Loading...

23, ఆగస్టు 2010, సోమవారం

వాడకంలోనూ మరియూ జాలంలోనూ మన తెలుగు

వాడకంలోనూ మరియూ జాలంలోనూ మన తెలుగు

తెలుగు రాకపాయ్ తురకం మర్సీపాయ్ అన్న సామెత మా చిన్నప్పుడు (రెంటికి చెడ్డ రేవడి అన్న చందంలా) తరచుగా వినేవాళ్ళం. మన భాషని మనమెంత చెడగొట్టుకున్నామో తెలిసేసరికి (మనకి తెలివొచ్చేసరికి) మన తెలుగు రూపమే మారిపోయింది.

బళ్ళలో తెలుగుబోధనకూ, తెలుగు పంతుళ్ళకూ ఇచ్చే గౌరవం తగ్గిపోయింది. తెలుగు మాధ్యమానికి అంతకు ముందే తగ్గిపోయింది లెండి. సినిమాల్లో విద్యార్థి/ని ప్రముఖ పాత్రయితే చాలు, హాస్య సన్నివేశాలంటే తెలుగు పాఠం తప్పులు చెప్పే పంతుళ్ళ విషయమే. అలాంటి ఉపాధ్యాయులు రావటానికి కారణం : మళ్ళీ తెలుగుపై ఉండే నిర్లక్ష్యమే. ఈ విధంగా తెలుగుకి పట్టిన అద్ధ్వాన్న స్థితికి ఉపాధ్యాయులూ, విద్యార్థులూ ప్రత్యక్షంగా ఎంతైతే కారణమో, తల్లిదండ్రులూ, సినీ మాధ్యమం పరోక్షంగా అంతే కారణం.

ఈ నేపధ్యంలో తారురోడ్డు, రైలు లాంటి కొత్త వస్తువులకు పేర్లు కనిపెట్టగలిగే సామర్థ్యం మనకి లేక అవే పేర్లు వాడటం మొదలు పెట్టాం. మన పూర్వీకులు బాగా వాడుకలో ఉన్న ఒక్క పదానికి పది పర్యాయ పదాలు తమ రచనల్లో వాడి, ఆనాటి పండితుల, పామరుల ఆమోదం పొందగలిగారన్నది ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన ధర్మం మనకుంది. అలాంటిది ఈ రైలు లాంటి పదాల్ని మనం తెలుగులోకి తేలేకపోగా, చక్కగా వాడుకుని అలవాటు పడిన వైద్యుడు, మామయ్య లను కూడా వదిలేసి డాక్టర్, అంకుల్ అన్నాం. బహుశా అప్పటికాలంలో ఎవరైనా వదలకున్నా వారిని ఎగతాళి చేసి మాన్పించి ఉంటారు.


ఔను మరి, భాషా ఙ్ఞానం, భాషాభిమానం ఉన్నవారు తక్కువై, లేనివారు ఎక్కువైనప్పుడు ఇలాగే జరుగుతుంది. ఒక బ్రాహ్మడు మేకను కొని పెంచుకోవటానికి తీసుకెళుతుంటే, దాన్నెలాగైనా కొట్టేయాలని నలుగురు దొంగలు ఒకరి తరువాత ఒకడుగా వచ్చి మర్యాదగా మాట్లాడి మేక కాదు కుక్కని తీసుకెళ్తున్నారేంటి అని పలకటం, ఇందరు చెపుతున్నారే, నేనే పొరబడ్డానని బ్రాహ్మడు భావించి మేకను వదిలేసి వెళ్ళిన కథలా లేదూ ఇది!

ఇప్పుడిప్పుడే మేలుకుంటున్న మనం అంతర్జాలంలో కొత్త పదాలను తయారుచేయడం గురించి (మనం అంటున్నది మన తెలుగు వారి గురించి అని అర్థం చేసుకోగలరు.) ప్రయత్నిస్తున్నాం. ప్రతి ఒక్కటీ అందరికీ నచ్చకపోవచ్చు. కొన్ని అందరికీ నచ్చినవి ఉంటే వాటంతటవే వాడుక భాషలోకీ వచ్చేస్తాయి. ప్రయత్నం అంటూ జరగటం అభినందనీయమనే నా అభిప్రాయం. నా భావజాలం అంగీకరించే వారందరి తరఫునా నేనే అలా తయారుచేస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.

ఇది బాలేదు, అది కృతకంగా ఉంది అనుకుంటే ఇంకెలా తయారవుతాయ్ పదాలు? ఏ పదాలైనా వాడుకలోకి వచ్చాక మన పలుకుల్లో పడి అనువుగా తయారవ్వటం ఎలాగూ జరుగుతుంది. ఇప్పుడు మనం వాడే పదాలలో ఎన్నో అలా కొత్త, అనువైన రూపం సంతరించుకున్నవే. ఉదాహరణకి ఒక తరం వాళ్ళు ఇచ్చట మేము కుశలం అనే రాసేవాళ్ళు. క్రమేపీ పూర్తిగా తగ్గిపోయి ఇక్కడ అనే రూపం మాత్రమే మిగల్లేదా! అలాగే ఈ కొత్త పదాలూను.

ఇష్టం లేకపోతే వాడకుండా ఉండొచ్చు. కానీ ఎగతాళి చేయక్ఖర్లేదు కదా! మనం ఇక్కడ ఎగతాళి చేస్తూ, "ట్రై చెయ్యండి" అని సంకరక్రియా పదాన్ని వాడే వాళ్ళు ప్రయత్నించండి అనే మాటని ఎగతాళి చేస్తారంటే ఎలా? మనం చేసే పనినే వాళ్ళూ చేస్తున్నారు.(*)

తమిళ్ లో రోబో పేరు యందిరన్ (యంత్రన్ అని) పెట్టారు. యంత్రంలా యంత్రాల సహాయంతో పని చేసే వాడు కాబట్టి ఆ పేరు. మనం పెట్టగలమా! లేము. కారణం ఇలా పరస్పరం విమర్శించుకుంటూ ఉన్న చోటే ఉండిపోతాం. హ్యాపీ హ్యాపీ గా అని ఓ కొత్త సినిమా , సుఖంగా సంతోషంగా అని పెట్టవచ్చుగా. (సంతోషం, ఆనందం ముందే సినిమాలున్నాయిగా మరి.)

ఎన్నో ఆంగ్ల, హిందీ, ఉర్దూ పదాలను కలిపేసుకుని తప్పేం లేదు, భాషాభివృద్ధి అని ఒప్పుకుంటున్న మనం మన తెలుగు పదాలైన అంతర్జాలం లాంటి పదాలను ఎందుకు ఒప్పుకోలేం అన్నదే నా ప్రశ్న. కలిసిపోయే కొత్తలో ఉర్దూ , ఆంగ్ల పదాలు మాత్రం కృతకంగా, ఇబ్బంది పెడుతూ ఉండి ఉండవా ఏమిటి?

భాష అనే ప్రోగ్రాం కి సాఫ్ట్వేర్ అయిన, బహు గొప్పదైన వ్యాకరణం మనకుండగా మనమెందుకు ప్రతీ చోటా కనీసం తయారు చేసుకోలేం? ( వాడుకలోకి తేకపోయినా)

మనకిలాంటి సంకల్పశక్తి, ఐకమత్యం ఉంటే తప్పకుండా మన తెలుగు కూడా వెలుగులు విరజిమ్ముతుందనీ, ఏదో కంటి తుడుపుగా ప్రాచీన భాష హోదా అని కాకుండా ఆ హోదాకి న్యాయం జరుగుతుందనీ ఆశిద్దాం.

(*)http://jb-jeevanayanam.blogspot.com/2010/08/blog-post.html

జేబి గారు వ్రాసిన వ్యాసానికి వ్యాఖ్య రాయబోయి, అలాగే నా గోల కూడా కలిపి ఇక్కడే ప్రచురించేశానన్నమాట.


నా వ్యాసం కన్నా చాలా గొప్ప వ్యాసం కోసం ఇక్కడ మరియు ఇక్కడా చూడండి


10 వ్యాఖ్యలు:

 1. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అంతర్జాలము అనే పదం తెలుగు పదం కాదు. దీనిని చెరసాల ప్రసాద్ గారు మొదటగా ఉపయోగించారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నేను కొత్త పదాలనిగానీ, వాటిని నృష్టించడానికి తమ సమయాన్ని కేటాయిస్తున్నవారిని నా పోస్ట్లో ఎక్కడా హేళన చేయప్రయత్నించలేదండి. కేవలం అది వృధా ప్రయత్నం అని అంటున్నా. ఆ సమయం, శ్రమ ఉన్న పదకోశంని కాపాడటానికి ప్రయత్నిస్తే బాగుంటుందికదా!

  మీరు ఇచ్చిన డాక్టర్-వైద్యుడు ఉదాహరణలాంటిదే నా అభిప్రాయం "ట్రై" విషయంలో. అలాగే రోడ్డు-రహదారి. ఎప్పుడైతే అసలు పదం బదులు ఇంగ్లీషు సరైందనుకుంటారో అప్పుడు ఆ పదం దాని ఉనికి కోల్పోతుంది.

  ఒక భాష కాలక్రమంలో ఇతర భాషాపదాలు చేర్చుకోవడమన్నది సాధారణం. ఇంగ్లీషులో ప్రతి సంవత్సరం కొన్ని వందల పదాలు వచ్చి చేరుతున్నాయి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, ఆ కొత్త పదం నిర్వచించే/సూచించే వస్తువు/గుణం/భావం ఆ భాషా సంస్కృతిలో లేనప్పుడు మాత్రమే. కానీ, ఇప్పుడు తెలుగులో కానీ, ఇతర భారతీయభాషల్లోగానీ, సరైన స్వభాషా పదమున్నా ఇంగ్లీషు పదం వాడుతున్నారు - అది తప్పంటున్నా.

  తమిళంలో చిత్రంపేరు పెడితే అక్కడ వినోదపు పన్ను మినహాయింపిస్తారు. తమిళులకు భాషాభిమానం కొంత ఎక్కువైనా, అక్కడకూడా ఈ తమిళ్-ఇంగ్లీషు కలిపికొట్టడం సినిమాల్లో-సామాన్యుల్లో అలవాటే. నేను గత ఏడు సంవత్సరాలుగా తమిళులతో కలిసి ఉంటున్నా, పని చేస్తున్నా.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. @ అజిత్
  మొదట ఉపయోగించిన వారి పేరు తెలిపినందుకు సంతోషమండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. @ JB

  మన భాషా సమృద్ధి కోసం ఇతర భాషా పదాల్ని సులభంగా గ్రహించ గలిగే మనం కొత్త తెలుగు పదాల్ని తప్పకుండా స్వీకరించగలం. కాబట్టి మనమా దిశలో కృషి చేయాలని నేను భావిస్తాను.
  తమిళ్ విషయంలో ఇంగ్లీష్ ఇష్టానుసారం కలిపినా, కొత్త పదాలని తిరస్కరించరు.
  స్పందించినందుకు ధన్యవాదములు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. భాస్కరరామిరెడ్డి గారూ!!ధన్యవాదములు.

  మీకూ, మీ కుటుంబ సభులకూ శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @ మందాకిని

  మీరు చాలా చక్కని అంశాన్ని ప్రస్తావించారు అండి. మీ దృక్కోణంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను అండి. మంచి వ్యాసం వ్రాశారు. సంతోషం.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మీ వ్యాఖ్యలన్నీ ఇప్పుడే చూస్తున్నానండి.
  తీరిక లేక ...
  నా భావాలు మీకు నచ్చినందుకు సంతోషమండీ.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. మందాకినీ గారూ!నమస్కారం . అమ్మ భాషకు జే జే -అన్న నా టపా మీ బ్లాగ్ లో లింక్ ఇవ్వటానికి నాకు ఎంత మాత్రం అభ్యంతరం లేదు.నిజానికి ఈ బ్లాగ్ లో ఈ రచన పెట్టిన వుద్ద్దేశమే నలుగురికీ తెలియాలని.ముందు ముందు కూడా ఈ సైట్ వైపు తొంగి చూస్తుండండి .మన నలుగురికీ మేలు కలిగించే విషయాలనే ఇక్కడ ప్రస్తావించటం జరుగుతుంది.అలాగే మీ ఈ వాడకంలోనూ,జాలం లోనూ మన తెలుగు(మరియు అనే మాటను మన తెలుగులో అసలు వుపయోగించ నవసరంలేదని నా వుద్దేశం )-అనే టపాను నా బ్లాగ్ లో లంకె ఇద్దామనుకుంటున్నాను.మీరు రేపటిలోగా అభంతరం చెప్పక పోతే .కృతజ్ఞతలు.ఈ తెలుగు మీద మరింత లోతైన చర్చ జరగాలని నా ఆలోచన.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. హనుమంతరావు గారూ! ఎంత మాట! మీ రచనలు ముద్రించబడినవి కాబట్టి నేను అనుమతి అడిగాను. నా వ్యాసాన్ని మీ బ్లాగులో లంకె ఇవ్వటానికి మీరడగాల్సిన పని లేదండి. తప్పకుండా ఇవ్వండి.
  నేను ఇప్పుడే మీ వ్యాఖ్య చూశాను. వెంటనే స్పందిస్తున్నాను.
  నేను నా బ్లాగులొ మీ వ్యాసాలకు లంకె ఇచ్చాను. గమనించారనుకుంటాను.

  ప్రత్యుత్తరంతొలగించు