుష్యుల్ని తినేవాళ్ళు కూడా వస్తారంటారా? అయితే జనాభా అయినా తగ్గుతుందేమో. (జోక్ పేలలేదా!!!)
మనదేశం వ్యవసాయ ప్రధాన దేశం అని పుస్తకాల్లో చదవటమే కానీ మన పరిచయస్తుల్లో ఎంత మంది వ్యవసాయం చేస్తున్నారు చెప్పండి? పొలాలు ఉన్నాయి కౌలుకిచ్చాం అని చెప్పేవాళ్ళు లెక్కలేదు. మనకున్న భూమి ఎంత? ఎంతమంది ఇష్టపడి చేస్తున్నాం ? అబ్బే మనకు రిస్కు ఎందుకు అని నెలజీతాల మోజులో పడి ఏదో బ్రతికేస్తున్నాం. మనం ఇలా ఉంటే దేశం ఎప్పటికి బాగుపడేను? ఎప్పుడు ధరలు తగ్గేను? మనకు కావలసినవన్నీ కావలసినంత పండిస్తే ఇంతలా ధరలు ఎందుకు పెరుగుతాయి? అలాంటి రోజులు సమీప భవిష్యత్తులో కనిపించటం లేదు. అందుకు తగిన ప్రయత్నం మనం చేయటం లేదు. అది నిజం. అందరూ ఒప్పుకోవాల్సిన నిజం.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి