Loading...

17, డిసెంబర్ 2010, శుక్రవారం

ఇష్టాలెప్పుడు వీడ్కోలు చెప్పాయో!

నన్నే అందరూ మెచ్చుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకునేమాటే .నేనూ అలాగే అనుకునేదాన్ని. బాగానే చదివేదాన్ని. ప్రతీ సారీ మంచి మార్కులు తెచ్చుకొనేదాన్ని. {ఇప్పటి రోజుల్లా 99.99% కాకపోయినా !} మా చిన్నాన్న గారు నాకూ, మా ఇంకో చిన్నాన్న కూతురికీ డిక్టేషన్ పోటీలు పెట్టేవారు. ఎప్పుడూ అన్నీ కరెక్ట్ గా రాసేదాన్ని. మార్కులని కాదు గానీ, ఒకే ఒక్కసారి తప్పు రాసినందుకు ఎంత ఏడ్చానో.. కానీ, రాన్రానూ అన్నింటిలోనూ నేనే పర్ ఫెక్ట్ గా ఉండాలనే దుగ్ధ ఎపుడు పోయిందో, ఎందుకు పోయిందో తెలీలేదు.

మా మేనత్త కూతురు జయ మా ఇంట్లో మాతోనే పెరిగింది. మాకన్నా పదేళ్ళు పెద్దదయినా పేరు పెట్టే పిలిచే అలవాటు. నిద్రపోయినపుడు తప్ప ఎప్పుడూ తనతోనే ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏదో శుభ/అశుభ కార్యక్రమాలప్పుడు కలిస్తే తప్ప మాట్లాడుకోవటం లేదు. ఊళ్ళు దూరమైనా, ఫోన్లో మాటలూ లేవు. అంత ఇష్టం ఎక్కడికి పోయిందో!

మొదట్నించీ లెక్కలు చేస్తుంటే లోకాన్నే మర్చిపోయేదాన్ని. రేడియోలో పాటలు పెట్టుకుని మరీ తేలిగ్గా చేసేసేదాన్ని.లెక్కలంటే ప్రాణం గా ఉండేది. మా గురుమూర్తి సార్ ఒకసారి చెప్పగానే అర్థం అయ్యేలా చెప్పేవారు. 10 వరకూ కాంపోజిట్ మాథ్స్ చదివాను. కాలేజ్ లో మాథ్స్ గ్రూప్ లో అమ్మాయిలు ఎవరూ లేరమ్మా, వదిలేయ్ , వేరే గ్రూప్ తీసుకో అని ఇంట్లో చెప్పారు. మా అబ్బాయి 10 కి వచ్చేసరికి నేను వాడి లెక్కలు చేయలేకపోయేసరికి ఏంటో తెలీని భావన.. నా మాథ్స్ కి నేను దూరం అయ్యానా అని అంతర్లీనంగా బాధేమో, చిన్న లెక్కల్ని కూడా చేయనంటోంది మెదడు.
అంత ఇష్టం ఎక్కడికి పోయిందో!

తెల్లారే మూడింటికి లేచి ఇంటి ముంగిట్లో నీళ్ళు చల్లి ఏడింటి వరకూ ముగ్గులు పెట్టేదాన్ని. ఇప్పుడు ఫ్లాట్స్ లోఏడు చుక్కల ముగ్గు వేస్తే గొప్ప. బస్సులో వెళ్తూ ఎవరి గుమ్మంముందు చూసిన కొత్త ముగ్గైనా ఇంటికి వెళ్ళాక ఇట్టే వేసేసే నేర్పు.... ఏమైందో, కొత్త ముగ్గులు చూసినా మనసు అటు పోవటం లేదు. కొన్నాళ్ళుపేపర్లలో వేసి ముచ్చట పడ్డాను కానీ ముంగిట్లో ముగ్గుకి వచ్చిన అందం ఆకాశంలో వేసినా రాదు. అంత ఇష్టం ఎక్కడికి పోయిందో!

అన్నింటి కన్నా ముఖ్యమైనది చదవటం, రాయటం మీద ఉన్న ఇష్టం. ఇది పుట్టినప్పట్నించీ ఉన్న ఇదైనా కట్టెల్లో కాలిపోయే దాకా పోకూడదని ఆశ, ప్రార్థన, విన్నపం ఆ దేవునికి.

2 వ్యాఖ్యలు:

  1. చాలా బాగా చెప్పారండి. చిన్ననాటి ఇష్టాలు, స్నేహితులు అంతా జ్ఞాపకాల పుటల్లోనే ఉన్నారు. మొన్న ఓ పెళ్లి లో చిన్న నాటి స్నేహితుడు ఒకడు కలిశాడు.యూనివెర్సిటీ చదువు దాకా కలిసి తిరిగాము. సుమారు 35 ఏళ్ల తర్వాత కలిస్తే మాట్లాడడానికి ఏమీలేవు.ఒరేయ్ అంటూ తిరిగిన వాళ్ళం ఏమండీ, మీరు దగ్గర ఆగిపోయాము. బహుశా పెరిగే కొద్ది మనం మన చుట్టూ లక్ష్మణ రేఖలు గీసుకుంటామేమో. అర్ధం కాలేదు నాకూ ఈ మార్పు.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ఔనండీ సుబ్రహ్మణ్యం గారూ,
    నా బాధని సరిగ్గా అర్థం చేసుకున్నారు. ధన్యవాదాలు.

    ప్రత్యుత్తరంతొలగించు