Loading...

3, ఫిబ్రవరి 2010, బుధవారం

లేఖా సాహిత్యము

లేఖా సాహిత్యము అనే ఒక భావనే ఎంతో బావుంటుంది. ఉత్తరాలు రాసుకునే రోజుల్లో స్నేహితులకు, బంధువులకు ఒక్క కాగితము రాసి ఎన్నడూ ముగించింది లేదు. ఉత్తరం వ్రాస్తే కొంతసేపు వారితో సంభాషించిన తృప్తి కలుగుతుందే, అది ఫోనులో ఎంతసేపు మాట్లాడినా రాదు.

ఉత్తరాలలో ఉన్న ఆత్మీయత మన మనసును స్పృశిస్తుంది. ఇప్పుడు మన మధ్య ఆత్మీయతలే లేవు. ఇక ఉత్తరాలలో మాత్రం ఎక్కడినుంచి వస్తాయిలే! జీవితమే యాంత్రికం అయిపోయింది.
యాంత్రికజీవితంలో తీరికగా రాసే ఉత్తరాలకు స్థానమేది?

ఉత్తరాల్లో కుశల ప్రశ్నలు, కులాసా కబుర్లు, సమాచార చేరివేతలు, మంగళకార్యపు సూచనలు, మనసులో మాటలు చెప్పాలంటే ఎన్నో.. అలాంటి వాటిల్లో ఒకటి నేను చదివిన ఈలేఖ.

పిఠాపురం మహరాజా వారి ఆస్థానమునకు చెందిన కురుమెళ్ళ వెంకటరావు గారు వారి మహారాజా వారితో కలిసి విదేశ యాత్రలు చేస్తూ ఊరిలో ఉన్న తమ మిత్రుడు పెమ్మరాజు వెంకటరావు గారికి తమ యాత్రా విశేషాలను గురించి లేఖల్లో వ్రాస్తూండేవారట. ఆ మిత్రుడు ఆ లేఖలన్ని దాచి ఉంచి ముద్రించమని సలహా ఇస్తూ తిరిగి ఇచ్చారుట.

"మా మహారాజుతో దూరతీరాలు" అనబడే ఈ రచన నుంచి " నయాగరా" అనే భాగాన్ని ఓ సంకలనంలో చదివాను.
ఆనాటి న్యూయార్క్ వర్ణన చదువుతూంటే ఈ నాటి మన మహానగరాలను వర్ణించినట్టే ఉంది.

"అమెరికా వెళ్ళి నువ్వు ఏం చూశావు అంటే ఒకటే ఒక జవాబు. అడ్వర్టయిజ్ మెంట్లు.ఎక్కడ చూసినా అవే. కళ్ళు తెరిస్తే అవే. న్యూస్ పేపరులో, గదిలో అన్ని వస్తువులమీద, బయటికి వస్తే గోడలనిండా, బస్సులమీదా, రైళ్ళలో, స్తంభాలమీదా రైళ్ళలో.. ఇలా ఒక్క అంగుళం కూడా వదలకుండా అవే." ____ అంటారు.
(ఇప్పుడు ఇంకా ఎక్కువనుకోండి.)

" ఆడవాళ్ళని చూస్తే నడకలో, అలంకరించుకోవడంలో ఒకళ్ళని మించి ఒకరు ఆకర్షించబడాలనే ప్రయత్నిస్తున్నట్టు ఉంటుంది.

మగవాళ్ళ ఆశయం డబ్బు సంపాదించడం ఒక్కటే నన్నట్టు కనిపిస్తుంది. విశ్రాంతీ, విరామం లేదు.
విద్యుత్ మీద విపరీతంగా ఆధారపడిన జీవితాలు. విద్యుత్ ఒక్కసారి ఆగిపోయింది అనుకో, అంతే అమెరికా స్మశానం అనుకో! జనం అంతా అమాంతంగా చచ్చిపోయినట్టే. యంత్రాలమీదే సమస్తం నడవటంతో అవి నడవక పోతే ఇక ఆటకట్టే."

లిఫ్టు గురించీ, ఎస్కలేటర్ గురించీ వింత గా రాస్తారు.
"భోజనం కూడా అంతే, రుచులు అనుభవిస్తూ,చక్కగా నములుతూ, కబుర్లు చెప్పుకుంటూ తినడం లేనే లేదు. ఇంజనులో బొగ్గు వేసినట్టు మనిషి అనే యంత్రంలో ఏదో పడాలి. అంతే. స్పీడు తప్ప స్థిమితత్వం లేదు."
మన నగరాల్లోనూ ఈనాడు ఇదేగా పరిస్థితి.
నయాగరా జలపాతం గురించి చక్కగా వర్ణించారు.