Loading...

20, ఫిబ్రవరి 2011, ఆదివారం

తన భాషయె తనకు రక్ష !బుద్ధిజీవి అంటే ఆలోచించే శక్తి గలిగిన ప్రాణులు మనుష్యులు. కేవలం పని చేయటం , కనీసావసరాలు సమకూర్చుకోవటం మాత్రమే కాకుండా, మిగతా ప్రపంచంతో సంబంధబాంధవ్యాలు నెఱపటం చేస్తూ, తన ఉనికిని నెలకొల్పటానికి ప్రయత్నిస్తారు. అంటే మిగతా ప్రాణులకూ ఏదో ఒక భాష ఉండొచ్చు. కానీ మనుష్యులు భాషను, సంస్కృతిని నిరంతరం వృద్ధి చేయటం ద్వారా తన ప్రత్యేకతను నిలుపుకుంటారు.

అలాంటిది మనమీ వేళ మన భాషని , తీయని తెలుగుని నాలుగు ఆంగ్ల మాటల మధ్య వెతుక్కోవాల్సి వస్తోంది. మారుమూల పల్లెల్లో కూడా రోడ్ లాంటి పదాలు వాడుతూ దారి అనే పదమే మరిచిపోయినట్టయింది. ఎందుకిలా జరిగింది అని ఒక ప్రశ్న కి జవాబులు ఇవ్వలేక ఎందుకు మన భాష?ఎందుకు తెలుగు ? ప్రపంచం అంతా మాట్లాడే ఆంగ్లం చాలదా? అనే మిథ్యావాదం ఒకటి బయలుదేరింది. అవును, ప్రపంచం అంతా ఆంగ్లం తెలిసి ఉంటారనుకోవటం బుద్ధిలేనితనం. మనం వేలం వెర్రిగా వెంటపడే అమెరికా, ఇంగ్లండు , మరికొన్ని దేశాలుంటాయి అంతే.

మన భాష అనేది ఎందుకు?

ఉదాహరణకు మనం ఒక కార్యాలయంలో గాని, వ్యాపారంలో గాని, ఇంటిపనుల్లో గాని, అభిరుచుల్లో గాని రాణించాలంటే మనదైన ఒక శైలిని పెంపొందించుకుంటాం. అలాగే ఈ సమాజంలో మన ఉనికిని ప్రత్యేకతను చాటుతూ మనదైన తెలుగు భాష, నాగరికత మనకున్నాయి. పదహారు కోట్ల మంది సొంతమైన ఈ భాష ను మనం ఈ నాటి పరిస్థితులలో మనం జాగరూకతతో కాపాడుకోవాలి. ఈ వేళ యువతరం తెలుగుతో కనీస పరిచయం లేకుండా పెరుగుతున్నందుకు మన బాధ్యత ఎంత ఉంది అనే విషయం మనం గమనించాలి.
సుమారుగా యాభయ్యేళ్ళక్రితం చదువుల్లో మన సాహిత్యం అక్కరలేదు అని భావించారేమో అనిపించేలా, మిగతా సాంకేతిక విద్యలను, పర భాషలను చదవటాన్ని విపరీతంగా ప్రోత్సహించటం.
సుమారు పదేళ్ళ క్రిందట నుంచి మాధ్యమం కూడా ఆంగ్లమే కావాలని పెద్దలు (ఇంట్లో పెద్దలు, పాఠశాలలో పెద్దలు, శాసనాలు చేసేవాళ్ళు) కొంచెం ఎక్కువగానే భావించడం.
విదేశీమోజు విపరీతంగా పెరగటం.

భాష సరే సాహిత్యం ఎందుకు?
మన సాహిత్యం ఎందుకు? అందులో వీర , శృంగార రసాల పేరుతో కల్పనా సాహిత్యం యొక్క ప్రయోజనం ఏమిటి? అనే వాదన తఱచూ వింటూ ఉంటాం. మన సాహిత్యం లో వీటితో పాటు ఎన్నో విషయాలు ఉంటాయి. ఒక ఆసక్తిని రేకెత్తించటం కోసం ఈ విషయాలని కవులు, లేఖకులు వాడుకున్నా, అందులో మానసిక పరిపక్వత స్థాయిని పెంచే అమూల్య విషయాలు మనకు సహజంగా అలవడేలా చేస్తాయి.

సభ్యసమాజపు రీతులు చర్చింపబడతాయి.
రెండు తరముల మధ్య అంతరాలు తగ్గిస్తూ సత్సంబంధాలు ఏర్పరుస్తాయి.
వ్యక్తిగత, సామాజిక బాధ్యతగురించి ప్రతీ మనిషినీ హెచ్చరిస్తాయి.

అంటే నలుగురితో కలిసి మెలిసి జీవించేటప్పుడు మన నాగరికత తెలిసిన మనుష్యుల్లా మసలుకోవాలంటే ఏం చేయాలి అనేది ముఖ్యంగా తెలుస్తుంది.అప్పుడు జీవితంలో ప్రశాంతత వస్తుంది. మన సాహిత్యానికి మాత్రం ఇది ప్రత్యేకమా ఏమిటి అని ప్రశ్న రావచ్చు. మనకు మన సంస్కారాన్ని తెలిపేది మన సాహిత్యమే అయి ఉండాలి. అన్ని సాహిత్యాలనీ చదవవచ్చు. చదవాలి కూడా. మునుపటి రోజుల్లో మాత్రం మన పెద్దవాళ్లు సంస్కృతం, తమిళం, కన్నడం, హిందీ, ఆంగ్లం , ఫ్రెంచ్ చదవలేదా ఏమిటి? కాకపోతే మన భాషనీ సాహిత్యాన్ని వదిలేయకుండా అన్నీ చదివారు. జీవిత పరమార్థం ఏమిటి అని తెలుసుకోగలిగారు. వారు మన సమాజానికి చేసిన సేవ ఫలితాలను మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. కానీ నీ జీవితం నీది, నీ సంతోషం నీవు చూసుకో అని చెప్పే కొన్ని రకాలైన సాహిత్య ప్రభావం మనపై పడిన తర్వాతి ఫలితాలను మనం చూస్తున్నాం కదా!
అవతలివారిని తప్పుపట్టడం కాదు. వారికి అది మేలు చేయవచ్చు. కానీ మనకు కాదు. ఎవరికి కుట్టిన బట్టలు వారికి మాత్రమే సరిపోయినట్టు మన సంస్కృతిని రక్షించే సాహిత్యం మనకు మేలు చేస్తుంది.

అసలు సాహిత్యం ఎందుకు?

ఇప్పుడు సాంకేతికత పెరగటం వల్ల మాకు సాహిత్యం ఎందుకు అని ఒక వాదన. పని చేయటం అనేది మనుష్యులకు ఎప్పుడూ ఉంది. ఇప్పుడు యంత్రాలు సులువుగా చేసే పని అప్పుడు మనుష్యులు కష్టపడి చేసే వారు. అందరూ కావ్యాలు చదవాలి అని కాదు, నాట్యాలు చేయాలి అని కాదు. కానీ ఎన్ని పనులు చేసినా మనిషి మనసుకు, శరీరానికి స్వాంతన నిచ్చేది కళ. అది నాట్యం అయినా, ఆటలయినా, పాటలయినా, ఇప్పటి సినిమాలయినా. మనసు రంజింప చేయాలి. అదే సమయంలో స్వార్థాన్ని, రాక్షసత్వాన్ని గొప్పదని తేల్చటం జరగరాదు. ఇప్పటి మన తెలుగు సినిమాల్లో ఏముంది? అమ్మాయి, అబ్బాయి చుట్టూ తిరిగే కథ తప్ప. వాళ్ళకి కుటుంబం పట్ల కానీ, సమాజం పట్ల కానీ, చివరికి తమ జీవితం పట్ల కానీ ఎటువంటి బాధ్యత ఉండక్కరలేదన్నది ముఖ్యంగా చూపిస్తూ ఉంటారు. ఈనాడు సినిమా తప్ప మిగతా కళలకు ఆదరణ లేదు. వీటిల్లో ఇదీ సంగతి.
మనుష్యుల మానసిక పరిణతని పెంపొందించే మన భాషా సాహిత్యాన్ని అందులోని విషయాలని కడు రమ్యంగా ప్రకటించే అనేక కళలకి గాని ఆదరణ దొరికినపుడు మన సమాజంలో శాంతి తప్పక నెలకొంటుంది.తప్పులేకాలంలో అయినా జరుగుతాయి.కానీ తప్పులకు పెద్దపీట వేసే ఈ తరపు ఆలోచనావిధానాన్ని మారిస్తే గానీ ఈ కల నెరవేరదు.
ఈ పరిస్థితి ఎలా వచ్చింది?

మన పెద్దల తరంలోనే రామాయణ, భారత, భాగవతాది ఐతిహాసిక గ్రంథాలను, కొన్ని కాల్పనికగ్రంథాలను చదవకపోయినా మనకు కొన్ని కథలద్వారా తెలిపారు. ఇక మనమా - మన తర్వాతి తరానికి ఏదైనా క్లుప్తంగా చెప్పటానికి మనకు వాటితో పరిచయం అంతంత మాత్రం. ఏం చెప్పగలం? చెప్పినా వాటిలోని అంతరార్థాలని , ధర్మ సూక్ష్మాలని సరిగా విశదీకరించగలమా ? అనుమానమే. ఏదో కొద్దో గొప్పో చదివినవారు మూల గ్రంథాలని చదివే వీలు లేక వాటిపై వచ్చిన సమీక్షలో, విమర్శలో చదివినవారు.
ఇక వాటిని కూలంకషంగా ఎవరు చెప్పగలరు?

ఫలితం?

మనదైన నాగరికతని విడిచిపెట్టి, వేరే నాగరికతని జీర్ణం చేసుకోలేక మనం పడుతున్న పాట్లు కుటుంబ జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. సమాజాన్ని దారీ తెన్నూ లేకుండా ఎటో తీసుకువెళుతున్నాయి. మనం మేలుకోవాలి. మనలను మనం కాపాడుకోవాలి.

ఈ సుమతీ శతకంలోని ఈ పద్యాన్ని చూడండి.

తనకోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయచుట్టంబౌ
తన సంతొషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!

ఇపుడు ఇలాగే మనం చేయాల్సింది పాడుకుందాం.

తన పలుకులె తనకు మేలు
తన భాషయె తనకు రక్ష నిజమెన్నడునూ,
తన సంస్కారము, సభ్యత
తన సంస్కృతి మెఱుగుసేయ ! నిక్కము సుమతీ!
------

4 వ్యాఖ్యలు:

 1. చాలా బాగా రాశారండీ! మంచి మాటలు చెప్పారు.. ధన్యవాదాలు. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మధురవాణి గారూ,
  మన మధురమైన భాషకి సంబంధించి మనమే ఎన్నో విషయాలు గొప్ప తెలుసుకోవాల్సి ఉందండీ ఇంకానూ.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. తన పలుకులె తనకు మేలు
  తన భాషయె తనకు రక్ష నిజమెన్నడునూ,
  తన సంస్కారము, సభ్యత
  తన సంస్కృతి మెఱుగుసేయ ! నిక్కము సుమతీ!
  చాలా బాగా చెప్పారండి మందాకినీ గారు! ధన్యవాదాలు!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. రావు గారూ, నా వ్యాసం చదవటానికి మీకు తీరిక దొరికినట్టు లేదు. అనుకుంటున్నాను. హమ్మయ్య! చదివారుగా, సంతోషం.

  ప్రత్యుత్తరంతొలగించు