Loading...

5, ఫిబ్రవరి 2011, శనివారం

ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారి ఇంటర్వ్యూ పూర్తి పాఠం,పద్మభూషణ్ అవార్డు సందర్భంలో .....శ్రీ శ్రీ శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి పద్మభూషణ్ పురస్కారం లభించినందుకు సంతోషంగా ఉంది.
మన గానగాంధర్వునికి ప్రపంచంలో ఉన్న అవార్డులన్నీ ఇచ్చినా తక్కువేనని అభిమానులమైన మనందరి మనస్సుల్లోనూ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అనేకన్నా మన బాలు గారు, మన ఎస్ పి బి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం అంటే తన గాన మాధుర్యంతో మనల మనములను అలరించే ఆత్మీయుడుగా; సరదా అయిన మాటలు మాట్లాడుతూ చిన్నప్పట్నీంచీ మనలని ఆటపట్టిస్తూ, మనతో కలిసి నవ్వుతూ, తుళ్ళుతూ, మనకు పరీక్షలు పెడుతూ, చదువులో ప్రోత్సహిస్తూ ఉండే చిన్నాన్నలా అనిపిస్తారు.

నిజంగానే గంధర్వ లోకం నుంచి మనందరినీ తన పాటల తోటలలో విహరింప చేయటానికి దిగి వచ్చారేమో అంటే అతిశయోక్తి కాదనిపిస్తుంది. ఒకవేళ ఇది కొంచెం ఓవర్ అని ఎవరైనా అనేవాళ్ళున్నా, వాళ్ళమీద జాలి పట్టం తప్ప మనమేం చేయలేము.

ఒకటా, రెండా ఎన్నివేల పాటలు పాడినా ఊటబావిలా ఆ గొంతులో మాధుర్యం, పాట భావాన్ని బట్టి ఒలికించే భావ ప్రకటనా సామర్థ్యం, ( జోల పాట పాడితే వాత్సల్య భావం, ప్రేమ గీతాలు పాడితే అనురాగం, శృంగార గీతాలు పాడితే కొంటెతనం, మధ్యలో వినపడే నవ్వుల్లో చిలిపి తనం, విషాద గీతాలు పాడితే శోక రసం ) ఎన్ని చెప్పగలం చెప్పండి?

సంగీతం నాకు రాదు రాదంటూనే ప్రతి రాగంగురించీ ఎవరూ తప్పు పట్టలేనంతగా వ్యాఖ్యానించగలగటం, స్వయంగా ఎన్నో సంగీతపరమైన పాటలు పాడటం ఎంత అద్భుతమైన విషయం?

సాహిత్యం విషయానికొస్తే పాటలలో సాహితీ విలువల గురించి చర్చించటం నుంచీ, పదాల అర్థాలు, వాటి భావాల గురించీ పిల్లలకు అర్థం అయ్యేలా వివరించేంత వరకూ ప్రతి విషయాన్నీ అంటే ఉచ్ఛారణ, పదాలని అర్థవంతంగా పలికే విధానం, భావోద్వేగాలను పలికించటం ప్రతీ విషయంలోనూ దోషరహితుడుగా ఎన్నదగిన పండితుడు అని చెప్పవచ్చు.

విద్యా దదాతి వినయం అన్న ఆర్యోక్తిని నిజంచేస్తూ తన గొప్పతనం ఏమీలేదని మనస్ఫూర్తిగా నమ్మే వినయ సంపన్నుడు. సంగీత సరస్వతీ పుంభావ రూపమైన ఘంటసాల గారిని, తన సాటి (పోటీ అని కొంతమంది భావించే ) అనేక గాయనీ గాయకుల్ని, పాటని శ్రవణీయంగా మలచే వాద్యకారుల్ని, కొత్తగా పాటలు పాడేవాళ్ళని అందర్నీ తగురీతిన గౌరవ మర్యాదలతో ఉటంకించే వినయ సంపన్నత సొంతం చేసుకున్నవారు.

కొత్త వారిని ప్రోత్సహించే ఎన్నో పాటల పోటీల కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించడమే గాక వాటికి వర్ధమాన సంగీత విద్వాంసుల్ని, గాయనీ గాయకుల్ని ఏమాత్రం ఈగో సమస్య లేకుండా పిలవటం, వారితో చక్కగా కలిసి మెలిసి కార్యక్రమం నిర్వహించడం చూస్తే ఈయనా, ఎవరినీ పైకి రానివ్వడు అన్న అపవాదు భరించింది అనిపించక మానదు.

అంతేకాదు, విశ్వనాథ్ గారి లాంటి క్లాసికల్ చిత్రాలని మనస్ఫూర్తిగా ఆస్వాదించే కళాదృష్టి ఉండి కూడా, వెంకటేష్ లాంటి కమర్షియల్ (చాలా వరకూ అంతే కదా) హీరో లో ఉండే ప్లస్ ఏమిటో అంతే సరిగ్గా చెప్పగలరు.

ఇలా చెప్పుకుంటూ పోతే నాకు అలుపు రాదు కానీ ఇక్కడ స్థలం చాలదు.

ఎంతో రసఙ్ఞతతో అభిమానించి, ఆదరించే కళాకారుడైన ఒక అభిమాని ఎవరైనా ఆయనతో ఇంటర్వ్యూ చేస్తే చూడాలని వుంది.

నా ఆశ ఎప్పుడు తీరుతుందో!!!!!!!!!!!

(ఇది నేను ఇదివరకు రాసుకున్న మనోగతం! )చంద్రునికో నూలుపోగు లా ఈ అవార్డు వారికి అందఁజేయఁబడిన ఈ శుభ సందర్భంలో .....
2006లో చెన్నై , ఆకాశవాణి వారి మధురం మధురం ఈ సమయం అనే కార్యక్రమంలో ప్రసారమైన ఇంటర్వ్యూ ఇది. మాధురీ కృష్ణ గారు చేసిన ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఇది. ఆవిడ నాకు ఈ స్కాన్డ్ పేపర్స్ ని నాకు పంపించారు.

దీన్ని నేను నా బ్లాగులో ప్రచురించటానికి అనుమతి నిచ్చినందుకు చాలా సంతోషం. మాధురి గారికి శతకోటి ధన్యవాదాలు.
ఎందుకంటే నేను వారితో మాట్లాడే అవకాశం నాకెప్పుడు కలగాలి? మాధురి గారి వల్ల వారి మాటలు, మనోభావాలు నా బ్లాగులో ప్రచురించుకోగలగటం నా అదృష్టం.
That was broadcast in AIR Chennai's FM RAINBOW on Diwali from 4pm to 5pm. The name of the programme is MADHURAM MADHURAM EE SAMAYAM.


2006లో దీపావళి సందర్భంగా చెన్నై ఆకాశవాణి కేంద్రానికి శ్రీ ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూ: ఆయన అనుమతితోనే.

"నేనసలు గాయకుణ్ణి అవుతానని ఊహించలేదు. అవ్వాలని కోరుకోలేదు. చెన్నైలో ఇంజనీరింగ్ చదువుతుండగా అయాచితంగా వచ్చిన వరమిది. 1962 లో ఆలిండియా రేడియో పోటీలో పాల్గొని జాతీయస్థాయిలో ఉత్తమగాయకుడి బహుమతి గెలుచుకున్నాను. అప్పుడు పాడినది మా నాన్నగారు రాసిన "పాడవే పల్లకీ పాట ఒకటి" . నేను స్వయంగా రాసిన "రాగము అనురాగము జీవనరాగము" అన్న పాట మరొకటి. (కోదండ పాణి గారు నన్ను ట్రేస్ చేసింది కూడా ఈ పాట ద్వారానే.... మద్రాసులోని ఆంధ్రా క్లబ్ లో పాడినప్పుడు.)

పోటీలో లలిత సంగీతం మాత్రమే పాడాలన్నారు. నాకు ఏవీ రావు కాబట్టి నేనే రాశాను. మిడిమిడి జ్ఞానంతో రాసి సంగీతాన్ని కూర్చి పాడాను. కానీ అన్నీ సరిగ్గా ఉండబట్టి కాలం కలిసొచ్చింది. పిచ్చివాడి రాయి వల్ల ఒక్కొక్కసారి మామిడికాయల గుత్తులే రాలతాయి. అలా అదృష్టం నా తలుపు తట్టింది. "ప్రస్తుతం నీది raw టాలెంట్. క్రమశిక్షణతో ఉండి సాధన చేస్తే కనీసం నలభై సంవత్సరాలు పాడతావు." అన్నారు కోదండపాణి గారు. అంత దూరదృష్టి ఆయనది.


మేరుపర్వతం వంటి ఘంటసాల మాష్టారు, సుశీలమ్మ, జానకిగారు, పిఠాపురం, మాధవపెద్ది, పీబీ శ్రీనివాస్ గారు ఉధృతంగా పాడుతున్న రోజుల్లో నేను రావడం, వాళ్ళను చూసి నేర్చుకునే అవకాశం కలగడం నా సుకృతం. సముద్రాల సీనియర్, సినారె, సముద్రాల జూనియర్ వంటి రచయితల నుంచి నాలుగో తరం వారితో కూడా పాడే అవకాశం రావడం, పాటలకు అద్భుతంగా అభినయం చేసిన ఎన్టీఆర్, ఏ ఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, హాస్యనటులు, క్యారక్టర్ ఆర్టిస్టులు, అభిరుచి ఉన్న దర్శక నిర్మాతలు, రచయితలు, సంగీత దర్శకులు, సన్నివేశ ప్రాధాన్యత కలిగిన పాటలు.....అద్భుతమైన టీం వర్క్ తో కూడిన వైవిధ్యమైన వాతావరణం ఉన్నప్పుడు పరిశ్రమలో కాలిడడం నా అదృష్టం.


నాకు కష్టమనిపించిన పాటలు బోలెడు. ప్రతీపాట వెనుక పురిటి నొప్పులుంటాయి. శాస్త్రీయ సంగీత ఆధారిత పాటల కోసం ఒక రిహార్సల్ సరిపోదని నాలుగైదుసార్లు రిహార్సల్స్ చేసిన సందర్భాలున్నాయి. " శంకరాభరణం" లోని పాటలు అటువంటివే. కొన్ని పాటలు నేను పాడలేనని చేతులెత్తేసిన సందర్భాలూ ఉన్నాయి. కన్నడంలో "గానయోగి పంచాక్షరి గవాయ్" అన్న పేరుతో ఒక హిందుస్థానీ సంగీత విద్వాంసుని గురించిన చిత్రం తీస్తూ ఆయన పాత్రకు నన్ను పాడమని అడిగారు.


కర్ణాటకమే రాని నేను హిందుస్థానీ పాడటమేంటన్నాను. కానీ వాళ్ళు చివరివరకు నాకోసం ఎదురుచూసి నా చేతే పాడించారు. ఆ చిత్రానికి నాకు జాతీయపురస్కారం కూడా లభించింది. అటువంటి పాటలకే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. పైగా వాద్య కళాకారులంతా మంచి విద్వాంసులు. చిన్న అపస్వరం వచ్చినా వాళ్ళు నొచ్చుకుంటారేమో లేదా ఆయా రాగాలలో రాకూడని ఛాయలు వచ్చేస్తాయేమోనన్న భయంతో పాడేవాడిని.


పాడుతూ ఉండడమే నా గాత్రరహస్యం. అంతకుమించి ఏ జాగ్రత్తలూ నాకు తెలియవు. ఇది మానసిక బలాన్ని బట్టి ఉంటుంది. వృత్తినే కాక జీవితాన్ని కూడా ప్రేమిస్తాను. అన్నింటినీ సమపాళ్ళలో అనుభవించాలనుకుంటాను. స్వభావంలో నేను పిల్లవాడినే. అందుకే పిల్లలతో ఉంటే నా వయసును మర్చిపోతాను. చిన్న వయసులోనే మంచి చెడులు, వాటి ఫలితాలను వివరించి చెప్పి మెచ్యూర్ చేస్తే పిల్లల నుంచి అద్భుతాలు రాబట్టవచ్చు. అలా చెప్పేవాళ్ళు దొరకని ఈ రోజుల్లో పిల్లలతో గడపడం నాకు చాలా ఆనందాన్నిస్తోంది.

నన్ను ప్రభావితం చేసిన ఈ టీవీ "పాడుతా తీయగా" , మాటీవీ " పాడాలని ఉంది", ఈటీవీ కన్నడ " ఎదె తుంబి హాడెదను" వేదికలు నాకు దొరికిన అద్భుతమైన వరం. అంతవరకు నేనేక్కడన్నా కనపడితే జనం "హాయ్ బాలూ" అని చేతులెత్తేవారు. ఇప్పుడు "నమస్కారం బాలసుబ్రహ్మణ్యం గారూ" అంటున్నారు. వైయక్తికంగా చాలా మందికి దగ్గరవుతున్నాను. సంగీతపరంగా నేర్చుకుంటున్నాను. నాకు ఒక ఉపలబ్ధి దొరికింది. ట్విలైట్ జోన్ లో జనానికి ఇంకా దగ్గరయ్యే ఇలాంటి అవకాశం రావడం గొప్ప విశేషం. మాధ్యమాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎంతో మంచి ఫలితాలొస్తాయన్నదానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ.


"పాడుతా తీయగా " కార్యక్రమాన్ని ప్లాన్ చేసినప్పుడు మొట్టమొదటి వేదిక కల్పించిన రామోజీ రావు గారికి నా పాదాభివందనం. నేను బాగా బిజీ గా ఉన్న రోజుల్లోనే కొత్త తరానికి దారి చూపించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేశానని, ఈ కార్యక్రమం చరిత్రలో బంగారు అక్షరాలతో నిలిచిపోయేటటువంటి ఘట్టం అవుతుందని అన్నారాయన. నా గొప్పతనం ఉన్నా లేకపోయినా ఒక మహత్తర కార్యక్రమానికి వేదిక నిచ్చిన ఆ మహానుభావుడు నాదృష్టిలో ప్రాతఃస్మరణీయుడు.


మార్పు ఎప్పుడూ హర్షించ దగినదే. సాంకేతికంగా సినిమా ఎంతో అభివృద్ధి చెందింది. అభివృద్ధి జరిగే కొద్దీ సినిమాకున్న హృదయం కూడా అభివృద్ధి చెందాలి. సాంకేతికంగా మాత్రమే అభివృద్ధి చెందితే ఏం లాభంలేదు. సంగీతాన్ని పరిగణనలోకి తీసుకుంటే నా ఉద్దేశ్యంలో సినీ సంగీతాభివృద్ధికి సాంకేతికత ఉపయోగపడటం లేదు. గతంలో గాయనీ గాయకులు, వాద్య విద్వాంసులు అందరూ కలిసి రికార్డింగ్ లో పాల్గొనేవారు. అందువల్ల అందరి అభిప్రాయాలు తెలుసుకోవడం, అనుభవజ్ఞులైన వారు పాడుతున్నపుడు చిన్నవారు కొత్త విషయాలు గ్రహించి సలహాలు తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడున్న పరిస్థితిలో నాతో పాటు ఫలానా పాట ఎవరు పాడతారో నాకే తెలీదు. అంతా యాంత్రికమే. సాంకేతిక అభివృద్ధి వల్ల సినీ వ్యాపారంలో ఇబ్బందులు కూడా వచ్చాయి. పైరసీ అలా ఉత్పన్నమైనదే. దేనికైనా నియమం, నిబద్ధత అనేవి లేకపోతే వ్యాపారంలో నష్టమే వస్తుంది. కానీ లాభం చేకూరే అవకాశం ఉండదు.


ఇంత హడావిడిలో కూడా మంచి పాటలు, సాహిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. మంచిపాటలను జనం ఎప్పుడూ కాదనరు. అందువల్ల మంచి పాటే కావాలని నిర్మాత, దర్శకుడు కోరుకోవాలి. గొర్రె దాటుడు వ్యవహారం ఉన్నంతకాలం సంగీత సాహిత్యాలకి విలువ ఉండదు.పాటలో వాయిద్యాల ఘోష ఎక్కువ ఉంటోంది.


సినిమా అనేది ప్రస్తుతం " యువత" చుట్టూనే తిరుగుతోంది. యూత్ అనేవారు ప్రతి తరంలోనూ......అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఉంటారు. సినిమా అన్నది అన్ని వర్గాలకి నచ్చేదిగా ఉంటేనే ఎక్కువ కాలం ఉంటుంది. ఒకే మూసలో పడిపోతే బయట పడటం కష్టం. సంబడీ హాస్ టు బ్రేక్ ద ఐస్. మా అబ్బాయి చరణ్ "ఉన్నై చరణడైందేన్" అనే అందమైన చిత్రాన్ని తీశాడు. అటువంటి చిత్రాన్ని తీసినందుకు తండ్రిగా నేను గర్వపడుతున్నాను. కానీ దానితో చేతులు కాల్చుకున్నాడు కాబట్టి విజయం కోసం కమర్షియల్ బాట పట్టాడు. కాబట్టి మంచి చిత్రాలను కూడా చూసి ప్రోత్సహించమని నేను ప్రేక్షకులను కోరుతున్నాను. మంచి సినిమాలను ఆదరిస్తారన్న ధైర్యం నిర్మాతకు కలిగితే మళ్ళీ మనం పాతకాల పద్ధతిలో సినిమాలను చూసే అవకాశం వస్తుంది.


నా పిల్లల మీద నేను ఏదీ బలవంతంగా రుద్దలేదు. కొద్దో గొప్పో పాడతాడని తెలిసి చరణ్ ను చిన్నప్పుడు నేను పాడమంటే పారిపోయే వాడు. ఎప్పుడైనా "పాడరా" అంటే తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుని టేప్ రికార్డరులో పాడి క్యాసెట్ తెచ్చిచ్చేవాడు. అటువంటి వాడు చదువు కోసం అమెరికా వెళ్ళాక తనంతట తానే ఒక వాద్యబృందాన్ని తయారుచేసుకున్నాడు. ఇక్కడికొచ్చాక తానే అవకాశాలను సంపాదించుకొని అన్ని భాషలలో పాడుతున్నాడు.

మా అమ్మాయి పల్లవికి ఏ. ఆర్. రహమాన్ తో సహా చాలామంది సంగీత దర్శకులు పిలిచి అవకాశాలిచ్చారు. పది, పదకొండు పాటలు పాడి " ఇంక నాకు ఆసక్తి లేదు నాన్నా! " అంటూ వదిలేసింది. పిల్లలిద్దరికీ అన్ని విషయాలలో నేనే స్ఫూర్తి అని వాళ్ళు చెప్పగా నాకు అర్థమైంది. మంచి ప్రవర్తన కలిగి ఇతరులకు చేతనైన సహాయం చేస్తూ మంచి వాళ్ళుగా పేరు తెచ్చుకొమ్మన్న నా సలహాని మాత్రం బీరు పోకుండా (అంటే వదిలిపెట్టకుండా) పాటిస్తుండటం నాకు సంతోషం కలిగిస్తుంది.


భవిష్యత్తులో కర్ణాటక శాస్త్రీయ సంగీత కచ్చేరీలు చేసే అవకాశం తప్పకుండా ఉంది. మా నాన్నగారి కోరిక కూడా అదే. ప్రతి సంవత్సరం ఈ సారి మొదలు పెడదామని అనుకుంటూనే ఉన్నాను. ఇప్పుడైనా త్యాగరాజు ఆరాధనోత్సవాలలో పుస్తకం పెట్టుకొని పాడమంటారు కానీ నా కలా ఇష్టం లేదు. సినిమా పాటలు పాడినంత హాయిగా, సౌకర్యంగా వాగ్గేయకారుల కృతులను పాడగలిగినప్పుడు కచ్చేరీలు చేస్తాను . ఆర్నెల్లు తమ దగ్గరుంటే చాలు మంచి తర్ఫీదు నిస్తామని బాలమురళీకృష్ణ గారు, ఏసుదాస్ గారు అంటూంటారు. వారికి నామీద అవ్యాజమైన వాత్సల్యం ఉంది. ఇంకా ఈ శ్లేష్మంలోనే ఉండడం వల్ల శాస్త్రీయ సంగీతం మీద నేనింకా దృష్టి పెట్టడం లేదు. అది తీరిన తర్వాత తప్పకుండా దృష్టి పెడతాను. చివరి ఊపిరి వదిలే లోపల ఒక్కసారన్నా వేదిక మీద చక్కటి శాస్త్రీయ సంగీత కచ్చేరీ చేయాలన్న కోరిక ఉంది.

భగవంతుడు, నా భగవంతులైన ప్రేక్షకులు, సంగీతప్రియుల ఆశీర్వాదముంటే అది తప్పక నెరవేరుతుంది.


ఎవరన్నా పాడి నేర్పిస్తే పాడటం, అనుభవించి పాడడం, దానికి చిన్న చిన్న నగిషీలు చెక్కడం అన్నది ఎలా వచ్చిందో....... అది ఈ జన్మలోది కాదేమో. వచ్చే జన్మలో కూడా ఇంతమంది ఆశీస్సులు పొందేటటువంటి గాయకుడి జీవితమే కావాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.
స్కాన్ చేసిన కాగితాలు చదవటం కష్టంగా ఉందని మిత్రులు చెప్పటంతో అవి తీసేసి మొత్తం టైపు చేశాను.
6 వ్యాఖ్యలు: